close

తాజా వార్తలు

ప్లేట్ లెట్లం.. గడ్డ కట్టిస్తాం.. అడ్డు కట్టేస్తాం!

డెంగీ జ్వరాలు... ప్లేట్‌లెట్లు పడిపోవడం...ఈమధ్య వీటి గురించే వార్తలన్నీ...అసలు ఈ ప్లేట్‌లెట్లు ఎక్కడుంటాయి?వాటి పనేంటి?ఇలా చిన్నూకి బోలెడు డౌట్లు వచ్చేశాయ్‌...అవన్నీ వాళ్ల డాక్టర్‌ అంకుల్ని
అడిగి తెలుసుకున్నాడు...అవేంటో చకచకా చదివేద్దామా మరి!

చిన్ను: డాక్టర్‌ అంకుల్‌! డాక్టర్‌ అంకుల్‌! నాకో డౌటు..
డాక్టర్‌ అంకుల్‌: చెప్పు చిన్నూ. ఎలా ఉన్నావు?
చిన్ను: నేను బాగానే ఉన్నా. కానీ నా ఫ్రెండ్‌కి డెంగీ జ్వరమట. ప్లేట్‌లెట్లు తగ్గాయని ఆసుపత్రిలో ఉంచారట.
డాక్టర్‌: అయ్యో అవునా! ఇప్పుడు ఎలా ఉంది...
చిన్ను: ప్లేట్‌లెట్లు ఎక్కిస్తున్నారట. ఈమధ్య డెంగీతో ప్లేట్‌లెట్లు తగ్గుతున్నాయంటూ వార్తలొస్తున్నాయి. ఇంతకీ ప్లేట్‌లెట్లు అంటే ఏంటంకుల్‌? అసలవి ఎక్కడుంటాయి? లేకపోతే ఏమవుతుంది? ప్లీజ్‌ చెప్పరూ!?
డాక్టర్‌: అరె చెబుతా ఉండు మరి. మన శరీరంలో రక్తం ఉంటుందిగా.

చిన్ను: హా.ఉంటుంది..
డాక్టర్‌: అందులోనే ఉంటాయివి.
చిన్ను: రక్తమంతా ఇవొక్కటే ఉంటాయా?
డాక్టర్‌: లేదు లేదు చిన్నూ. రక్తంలో ప్లాస్మా, ఇంకా రక్త కణాలుంటాయి. ఈ రక్త కణాల్లోనే ఎర్ర, తెల్ల రక్తకణాలతో  పాటు ఈ ప్లేట్‌లెట్లు ఉంటాయి.
చిన్ను: ఓహో. ఇంతకీ ఇవి ఏం చేస్తాయి?
డాక్టర్‌: నువ్వు ఆటలాడుకున్నప్పుడు అప్పుడప్పుడు దెబ్బలు తగిలి రక్తం వస్తుందిగా. అది కాసేపటికి గడ్డకడుతుంది కదా.
చిన్ను: అవును అంకుల్‌!

డాక్టర్‌: అలా రక్తాన్ని గడ్డకట్టించేది ఈ ప్లేట్‌లెట్లే. గాయమైనప్పుడు ఇవి అక్కడికి వెళతాయి.
చుట్టుపక్కలున్న వాటినీ పిలుస్తాయి. వాటికి చేతుల్లాంటి భాగాలు(టెంటకిల్స్‌) మొలుచుకొస్తాయి. వీటితో ఈ ప్లేట్‌లెట్లన్నీ కలిసి చేతిలో చేయి వేసుకుని పట్టుకున్నట్టు పెనవేసుకుంటాయి. కట్టకట్టినట్లుగా మారి రక్తాన్ని బయటకుపోనివ్వకుండా అడ్డుగా నిలుస్తాయి. సిమెంట్‌లాగా పని చేసి రక్తస్రావాన్ని ఆపివేస్తాయన్నమాట. ఇదంతా రెండు నుంచి ఆరు నిమిషాల్లో జరిగిపోతుంది.

చిన్ను: బాబోయ్‌ ఇవి లేకపోతే ఎంత కష్టమయ్యేది. దెబ్బ తగిలినప్పుడు రక్తమంతా కారి ఖాళీ అయిపోతుండేదేమో! ఇప్పుడర్థమయ్యింది ఇవి తగ్గితే ఎంత ప్రమాదమో!

డాక్టర్‌: అంతేగా..
చిన్ను: ఇంతకీ ఇవి ఎన్నుంటాయి?
డాక్టర్‌: మైక్రోలీటర్‌ రక్తంలో ఈ ప్లేట్‌లెట్లు లక్షన్నర నుంచి నాలుగున్నర లక్షల వరకూ ఉంటాయి.
చిన్ను: పుట్టినప్పటి నుంచి ఇలాగే ఉంటాయా?
డాక్టర్‌: లేదు లేదు. వీటికీ జీవితకాలం ఉంటుంది. ఎముక మజ్జలోంచి పుట్టే ఇవి 8 నుంచి 10 రోజులే బతుకుతాయి. కొన్ని చనిపోతూ ఉంటే కొత్తవి పుట్టుకొస్తుంటాయి. ఇదంతా ఓ ప్రక్రియలా సాగిపోతూ ఉంటుంది.
చిన్ను:  అంకుల్‌ నాకు ఇంకో అనుమానం. ఇప్పుడు ఇలా డెంగీ లాంటి జ్వరాలు వచ్చి వీటి సంఖ్య  తగ్గిపోయినప్పుడు ఏం చేస్తారు?
డాక్టర్‌: సాధారణంగా వీటి సంఖ్య తగ్గినా మళ్లీ వాటంతట అవే పెరుగుతాయి. మరీ ప్రమాదకరంగా తగ్గితే దాతల రక్తం నుంచి వేరు చేసి ప్లేట్‌లెట్లను ఎక్కిస్తారు.
చిన్ను: అలాగా! చాలా విషయాలు చెప్పారు. నా సందేహాలన్నీ తీర్చేశారు. థాంక్యూ అంకుల్‌.

 

Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.