Etela Rajender: అడుక్కుంటే కాదు.. మంత్రి పదవి హక్కులా వచ్చింది
close

ప్రధానాంశాలు

Etela Rajender: అడుక్కుంటే కాదు.. మంత్రి పదవి హక్కులా వచ్చింది

పింఛన్‌ రాదని   ప్రజలను భయపెడుతున్నారు
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: తనకు పదవి అడుక్కుంటే రాలేదని.. ఉద్యమంలో పనిచేస్తే హక్కులా వచ్చిందని.. తాను నికార్సైన తెలంగాణ ఉద్యమకారుడినని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ అన్నారు. ఆదివారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘దేశ చరిత్రలో సంపూర్ణ మెజారిటీ పొందినా కేబినెట్‌ ఏర్పాటు చేయని చరిత్ర కేసీఆర్‌ది. మంత్రులు లేకుండానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చారు. 2018 ఎన్నికల్లో గెలిచిన తరువాత నాకు మంత్రి పదవి రాదని ఉద్దేశపూర్వకంగానే ప్రచారం చేయించారు. చాలామంది ఆయన్ని కలవమన్నా నేను కలవలేదు. పదవి హక్కులా రావాలి. అడుక్కోనని చెప్పాను. సీఎం నాకు ఫోన్‌ చేయలేదు. వేరే వాళ్లతో నాకు మంత్రి పదవి ఉందని చెప్పించారు. రోజూ వ్యతిరేక వార్తలొస్తాయని భావించి కావాలనే వైద్యఆరోగ్య శాఖ అప్పగించారు. కరోనా సమయంలో నా శక్తిమేర కష్టపడ్డాను. ముఖ్యమంత్రిని కలవాలంటే వయాలుంటాయి. కొందరు రెవెన్యూ అధికారులు నన్ను కలిసిన అనంతరం నాకు వ్యతిరేకంగా వార్తలొచ్చాయి. అందుకే గులాబీ జెండాకు నేను ఓనర్ని అని.. కిరాయి వాణ్ని, కూలీని కాదని చెప్పాను. కరోనా నేపథ్యంలో ఆసుపత్రుల్లో పర్యటిస్తుంటే.. నాపై కుట్ర చేశారు. నన్ను పార్టీ నుంచి వెళ్లగొట్టారు. హుజూరాబాద్‌లో నాయకుల్ని కొనాలని మంత్రులకు ఆదేశాలిచ్చారు. వేరే పార్టీల ప్రజాప్రతినిధులను కొనడం ప్రజాస్వామ్యమా? హుజూరాబాద్‌లో ధర్మమో, అధర్మమో తేల్చుకుందాం. తెలంగాణ వాదులంతా ఇంటికొకరు చొప్పున నాకోసం వస్తారు. ఇక్కడి ప్రజలకు పింఛన్‌ రాదని భయపెడుతున్నారు. పింఛన్‌ సొమ్ము ప్రజల చెమట బిందువు సొత్తు. ఆ సొత్తుతోనే రైతుబంధు, కిట్లు, బీమా, బియ్యం ఇస్తున్నారు. హుజూరాబాద్‌ ఎన్నికల తరువాత తెలంగాణలో సత్తా చాటుతాం. 2023లో కేసీఆర్‌ అధికారంలోకి రారు. అప్పుడు మేము అధికారంలోకి వచ్చి.. ఇంతకన్నా మెరుగైన ఫలాల్ని నాలుగుకోట్ల ప్రజలకు అందిస్తాం’’ అని ఈటల రాజేందర్‌ అన్నారు.

హుజూరాబాద్‌ ఎన్నికపై భాజపా సమీక్ష
నేడు ముఖ్య నేతలతో తరుణ్‌ ఛుగ్‌ భేటీ

ఈనాడు, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉపఎన్నికపై భాజపా దృష్టి సారించింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి, జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ ఛుగ్‌ ఆదివారం రాత్రి హైదరాబాద్‌ చేరుకున్నారు. సోమవారం ఉదయం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, నగర కార్యాలయంలో తరుణ్‌ ఛుగ్‌ పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు పార్టీ సీనియర్‌ నేతలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో ఛుగ్‌ సమావేశం కానున్నారు. బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌తో పాటు ఇతర ముఖ్య నేతలు ఇందులో పాల్గొననున్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక, పార్టీపరంగా అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించనున్నట్లు భాజపా వర్గాల సమాచారం. కమలదళంలో చేరాక పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఈటల నేడు(సోమవారం) తొలిసారి రానున్నారు. ఈ నెల 30న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం వర్చువల్‌గా జరగనుంది. జిల్లా స్థాయిలోనూ పార్టీ పరంగా కోర్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని భాజపా నిర్ణయించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని