close
పడి లేచిన కెరటం! 

రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, 
కర్ణాటకల్లో  ఫలించిన భాజపా వ్యూహం

దేశ వ్యాప్తంగా మోదీ ప్రభ తగ్గిందంటూ ప్రచారం, పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలు అధికారంలోకి రావడం... సార్వత్రిక ఎన్నికల ముందు భాజపాకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. దీంతో ఓడిపోయిన చోటే మళ్లీ తలెత్తుకొని నిలబడాలని కాషాయపార్టీ కసితో కృషి చేసింది. సరికొత్త వ్యూహాలతో ప్రత్యర్థులను చిత్తుచేసింది. ముఖ్యంగా రాజస్థాన్‌,  మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటకల్లో అత్యధిక లోక్‌సభ స్థానాలను తన   ఖాతాలో వేసుకుంది. 

రాజస్థాన్‌లో భాజపా అనూహ్యంగా సంపూర్ణ విజయం సాధించింది! 2014లో 55.6% ఓట్లతో రాష్ట్రంలోని మొత్తం 25 లోక్‌సభ స్థానాలనూ ఆ పార్టీయే కొల్లగొట్టింది. 30.7% ఓట్లు సాధించిన కాంగ్రెస్‌కు ఒక్క సీటయినా దక్కలేదు. ఆ తర్వాత 2018 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించి, రాష్ట్ర పగ్గాలు చేపట్టినా... మెజార్టీ అంతంత మాత్రమే. మొత్తం 200 స్థానాలకుగాను ఆ పార్టీకి 100 స్థానాలు వచ్చాయి. ఆ ఓటింగ్‌ సరళిని నిశితంగా పరిశీలిస్తే 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 11, భాజపాకు 7 లోక్‌సభ స్థానాలు వస్తాయనీ... మిగతా ఏడింటిలో ఎవరెన్ని సాధిస్తారన్నదే తేలాల్సి ఉందన్న అంచనాలు వినిపించాయి. కొందరు రాజకీయ విశ్లేషకులైతే... కమలనాథులకు 10-11 సీట్లకు మించి రావని తేల్చి చెప్పారు. అయితే భాజపా మాత్రం వాటిని ఖండిస్తూనే వచ్చింది. కనీసం 18-19 సీట్లు గెలుచుకుంటామని ఢంకా బజాయించింది. చివరికి మిత్రపక్షం ఆర్‌ఎల్‌టీపీతో కలిసి మొత్తం అన్ని స్థానాలనూ తన ఖాతాలో వేసుకుంది. 

చందనసీమలో సత్తా చాటిన భాజపా 
కన్నడనాట భాజపా సత్తా చాటింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌-జేడీ(ఎస్‌) కూటమిని చావుదెబ్బ కొట్టింది. మోదీ-షా వ్యూహాలకు తోడు యడ్యూరప్ప మంత్రాంగం పక్కాగా పనిచేసింది. 28 స్థానాల్లో ఏకంగా 24 గెలిచింది. మండ్యలో స్వతంత్ర అభ్యర్థి సుమలతకు మద్దతిచ్చి గెలిపించింది. 20% ఉన్న లింగాయత్‌లు భాజపాకు దన్నుగా నిలిచారు. ఈబీసీలకు కేంద్రం 10% రిజర్వేషన్లు ప్రకటించడం అదనపు ఓట్లు తెచ్చిపెట్టింది. మోదీ అత్యధికంగా 7 సార్లు కర్ణాటకలో పర్యటించడంతో పార్టీ శ్రేణులంతా ఉత్సాహంగా పనిచేశాయి. 
చిత్తయిన కూటమి 
గత ఏడాది జట్టు కట్టి భాజపా నుంచి అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్‌-జేడీ(ఎస్‌) కూటమి ఈ ఎన్నికల్లో చతికిలపడింది. మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రభావం చూపలేకపోయారు. జేడీ(ఎస్‌) దన్నుతో కర్ణాటకలో గౌరవప్రదమైన స్థానాలు గెలవాలనుకున్న కాంగ్రెస్‌కు భంగపాటు తప్పలేదు. మాజీ ప్రధాని దేవేగౌడ ఓడిపోగా, ఆయన మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణ ‘హసన్‌’ నుంచి గెలిచారు. మరో మనవడు నిఖిల్‌ కుమారస్వామి స్వతంత్ర అభ్యర్థి సుమలత చేతిలో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌ ప్రముఖులు మల్లికార్జున ఖర్గే, వీరప్ప మొయిలీ, కె.హెచ్‌.మునియప్పలకూ ఓటమి తప్పలేదు. 
మధ్యప్రదేశ్‌లో కమల వికాసం 
మధ్యప్రదేశ్‌లో కమలదళం మరోసారి ప్రభంజనం సృష్టించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవం తాత్కాలిక గ్రహణమేనని చాటిచెప్తూ.. రాష్ట్రంలో 28 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌పై పూర్తిగా పైచేయి సాధించింది. ఆ పార్టీని ఒకే ఒక్క స్థానానికి పరిమితం చేసింది. భాజపా హవా ధాటికి కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా కూడా పరాజయం పాలయ్యారు. రాష్ట్రంలో మొత్తం 29 లోక్‌సభ స్థానాలున్నాయి. 2014 ఎన్నికల్లో 27 స్థానాలను కమలనాథులు గెల్చుకోగా, కాంగ్రెస్‌ రెండంటే రెండే సీట్లకు పరిమితమైంది. రాష్ట్రంలో 15 ఏళ్లపాటు సాగిన కమలనాథుల గుత్తాధిపత్యానికి తెరదించుతూ గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయబావుటా ఎగరేసింది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లోనూ భాజపాకు ఇక్కట్లు తప్పవని విశ్లేషకులు అంచనా వేశారు.  ఈ అంచనాలను కమలనాథులు తలకిందులు చేశారు. 

ఛత్తీస్‌గఢ్‌ 
ఛత్తీస్‌గఢ్‌ శాసనసభ ఎన్నికల్లో కుదేలైన కమలం పార్టీ... కొద్ది రోజుల్లోనే పూర్వ వైభవం సాధించింది! 2014 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఇక్కడ 49.7% ఓట్లతో పది స్థానాలను తన ఖాతాలో వేసుకోగా, 39.1% ఓట్లతో కాంగ్రెస్‌ ఒకే ఒక్క స్థానం సాధించింది! అయితే ఆ తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో హస్తం పార్టీకి తిరుగులేని ఆధిక్యం లభించింది. సార్వత్రిక ఎన్నికల్లో రైతులు-గిరిజనుల సంక్షేమం; వరికి మద్దతు ధర కల్పన; గిరిజనుల హక్కుల పరిరక్షణ లాంటి అంశాలు ఇక్కడ ప్రధానంగా చర్చకు వచ్చాయి. చావో-రేవో అన్నట్టు భాజపా శ్రేణులు సమష్టిగా కృషి చేసి 9 సీట్లను సాధించాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్నా రెండు చోట్ల మాత్రమే కాంగ్రెస్‌ విజయం సాధించింది.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.