Corona Virus: వస్త్ర మాస్కూ సమర్థ అస్త్రమే!

ప్రధానాంశాలు

Published : 21/09/2021 08:02 IST

Corona Virus: వస్త్ర మాస్కూ సమర్థ అస్త్రమే!

వాషింగ్టన్‌: కొవిడ్‌-19 వ్యాప్తి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రామాణిక మాస్కులు అందుబాటులో లేనప్పుడు ఇంట్లోనే ముఖ తొడుగులు తయారుచేసుకోవాలని భారత శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సాధారణ వస్త్రాలతో వీటిని సిద్ధం చేసుకోవచ్చని వారు పేర్కొన్నారు. అవి కూడా సమర్థంగానే పనిచేస్తాయని వారు ప్రయోగపూర్వకంగా తేల్చారు. బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన జరిపారు.

సర్జికల్‌, ఎన్‌95 మాస్కులు అందుబాటులో లేకుంటే వస్త్ర మాస్కులను వాడాలని కొవిడ్‌-19 మహమ్మారి మొదలైనప్పటి నుంచి నిపుణులు సూచిస్తున్నారు. చౌకలో లభ్యమయ్యే ఈ ముఖ తొడుగులు.. పేద దేశాలకు చాలా ప్రయోజనకరం. ఈ నేపథ్యంలో వీటి సామర్థ్యంపై శాస్త్రవేత్తలు పరిశోధన జరిపారు. పీజోఎలక్ట్రిక్‌ ఆధారిత ‘డ్రాప్లెట్‌ డిస్పెన్సర్‌’ను ఉపయోగించి.. దగ్గు తుంపర్లను పోలిన బిందువులను కృత్రిమంగా సృష్టించారు. భిన్న వేగాల్లో వీటిని.. భిన్న రకాల వస్త్రాలపై ప్రయోగించి చూశారు. తుంపర్లను ఇవి ఎంతమేర నిలువరిస్తున్నాయన్నది పరిశీలించారు. కాటన్‌, టవల్‌ తరహా వస్త్రాలతో తయారైన మాస్కులు సమర్థంగా పనిచేస్తున్నాయని తేల్చారు. వాటిని కలిపి కుట్టడం ద్వారా పటిష్ఠ ముఖ తొడుగులను తయారుచేసుకోవచ్చని పేర్కొన్నారు. ఉతకడం వల్ల మాస్కు సమర్థతపై ఎలాంటి ప్రభావం పడుతుందన్నది కూడా శాస్త్రవేత్తలు పరిశీలించారు. వీటిని 70సార్ల వరకూ ఉతకొచ్చని చెప్పారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన