
తాజా వార్తలు
ముంబయి: సచిన్ తెందూల్కర్ క్రికెట్ దిగ్గజంగా ఎదుగుతాడని తానెప్పుడో ఊహించానని టీమిండియా మాజీ క్రికెటర్ సునిల్ గావస్కర్ అన్నారు. అతడి బ్యాక్‌ఫుట్ షాట్లను చూసే గొప్పవాడవుతాడని అనుకున్నానని వెల్లడించారు. రికార్డుల పుస్తకాలను సవరించిన లిటిల్ మాస్టర్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి శుక్రవారానికి 30 ఏళ్లు. భారత్, బంగ్లా మ్యాచ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సన్నీ ఈ సందర్భం గురించి మాట్లాడారు. 15 ఏళ్ల వయసులో నెట్స్‌లో సచిన్ సాధన గురించి వివరించారు.
‘నెట్స్‌లో బౌలింగ్ చేసేటప్పుడు బౌలర్లు సాధారణంగా అడుగు ముందుకేస్తారు. అప్పుడు 22 అడుగుల బదులు పిచ్ 20 ఉంటుంది. రాజు కులకర్ణి కసిగా బంతులు విసురుతున్నాడు. అప్పుడు సచిన్ బ్యాక్‌ఫుట్‌తో అతడి బంతులు ఆడిన విధానం మర్చిపోలేను. బంతులు ఆడేందుకు సచిన్కెంతో సమయం లభిస్తోంది. అప్పుడతనికి 15 ఏళ్లే. వేగంగా వస్తున్న బంతులు ఆడేందుకు సచిన్‌కు చాలా సమయం ఉంటోంది. భవిష్యత్తులో అతడు గొప్పస్థాయికి ఎదుగుతాడని చెప్పేందుకు ఇదో సూచన’ అని సన్నీ అన్నారు. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సచిన్ ఓ వీడియోను ట్వీట్ చేశాడు. ‘ఈ పని చేయడమంటే నాకెంతో ఇష్టం’ అని ఇండోర్‌లో సాధన చేస్తున్న వీడియో పెట్టాడు.