close

తాజా వార్తలు

వలలున్నాయి..అతివల్లారా..

వలలున్నాయి..అతివల్లారా..

స్నేహితుడని నమ్మింది ఒకరు.... అతడి ప్రేమని తిరస్కరించింది మరొకరు....నా ఫోను, ల్యాప్‌టాప్‌లే కదా! భద్రం అనుకుంది మరొకరు...కారణాలేవైనా.... జాగ్రత్త, అప్రమత్తత లేకపోవడం వల్ల చాలామంది జీవితాల్లో చిచ్చు పెడుతోంది సాంకేతికత.
స్మార్ట్‌ ఫోన్‌ సౌకర్యమే..అంతర్జాలం కూడా అవసరమే.. కానీ, దాన్ని సరిగా ఉపయోగించకపోతే మాత్రం అనర్థాలే.  అదెలా అంటే...


సామాజిక మాధ్యమాల ద్వారా సైబర్‌ బుల్లీయింగ్‌, స్టాకింగ్‌, హ్యాకింగ్‌... వంటివి రోజు రోజుకీ హెచ్చు మీరుతున్నాయి. పేర్లేవైనా అన్నీ సైబర్‌ నేరాల కిందకే వస్తాయి. వీటి బారిన పడిన ఎంతో మంది పరువుపోతుందనే భయంతో మౌనంగా ఉండిపోతున్నారు. అయితే వీరిలో యువత సంఖ్యే ఎక్కువ. అలాగే ఒంటరిగా ఉండే మహిళలు, కుటుంబ తగాదాలతో సతమతమవుతున్న వారు కూడా వీటి బారిన సులువుగా పడుతున్నారని సైబర్‌ క్రైమ్‌ రికార్డులు చెబుతున్నాయి.

ఎందుకిలా...  
సాంకేతికతను దుర్వినియోగం చేయడం, మితిమీరి వినియోగించడం వంటివన్నీ దీనికి కారణాలే. అరచేతిలో ప్రపంచాన్ని చూడగలిగే సౌకర్యం, ఏ పనిచేసినా...సులువుగా సలహాలు ఇచ్చే యాప్‌లు, విచ్చలవిడిగా వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలు, ఫేక్‌ వార్తలు వంటివన్నీ మనల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. దీనికి తోడు ప్రేమ వైఫల్యంతో వచ్చే అసూయ, కోపం, అమ్మాయిలు, ఉచితంగా వచ్చే డబ్బుపై మోజు ఈ కొత్త మోసాలకు ప్రధాన కారణం. సామాజిక చొరవ తగ్గి, వర్చువల్‌ కమ్యూనికేషన్‌ పెరగడం మరో కారణం.

మరేం చేయాలి?

ఇంటర్నెట్‌:  ఇప్పుడు కాసేపు అంతర్జాలం లేకపోతే ఏదో వెలితిగా అనిపిస్తోంది. అంతలా దీనికి అలవాటైపోయాం. కానీ దాన్ని వాడటంలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పకపోవచ్చు. పైరేటెడ్‌ వెబ్‌సైట్స్‌, టోరెంట్స్‌ వంటి వాటి నుంచి ఏదైనా డౌన్‌లోడ్‌ చేయడం మొదలుపెడితే వాటిల్లో ఉండే మైక్రో కెమెరా దానంతట అదే ఆన్‌ కావొచ్చు.   చాలామంది అమ్మాయిలు దాన్ని గమనించుకోరు. దాంతో ఆ కెమెరా ఆ పరిసర ప్రాంతాలను చిత్రీకరిస్తుంది. ఆ ఫొటోలను చూపించే హ్యాకర్లు అమాయక అమ్మాయిల్ని బెదిరిస్తున్నారు. ఈ పరిస్థితి నివారించాలంటే కొమాడో వంటి యాంటీమాల్‌వేర్‌, ఫైర్‌వాల్స్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోవడం వల్ల మీ ఫోన్‌, ల్యాప్‌టాప్‌ల నుంచి మీ సమాచారం తస్కరించే అవకాశం ఉండదు.

సైబర్‌ నేరాల బారి నుంచి తప్పించుకోవాలంటే...
ఇప్పుడంతా ఫొటో తీసుకోవాలంటే బ్యూటీయాప్‌, వంట చేయడానికి, దుస్తులు కొనుక్కోవడానికి, వినోదానికి, విజ్ఞానానికి ఇలా ప్రతి పనికీ ఓ యాప్‌ని వాడేస్తున్నారు. వాటిని ఇన్‌స్టాల్‌ చేసేందుకు ఎడాపెడా అనుమతులు ఇచ్చేస్తున్నారు. నిజానికి ఇవన్నీ మీ పనుల్ని సులభతరం చేయొచ్చు. సౌకర్యాన్ని అందించొచ్చు. కానీ వాటివల్ల వ్యక్తిగత గోపత్య ఏ మేరకు భద్రంగా ఉంటుందో మాత్రం ఆలోచించడం లేదు. ఇలా మనం చేసే చిన్న పొరపాట్ల వల్లే సైబర్‌నేరాల బారిన పడుతున్నాం.

వలలున్నాయి..అతివల్లారా..


అనుమతులివ్వోద్దు:  వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ అంతర్జాలాన్ని, సోషల్‌ మీడియాను ఉపయోగించుకోవడానికి కొన్ని పరిధులు పెట్టుకోవాలి. ఫోన్‌కి సురక్షితమైన పాస్‌వర్డ్‌ పెట్టుకున్నా... యాప్‌లకు అనుమతులు ఇవ్వడం వల్ల దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లు అవుతుంది.  ప్లే స్టోర్‌లో కనిపించిన ప్రతి యాప్‌నీ డౌన్‌లోడ్‌ చేసుకోకూడదు. వాటి నియమ నిబంధనలు చదవాలి. ఎక్కువ అనుమతులు అడుగుతుంటే ఆలోచించాల్సిందే. ముందుగా మెకాఫీ, కాస్పెర్‌స్కై, ఎవాస్ట్‌ వంటి యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఫోనులో సెట్టింగ్‌-సెక్యూరిటీలో-పర్మిషన్స్‌ మేనేజర్‌ అని ఉంటుంది. ఒకవేళ అది లేకపోతే ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అప్పుడే మన ఫోనులోని కెమెరా, మైక్రోఫోను, లొకేషన్‌ని ఏ యాప్‌లు వాడగలుగుతున్నాయో తెలుసుకోగలుగుతాం.. యాప్‌ లాకర్‌ని వాడినా మంచిదే. ఫొటోలను భద్రపరుచుకోవడానికి థర్డ్‌పార్టీ యాప్‌లను వాడొద్దు. గూగుల్‌ ఫైల్స్‌గో సురక్షితం. వాటిని ఎన్‌క్రిప్ట్‌ చేసుకోగలిగితే హ్యాక్‌ కాకుండా ఉంటాయి. అన్‌నోన్‌ సోర్సెస్‌ నుంచి ఏదీ డౌన్‌లోడ్‌ చేయకూడదు.

 

వలలున్నాయి..అతివల్లారా..సోషల్‌ మీడియా: ప్రతి ఒక్కరు సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు ఉండటాన్ని హోదాకు చిహ్నంగా భావిస్తున్న రోజులివి.  అమ్మాయిలైనా, అబ్బాయిలైనా సోషల్‌ వెబ్‌సైట్స్‌ని సరైన దిశలో వాడకపోతే కుంగుబాటుకి గురయ్యే ప్రమాదం ఉంది. వ్యక్తిగత ఫొటోలు తరచూ పోస్ట్‌చేయడం, చెక్‌ఇన్‌లు చేయడం, ట్యాగ్‌లు చేయడం వంటివన్నీ మీ వ్యక్తిగత భద్రతను ప్రశ్నార్థకం చేస్తాయి. వీటిని పోస్ట్‌ చేసేముందే ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోవడం మంచిది. అలానే తప్పనిసరిగా పెట్టాల్సి వచ్చినా సెట్టింగ్‌ సెక్యూరిటీలో ఫొటోలకు ప్రైవేట్‌ ఆప్షన్‌ పెట్టుకోవడం వల్ల కొంతవరకూ సురక్షితం. అపరిచితులతో స్నేహం, ఫోటో షేరింగ్‌ అసలే వద్దు. ఇక ఇంటర్నెట్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌...ఇలా దేన్ని ఉపయోగిస్తున్నా ఇంటర్నెట్‌ సేఫ్టీకోసం ఫోన్‌ నంబర్‌తో లింక్‌ చేసే టూ స్టెప్స్‌ వెరిఫికేషన్‌ని ఎనేబుల్‌లో ఉంచుకోవాలి. లాగిన్‌ నోటిఫికేషన్‌లు ఎనేబుల్‌ చేసుకోవడం వల్ల ఇతరులు ఎక్కడ మీ లాగిన్‌లు ఉపయోగించినా తెలిసిపోతుంది. మీ వాట్సాప్‌ ప్రొఫైల్‌ పిక్చర్‌ మార్చినప్పుడు ఫొటో సీన్‌ మై కాంటాక్ట్స్‌ ఆఫ్షన్‌నే ఎంచుకోవాలి. ఫోన్‌లో యాప్‌లాక్‌ ఎనేబుల్‌ చేసుకోవాలి. అన్‌నోన్‌సోర్స్‌లను డిజేబుల్‌ చేయాలి. 

గీతికకి పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు. హాయిగా గడిచిపోతోంది ఆమె జీవితం. అకస్మాత్తుగా ఓ రోజు  ఆమె నగ్న చిత్రాలు పోర్న్‌ సైట్‌లో కనిపించాయన్న విషయం తెలిసి షాక్‌కి గురైంది. కుంగిపోయి ఆత్మహత్యాయత్నం చేసింది. అదృష్టవశాత్తు కుటుంబ సభ్యుల అప్రమత్తతో బయటపడింది. కానీ ఆమెకెవరూ శత్రువులు లేరు. మరి ఈ పని ఎవరు చేసుంటారు?
- ఏం జరిగింది:  గీతిక చాలా కాలం తరువాత తన చిన్ననాటి స్నేహితుల్ని సోషల్‌ మీడియాలో కలుసుకుంది. అంతా కలిసి ఓ బృందంగా ఏర్పడ్డారు. ఒకరినొకరు మళ్లీ కొత్తగా పరిచయం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆమె తన జీవితంలోని మధుర క్షణాల తాలూకు ఫొటోలు, వీడియోలను వారికి షేర్‌ చేసింది. అంతే..! వాటిల్లోని ఆమె ఫొటోను మార్ఫింగ్‌ చేసి పోర్న్‌ సైట్లలో అప్‌చేశాడో దుండగుడు. 

 


* నిత్య పేరు, ఫొటోతో ఉన్న ఫేస్‌బుక్‌ ఖాతా నుంచి ఆమె స్నేహితులందరికీ ఫ్రెండ్‌ రిక్వెస్టులు అందాయి. ఆమే కదా అని యాక్సెప్ట్‌ చేశారు వారంతా. అది మొదలు ఆ ఖాతా నుంచి వారందరికీ మార్ఫింగ్‌ చేసిన నిత్య ఫొటోలు వస్తున్నాయి. అసభ్యకరమైన చేస్తున్నారెవరో. కానీ అది నిత్య కాదు. మరెవరు ఆమె పరువు తీయాలనుకున్నారు?
- ఏం జరిగింది: ఎదురింట్లో ఉండే వంశీ నిత్యను ఇష్టపడ్డాడు.  అతని ప్రేమను ఆమె తిరస్కరించింది. దాంతో అతడు నిత్యపై కక్ష కట్టాడు. ఆమె ఫొటోలను సేకరించి మార్ఫింగ్‌ చేసి ఓ కల్పిత ఐడీ సృష్టించాడు. దాని ద్వారా అమెను అల్లరిపాలు చేయాలనుకున్నాడు.

 

*  ఓ రోజు శ్వేత ఫోన్‌కి కొన్ని ఫొటోలు వచ్చాయి. అవి ఆమె తన ఇంట్లో దుస్తులు మార్చుకుంటున్నప్పుడు తీసినవి. కోరినంత డబ్బు ఇవ్వకపోతే వాటిని సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తానంటూ ఓ ఆంగతుకుడి నుంచి బెదిరింపులు. ఇంతకీ ఆ ఫొటోలు ఎవరు తీశారు? ఎందుకు బెదిరిస్తున్నారు?
- ఏం జరిగింది: ఆ ఆంగతుకుడిది మధ్యప్రదేశ్‌. నచ్చిన పాటలు ఫ్రీగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చంటూ ఆమె ఫోన్‌కి ఓ సందేశం పంపాడు. పాటల్ని విందామని శ్వేత యథాలాపంగా ఆ ఆప్షన్‌లను నొక్కుతూ వెళ్లింది. అంతే  హ్యాకర్‌ ఆమె ప్రతి కదలికనూ  ఆమె ఫోన్‌లోని మైక్రో కెమెరాతో  వీడియో రికార్డ్‌ చేశాడు. వాటిని చూపించి ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు.

ఫిర్యాదు చేస్తే తొలగిస్తారు
ఆడపిల్లల ఫొటోలు, వీడియోలు వారికి తెలియకుండానే తీసి పోర్న్‌ సైట్‌లలో పెడుతున్నారు దుండగులు. అలాంటివి చూసినప్పుడు, తెలిసినప్పుడు కుంగిపోయి ఆత్మహత్యాప్రయత్నాలు చేస్తున్నారు కొందరు. కానీ తొందరపడొద్దు. ఆ వీడియో కిందే రిపోర్ట్‌ బటన్‌ ఉంటుంది. దాన్ని క్లిక్‌ చేసి ఫిర్యాదు చేస్తే తొంభైశాతం సైట్‌లు వాటిని తొలగిస్తాయి. ఒకవేళ అప్పటికీ డిలీట్‌ కాకపోతే ‘డిజిటల్‌ మిలీనియం కాపీరైట్‌ యాక్ట్‌’’కి ఫిర్యాదు చేస్తే ఆ లింక్‌లను, వీడియోలను తొలగిస్తాయి.

 

స్క్రీన్‌ షాట్‌లు తీసుకోండి
ఆన్‌లైన్‌లో వేధింపులు ఎదుర్కొంటుంటే వాటిని స్క్రీన్‌షాట్‌లు తీసుకోండి. యూఆర్‌ఎల్‌ కాపీ చేసుకోండి. అవతలి వ్యక్తులు వాటిని డీయాక్టివేట్‌ చేసినా పోలీసులు వారిని సులువుగా గుర్తించేందుకు సాయపడతాయి.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.