
తాజా వార్తలు
ఎలా ఆడాలో రోహిత్ చూపించాడుగా!
మొతేరాపై విమర్శలకు సన్నీ సమాధానం
ఇంటర్నెట్ డెస్క్: మొతేరా పిచ్‌పై పరుగులు ఎలా చేయాలో టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్‌శర్మ చూపించాడని సునిల్ గావస్కర్ అన్నారు. టెస్టు బ్యాట్స్‌మెన్ అన్నప్పుడు బంతి టర్నైనా, ఎదురుగా వచ్చినా ఆడాల్సిందేనని స్పష్టం చేశారు. డే/నైట్ టెస్టులో బంతి మరీ విపరీతంగా ఏమీ టర్నవ్వలేదని పేర్కొన్నారు. అక్షర్ పటేల్, అశ్విన్ బౌలింగ్ అద్భుతమని ప్రశంసించారు.
అహ్మదాబాద్‌లో జరిగిన గులాబి టెస్టు రెండు రోజుల్లో ముగిసిన సంగతి తెలిసిందే. అక్షర్, యాష్ చెలరేగడంతో మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 112కే ఆలౌట్ అయింది. అయితే ఇంగ్లాండ్ స్పిన్నర్ జాక్‌లీచ్, కెప్టెన్ జోరూట్ సైతం బంతిని టర్న్ చేయడంతో భారత్ 145కు ఇన్నింగ్స్ ముగించింది. ఆ తర్వాత జరిగిన రెండో ఇన్నింగ్స్‌లోనూ ఇంగ్లాండ్ 81కే కుప్పకూలడంతో స్వల్ప లక్ష్యాన్ని భారత్ 10 వికెట్ల తేడాతో సునాయాసంగా ఛేదించిన సంగతి తెలిసిందే.
‘పిచ్‌పై విసిరిన ప్రతి బంతీ విపరీతంగా స్పందించలేదు. ప్రమాదకరంగానూ అనిపించలేదు. ఊహించలేనంత బౌన్స్ కనిపించలేదు. నిజానికి ఇక్కడ ఉండాల్సిన స్థాయిలోనే బౌన్స్ ఉంది. బంతి మాత్రం కొద్దిగా స్పిన్ అయ్యింది. కానీ టెస్టు బ్యాట్స్‌మన్ అన్నప్పుడు బంతి టర్న్ అయినా నేరుగా వచ్చినా ఆడాల్సిందే. ఇది సవాలే కానీ, మరీ ఆడలేనంత కాదు. బ్యాట్స్‌మెన్ ఔటైన విధానం చూస్తుంటే వారి గోతులు వారే తవ్వుకున్నట్టు ఉంది’ అని సన్నీ అన్నారు. ‘పిచ్ కన్నా బ్యాట్స్‌మెన్ వైఖరే ఎక్కువగా దెబ్బతీసింది. మొతేరా పిచ్‌పై పరుగులు ఎలా చేయాలో రోహిత్ శర్మ రెండు ఇన్నింగ్సుల్లోనూ తన బ్యాటింగ్ ద్వారా చూపించాడు’ అని గావస్కర్ తెలిపారు.