close

తాజా వార్తలు

గంజాయి.. విద్యార్థులే విక్రేతలు

కళాశాలల్లో గుట్టుగా అమ్మకాలు
గంజాయికి బానిసవుతున్న యువత
ఈనాడు, విజయవాడ

చదువుకుని ప్రయోజకులుగా ఎదగాల్సిన వయస్సులో యువత పెడతోవ పడుతోంది. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన పలు కశాశాలల్లో గంజాయి వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా ఇంజినీరింగ్‌ కాలేజీలే లక్ష్యంగా విక్రయాలు సాగుతున్నాయి. ఫలితంగా మత్తుకు బానిసలుగా మారి యువకులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ ధోరణి గత రెండేళ్ల నుంచి బాగా పెరిగింది. ఇది ఎంతవరకు వెళ్లిందంటే.. గంజాయి రవాణాదారులు తాము ఎక్కడా దొరక్కుండా విద్యార్థులతోనే అంతా నడిపిస్తున్నారు. యువతను మత్తుకు బానిసలను చేసి, వారినే సరఫరాదారులుగా మార్చుతున్నారు. ఇటీవలి కాలంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద పరిమాణంలోనే పట్టుబడుతోంది. నగర కమిషనర్‌ టాస్క్‌ఫోర్స్‌, డీఆర్‌ఐ అధికారులకు దొరుకుతోంది స్వల్పమే. గత నెలలో ఏజెన్సీ ప్రాంతంలో పట్టుబడిన వారిలో విజయవాడలో చదివే ఇంజినీరింగ్‌ విద్యార్థులుగా తేలింది. తాజాగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు పది యువకులు దొరికారు. వారిలో ఆరుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థులే కావడం గమనార్హం.
నిఘా కళ్లుగప్పి...: ఏవోబీ (ఆంధ్ర - ఒడిశా సరిహద్దు) కేంద్రంగా గంజాయిని సాగు చేస్తున్నారు. కొందరు బడా వ్యక్తులు స్థానిక గిరిజనులకు డబ్బులిచ్చి సాగు చేయిస్తున్నారు. గిరిజనులు వివిధ పంటల్లో అంతరపంటగా దీన్ని వేస్తున్నారు. ఆనక దీన్ని ఎంతోకొంత డబ్బు ఇచ్చి వాటిని అక్రమ రవాణాదారులు కొనుగోలు చేస్తున్నారు.  లక్ష్మీపురం, పొట్టంగి, నర్సీపట్నం, పాడేరు, తదితర ప్రాంతాల్లో దట్టమైన, దుర్భేద్యమైన అటవీ ప్రాంతం ఉంది. ఇది పూర్తిగా మావోయిస్టు పట్టు ఉండడంతో పోలీసులు కూడా సాహసం చేయలేని పరిస్థితి. దీన్ని అవకాశంగా తీసుకుని విచ్చలవిడిగా సాగు చేస్తున్నారు.  అక్కడే ఎక్సైజ్, పోలీసు అధికారులకు గంజాయి మాఫియా డబ్బు ఎరవేసి రవాణా చేస్తోంది. దీంతో జిల్లాకు సునాయాసంగా వస్తోంది. నగర కమిషనరేట్‌ పరిధిలో పోలీసులు కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. అయినా రవాణా, సరఫరా, వినియోగం మాత్రం తగ్గడం లేదు. 2016లో మొత్తం 39 కేసులు, 2017లో 16 కేసులు, 2018లో 15 కేసులు నమోదు చేశారు. ఇదే సంవత్సరంలో పది మంది వ్యక్తులను అరెస్ట్‌ చేసి రూ. 19.90 లక్షల విలువైన 995 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఒక్కో సిగరెట్‌.. రూ.100: విజయవాడలో గంజాయి వినియోగం బాగా పెరిగింది. యువత తర్వాత.. కార్మికులు, ఆటో డ్రైవర్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. నగరంలోని రైల్వేస్టేషన్‌, రాజీవ్‌గాంధీ పార్క్‌, వాటి పరిసర ప్రాంతాలు, హనుమాన్‌పేట, కృష్ణలంక, బస్టాండు, సింగ్‌నగర్‌, గుణదల ప్రాంతాల్లో అధికంగా వాడుతున్నారు. నగరం మీదుగా అన్నీ రవాణా అవుతుండటమే ప్రధాన కారణం. మాస్‌ ప్రాంతాలైన సింగ్‌నగర్‌, పాయకాపురం, జక్కంపూడి కాలనీలు, తదితర చోట్ల గంజాయి సిగరెట్లు దొరుకుతున్నాయి. గంజాయిని తీసుకొచ్చి ఈ ప్రాంతాల్లో కాగితాల్లో పొడిని కూర్చి సిగరెట్లుగా చుడుతున్నారు. వీటిని ఒక్కొక్కటి రూ.100 చొప్పున విక్రయిస్తున్నారు. వీటిని అత్యంత గోప్యంగా నమ్మకస్తులకే అమ్ముతారు. ఇటీవల కాలంలో వీటిని నగరంలో ఎక్కువగా కాలుస్తున్నారు. విద్యార్థులు కూడా క్రమంగా అలవాటు పడుతున్నారు.
పదే పదే పట్టుబడుతోంది..: విజయవాడ రైల్వేస్టేషన్‌ దేశంలోనే రెండో పెద్ద జంక్షన్‌. ఇది దక్షిణ భారతదేశాన్ని, ఉత్తర ప్రాంతాలను అనుసంధానం చేస్తోంది. ఇక్కడి నుంచి దేశంలోని ముఖ్య నగరాలకు రైళ్లు వెళ్తుంటాయి. దీంతో రైళ్ల ద్వారా అధికంగా జరుగుతోంది. ప్యాసింజర్‌ రైళ్లతో పాటు, సూపర్‌ఫాస్ట్‌ రైళ్లలోని సాధారణ బోగీల్లో వెళ్తోంది. గత కొంతకాలంగా వీటిపై జీఆర్పీ పోలీసులు నిఘాను పెంచి తనిఖీలు చేస్తున్నారు. పలువురు పట్టుబడుతున్నారు. దీంతో స్మగ్లర్లు తమ వ్యూహాన్ని మార్చి రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నారు. విజయవాడ నుంచి జాతీయ రహదారులు వెళ్తున్నాయి. విజయవాడ, హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, జగదల్‌పూర్‌, కోల్‌కతా తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు అనువైన దారులు ఉన్నాయి. దీన్ని అవకాశంగా మార్చుకుని ఎవరికీ అనుమానం రాకుండా.. ఖరీదైన కార్లు, ప్రైవేటు బస్సులు, వాహనాల్లో పంపిస్తున్నారు. చాలా సందర్భాలలో లగేజీలు, ప్రయాణికుల ముసుగులో తరలిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు పలుసార్లు గంజాయిని రవాణా చేస్తుండగా పోలీసులు, డీఆర్‌ఐ అధికారులు మాటు వేసి పట్టుకున్నారు.
మే 24న విజయవాడ శివారు ఎనికేపాడు వద్ద నర్సీపట్నం నుంచి హైదరాబాద్‌కు జిప్సం లోడుతో వెళ్తున్న లారీని డీఆర్‌ఐ అధికారులు తనిఖీ చేశారు. అందులో పైన అంతా జిప్సంను తొలగించగా.. కింద గంజాయి బస్తాలు కనిపించాయి. దాదాపు 1,138 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.2.27 కోట్లు ఉంటుంది.
ఈ ఏడాది మే 27న నందివాడ పోలీసులు.. ముందస్తు సమాచారం మేరకు మండలంలోని జనార్దనపురం వద్ద గంజాయితో వాహనం దొరికింది. బొలెరో వాహనంలో నర్సీపట్నం నుంచి హైదరాబాద్‌కు రవాణా చేస్తున్నారు. నిఘా తప్పించుకునే క్రమంలో గుడివాడ వచ్చి.. అక్కడి నుంచి హనుమాన్‌ జంక్షన్‌ వెళ్తుండగా దొరికిపోయారు. ఇందులో 140 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు.
గత నెల 28న చెన్నై - కోల్‌కతా జాతీయ రహదారిపై పొట్టిపాడు వద్ద పోలీసులు గంజాయి వాహనాన్ని పట్టుకున్నారు. మినీ వ్యాన్‌లో 400 కిలోలతో అనకాపల్లి నుంచి హైదరాబాద్‌కు రవాణా అవుతుండగా తనిఖీలలో దొరికింది. ఈ సందర్భంగా ఆత్కూరు పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ నెల 2న విజయవాడ బస్టాండు సమీపంలో కేరళకు చెందిన ఇద్దరిని కృష్ణలంక పోలీసులు అరెస్టు చేశారు. తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సమీపంలో గంజాయిని కొనుగోలు చేసి చెన్నైకు కారులో తరలిస్తున్నారు. వాహనం మొరాయించడంతో అందులో ఉన్న వంద కిలోల గంజాయిని ప్రైవేటు బస్సులోకి పంపేందుకు ప్రయత్నిస్తుండగా దొరికిపోయారు. పండిట్‌ నెహ్రూ బస్టాండు అవుట్‌ గేట్‌ వద్ద పోలీసులు మాటు వేసి ఇద్దరిని పట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో నెట్‌వర్క్‌ను చేధించేందుకు నగర టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగారు. మూడు అంచెల్లో విస్తరించినట్లు గుర్తించారు. ఈ ప్రయత్నంలో ఇప్పటివరకు పది మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఏకంగా ఆరుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఉన్నట్లు తేలింది. ఇంజినీరింగ్‌ కళాశాలల్లో గంజాయి వినియోగం బాగా పెరిగినట్లు గుర్తించారు. గుట్టును రట్టు చేస్తుండగా విషయం బయటకు పొక్కింది. దీంతో మిగిలిన వారు అప్రమత్తం అయ్యారు. విద్యార్థులే స్వయంగా ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లి తీసుకొస్తున్నారు. అక్కడ కిలో రూ.4వేలకు కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడికి తీసుకొచ్చి.. చిన్న ప్యాకెట్లలో అమ్ముతున్నారు. 25 గ్రాముల ప్యాకెట్‌ను రూ.500 చొప్పున విక్రయిస్తున్నారు. ఏజెన్సీ నుంచి కళాశాలల వరకు విస్తరించి ఉన్న నెట్‌వర్క్‌ను బద్దలుకొడితేనే మత్తు మాఫియా నుంచి విద్యార్థులను కాపాడగలం.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.