కేటీఆర్‌.. ఏం సమాధానం చెప్తారు: లక్ష్మణ్‌

తాజా వార్తలు

Published : 17/01/2020 00:10 IST

కేటీఆర్‌.. ఏం సమాధానం చెప్తారు: లక్ష్మణ్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన తెరాస ప్రభుత్వం ఈ ఆరేళ్ల పాలనలో ఎంత మందికి అందజేసిందో చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వస్తేనే యువతకు కొలువులు వస్తాయని చెప్పిన తెరాస ఈ ఆరేళ్ల పాలనలో 20 వేలకు మించి ఉద్యోగాలు కల్పించలేదని విమర్శించారు. వాటిలో 50 శాతానికిపైగా పోలీసు ఉద్యోగాలే ఉన్నాయని.. అవి కూడా అధికార పార్టీ నేతల రక్షణ కోసమే అని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని పురపాలికలకు కేంద్ర ప్రభుత్వం రూ.1030 కోట్లు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటిని విడుదల చేయకుండా ఏరకమైన అభివృద్ధికి పాటుపడుతుందని ప్రశ్నించారు. జిల్లాల్లోని నియోజకవర్గాల్లో సమీక్షలు నిర్వహిస్తూ ఎక్కువ సమయం జిల్లాల్లో గడుపుతానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటతప్పారని విమర్శించారు.  

హైదరాబాద్‌ మాదిరిగా రాష్ట్రంలోని మున్సిపాలిటీలన్నింటిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి.. ఏమేరకు వాటిని నెరవేర్చారో కేటీఆర్‌ సమాధానం చెప్పాలని లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో లేఅవుట్లు, భవన నిర్మాణాల్లో అవినీతి పెచ్చుమీరిందని.. పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేసి ప్రజల నుంచి అధిక మొత్తంలో పన్నులు వసూలు చేస్తున్నారని లక్ష్మణ్‌ మండిపడ్డారు. పట్టణాల్లో మంచినీటి సరఫరా, ప్రజా రవాణా వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు, రాయితీలు కల్పిస్తుంటే వాటిని ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే సంస్థలు, వ్యక్తులకు అప్పనంగా కట్టబెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని