తెలంగాణ సంచార పశు వైద్యశాలలు భేష్‌

ప్రధానాంశాలు

తెలంగాణ సంచార పశు వైద్యశాలలు భేష్‌

దేశవ్యాప్తంగా ప్రవేశపెడతాం

కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ప్రవేశపెట్టిన సంచార వైద్యశాలల పనితీరు బాగుందని కేంద్ర పశు సంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా అన్నారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆయన శనివారం రాజేంద్రనగర్‌లోని గోశాలను సందర్శించారు. చేవెళ్ల ఎంపీ జి.రంజిత్‌రెడ్డి.. పశువైద్యశాల వాహనాన్ని ప్రత్యేకంగా అక్కడికి తెప్పించి కేంద్ర మంత్రికి చూపించారు. పశువులకు చికిత్స చేయడానికి అందులో ఉన్న పరికరాలు, మందులు, రైతులు వాహన సేవలను వినియోగించుకోవడానికి వీలుగా ఏర్పాటుచేసిన టోల్‌ ఫ్రీ నంబర్‌ 1962 గురించి రూపాలాకు ఎంపీ రంజిత్‌రెడ్డి వివరించారు. అనంతరం కేంద్ర మంత్రి రూపాలా మాట్లాడుతూ.. అత్యవసర సందర్భాల్లో పశువుల వద్దకే వెళ్లి వైద్యసేవలు అందించే ఇలాంటి వాహనాలను దేశవ్యాప్తంగా ప్రవేశపెడతామన్నారు. పశు వైద్యసేవలకు కేటాయించిన సంచార వాహనాన్ని చూడటం సంతోషంగా ఉందంటూ వాహనంతో దిగిన ఫొటోను తన ట్విటర్‌ ఖాతాకు ట్యాగ్‌ చేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని