IPL: 10 ఫ్రాంచైజీలు 90+ మ్యాచులు

తాజా వార్తలు

Published : 05/07/2021 12:51 IST

IPL: 10 ఫ్రాంచైజీలు 90+ మ్యాచులు

నలుగురు రీటెయిన్‌.. జీతాల పెంపు

ముంబయి: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2022 సీజన్‌కు బీసీసీఐ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది. రెండు కొత్త ఫ్రాంచైజీలు, ఆటగాళ్ల రీటెన్షన్‌ విధానం, భారీ వేలం, జీతాల పెంపుపై నిర్ణయం తీసుకుంది. కొత్త ఫ్రాంచైజీల కోసం ఆగస్టులో టెండర్లు పిలిచి సెప్టెంబర్లో విక్రయం పూర్తి చేయనుంది. డిసెంబర్లో భారీ వేలం నిర్వహించనుంది. 2022 జనవరిలో ప్రత్యక్ష ప్రసారాల హక్కులకు టెండర్లు పిలవనుంది.

కొత్త ఫ్రాంచైజీల కొనుగోలు కోసం సంజీవ్‌ గోయెంకా గ్రూప్‌ (కోల్‌కతా), అదానీ గ్రూప్‌ (అహ్మదాబాద్‌), అరబిందో ఫార్మా (హైదరాబాద్‌), టొరెంట్‌ గ్రూప్‌ (గుజరాత్‌) సహా మరికొన్ని వ్యాపార సంస్థలు ఆసక్తిగా ఉన్నట్టు తెలిసింది. ఏదేమైనా అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీని అదానీ గ్రూప్‌ దక్కించుకోనుందని సమాచారం.

ఇక ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడంపై బీసీసీఐ స్పష్టతనిచ్చింది. 2022 సీజన్‌ వేలం ముందు గరిష్ఠంగా నలుగురిని రీటెయిన్‌ చేసుకోవచ్చు. ఐతే ఇందుకు కొన్ని పరిమితులు ఉన్నాయి. ముగ్గురు భారతీయులు, ఒక విదేశీ ఆటగాడిని తీసుకోవచ్చు. లేదా ఇద్దరు భారతీయులు, ఇద్దరు విదేశీ ఆటగాళ్లను అట్టిపెట్టుకోవచ్చు. కాగా ముగ్గురు ఆటగాళ్లను తీసుకుంటే రూ.15 కోట్లు, రూ.11 కోట్లు, రూ.7 కోట్లు వారికి చెల్లించాలి. ఇద్దరిని తీసుకుంటే రూ.12.5 కోట్లు, రూ.8.5 కోట్లు, ఒక్కరినే తీసుకుంటే రూ.12.5 కోట్లు ఇవ్వాలి.

ఆటగాళ్లకు చెల్లించే జీతాల నిధి మొత్తాన్ని రూ.85 నుంచి 90 కోట్లకు పెంచింది. అంటే పది ఫ్రాంచైజీల నుంచి రూ.50 కోట్లు జమ అవుతుంది. ఫ్రాంచైజీలు ఇందులో కనీసం 75% ఖర్చు చేయాలి. ఏటా రూ. 5 కోట్లు పెంచుతూ 2024కు ఈ జీతాల నిధిని రూ.100 కోట్లకు చేరుస్తారని తెలిసింది. పది జట్లతో నిర్వహించే ఐపీఎల్‌ ప్రసార హక్కులు భారీ స్థాయిలో అమ్ముడు పోతాయని అంచనా. ఎందుకంటే ఎనిమిది జట్లతో 60 మ్యాచులే నిర్వహిస్తున్నారు. అదే పది జట్లతో అయితే 90కి పైగా మ్యాచులు ఉంటాయి. దాంతో 25% ఎక్కువ ధర లభిస్తుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని