close

తాజా వార్తలు

ఈ కస్టమర్‌కేర్లను నమ్మితే తప్పదుకేర్‌ కేర్‌!

ఇంటర్నెట్‌డెస్క్‌: మనం వాడే ఏ ఉత్పత్తికి సంబంధించి సమస్యలు తలెత్తినా.. మనకేదైనా సమాచారం కావాల్సివచ్చినా ముందుగా గుర్తొచ్చేది కస్టమర్‌ కేర్‌. మన దగ్గర ఆ నంబర్‌ ఉంటే వెంటనే వారికి ఫోన్‌ చేసి మన సందేహాలను, సమస్యలను వారికి తెలియజేసి నివృత్తిచేసుకోవడం రివాజు. ఒకవేళ ఆ నెంబర్‌ మన దగ్గర లేకుంటే మరో ఆలోచన లేకుండా చేసేది గూగుల్‌లో ఆ ఫోన్‌ నెంబర్‌ వెతకడమే. ఇక్కడ మనంచేసే పొరపాటే సైబర్‌ నేరగాళ్ల పాలిట వరంగా మారుతోంది. ఆ నెంబర్లను గుడ్డిగా అనుసరించడం వల్ల బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. తాజాగా ఇటువంటి మోసాలే వెలుగు చూస్తున్నాయి.

బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఇటీవల జొమాటోలో ఫుడ్‌ ఆర్డర్‌ చేసింది. దీనికి సంబంధించి రిఫండ్‌ రుసుమునకు సంబంధించి కస్టమర్‌కేర్‌తో మాట్లాడాల్సి వచ్చింది. దీంతో ఆమె మరోవైపు ఆలోచించకుండా గూగుల్‌లో కస్టమర్‌ కేర్‌ నంబర్‌ వెతికి ఆ నంబర్‌కు ఫోన్‌ చేసింది. అక్కడికి కొద్ది నిమిషాల్లోనే ఆమె బ్యాంకు ఖాతాలోంచి డబ్బు మాయమైంది. ఆమె చేసిన నంబర్‌ ఫేక్‌ జొమాటో కస్టమర్‌ కేర్‌. సంభాషించింది ఓ సైబర్‌ నేరగాడితో. దీంతో ఆమె మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అవతలి వ్యక్తి రిఫండ్‌ మొత్తం తిరిగి రావాలంటే ‘ఎనీ డెస్క్‌ యాప్‌’ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించడంతో ఆమె అలానే చేసింది. దీంతో ఆమె ఖాతాలోని డబ్బులు మాయమయ్యాయని ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది. దీనిపై ఫిర్యాదులు అందడంతో జొమాటో సైతం స్పందించింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసలు తమ కస్టమర్‌ కేర్‌కు ‘కాల్‌ ఇన్‌’ సదుపాయం లేదని తెలిపింది.

మరోవైపు, ఇలాంటి ఘటనే చెన్నైలో మరోటి చోటుచేసుకుంది. ఓ వ్యక్తి గూగుల్‌లో నంబర్‌ వెతికి కస్టమర్‌ కేర్‌కి కాల్‌ చేయగా.. అవతలి వ్యక్తి యూపీఐ పిన్‌ చెప్పాలని కోరాడు. తెలివిగా ఆలోచించి తప్పుడు పిన్‌ నంబర్‌ చెప్పడం వల్ల రెండుసార్లు లావాదేవీలు ఫెయిల్‌ అయ్యాయి. తాజాగా వెలుగుచూస్తున్న ఈ కొత్త తరహా మోసాలకు ఈ రెండు ఘటనలు ఉదాహరణలు మాత్రమే. అందుకే కస్టమర్‌ కేర్‌తో మాట్లాడేటప్పుడు అవతలి వ్యక్తి అడిగినవన్నీ చెప్పకూడదు. అంతకంటే ముందు మనం ఫోన్‌ చేస్తున్న నంబర్‌ అసలా? నకిలీనా? అనేది నిర్ధారించుకోవాలి. అందుకోసం ఆ కంపెనీ వెబ్‌సైట్‌ను సందర్శించి అక్కడ పేర్కొన్న ఫోన్‌ నంబర్‌కు ఫోన్‌ చేయడం ఉత్తమం. అంతే తప్ప గూగుల్‌లో సెర్చ్‌ చేయగానే లభ్యమైన ఫోన్‌ నంబర్‌కు కాల్‌ చేస్తే మాత్రం తగిన మూల్యం చెల్లించక తప్పదు. కాబట్టి బహు పరాక్‌!!


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.