close

తాజా వార్తలు

ముందున్నది కన్నుల పండగ

దసరా, దీపావళి, క్రిస్మస్‌, సంక్రాంతి.. క్యాలెండర్‌లో వరుస నెలల్లో పండగలు దర్శనమిస్తున్నాయి. విహార పర్వంలోనూ పండగల కాలం ఊరిస్తోంది! ఓ దిక్కున మేళాలు.. మరోవైపున సంబరాలు.. పర్యాటక ప్రియులను సాదరంగా ఆహ్వానిస్తున్నాయ్‌. ఒక వేడుక సాంస్కృతిక సౌరభాన్ని వెదజల్లితే.. మరో సంరంభం సంప్రదాయ వైభవాన్ని ఆవిష్కరిస్తుంది. ఎందుకాలస్యం.. మనసు దోచే పండగలకు తరలి వెళ్దామా!


సంప్రదాయ సందడి కోహిమా, నాగాలాండ్‌

ఈశాన్య రాష్ట్రాల్లో నాగాలాండ్‌కి పండగల రాష్ట్రంగా పేరుంది. అందుకు తగ్గట్టే ఇక్కడి పల్లెల్లో తరచూ వేడుకలు జరుగుతుంటాయి. అన్ని పండగల సందడిని అందరికీ చూపుతుంది హార్న్‌బిల్‌ ఫెస్టివల్‌. దీనికి హాజరైతే గిరిజన సంప్రదాయం, సంస్కృతి గొప్పదనం తెలుస్తుంది. తమ పూర్వీకుల వైభవాన్ని నాగావాసులు ఎలా కాపాడుకుంటున్నారో అర్థమవుతుంది. భూమిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న గిరిజనులంతా ఈ వేడుకలో పాలుపంచుకుంటారు. ఆటపాటలతో అడవితల్లిని ఆరాధిస్తారు. సంప్రదాయ నృత్యరీతులను ప్రదర్శిస్తూ.. వారసత్వాన్ని భావితరాలకు అందిస్తారు. కోహిమా సమీపంలోని నాగా హెరిటేజ్‌ విలేజ్‌లో జరిగే ఈ సంబరాన్ని చూసేందుకు విదేశాల నుంచీ పర్యాటకులు వస్తారు.
ఎప్పడు?: డిసెంబరు 1 నుంచి 10 వరకు
ఇలా వెళ్లాలి: కోల్‌కతా నుంచి డిమాపుర్‌కు నాన్‌స్టాప్‌ విమాన సర్వీసులు ఉన్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కోహిమా (74 కి.మీ.) చేరుకోవచ్చు. దిల్లీ, కోల్‌కతా, గువాహటి నుంచి డిమాపుర్‌కు రైళ్లున్నాయి.


అందెల రవళి.. కోణార్క్‌, ఒడిశా

ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కోణార్క్‌. ప్రత్యక్ష నారాయణుడు కొలువుదీరిన కోణార్క్‌ ఆలయంలో అణువణువూ కళాత్మకమే. ఏటా డిసెంబరులో ఇక్కడ అద్భుతమైన నృత్యోత్సవం జరుగుతుంది. లబ్ధప్రతిష్ఠులైన కళాకారులు ప్రదర్శించే భారతీయ సంప్రదాయ నృత్యరీతులన్నీ చూడాలని ఎందరో కోణార్క్‌ బాట పడతారు. ఐదు రోజుల ఉత్సవంలో ప్రతి సాయంత్రం కళారాధనే. ప్రతి నిమిషం మనోహరమే. ఇదే సమయంలో పూరి బీచ్‌ ఫెస్టివల్‌ జరుగుతుంది. దేశదేశాలకు చెందిన సుప్రసిద్ధ సైకత శిల్పులు తమ ఊహల్లోని ఆలోచనలకు పూరి తీరంలో ఇసుకతో ప్రాణప్రతిష్ఠ చేస్తారు. వేడుకలో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలు, పడవ పందేలు, కబడ్డీ పోటీలు, బీచ్‌ పార్టీలు, ఫ్యాషన్‌ షోలు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి.
ఎప్పుడు?: డిసెంబరు 1 నుంచి 5 వరకు
ఇలా వెళ్లాలి: హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నుంచి ఖుర్ధా రోడ్‌ జంక్షన్‌ వరకు రైలులో వెళ్లాలి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కోణార్క్‌ (59 కి.మీ.) చేరుకోవచ్చు.
* హైదరాబాద్‌, విశాఖపట్నం నుంచి భువనేశ్వర్‌కు నాన్‌స్టాప్‌ విమాన సర్వీసులు ఉన్నాయి. భువనేశ్వర్‌ నుంచి ట్యాక్సీలు, బస్సుల్లో కోణార్క్‌ (72 కి.మీ.) చేరుకోవచ్చు.


రామచరిత కనరయ్యా వారణాసి, ఉత్తర్‌ప్రదేశ్‌

అణువణువూ ఆధ్యాత్మికత తొణికిసలాడే వారణాసిలో రామ్‌లీలా మేళా ప్రత్యేకమైంది. తులసీదాస్‌ రచించిన ‘రామచరిత మానస్‌’ ఆధారంగా కళాకారులు రామాయణాన్ని ప్రదర్శిస్తారు. వివిధ వేదికలపై వివిధ ఘట్టాలను కళ్లకు కడతారు. దసరా సందర్భంగా కాశీలో వీధివీధిలో రామాయణ కావ్యాన్ని ఆవిష్కరిస్తారు.
ఎప్పుడు?: సెప్టెంబరు 9 నుంచి అక్టోబరు 9 వరకు
ఇలా వెళ్లాలి: హైదరాబాద్‌ నుంచి వారణాసికి నాన్‌స్టాప్‌ విమాన సర్వీసులు ఉన్నాయి. హైదరాబాద్‌, విజయవాడ నుంచి రైళ్లు అందుబాటులో ఉన్నాయి.


రాయల వైభవం హంపి, కర్ణాటక

రాయల రాజధాని హంపి చారిత్రక వైభవాన్ని చూడాలనుకుంటున్నారా? అయితే హంపి వేడుకకు వెళ్లండి. ఏటా నవంబరు మొదటి వారంలో ఈ ఉత్సవం జరుగుతుంది. ఇందులో భాగంగా రాచనగరిలోని వీధులన్నింటినీ అందంగా ముస్తాబు చేస్తారు. సైనికుల కవాతులు, గజరాజుల ఊరేగింపులతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారిపోతుంది. నృత్య, నాటక ప్రదర్శనలు, తోలుబొమ్మలాటలు రాయల చరితను కళ్లముందుంచుతాయి.
ఎప్పుడు?: నవంబరు మొదటి వారం (తేదీ వివరాల కోసం
www.karnatakatourism. org వెబ్‌సైట్‌ని సందర్శించండి)
ఇలా వెళ్లాలి: హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నుంచి హోసపేటకు రైళ్లున్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హంపి (12 కి.మీ.) చేరుకోవచ్చు.


మెగా మేళా పుష్కర్‌, రాజస్థాన్‌

రాజస్థాన్‌లో ప్రముఖ పుణ్యక్షేత్రం పుష్కర్‌. భారతదేశంలో బ్రహ్మదేవుడి ఆలయం ఉన్న ఏకైక క్షేత్రమిది. ఏడాది పొడవునా యాత్రికులు వస్తుంటారు. నవంబరులో బ్రహ్మదేవుడి దర్శనంతో పాటు ఇక్కడ జరిగే ఒంటెల మేళాను చూడడానికి పర్యాటకులు పుష్కర్‌ చేరుకుంటారు. వారం రోజులు జరిగే ఉత్సవాలకు సుమారు నాలుగున్నర లక్షల మంది వస్తారు. మేళాలో ఒకవైపు ఒంటెల క్రయవిక్రయాలు సాగితే.. మరోవైపు ఆటపాటలు అందరినీ అలరిస్తాయి. భారీ రంగుల రాట్నాలు, ఒంటెలపై స్వారీలు, కళాకారుల ప్రదర్శనలు, జానపదుల గళవిన్యాసాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. రాజస్థానీ రుచుల ఘుమఘుమలు మరపురాని ఆతిథ్యాన్ని అందిస్తాయి.
ఎప్పుడు?: నవంబరు 4-12
ఇలా వెళ్లాలి: పుష్కర్‌.. జైపుర్‌ నుంచి 145 కి.మీ. దూరంలో ఉంటుంది. హైదరాబాద్‌, విజయవాడ నుంచి అజ్మీర్‌కు రైళ్లున్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పుష్కర్‌ (15 కి.మీ.) చేరుకోవచ్చు. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నుంచి జైపుర్‌కు రైళ్లున్నాయి. అక్కడి నుంచి బస్సులు, ట్యాక్సీల్లో పుష్కర్‌ వెళ్లొచ్చు. హైదరాబాద్‌ నుంచి జైపుర్‌కు నాన్‌స్టాప్‌ విమాన సర్వీసులు ఉన్నాయి.


రన్‌ రాజా రణ్‌ కచ్‌, గుజరాత్‌

ఎడారి సీమలో ఎడతెగని సంబరం రణ్‌ ఉత్సవ్‌. గుజరాత్‌ కచ్‌ ప్రాంతంలోని ధోర్డో ఈ వేడుకకు వేదిక. కరవు సీమ కచ్‌ గతిని మార్చిన రణ్‌ ఉత్సవ్‌కు లక్షలాదిగా పర్యాటకులు తరలి వస్తారు. తెల్లటి ఇసుక తిన్నెల్లో, వెన్నెల రాత్రులు గడుపుతారు. ఉప్పూరిన మైదానంలో మనసు విప్పారేలా ఆటపాటల్లో తేలిపోతారు. టెంట్‌ విలేజ్‌లో గుడారాల్లో బస, గుజరాతీ రుచులు, సంప్రదాయ ఆటపాటలు మరింత ఆనందాన్ని పంచుతాయి. రాక్‌ క్లైంబింగ్‌, ర్యాపెలింగ్‌ వాల్‌, పెండలమ్‌ స్వింగ్‌, జిప్‌లైన్‌ టవర్‌, పారా సెయిలింగ్‌ వంటి క్రీడలు యువతకు కావాల్సినంత వినోదాన్ని పంచుతాయి.
ఎప్పుడు: అక్టోబరు 28- 2020 ఫిబ్రవరి 23
ఇలా వెళ్లాలి: రణ్‌ ఉత్సవ్‌ జరిగే ధోర్డో.. రాజ్క్‌కోట్‌ నుంచి 140 కి.మీ. దూరంలో ఉంటుంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నుంచి రాజ్‌కోట్‌కు రైళ్లున్నాయి. అక్కడి నుంచి భుజ్‌ మీదుగా ధోర్డో చేరుకోవచ్చు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.