సమీర్‌ వాంఖడేపై ఎన్‌సీబీ విచారణ

ప్రధానాంశాలు

Published : 26/10/2021 05:09 IST

సమీర్‌ వాంఖడేపై ఎన్‌సీబీ విచారణ

‘డ్రగ్స్‌ కేసులో రూ.25 కోట్లు డిమాండ్‌’ ఆరోపణల నేపథ్యం..

దిల్లీ: ముంబయి నౌక డ్రగ్స్‌ కేసులో మరో కుదుపు! అందులో అరెస్టైన షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ను విడుదల చేయడానికి ఓ అధికారి సహా మరికొందరు రూ.25 కోట్లు డిమాండ్‌ చేశారంటూ ప్రభాకర్‌ సాయీల్‌ అనే ప్రత్యక్ష సాక్షి ఆరోపణలు చేసిన నేపథ్యంలో దిల్లీలోని మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ(ఎన్‌సీబీ) ప్రధాన కార్యాలయం రంగంలోకి దిగింది. ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరిస్తున్న ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడేతో పాటు మరికొందరిపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. మరోవైపు ప్రభాకర్‌ సమర్పించిన అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకోకుండా న్యాయస్థానాలకు ‘బ్లాంకెట్‌ ఆర్డర్‌’ జారీ చేయాలంటూ వాంఖడే చేసుకున్న అభ్యర్థనను ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. ప్రభాకర్‌కు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో పోలీసు రక్షణ కల్పించినట్లు మహారాష్ట్ర హోం మంత్రి చెప్పారు. ఈ నెల 2న రాత్రి ఓ నౌకలో జరుగుతున్న డ్రగ్స్‌ పార్టీపై వాంఖడే నేతృత్వంలోని ఎన్‌సీబీ బృందం దాడి చేసి ఆర్యన్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆర్యన్‌ను విడుదల చేయడానికి రూ.25 కోట్లు ఇవ్వాలని, అందులో రూ.8 కోట్లు వాంఖడేకు ఇవ్వాల్సి ఉందంటూ ఎన్‌సీబీకి చెందిన ఓ అధికారి మరికొందరితో కలసి షారుక్‌ను డిమాండ్‌ చేసినట్లు ప్రభాకర్‌ ఆదివారం వెల్లడించడం సంచలనం రేపింది. ఈ వ్యవహారంలో వాంఖడేతోపాటు మరికొందరిపై విజిలెన్స్‌ విచారణ కోసం ప్రధాన విజిలెన్స్‌ అధికారి జ్ఞానేశ్వర్‌ సింగ్‌ నేతృత్వంలో త్రిసభ్య కమిటీని సోమవారం ఏర్పాటు చేశారు.

వాంఖడేకు కోర్టులో చుక్కెదురు

తమపై ఆరోపణలు చేస్తూ ప్రభాకర్‌ సమర్పించిన అఫిడవిట్‌ను ఏ కోర్టూ పరిగణనలోకి తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని వాంఖడేతోపాటు ఎన్‌సీబీ ముంబయి కార్యాలయం సోమవారం ప్రత్యేక కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. అలాంటి ఆదేశాలివ్వలేమంటూ న్యాయమూర్తి స్పష్టం చేశారు. డ్రగ్స్‌ కేసు విచారణ బాంబే హైకోర్టు పరిధిలో ఉన్నందున సంబంధిత న్యాయస్థానమే దీనిపై నిర్ణయం తీసుకుంటుందన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన