రాహుల్‌, ప్రియాంకలతో ప్రశాంత్‌ కిశోర్‌ భేటీ

ప్రధానాంశాలు

రాహుల్‌, ప్రియాంకలతో ప్రశాంత్‌ కిశోర్‌ భేటీ

 2024లో భాజపాను గద్దె దించడంపై సమాలోచనలు

ఈనాడు, దిల్లీ: జాతీయ రాజకీయాలు వేడెక్కాయి! కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌, ప్రియాంకా గాంధీలతో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ భేటీ అయ్యారు. దిల్లీలోని రాహుల్‌ నివాసంలో మంగళవారం ఈ సమావేశం జరిగింది. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ కూడా హాజరయ్యారు. తాజా పరిణామం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు తెర లేపింది. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌తో గతనెల 11న ముంబయిలో ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే) తొలిసారి భేటీ అయ్యారు. మళ్లీ 21న దిల్లీలోనూ ఆయన్ను కలిశారు. దాదాపు 3 గంటల పాటు వారిద్దరూ ఏకాంతంగా సమాలోచనలు జరిపారు. అంతకు ముందురోజే 8 విపక్ష పార్టీల నేతలు పవార్‌తో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ లేకుండా 2024 ఎన్నికల్లో భాజపాను గద్దె దించడం సాధ్యపడదని పవార్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీలు నిశ్చితాభిప్రాయంతో ఉన్నారు. ఈ క్రమంలో వారి దూతగా కాంగ్రెస్‌ అగ్రనేతలతో పీకే భేటీ కావడం గమనార్హం.

కాంగ్రెస్‌ అగ్రనేతలు, ప్రశాంత్‌ కిశోర్‌ మధ్య... వచ్చే ఏడాది జరిగే ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌ శాసనసభ ఎన్నికలపై ప్రధానంగా చర్చ జరిగినట్టు చెబుతున్నారు.

2024 పార్లమెంటు ఎన్నికల్లో భాజపా వ్యతిరేక పార్టీలన్నీ కలిసి సగం లోక్‌సభ స్థానాలు సాధించడం ద్వారా, కాషాయ పార్టీని అధికారం నుంచి తప్పించే సూత్రీకరణను పీకే ప్రతిపాదించినట్టు చెబుతున్నారు.

కాంగ్రెస్‌ లక్ష్యం... ‘సగంలో సగం’!

‘‘భాజపా వ్యతిరేక పార్టీల విస్తృత ఉమ్మడి వ్యూహంలో భాగంగా... కాంగ్రెస్‌ పార్టీ సగంలో సగం లోక్‌సభ స్థానాలు సాధించాల్సి ఉంటుంది. ఆ ప్రకారం- 2024లో కాంగ్రెస్‌ సొంతంగా 136 సీట్లు తెచ్చుకోవాలి. ఇతర భాజపా వ్యతిరేక పార్టీలన్నీ కలిసి మరో 137 సీట్లు సాధించాలి. తద్వారా అధికారానికి అవసరమైన 273 మార్కును చేరుకోవచ్చు.

* ఎన్నికల సందర్భంగా ఈ పార్టీలన్నీ కాంగ్రెస్‌తో లోపాయికారీ అవగాహనతో వ్యవహరించాలి. ఒక పార్టీ ఓట్లను మరో పార్టీ చీల్చుకోకూడదు. తద్వారా గురి పెట్టుకున్న సీట్లను కైవసం చేసుకోవచ్చు.

* ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌ సహా ఈ పార్టీలన్నీ కలిసి ఒక అవగాహనతో కూటమిగా ఏర్పడవచ్చు.

ఆ ప్రశ్నకు స్పందించొద్దు...
ప్రధాని అభ్యర్థిత్వంపై భాజపా వ్యతిరేక పార్టీలన్నీ మంచి అవగాహనతో ఉండాలి. ముఖ్యంగా- ‘‘మోదీకి ప్రత్యామ్నాయం ఎవరు?’’ అని కాషాయ పార్టీ నుంచి ప్రశ్న ఎదురవుతుంది. దీనికి స్పందించకూడదు. భాజపా వ్యతిరేక కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరన్న దానికి మౌనమే సమాధానం కావాలి’’ అని పీకే పేర్కొన్నట్టు కాంగ్రెస్‌ వర్గాలు వివరించాయి.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని