close

తాజా వార్తలు

బామ్మ బాట బంగారు తోట!

ఏదో కృష్ణారామా అనుకుంటూ కూర్చోవచ్చు కదా... అంటే ఆమె ఊరుకోరు.
మనవల్ని ఆడించుకుంటూ ఇంటిపట్టున ఉండొచ్చు కదా... అంటే ‘ఇంకో మాట చెప్పండి’ అంటారు.
వంటవార్పులో సహకరించడం కాదు పంటపొలాల్లో సేద్యమంటే మక్కువ ఆమెకు.
ఎనిమిది పదులు దాటిన వయసులో ఆమె పొలంబాట పడితే చూసిన వాళ్లంతా  ఔరా అని ఆశ్చర్యపోతుంటారు.
యాభై రాగానే ఇక మా పనై పోయిందనుకునేవారికి ఆమె ఓ నడిచే స్ఫూర్తి...

బామ్మగారి వయసు అక్షరాలా 85. పేరు లక్ష్మీకాంతం. ఊరు పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం. మట్టి వాసనల్లోని మాధుర్యమంటే ఆమెకు ప్రాణం. పైరగాలులు తాకితే చాలు పులకించిపోతారామె. ఈ వయసులోనూ పొలాలను బాగు చేస్తూ, సాగు చేస్తూ హాయిగా బతికేస్తున్నారు. ఆమె తండ్రికి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. ఆ లక్షణమే తనకూ అబ్బిందంటారామె. ఒక వైపు పొలం పనుల్లో తండ్రికి చేదోడుగా ఉంటూ బడికెళ్లి చదువుకుంటూ ఉండేవారామె. ఎనిమిదో తరగతి పూర్తయ్యాక 1952 నుంచి 54 వరకూ హయ్యర్‌ గ్రేడ్‌ టీచింగ్‌లో శిక్షణ తీసుకున్నారు. అంటే ఇప్పటి బీఈడీ అన్నమాట. శిక్షణ అనంతరం ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసే ఉపాధ్యాయినిగా ఉద్యోగం సాధించారు. అప్పటి నుంచి అనేక గిరిజన ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. రవాణా సౌకర్యాలు, పారిశుద్ధ్య సమస్యలు, అడవీ ప్రాంతం ఇలా ఎన్నో ప్రతికూల పరిస్థితులను తన అనుకూల దృక్పథంతో అధిగమిస్తూ వచ్చారు. చాలా కాలం కాలి నడకనే విధులకు హాజరయ్యారు. తర్వాత సైకిల్‌ నేర్చుకుని విధులకు వెళ్లారు. పరుషులు సైతం ఉద్యోగం చేయడానికి భయపడే ఏజెన్సీ ప్రాంతాల్లో పెదవులపై చిరునవ్వులు చెరగకుండా విద్యార్థులతో మమేకమై విజ్ఞానాన్ని పంచారు. పోలవరం, రామయ్యపేట, కొత్తూరు, పైడిపాక, చేగొండిపల్లి, లక్ష్మీపురం, సింగన్నపల్లి, కోండ్రుకోట, ఇలా అధికారులు ఏ ప్రాతానికి వెళ్లమంటే ఆ ప్రాంతానికి వెళ్లి ఎందరో గిరిజన విద్యార్థులను తీర్చిదిద్దారు.

ఆమెకు మొదటి నుంచీ కొన్ని నిశ్చితాభిప్రాయాలున్నాయి. ఆ కారణాలతోనే అవివాహితగా మిగిలిపోయారు. మీరు ఎందుకు వివాహం చేసుకోలేదు అంటే అప్పటి సమాజంలో ఉన్న ప్రతికూల పరిస్థితులు కారణమని చెబుతారామె.‘పురుష ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. సమానత్వం లేదు. ప్రతి విషయంలో స్త్రీ పురుషునిపై అధార పడి జీవించాలని అందరూ భావించేవాశళ్లు. అలా ఓ మగాడి చాటున బతకటం నాకు ఇష్టం లేదు. అందుకే వివాహం చేసుకోలేద’ంటూ వివరించారు.

1981 నుంచి స్కూటర్‌పై స్కూల్‌కు వెళ్లేవారు. ఇంతలో తండ్రి శ్రీరాములు కాలం చేయడంతో కుటుంబ భారం తన భుజాలపై వేసుకున్నారు. ఓ వైపు కుటుంబాన్ని చూసుకుంటూ, మరోవైపు  స్కూల్లో విధులు నిర్వహిస్తూ. తనకు ఎంతో ఇష్టమైన వ్యవసాయాన్ని కొనసాగించారు. ఆమెకు మొదటి నుంచీ అన్న అప్పారావు సహకారం ఉంది. రామయ్యపేటలో కొంత పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశారు. 1992 ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఆమె పూర్తిగా వ్యవసాయానికే అంకితమయ్యారు. ఆ సమయంలో వచ్చిన సొమ్ముతో జంగారెడ్డిగూడెం పరిధిలోని రామచర్లగూడెంలో 5 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఆయిల్‌పామ్‌, కోకో సాగు చేస్తున్నారు. ఈ పంటలు పండిస్తూనే వేరుసెనగ, అరటి, కంది మొక్కజొన్న, వరి, జామ పంటలను పండిస్తూ అధిక దిగుబడి సాధిస్తున్నారు. రోజూ స్కూటీపై పొలానికి వెళ్లి పంట ఎలా ఉందో చూస్తూ ఉంటారు. పంటకు మందు పిచికారి చేయడం, కలుపుతీయడం, పిండి చల్లటం కూడా దగ్గరుండి చేయిస్తారు. అవసరమైతే తాను కూడా చేసేస్తారు. అందరూ వ్యవసాయంలో నష్టాలు వస్తున్నాయంటున్నారు. మరి మీరేలా చేస్తున్నారు అంటే ‘‘వ్యవసాయంలో కొన్నిసార్లు నష్టాలు వస్తాయి. అలా అని వ్యవసాయం వదిలేసి భూములు అమ్ముకుంటే  రేపు లాభాలు వచ్చినప్పుడు భూమి ఎక్కడ నుంచి వస్తుంది’’ అని ప్రశ్నిస్తారు. వ్యవసాయంలో ఎక్కువగా సేంద్రియ ఎరువులనే వినియోగిస్తారు. ఆమె విధానాలు, వ్యవసాయ పద్ధతులు నేటి రైతులను సైతం ఆకర్షిస్తున్నాయి. మీరు ఎప్పటి వరకూ వ్యవసాయం చేస్తారు అని ప్రశ్నిస్తే జీవితాంతం వ్యవసాయం చేస్తానని బదులిస్తున్నారు. తనకున్నంతలో పేదలకు, అనాథలకు సహాయం చేస్తున్నారు. ఆశ్రమాలకు విరాళాలు ఇస్తున్నారు. నా జీవితం వ్యవసాయానికి అంకితం అంటున్నారు.

- ఉప్పాల రాజాపృథ్వీ, ఈనాడు డిజిటల్‌ ఏలూరు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.