close

తాజా వార్తలు

మరో 11 సంవత్సరాలు కూడా సేఫ్‌: నాని

విశాఖపట్నం: తన సినీ కెరీర్‌ ‘అష్టాచమ్మా’తో వైజాగ్‌లోనే ప్రారంభమైందని, 11ఏళ్లు ఎలా గడిపోయాయో తెలియదని అన్నారు యువ కథానాయకుడు నాని. ఇప్పుడు ‘గ్యాంగ్‌లీడర్‌’తో మరో 11 ఏళ్లపాటు తన సినీ కెరీర్‌ సేఫ్‌గా ఉంటుందని అన్నారు. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ప్రియాంక కథానాయిక. ‘ఆర్‌ఎక్స్‌ 100’ కార్తికేయ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబరు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విశాఖపట్నంలో ప్రీరిలీజ్‌ వేడుకలో నాని మాట్లాడుతూ.. ‘‘ఎప్పుడో పదేళ్ల కిందట ఇక్కడ వైజాగ్‌ అమ్మాయితో ప్రేమలో పడ్డా. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ సిటీతో ప్రేమలో ఉన్నా. సినిమా పాటల షూట్‌ కోసం అందరూ ఫారెన్‌ వెళ్తారు. కానీ, వైజాగ్‌ను మించిన అందమైన ప్రదేశం ఎక్కడ ఉంటుంది? ‘అష్టాచమ్మా’కు మూడు రోజుల ముందు ఇక్కడే ప్రీమియర్‌ జరిగింది. నా కెరీర్‌ వైజాగ్‌లోనే ప్రారంభమైంది. 11 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎప్పుడు జరిగిందో కూడా తెలియదు. మళ్లీ ‘గ్యాంగ్‌లీడర్‌’ విడుదలకు మూడు రోజుల ముందు ప్రీ రిలీజ్‌ వేడుక జరుగుతోంది. తర్వాతి 11 సంవత్సరాలు కూడా సేఫ్‌’’

‘‘ఇంత ఎనర్జీ మీరు చూపిస్తే ప్రతి సినిమాకు ఇక్కడే ఫంక్షన్‌ చేసుకోవాలంటే కష్టం కదా(నవ్వులు). సెప్టెంబరు 13 నుంచి థియేటర్‌లో ఒక్క టికెట్‌ ముక్క కూడా దొరక్కూడదు. మీదే బాధ్యత. విక్రమ్‌తో కలిసి పనిచేయాలని ‘మనం’ నుంచి అనుకుంటున్నాం. ఇన్నాళ్లకు ‘గ్యాంగ్‌లీడర్‌’తో అది కుదిరింది. తను ఎక్కడ ఉన్నా పాజిటివ్‌ ఎనర్జీ పంచి పెడతాడు. భవిష్యత్‌లో ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. మైత్రీ మూవీ మేకర్స్‌తో కూడా ఎప్పటి నుంచో సినిమా చేయాలని అనుకుంటున్నా. మా పేరు మీద కూడా ‘గ్యాంగ్‌లీడర్‌’ రాసి పెట్టి ఉంది. రచయిత వెంకట్‌ అద్భుతమైన కథ అందించాడు. థియేటర్‌లో పడిపడీ నవ్వుతారు. అనంత్‌ శ్రీరామ్‌ చక్కని పాటలు రాశారు. ‘వై దిస్‌ కొలవెరి’ అంటూ అనిరుధ్‌ ప్రపంచాన్నే ఊపేశాడు. అతనితో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నా. కానీ, వరుస హిట్‌ సినిమాలు చేస్తామని అనుకోలేదు. నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటుంది. తొలిసారి నటిగా కాకుండా ప్రియాంక ఎంతో పరణతితో చక్కగా నటించింది. లక్ష్మిగారు, శరణ్య నటన కూడా మిమ్మల్ని అలరిస్తుంది’’

‘‘ఇక కార్తికేయ ఈ సినిమా చేయాలని నిర్ణయం తీసుకున్న రోజు నుంచి ఇప్పటివరకూ ఎంతో వినమ్రంగా, వినయ విధేయతలతో నడుచుకున్నాడు. ఇలాగే కొనసాగితే, భవిష్యత్‌ చాలా ఎత్తుకు ఎదుగుతాడు. తెలుగులో మనకు మరో మంచి నటుడు దొరికాడు. సినిమాలో కార్తికేయ నటన చూసి ఆశ్చర్యమేసింది. తనకు ఫోన్‌ చేసి చెబుదామనుకున్నా. కానీ, నేరుగా తన నటనని మెచ్చుకోవాలి. ఈ నెల 13 తర్వాత నుంచి అతనిని కార్తికేయ అని కాకుండా ‘దేవ్‌’ అని పిలుస్తారు. మేమిద్దరం కలిసి త్వరలోనే మరోసారి పనిచేసే అవకాశం వస్తుందని అనుకుంటున్నా. అందులో తను హీరోగా నటిస్తే, నేను విలన్‌గా నటిస్తా(నవ్వులు). నాపై ఇంత అభిమానం చూపిస్తున్న ప్రేక్షకులకు ఎప్పటికీ రుణ పడి ఉంటా’’అని అన్నారు. 

ఆ సమయంలో నాని సహకారం మర్చిపోలేను!
దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘గ్యాంగ్‌లీడర్‌’ కన్నా ముందు చాలా ఇష్యూలు ఉన్నాయి. కానీ, నాని ఒక్కటే చెప్పాడు. ‘విక్రమ్‌ ఏది ఏమైనా సరే.. నీతో ఒక సినిమా చేస్తా’ అని నా వెన్నంటే నిలబడ్డాడు. నీ సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు అద్భుతమైన నటుడివి. అంతకుమించి నాకు నిజమైన స్నేహితుడివి. మనిద్దరం కలిసి మరిన్ని సినిమాలు చేయాలి. ఈ అవకాశం ఇచ్చిన మైత్రీమూవీమేకర్స్‌ను ధన్యవాదాలు. ఒక దర్శకుడికి అలాంటి నిర్మాతలు ఎక్కడా దొరకరు. కథానాయిక ప్రియాంక, సంగీత దర్శకుడు అనిరుధ్‌, సినిమాటోగ్రాఫర్‌ క్యూబా అద్భుతంగా సహకరించారు. ఇక కార్తికేయ ఈ సినిమాకు మరో బలం. ఇందులో అతని నటన మరో స్థాయిలో ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు. 

అందుకే ఆయన నేచురల్‌ స్టార్‌ అయ్యారు
కథానాయిక ప్రియాంక మాట్లాడుతూ.. ‘‘థియేటర్‌ ఆర్టిస్ట్‌గా, షార్ట్‌ ఫిలిం నటిగా కెరీర్‌ను ప్రారంభించా. కన్నడ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యా. అందరిలాగే నేను కూడా చాలా కష్టాలు పడి ఇక్కడి వరకూ వచ్చా. నాకు ఈ అవకాశం ఇచ్చిన విక్రమ్‌ గారికి ఎప్పటికీ రుణ పడి ఉంటా. నాని పక్కన నటించడం చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. అందుకే ఆయన నేచురల్‌ స్టార్‌ అయ్యారు. నిర్మాతలు నన్ను వాళ్ల ఇంటి అమ్మాయిలా చూసుకున్నారు. ఈ నెల 13న మీ గ్యాంగ్‌తో వచ్చి,  మా గ్యాంగ్‌లీడర్‌ను చూడండి’’ 

హీరోలవుదామనే మాలాంటి వారికి నానినే స్ఫూర్తి
కార్తికేయ మాట్లాడుతూ.. ‘‘మీలాగే నేను కూడా నానికి పెద్ద ఫ్యాన్‌ని. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా నటుడు అవుదామని వచ్చే వారికి కొందరు కనపడతారు. చిరంజీవిగారు, రవితేజగారు. వాళ్లంతా ఎప్పుడో చిత్ర పరిశ్రమకు వచ్చారు. ప్రస్తుత రోజుల్లో నాలాంటి యువకులకు స్ఫూర్తిగా నిలిచే వ్యక్తి నాని. నా జీవితంలో నేను ఏస్థాయికి వెళ్తానో తెలియదు కానీ, నా జీవితాంతం గుర్తిండిపోయే సినిమా ఇది. మీతో(నాని) మరిన్ని సినిమాలు చేయాలి. విక్రమ్‌గారు ఎలాంటి సినిమాలు తీస్తారో మనం చూశాం. ఆయన సినిమాలో పనిచేయడం నా అదృష్టం. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నా. ‘గ్యాంగ్‌లీడర్‌’ తర్వాత నేను నటించే పద్ధతి పూర్తిగా మారిపోయింది. ఈ సినిమా నుంచి కొత్త కార్తికేయను చూస్తారు. మైత్రీ మూవీమేకర్స్‌ నుంచి మరో బ్లాక్‌బస్టర్‌ చిత్రం అవుతుంది’’అని అన్నారు. 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.