
జయరాజు ‘అవని’ పుస్తకావిష్కరణ సభలో వక్తలు
రవీంద్రభారతి, న్యూస్టుడే: మనిషి ప్రకృతిలో భాగమని, ఆ ప్రకృతిని కాపాడుకుంటేనే అది మనల్ని కాపాడుతుందని వక్తలు పేర్కొన్నారు. ప్రజాకవి జయరాజు రచించిన ‘అవని’ పుస్తకావిష్కరణ సభ మంగళవారం రాత్రి రవీంద్రభారతిలో జరిగింది. ప్రకృతి తత్వవేత్త శ్రీరామ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. వక్తలు మాట్లాడుతూ.. ప్రకృతి అందాలను కళ్లకు కడుతూ.. దాన్ని ధ్వంసం చేసే అధికారం మనిషికి లేదని జయరాజు చెప్పిన తీరు ఆలోచింపజేసేదిగా ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ బి.ఎస్.రాములు, తెలంగాణ గ్రంథాలయ పరిషత్తు అధ్యక్షుడు డా.అయాచితం శ్రీధర్, తెలంగాణ ప్రజా పార్టీ వ్యవస్థాపకులు జస్టిస్ చంద్రకుమార్, దళిత ఉద్యమ నేత జూపూడి ప్రభాకరరావు, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ రాష్ట్ర పూర్వ శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, గద్దర్, సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి, జలసాధన సమితి నేత సత్యనారాయణ, అరుణోదయ కళామండలి నేత విమలక్క, జన విజ్ఞాన వేదిక నేత రమేశ్ పాల్గొన్నారు.