వారెవ్వా వరుణ్‌
Array ( ) 1

ప్రధానాంశాలు

Published : 25/10/2020 02:10 IST

వారెవ్వా వరుణ్‌

చెలరేగిన నరైన్‌, రాణా
కోల్‌కతా ఘనవిజయం
అయిదు వికెట్లు పడగొట్టిన స్పిన్నర్‌
అబుదాబి

అదిరిపోయే విజయాలతో ప్లేఆఫ్స్‌ రేసులో దూసుకొచ్చిన దిల్లీ క్యాపిటల్స్‌.. బెర్తు సాధించేందుకు అవసరమైన ఒక్క విజయం సాధించలేకపోతోంది. అన్ని రంగాల్లో విఫలమైన ఆ జట్టు శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో చిత్తయ్యింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో 59 పరుగుల తేడాతో దిల్లీని ఓడించిన కోల్‌కతా ప్లేఆఫ్‌ అవకాశాలను మెరుగుపరుచుకుంది. నరైన్‌, రాణా విధ్వంసానికి వరుణ్‌ చక్రవర్తి మాయాజాలం తోడైన వేళ నైట్‌రైడర్స్‌కు ఎదురులేకుండా పోయింది. దిల్లీకి ఇది వరుసగా రెండో పరాజయం.

ప్లేఆఫ్స్‌ రేసు కఠినంగా మారుతున్న తరుణంలో కోల్‌కతా చక్కటి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. నితీష్‌ రాణా (81; 53 బంతుల్లో 13×4, 1×6), నరైన్‌ (64; 32 బంతుల్లో 6×4, 4×6) చెలరేగడంతో మొదట 6 వికెట్లకు 194 పరుగులు చేసిన ఆ జట్టు.. వరుణ్‌ చక్రవర్తి (5/20) కమిన్స్‌ (3/17) విజృంభించడంతో ఛేదనలో దిల్లీని 135 (9 వికెట్లకు) పరుగులకే పరిమితం చేసింది. శ్రేయస్‌ (47; 38 బంతుల్లో 5×4) టాప్‌ స్కోరర్‌.

దిల్లీ తడబాటు: భారీ లక్ష్య ఛేదనను పేలవంగా ఆరంభించిన దిల్లీ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. తొలి బంతికే రహానేను ఔట్‌ చేసి ఆ జట్టుకు షాకిచ్చిన కమిన్స్‌.. తన తర్వాతి ఓవర్లో ధావన్‌ (6)నూ వెనక్కి పంపాడు. ఆ తర్వాత దిల్లీని చుట్టేసే బాధ్యతను వరుణ్‌ తీసుకున్నాడు. అతడి మాయాజాలానికి మొదలవడానికి ముందు శ్రేయస్‌ అయ్యర్‌, పంత్‌ (27; 33 బంతుల్లో 2×4, 1×6) నిలబడ్డారు. కానీ స్కోరు బోర్డు నెమ్మదిగా సాగింది. 11 ఓవర్లకు స్కోరు 76/2. 12వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన వరుణ్‌.. దిల్లీకి పుంజుకునే అవకాశమే లేకుండా చేశాడు. ఆ ఓవర్లో పంత్‌ను ఔట్‌ చేసిన అతడు.. తన తర్వాతి ఓవర్లో హెట్‌మయర్‌ (10), శ్రేయస్‌లను వెనక్కి పంపి దిల్లీ వెన్నువిరిచాడు. అతడు 16వ ఓవర్లో స్టాయినిస్‌ (6), అక్షర్‌ పటేల్‌ (9)లను కూడా ఔట్‌ చేసి ఈ ఐపీఎల్‌లో అయిదు వికెట్ల ఘనత సాధించిన తొలి బౌలర్‌గా నిలిచాడు. 112/7తో దిల్లీ ఓటమి ఖాయమైపోయింది.

వాళ్లిద్దరు దంచేశారు..: 194/6. కోల్‌కతాకు ఇది ఊహించని స్కోరే. ఎందుకంటే ఆ జట్టు 8 ఓవర్లలో 44కే మూడు వికెట్లు చేజార్చుకుంది. నార్జ్‌, రబాడ ధాటికి శుభ్‌మన్‌ (9), త్రిపాఠి (13), కార్తీక్‌ (3) వరుస కట్టినా.. మరోవైపు నిలిచిన నితీష్‌ రాణాకు నరైన్‌ తోడయ్యాక ఇన్నింగ్స్‌ స్వరూపమే మారిపోయింది. బ్యాట్స్‌మెన్‌ ఇద్దరూ విరుచుకుపడడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. రాణా 35 బంతుల్లో, నరైన్‌ 24 బంతుల్లో అర్ధశతకాలు సాధించారు. రాణాతో 115 పరుగులు జోడించిన నరైన్‌.. 17వ ఓవర్లో ఔటైనా స్కోరు బోర్డు పరుగు కొనసాగింది. జోరు కొనసాగించిన రాణా.. మోర్గాన్‌ (17; 9 బంతుల్లో 2×4, 1×6)తో కలిసి వేగంగా 37 పరుగులు జోడించాడు. ఇద్దరూ చివరి ఓవర్లో ఔటయ్యారు.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: శుభ్‌మన్‌ గిల్‌ (సి) అక్షర్‌ (బి) నార్జ్‌ 9; రాణా (సి) దేశ్‌పాండే (బి) స్టాయినిస్‌ 81; రాహుల్‌ త్రిపాఠి (బి) నార్జ్‌ 13; దినేశ్‌ కార్తీక్‌ (సి) పంత్‌ (బి) రబాడ 3; నరైన్‌ (సి) రహానె (బి) రబాడ 64; మోర్గాన్‌ (సి) రబాడ (బి) స్టాయినిస్‌ 17; కమిన్స్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 194; వికెట్ల పతనం: 1-11, 2-35, 3-42, 4-157, 5-194, 6-194; బౌలింగ్‌: తుషార్‌ దేశ్‌పాండే 4-0-40-0; నార్జ్‌  4-0-27-2; రబాడ 4-0-33-2; అక్షర్‌ పటేల్‌ 1-0-7-0; స్టాయినిస్‌ 4-0-41-2; అశ్విన్‌ 3-0-45-0

దిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: రహానె ఎల్బీ (బి) కమిన్స్‌ 0; ధావన్‌ (బి) కమిన్స్‌ 6; శ్రేయస్‌ అయ్యర్‌ (సి) నాగర్‌కోటి (బి) వరుణ్‌ 47; రిషబ్‌ పంత్‌ (సి) శుభ్‌మన్‌ (బి) వరుణ్‌ 27; హెట్‌మయర్‌ (సి) త్రిపాఠి (బి) వరుణ్‌ 10; అక్షర్‌ పటేల్‌ (బి) వరుణ్‌ 9; రబాడ (సి) త్రిపాఠి (బి) కమిన్స్‌ 9; అశ్విన్‌ నాటౌట్‌ 14; దేశ్‌పాండే (సి) మోర్గాన్‌ (బి) ఫెర్గూసన్‌ 1; నార్జ్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 135; వికెట్ల పతనం: 1-0, 2-13, 3-76, 4-95, 5-95, 6-110, 7-112, 8-132, 9-135; బౌలింగ్‌: కమిన్స్‌ 4-0-17-3; ప్రసిద్ధ్‌కృష్ణ 2-0-19-0; నాగర్‌కోటి 2-0-11-0; ఫెర్గూసన్‌ 4-0-30-1; నరైన్‌ 4-0-37-0; వరుణ్‌ చక్రవర్తి 4-0-27-5Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన