close

తాజా వార్తలు

సీట్లిస్తే.. మంచి వైద్యులను తయారు చేస్తాం

దేశంలోనే ఎక్కువ పడకలున్న కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ‘యశోద’ ఒకటి. ఎలాంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికైనా చికిత్స అందించాలంటే ముందు గుర్తొచ్చే అగ్రశ్రేణి ఆసుపత్రుల్లో ఒకటి యశోద. విదేశాల్లోని తమ్ముడిని భారత్‌కు రప్పించేందుకు అన్న కట్టిన ఈ ఆసుపత్రి అంచెలంచెలుగా ఎదిగింది. విదేశాల నుంచి సైతం హైదరాబాద్‌కు రోగులు వచ్చి చికిత్సలు చేయించుకునేలా మన్ననలు పొందిన ఇది... ముగ్గురు అన్నదమ్ముల కృషి ఫలితం. గోరుకంటి రవీందర్‌రావు, సురేందర్‌రావు, దేవేందర్‌రావులు దీన్ని ఎలా స్థాపించారు? ఎలా ఈ స్థాయికి తీసుకొచ్చారు? వీరి విజయగాథ ‘హాయ్‌’కి ప్రత్యేకం.

* మీరు చదివింది ఇంజినీరింగ్‌.. మరి ఎందుకు వైద్య రంగంవైపు రావాలనిపించింది?
రవీందర్‌రావు : మా తమ్ముడు ఉపాధి కోసం ఇరాన్‌లో డాక్టర్‌గా పనిచేసేవాడు. అతన్ని ఎప్పుడు ఇండియాకు రమ్మన్నా వచ్చేవాడు కాదు. ఒకసారి మాటల్లో అక్కడ ఆసుపత్రి కడితే వస్తానన్నాడు. అందుకే ఈ రంగంలోకి వచ్చాం.

* జిరాక్స్‌ మిషన్ల వ్యాపారమూ చేశారట!
రవీందర్‌రావు : జిరాక్స్‌ మిషన్లను అసెంబుల్‌ చేసి ఇచ్చే వ్యాపారం చేసేవాడిని. దాన్ని బాగా అభివృద్ధి చేశాం. తర్వాత జిరాక్స్‌ డ్రమ్స్‌ తయారు చేశాం. దీన్ని విజయవంతం చేశాం.

* మున్సిపాల్టీలో ఉద్యోగం చేస్తూనే జిరాక్స్‌ కేంద్రం నడిపేవారు. అప్పుడు అనుకోకుండా ఏదో వ్యాపారం చేసి బాగా సంపాదించారట?
రవీందర్‌రావు : అరకు వ్యాలీ దగ్గర బాక్సైట్‌ వెలికితీతకు సాధ్యాసాధ్యాలపై సర్వే చేసే కాంట్రాక్ట్‌ అది. దీనికి సంబంధించిన పత్రాలను జిరాక్స్‌ తీసుకోవడానికి ఒక వ్యక్తి వస్తే వివరాలు తెలుసుకున్నా. అతను ఆ సర్వే బాధ్యతలు తీసుకున్న కాంట్రాక్టరు. అతనితో మాట్లాడి... సర్వే చేయడానికి కావాల్సిన దాంట్లో రూ.60వేల పెట్టుబడి పెట్టడానికి సిద్ధమయ్యాను. 80వ దశకం మొదట్లో ఈ పనికి మాకు లక్షన్నర రూపాయలు మిగిలింది. అప్పట్లో ఇది చాలా పెద్ద మొత్తం.

‘‘ఊర్లోని మా భూములను ప్రభుత్వానికి ఇచ్చాం. లేనోళ్లకు పంచమని చెప్పాం. మా ఇంటిని వ్యవసాయం, కుట్టుమిషన్లు.. వంటి వాటికి శిక్షణ కేంద్రంగా అభివృద్ధి చేశాం.’’

ప్రభుత్వం ధ్రువీకరించాలి

‘‘జనరిక్‌ మందుల విధానం అమెరికాలో విజయవంతమైంది. మనదేశంలో జనరిక్‌ మందుల్లో 10 ఎమ్‌జీ అంటే అంత ఉండటం లేదు. పైగా జనరిక్‌ మందులు తయారు చేసే కంపెనీలను మీరు చూడండి. అదే రెడ్డీల్యాబ్‌ వాళ్లు జనరిక్‌ మందులు ఇస్తే మేం తప్పకుండా కొంటాం. ప్రభుత్వం ముందు ఆ మందులను ధ్రువీకరిస్తే మేమూ వాడటానికి వీలుంటుంది.’’

స్వల్పకాలిక కోర్సులు అవసరం

‘‘వైద్యాన్ని రెండు మూడేళ్ల స్వల్పకాలిక కోర్సులాగా అందించాలి. వీరికి కొన్ని పరిమితులు పెట్టి... వైద్య సేవలు అందించే అవకాశం ఇవ్వాలి. వీరిని గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. శస్త్రచికిత్సలు చేయొద్దని నిబంధనలు విధించి ఈ విధానం అమలు చేస్తే వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి వస్తాయి. 

* జీవితంలో ఎదగాలనే స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది?
రవీందర్‌రావు :  మాది వరంగల్‌ జిల్లా మేడిపల్లి. మా అమ్మ యశోదమ్మ కష్టపడేతత్వం నేర్పారు. మమ్మల్ని చదివించడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో మా ఇంట్లో మరో ఇద్దరు పిల్లలు చదువుకునే వారు.  అలా ఇతరులకు సాయపడే తత్వం అమ్మ నుంచి అలవడింది. మాకు క్రమశిక్షణ అలవరిచారు. ప్రతిరోజూ తెల్లవారుజామున 4 గంటలకు నిద్ర లేపేవారు. బాగా చదివించేవారు. అందుకే నలుగురం పిల్లలం బాగా చదువుకున్నాం.

* ఇరాన్‌ నుంచి భారత్‌ వచ్చేటప్పుడు మీ ఆలోచనేంటి?
సురేందర్‌రావు : ముందుగా నేను ఇరాన్‌ నుంచి ఆస్ట్రియా వెళ్లాను. అక్కడ పీడియాట్రిక్స్‌ విభాగంలో శిక్షణ తీసుకున్నా. తర్వాత భారత్‌ వచ్చా. ఇక్కడికి వచ్చాక తెలిసింది అక్కడ తీసుకున్న శిక్షణకు ఇక్కడ  సమస్యలకు చాలా తేడా ఉందని. ఈ పరిస్థితులపై అవగాహన కోసం కొన్ని నెలల పాటు నిలొఫర్‌లో పనిచేశాను. దిల్‌సుఖ్‌నగర్లో ప్రాక్టిస్‌ పెట్టాను. రవీందర్‌రావు ఆసుపత్రి కట్టడం మొదలుపెట్టారు. నిజాయతీగా చేస్తే దేంట్లోనైనా విజయం సాధించవచ్చనే ధైర్యం మాది.
* క్రిటికల్‌ కేర్‌ మేనేజ్‌మెంటు అనేది పెద్ద సవాళ్లతో కూడిన పని. దీన్ని ఎలా సమర్థంగా చేస్తున్నారు?
సురేందర్‌రావు : ఆసుపత్రి మేనేజ్‌మెంటులో ప్రత్యేకంగా నేనేమీ స్పెషలైజేషన్‌ చేయలేదు. అనుభవాల ద్వారానే అన్నీ నేర్చుకున్నా. క్రిటికల్‌ కేర్‌ మేనేజ్‌మెంటుకి మనకు సమర్థమైన సిబ్బంది, ఆధునిక యంత్ర సామగ్రి అవసరం. క్రిటికల్‌ కేర్‌లో ఎప్పుడూ ఒక కార్డియాలజిస్ట్‌, ఫిజీషియన్‌, అనస్తీషియన్‌, క్రిటికల్‌ కేర్‌ నిపుణులను అందుబాటులో ఉంచుకోవాలి. ఎంత సీరియస్‌ కేసులనైనా మేం తీసుకుంటాం. చిత్తశుద్ధితో మా ప్రయత్నం చేస్తాం.

* వైద్యుడిగా స్థిరపడటానికి చాలా సమయం పడుతోంది. దీనివల్ల రోగి, వైద్యుల నిష్పత్తిలో తేడా పెరిగిపోతోంది. ఈ సమస్య పరిష్కరించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
సురేందర్‌రావు : రోగి, వైద్యుల నిష్పత్తిలో తేడాను తగ్గించకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు వస్తాయి. దీనిపై ప్రభుత్వం దృష్టిపెట్టాల్సి ఉంది. ఎంత శ్రమ, సమయం పడుతున్నా... ఆసక్తి ఉన్న వారు ఈ రంగంలోకి వస్తూనే ఉన్నారు. ఒక రోగికి బాగైనప్పుడు వైద్యుడికి కలిగే తృప్తి... ఐటీనే కాదు... మిగతా ఏ రంగాల్లోనూ లభించదు. ఇప్పుడు అమ్మాయిలు కూడా గుండె శస్త్రచికిత్సలు చేయడానికి ముందుకొస్తున్నారు.

* చైనాలో సంప్రదాయ వైద్యవిధానాన్ని బతికించుకుంటూనే అలోపతిని అనుసరిస్తున్నారు. మరి మనదేశంలో అలోపతే దిక్కుగా మారింది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
సురేందర్‌రావు : చైనాలో సంప్రదాయ వైద్య విధానాలను బాగా పాటిస్తారు. మన దేశంలో దీనిపై చైతన్యం అవసరం. దీనికి ప్రభుత్వమే చొరవ చూపాలి. హోమియో, ఆయుర్వేద వైద్యాలకు కొన్ని పరిమితులున్నాయి. వీటిని ప్రభుత్వం నిర్ధారించాలి. దీనిద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశముంది. మాలాంటి ప్రైవేటు నిర్వాహకులకు వైద్య కళాశాలల ఏర్పాటులో కొన్ని నిబంధనలు సడలిస్తే... మరింత మందిని వైద్యులుగా తయారుచేసే వీలుంటుంది. దీనివల్ల సేవలు మెరుగవుతాయి.

* వేరే దేశాలతో పోల్చినప్పుడు మనదేశంలో అవయవ దానంపై చైతన్యం ఎలా ఉంది?
సురేందర్‌రావు : స్పెయిన్‌లో తప్పనిసరిగా 100 శాతం అవయవ దానం అమలు చేస్తున్నారు. అమెరికాలో చైతన్యం వల్ల ఎక్కువ మంది ఇస్తారు. అవయవదానంలో ప్రస్తుతం మన హైదరాబాద్‌ కూడా నంబర్‌ వన్‌గా మారుతోంది. మనదేశంలో దీనిపై ఇంకా అవగాహన పెరగాలి. ఉత్తర భారతంలో దీనిపై కొంత చైతన్యం తక్కువే. సెలబ్రిటీలు ఈ విషయం చెప్పడం ద్వారా, సదస్సులు నిర్వహించడం ద్వారా చైతన్యం పెంచొచ్చు.

* యశోద ఫౌండేషన్‌ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు?
రవీందర్‌రావు, దేవేందర్‌రావు :  మా ఆసుపత్రి ఏర్పాటు చేసి పదేళ్లు అయిన సందర్భంగా ఈ ఫౌండేషన్‌ ప్రారంభించాం. దీనిద్వారా అనాథ శరణాలయాల్లో ఉన్న పిల్లలకు నైపుణ్య అభివృద్ధి శిక్షణలు ఇప్పిస్తున్నాం. ఉద్యోగాలు చూపిస్తున్నాం. ముఖ్యంగా కంప్యూటర్‌ కోర్సులు నేర్పిస్తున్నాం. ఇప్పటికే 5000 మందికి ఉపాధి చూపాం. ప్రతీ బ్యాచ్‌కు 50 మందిని తీసుకుంటాం. అనాథ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నాం. ‘మా కుటుంబం’ అనే గ్రూప్‌ పెట్టి పిల్లలందర్నీ కలిపాం. వాళ్లకు ఏ కష్టమొచ్చినా కుటుంబంలోని మిగతా వారు ఆదుకునేలా కో-ఆర్డినేట్‌ చేస్తుంటాం.

* ప్రతిభతోనే సీట్లు సంపాదించుకోవాలని ఇంట్లో పిల్లలకు ఆదేశాలిచ్చారట ఎందుకు?
రవీందర్‌రావు : వాళ్లు బాగుపడాలనే అలా చేశామండి. నేను కఠినంగా ఉన్నానని వాళ్ల చిన్నాన్నలకు ఫిర్యాదుచేశారు కూడా. అయితే త్వరగా విషయం గ్రహించి బాగా చదువుకున్నారు. మా కుటుంబంలోని పిల్లల్లో పోటీతత్వం అలవడింది. జీవితం, డబ్బు విలువను వారికి చెబుతాం. ఆడంబరాలకు దూరంగానే పెంచుతాం. మా పిల్లలు చదువుకోడానికి ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్లేవారు.

* కార్పొరేట్‌ ఆసుపత్రులకు వెళితే ఆర్థికంగా చితికిపోతారని, లేనిపోని ఖర్చుల భారంతో జీవితంలో కోలుకోలేకపోతారనే భావన ఉంది. దీనిపై మీరేమంటారు?
సురేందర్‌రావు : ఖర్చు ఎక్కువన్న మాట వాస్తవమే. అయితే ఇక్కడ డబ్బులు పెడితే కచ్చితంగా వైద్యం లభిస్తుంది. వ్యాధులు అనుకోకుండా వస్తాయి. వీటిని ఎదుర్కోవడానికి మన దగ్గర ప్రణాళిక ఉండదు. అందుకే మధ్య తరగతికి చెందిన వారు వైద్య ఖర్చులతో నలిగిపోతారు. అయితే మనం వాడే వైద్య పరికరాలు చాలా ఖరీదైనవి. ఇవి మన దేశంలో తయారు కావు. చివరికి ఆపరేషన్‌ థియేటర్లో లైట్లను కూడా విదేశాల నుంచి తెచ్చుకోవాలి. అందుకే వైద్యం ఖరీదవుతోంది. పైగా మంచి వైద్యులను నియమించుకోవాలి. నైపుణ్యం, అనుభవం ఉన్న వైద్యులకు ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి వస్తోంది. ఇతర దేశాల్లో ఇదే వైద్యానికి రెట్టింపు ఖర్చువుతుంది. దీనికి పరిష్కారం ఏంటంటే... ప్రతి ఒక్కరికి వైద్య బీమా తప్పనిసరి చేయడం. అప్పుడే వైద్య ఖర్చులు మధ్య తరగతి కుటుంబాలకు భారం కావు.

* ఇన్సూరెన్స్‌ కవర్‌ లక్ష రూపాయలతో కార్పొరేట్‌ ఆసుపత్రికొస్తే అవసరం లేకపోయినా తొంభైవేలు బిల్లు చేస్తారంటారు. ఇందులో ఎంత వరకూ నిజముంది?
సురేందర్‌రావు : అది అంత సులభం కాదు. ఇప్పుడు ఇన్సూరెన్స్‌ కంపెనీల నుంచి ప్రతినిధి వచ్చి ప్రతి ఒక్కటీ చెక్‌ చేస్తారు. మేం రిపోర్టు పంపించాక వాళ్లూ దీని గురించి వాకబు చేస్తారు. ఫలానా మందు వాడాలా లేదా అనేది వారే తెలుసుకొని చెబుతారు. ఎక్కడా ఏదీ సరిగ్గా లేకపోయినా వాళ్లు బీమాను తిరస్కరిస్తారు.

* రూ.2కోట్ల వరకూ ఖర్చు పెట్టి వైద్య విద్య నేర్చుకొని వచ్చేవారిలో సేవాభావం ఉంటుందా?
సురేందర్‌రావు : దీనికి పరిష్కారం ఏమంటే సీట్లు పెంచడమే. మాలాంటి ఆసుపత్రులకు వందసీట్లు ఇవ్వండి చాలు, మంచి డాక్టర్లను తయారు చేస్తాం. సీటు దొరక్కనే ఇలా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి చదువుకోవాల్సి వస్తోంది. 50 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. మెరిట్‌లో సీటు దొరక్క డబ్బు కడుతున్నారు. డబ్బు కట్టి చదివిన వాళ్లకు సేవాభావం లేదని చెప్పలేం.

* ఆసుపత్రులకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
సురేందర్‌రావు : మంచినీళ్లను కాచి తాగితే చాలు... చాలా రోగాలు దరిచేరవు. కాలుష్యం తగ్గించేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి. వ్యాయామం తప్పనిసరి. ధూమ, మద్యపానాలకు దూరంగా ఉండాలి.

పరీక్షలు తప్పవు

‘‘కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షల భారం ఎక్కువగా ఉంటుందనే భావన ఉంది. ఒక మనిషి ఏదైనా వ్యాధితో వచ్చినప్పుడు దానిపై సమగ్ర అవగాహన వైద్యుడికి అవసరం. అప్పుడే అతను సరైన చికిత్స చేయగలడు. అందుకే పరీక్షలు రాయాల్సి వస్తోంది. పరీక్షల్లో ఏమీ తేలకపోతే ఊరికే రాశారు అంటారు. ఒకవేళ పరీక్షలు చేయకుండా కొన్ని రోజులు చికిత్స చేసి... తర్వాత పరీక్షలకు పంపితే, ఈ పని ముందే చేసి ఉండొచ్చు కదా! అంటారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి.’’

ఆరోగ్యశ్రీ కార్పొరేట్‌కు వద్దు

‘‘ఆరోగ్యశ్రీ, ఉద్యోగశ్రీ వంటి పథకాలను ప్రభుత్వం వైద్య కళాశాలలు, ఆసుపత్రులకే ఇవ్వాలి. ప్రయివేటు ఆసుపత్రులకు ఇవ్వకూడదు. ఒక వేళ తప్పని పరిస్థితులై... అక్కడ కాకపోతేనే మా లాంటి కార్పొరేట్‌ ఆసుపత్రులకు పంపాలి. అప్పుడు అవీ అభివృద్ధి చెందుతాయి.’’

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.