close
జ్ఞానోదయం

- వలివేటి నాగచంద్రావతి

ఉన్నట్టుండి రుక్మిణమ్మ విలువ ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పటివరకూ ఆ ఇంట్లో ఆవిడది జీతబత్తాలడగని ఒక పనిమనిషి పాత్ర మాత్రమే.

ముగ్గురు కొడుకులున్న ఓ ఉమ్మడి కుటుంబంలో చివరి కుమారుడి భార్యగా ఆ ఇంట్లో గృహప్రవేశం చేసింది రుక్మిణమ్మ.

పెద్ద కోడళ్ళిద్దరూ ‘ఉన్న ఇంటి’ ముద్దుగుమ్మలు - పుట్టింటి ఐశ్వర్యం కొంత వాటా తవ్వి తెచ్చుకున్నవాళ్ళు. వాళ్ళంటే అందరికీ అపురూపం.

ఒక్కరైనా నోరు మెదపకుండా తను చెప్పింది వినే కోడలు కావాలని, లేమిలోకి జారిన తమ్ముడి మొదటి భార్య కూతురు రుక్మిణిని దయ తలిచినట్టు తిరుగుబోతు కొడుక్కి భార్యగా, తనకి మూడో కోడలిగా కోరి తెచ్చుకుంది అత్తగారు.

చీరె సారెలు కావిళ్ళతో మోసుకురాని రుక్మిణి అంటే ఇంటిల్లిపాదికీ చులకనే. చిన్న పొరపాటుకీ బుగ్గలు పొడిచేది అత్తగారు. హక్కు ఉన్నట్టు అడ్డమైన చాకిరీ చేయించుకునేవాళ్ళు తోటికోడళ్ళు. బేలచూపులు తప్ప వయ్యారిహొయలెరుగని భార్యని ఏడుపుగొట్టు మొహం అని చీదరించుకునేవాడు భర్త.

ఈ చిన్నచూపు, ఈ నిరాదరణతోనే  సగం వయసు చెల్లించేసింది రుక్మిణమ్మ.

కాలంతోపాటు శరీరంలో వచ్చిన మార్పులేకాక ఇంట్లో ఆవిడ పరిస్థితిలోనూ మార్పులొచ్చినయ్‌. సుఖంతోపాటు బోనస్‌గా వచ్చే వ్యాధులతో ఒళ్ళు పుచ్చిపోగా రుక్మిణమ్మ పసుపు కుంకుమలు తుడిచేస్తూ తనువు చాలించాడు భర్త. చివరి శ్వాస వదిలేవరకూ కాల్చుకుతిన్న అత్తగారు కాలం తీరి వెళ్ళిపోయింది. బాధపెట్టేవాళ్ళు లేరు కనుక రుక్మిణమ్మ ఇక సుఖపడిందనుకోనక్కరలేదు. హయాం మారింది- అంతే. బుగ్గపోట్లు లేవుగానీ చీదరింపులూ బండచాకిరీ అంతా మామూలే.

అసలైన దురదృష్టం ఏమిటంటే- రుక్మిణమ్మకు భర్త సుఖసంతోషాలివ్వకపోగా సంతానభాగ్యాన్ని కూడా ఇవ్వలేదు. బిడ్డా పాపా లేరు. ఇంట్లో మేమున్నామని భరోసా ఇచ్చేవాళ్ళూ లేరు... అవసరమొస్తే ఆసరా అయ్యే కన్నవాళ్ళూ లేరు. అసలు నోరెత్తే సాహసం రుక్మిణమ్మకీ లేదు.

ఎవరేపని చెప్పినా ఫుల్‌ చార్జింగ్‌ పెట్టిన రోబోలా చేసుకుపోతూ, ఎవరేమన్నా తనను కానట్టు దులిపేసుకుపోతూ, తనూ ఓ మనిషే అన్నమాటే మరిచిపోయినట్టుండే రుక్మిణమ్మ ఒక్కసారిగా స్పందించింది. ఉలిక్కిపడింది.

* * *

‘‘రుక్మిణీ, ఒక్కమాటు ఇలా రామ్మా.’’

అంత ప్రేమగా పిలిచింది పెద్ద బావగారు భక్తవత్సలంగారు. ఆయన ఏనాడూ మరదలికి మర్యాదిచ్చి పేరుపెట్టి సంబోధించింది లేదు. అవసరపడితే గోడకో గుమ్మానికో ఆజ్ఞాపిస్తున్నట్టు పనులు పురమాయిస్తాడంతే. అలాంటిది ఏమిటీ అకారణ కరుణాపాతం- బిత్తరపోయి చూసింది రుక్మిణమ్మ.

ముందు హాల్లో భక్తవత్సలంగారు నల్లకోటు వేసుకున్న ఆయనతో మాట్లాడుతున్నారు. ‘‘ఈయన లాయరు లక్ష్మీపతిగారు, నీ కోసమే వచ్చారు. ఆయన చెప్పినచోట సంతకం చెయ్యమ్మా’’ అన్నారు ఎంతో సౌమ్యంగా.
‘ఎందుకూ అది?’ చిన్న అనుమానం మనసులో పొటమరించినా, ‘హ్హు, ఏదయితే మాత్రమేం... ఇంతకంటే చెడేదేముంది’ అన్నట్టు నిర్లిప్తంగా పెన్‌ చేతికి తీసుకుంది రుక్మిణమ్మ.

‘‘ఏం తల్లీ, అదెందుకో అడగవా?’’ వచ్చిన ఆ లాయరు ఆశ్చర్యపోతూ ప్రశ్నించారు.

‘‘ఉత్త అమాయకురాలండీ లాయరుగారూ. ఏం చెప్పినా చప్పున అర్థం చేసుకోలేదు పాపం. ఆ తరవాత వివరంగా నేను చెబుతాలెండి’’ భక్తవత్సలంగారు లాయరుగారి చేతిలోని కాయితాలు అందుకోడానికి చెయ్యి చాపి అన్నారు.
కాయితాలు ఆయనకందించకుండా- ‘చెప్పవలసిన బాధ్యత నాది కదా’ అంటూ- ‘‘చూడమ్మా రుక్మిణీ, ఇలా కూర్చో. ఇవి సావిత్రమ్మగారి ఆస్తి తాలూకూ కాయితాలు. ఆవిడ నీకు తెలుసు కదా?’’ అన్నారు.

ఒక్క క్షణం ఆగి ‘‘తెలుసు, మా పిన్ని.

మా అమ్మకి చెల్లెలు తను’’ నింపాదిగా చెప్పింది రుక్మిణి.

‘‘నెలక్రితం ఆవిడ మరణించారు’’ ముందుగా చావు కబురు చెప్పి, ‘‘పోయే ముందర తన ఆస్తిలో కొంతభాగం నీ పేర రాసి రిజిస్టరు చేయించారు. ఈ దస్తావేజులు నీకందించి ముట్టినట్టు దస్కతు చేయించుకుంటే నా పని పూర్తవుతుంది’’ చల్లని కబురు చల్లగా చెప్పారు చివరికి.

వివరాలు ముందే సేకరించబట్టి భక్తవత్సలంగారు గాంభీర్యం పోషించగలిగారుగానీ, ‘ఈ అనామకురాలిని వెతుక్కుంటూ వచ్చిన అర్భకుడెవరా...’ అని వింతగా తొంగి చూడవచ్చిన కుటుంబ సభ్యులు మాత్రం కరెంట్‌ షాక్‌ తగిలినట్టు దిమ్మెరపోయారు. రుక్మిణమ్మకయితే అసలాయన చెప్పిన సమాచారం కొన్ని క్షణాలు అర్థంకాలేదు.

* * *

పినతల్లి సావిత్రి అంటే రుక్మిణికి చిన్ననాటి ఓ తీపి జ్ఞాపకం.

సావిత్రి అపురూప సౌందర్యవతి. ఓ ఇండస్ట్రియలిస్టు కుమారుడు కోరి చేపట్టాడామెని. కానీ ఐశ్వర్యమిచ్చిన దేవుడామెకు సంతానమివ్వటం మరచిపోయాడు.

అక్కగారింటికి తరచూ వచ్చేది సావిత్రి. పసిపిల్ల రుక్మిణి అంటే ప్రాణం పెట్టేది.

‘దీన్ని నాకిచ్చెయ్యవే అక్కా’ అంటుండేది. నవ్వేదావిడ.

రుక్మిణి తల్లి మరణించింది. సవతి తల్లి వచ్చింది. రుక్మిణిని పెంపకానికిచ్చే ప్రసక్తి వచ్చినా సవతి తల్లి మత్సరంకొద్దీ ససేమిరా అంది. అలా ఆ ఇంటికి దూరమైపోయింది సావిత్రి.
‘పిన్నికి చివరిదాకా నామీద అపేక్ష పోలేదు’ కళ్ళు చెమర్చాయి రుక్మిణికి.

ఆరోజు నుంచీ... అబ్బే... ఆ క్షణం నుంచీ ఇంటి వాతావరణం- కాదు కాదు ఇంట్లోవాళ్ళ స్వభావం, మాంత్రికుడు మంత్రదండం ఝళిపిస్తే పూరిగుడిసె అద్భుత భవనంలా మారిపోయినట్టు - విచిత్రంగా కఠోరత్వం నుంచి మృదు మధురానికి షిఫ్టయిపోయింది. మాటల్లో సౌమ్యతా చూపుల్లో ఆర్ద్రతా పరిగెత్తుకుంటూ వచ్చేశాయి. ‘ఏమేవ్‌’, ‘ఒసేయ్‌’ అనే పిలుపు ‘రుక్కూ’ ‘రుక్మిణమ్మా’ అయిపోయింది.

ఈ రంగులు మారిన విధానాన్ని విస్మయంతో గమనిస్తోంది రుక్మిణి.

పినతల్లి పోయిన దుఃఖంలో ఉన్నావు. ఇప్పుడు కూడా అన్ని పనులూ నువ్వే చెయ్యాలా పిచ్చిదానా, మేము లేమూ’’ చేతిలో చీపురు లాక్కుంటూ ఎక్కడలేని ప్రేమా కురిపించింది పెద్దావిడ.

‘‘నీకు మరీ మొహమాటమెక్కువ రుక్కూ. ఇటివ్వు నీ బట్టలు వాషింగ్‌మిషన్‌లో వేస్తా’’ తెగ మొహమాట పెట్టేసింది చిన్న తోటికోడలు.

ఒకానొకనాడు ‘అడ్డమైన మురికి తోళ్ళూ వేస్తే మిషను నాశనమైపోతుంది. ఏం చేత్తో ఉతుక్కోలేవూ, కాస్త ఎక్సర్‌సైజన్నా ఉంటుందీ’ అని వెటకరించిందీ ఈ నోరే.

నాలుగు రోజుల్లో రుక్మిణమ్మకు చెందే ఆస్తి వివరంగా తెలిసింది.

తనకున్న ఆస్తిలో మూడువంతులు ధర్మ సంస్థలకు దానం చేసింది సావిత్రమ్మ. తను అంతవరకూ నివాసముంటున్న భవంతినీ యాభైలక్షల బ్యాంకు బ్యాలెన్సునీ వంద తులాల జవహరీనీ తెలిసీతెలియని వయసులోనే తనని ‘అమ్మా’ అని పిలిచి తనలోని మాతృత్వాన్ని తృప్తిపరిచిన తన అభిమాన పుత్రిక రుక్మిణికి రాసి ఇచ్చిందావిడ.

దానిమొత్తం విలువెంతో తెలిసేసరికి కళ్ళు పచ్చబడ్డాయి అందరికీ.

రెండు రోజుల్లో పెద్ద బావగారి కూతురు అపరాజితా, ఆ మర్నాడే చిన్న బావగారి అమ్మాయిలు అర్చనా, అంబికా పిల్లల్నేసుకు దిగిపోయారు.

రాగానే రుక్మిణమ్మని వాటేసుకున్నారు వాళ్ళు. ఒళ్ళు పులకరించింది రుక్మిణమ్మకి.
వారి ముగ్గురి పసితనమంతా రుక్మిణమ్మ సందిట్లోనే గడిచింది. వాళ్ళ తల్లులు వాళ్ళని కనగలిగారంతే. సాకే భారం మొయ్యటం మాత్రం వారివల్ల కాలేదు పాపం... సుకుమారులు. వారికే బాదరబందీ కలగకుండా చూసుకునేందుకు వారికి తేరగా దొరికిన ప్రత్యామ్నాయం రుక్మిణి. ఆ బాధ్యతని దేవుడిచ్చిన వరంగా పరమ సంతోషంగా తలకెత్తుకుంది ఆమె.

ఆ పిల్లల మలమూత్రాలు ఎత్తింది. తిప్పితిప్పి బువ్వ పెట్టింది. వాళ్ళకొచ్చిన బాలారిష్టాలకు నిద్రాహారాలు మాని సేవలు చేసింది. గుండెకు హత్తుకుని నిద్రపుచ్చింది. స్కూళ్ళకు తీసుకెళ్ళి తీసుకువచ్చింది. వాళ్ళు చెప్పే ఊసులు విన్నది. వాళ్ళకు కథలూ కబుర్లూ చెప్పింది. కలిసి పాడింది, నవ్వింది. వాళ్ళే ప్రాణంగా లోకంగా మైమరిచిపోయిందొకనాడు.

పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. పిన్నమ్మ అవసరం తగ్గిపోయింది. పాకెట్‌ మనీ ఇచ్చే అమ్మానాన్నలతో సాన్నిహిత్యం పెరిగింది.

వాళ్ళకీ అంతే. ఎత్తుకోమని చేతులు చాపి ఇబ్బందిపెట్టే రోజులు దాటిపోయి, బార్బీ బొమ్మల్లా అందంగా ముస్తాబై, షోగ్గా స్టైల్‌గా ‘మమ్మా, పప్పా’ అంటూ గారాలుపోయే వయసొచ్చిన కూతుళ్ళ మీద అమ్మానాన్నలకి అభిమానం పెరిగిపోయింది.

అలా మెల్లమెల్లగా దూరం జరిగిపోయిన పిల్లలు వెనకటిలా ఆత్మీయంగా కౌగిలించుకునేసరికి ఒళ్ళు మరిచిపోయింది రుక్మిణమ్మ. వాళ్ళు తనని తృణీకరించిన వైనమే తలపుకు రాలేదు. ‘నా తల్లి...

నా తల్లి’ అంటూ నడుము చుట్టూరా చేతులు చుట్టింది.

ఆ రోజంతా రుక్మిణిని అంటిపెట్టుకునే తిరిగారు పిల్లలు ముగ్గురూ. ఏ మాట ఆమెను సంతోషపెట్టగలదో వాళ్ళకి బాగా తెలుసు.

‘‘చిన్నమ్మా, సొరకాయ ముక్కల్లో పాలుపోసి చేస్తావే, ఆ కూర చేసిపెట్టవా.

మా అత్తగారికది అసలు చేతకాదు. నువ్వు చేసేదే సూపరు’’ ఉబ్బేసింది అపరాజిత. మిగతా ఇద్దరూ కూడా తక్కువ తిన్నారనిపించుకోకుండా చేగోడీ లొకరూ, గోధుమ హల్వా ఒకరూ పురమాయించి ‘‘వాటికి పేటెంటు హక్కులు ఎప్పుడూ నీవే’’ అని పొగిడారు.

పిల్లల పొగడ్తలకి ఏభై కేజీల బరువుండే రుక్మిణి అరవై కేజీలయిపోయింది.

సాయంత్రం దగ్గరుండి రుక్మిణి ఇష్టదైవం వేణుగోపాలస్వామి కోవెలకు తీసుకువెళ్ళి ప్రదక్షిణాలు చేయించారు. పాత రోజులు గుర్తుకువచ్చి కళ్ళు చెమ్మగిల్లాయి రుక్మిణికి.

లంచ్‌ తరవాత కుటుంబసభ్యులందరూ ముందు హాల్లో కొలువుతీరారు. నిజానికి రోజూ రాత్రిళ్ళు టీవీ చూస్తూ కబుర్లాడుకోటం కోసం అందరూ అక్కడ సమావేశమవడం సాధారణమే.

కాగా ఎప్పుడూ రుక్మిణికి అందులో భాగం ఉండదు. ఆ సమయానికి వంట ఇంట్లోనూ డైనింగ్‌ టేబుల్‌ దగ్గరా అందరూ చేసిన కంగాళీ అంతా శుభ్రం చేయటంలో మునిగిపోయుంటుంది. ఇవాళ్టి ముచ్చట ఏమిటంటే- రుక్మిణి వద్దంటున్నా కిచెన్‌లో జొరబడిపోయి పనులన్నీ చకచకా చక్కబెట్టేసి రుక్మిణిని కూడా హాల్లోకి లాక్కొచ్చి సోఫాలో కుదేశారు అమ్మాయిలు ముగ్గురూ. ఆమె భుజం మీద ప్రేమగా చెరొకరూ తలలు పెట్టారు. అర్చనయితే రుక్మిణి కాళ్ళ దగ్గర నేలమీద కూర్చుని ఒళ్ళో తలపెట్టుకుంది. జన్మ ధన్యమైపోయింది రుక్మిణమ్మకి.

‘‘పిన్నీ, ఇంకా ఆ పాత పగడాల దండేమిటి చెప్పు... చక్కగా రాళ్ళబిళ్ళ వేయించుకుని పలకసర్లు చేయించుకో... మెడ నిండుగా ఉంటుంది’’ భుజంమీంచి తల పైకెత్తి రుక్మిణి కంఠం చూస్తూ అభిమానం కురిపిస్తూ సలహా ఇచ్చింది అపరాజిత.

‘‘కరెక్టుగా చెప్పావ్‌. దాంతోపాటు పెద్దపెద్ద ముత్యాలున్న దండ వేసుకున్నదంటే మా పిన్ని మహారాణిలా ఉంటుంది’’ చెల్లెలు అంబిక మద్దతు పలికింది.

వీళ్ళ మాటలు వింటూ పెద్ద తోటికోడలు వారిజ నవ్వింది. ‘‘మీ మొహం. ఏమీ పెట్టుకోకపోయినా మీ పిన్ని పున్నమి చందమామే. కావాలంటే మీరే దిగేసుకోండి హారాలు’’ అంది.

‘‘మాకెవరు చేయిస్తారు?’’ బుంగ మూతిపెట్టింది అంబిక.

‘‘ఎవరేమిటీ? అడగాలేగానీ మీ పిన్నే చేయిస్తుంది. పెంపుడు కూతుళ్ళు- మీగ్గాక ఎవరికి పెడుతుందంత బంగారం!’’ అంది చిన్న తోటికోడలు హిమజ- రుక్మిణి తరఫున తనే తీర్మానించేస్తూ.

‘‘నిజంగానేనా పిన్నీ’’ ఠక్కున తల పైకెత్తింది అపరాజిత. కానీ సమాధానం కోసం మాత్రం ఎదురుచూళ్ళేదు. ‘‘అలా అయితే పిన్నీ, నాకు పలకసర్లు వద్దు, మువ్వల వడ్డాణం పెట్టుకోవాలని నా పెళ్ళప్పటి నుంచీ కోరిక. అమ్మా చేయించలా, అత్తగారూ చేయించలా. నువ్వది చేయించి పెట్టవా?’’ అపరాజిత కంఠంలో తొణికిసలాడే ఆశ.

‘‘నాకు కాసులపేరు కావాలి, ఇప్పుడది ఫ్యాషన్‌. మా తోటికోడలప్పుడే చేయించేసుకుంది. నాకే ఉందని తెగ ఫోజు పోతోంది. నాకెంత చిన్నతనంగా ఉంటుందో నువ్వు చెప్పు. నీకిది తెలిస్తే నాకది చేయించకుండా ఆగ్గలవా? ఆ మాటే మా తోటికోడలికి చెప్పి మరీ వచ్చా’’ అంది అర్చన గారంగా.

‘‘నాకీ భారీ నగలేం వద్దు. డైమండ్‌ హారమొక్కటీ చాలు’’ ముద్దుముద్దుగా అంది అంబిక.

‘‘అలాగేలెండి పిచ్చి మొహాల్లారా. మీకు చేయించి పెట్టక ఆవిడేం చేయించుకుంటుందీ?’’ ‘అత్త సొమ్ము అల్లుడు దానం...’ - అన్న చందాన రుక్మిణి తరఫున తను మాటిచ్చేసింది రెండో కోడలు.

‘‘సరే, మీ నగల గోల అలా ఉంచండి. అమ్మాయ్‌ రుక్మిణీ... ఆ డబ్బంతా అలా బ్యాంకులో పాతర వేస్తే ఏం వస్తుంది? నూటికి రూపాయి రాదు. ఏడాదిలో రెట్టింపయ్యే పథకాలు నా దగ్గర బోల్డున్నాయ్‌. రేపా బ్యాంకు కాగితాల మీద ఓ సంతకం పెట్టి నాకివ్వు- ఆ డబ్బు సంగతి నేను చూసుకుంటా’’ అన్నారు భక్తవత్సలంగారు.

ఏది చెప్పినా నా మాటకి తిరుగులేదంతే అన్నంత గంభీరంగా చెబుతాడాయన.

‘‘నేనూ సరిగ్గా అదే చెబుదామనుకుంటున్నా నన్నయ్యా. ‘డబ్బు చేతికొస్తే దాన్ని ఎలా క్షవరం చెయ్యటమా అని కాదు, దాన్ని రెట్టింపు చెయ్యటమెలాగా’ అని ఆలోచించాలి. చూడు రుక్కూ... మొన్ననే మీ పిన్నిగారి ఊరు వెళ్ళి నీకిచ్చిన ఇల్లు చూసొచ్చాను- బయటనుంచే అనుకో - చాలా పెద్దది.

సిటీ మధ్యలో ఉంది. దాన్ని కాస్త అటూ ఇటుగా మార్పులు చేసి ఏ బ్యాంకులకో ఆఫీసులకో ఇచ్చామనుకో... బ్రహ్మాండమైన రెంటు వస్తుంది. రెండు మూడు పార్టీలతో మాట్లాడేశాను కూడా. నీకు తెలుసుగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో నాకెంత పేరుందో. నీకెందుకు- ఆ ఇంటి తాళాలు నాకిలా పడేసి నువ్వు నిశ్చింతగా కూర్చో.

క్షణాల్లో ఆ భవనం రూపురేఖలు మార్చేసి, లక్షల్లో అద్దెలు వసూలుచేసి చూపిస్తాను’’ అరచేతిలో వైకుంఠం చూపించాడు చిన్న బావగారు శేషావతారంగారు.

దొంగలూ దొంగలూ ఊళ్ళు పంచేసుకున్నారు. రుక్మిణమ్మ బరువు దింపేశారు. వారివంక చూస్తూ ఓ వెర్రి నవ్వు నవ్వింది రుక్మిణి.

* * *

ఆ మర్నాడు రామాలయం పూజారి రామశాస్త్రిగారూ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయ ధర్మకర్త వాసుదేవరావుగారూ ఇంటికి విచ్చేశారు.

నిరతాన్నదాన పథకానికి పదిలక్షల విరాళమివ్వమని ఒకరూ, అమ్మవారి మణి కిరీటానికి ఇరవై లక్షలు కానుకగా సమర్పించమని ఒకరూ అభ్యర్థించారు.

అందుమూలంగా రుక్మిణి చేసిన పాపాలు నశించిపోయి కేజీలకొద్దీ పుణ్యమూ అడక్కుండానే మోక్షమూ లభించగలవని నొక్కి వక్కాణించారు. ఒకవేళ తప్పదారి మరుజన్మంటూ ప్రాప్తించినా ఇప్పట్లాగా సంతానలేమీ వైధవ్య బాధా ఉండబోవని హామీ ఇచ్చారు.

వాళ్ళు వెళ్ళాక ఒకరిద్దరు ధర్మసంస్థల వారొచ్చి తలుపు తట్టారు. భక్తవత్సలంగారికి గంగ వెర్రులెత్తిపోయింది.

‘‘వీళ్ళ మాటలన్నీ నిజమనుకునేవమ్మాయ్‌. అందరూ దొంగలే. నువ్విచ్చేదాన్లో సగం వాళ్ళ జేబుల్లోకే పోతుంది. నీ దగ్గర డబ్బు లాగాలనే ఇన్ని మాయమాటలు. అవన్నీ నమ్మి చేతులు ఖాళీ చేసుకోకు సుమీ. కావాలంటే హారతి పళ్ళెంలో రూపాయివేసే దక్షిణ పది రూపాయలు వెయ్యి, చాలు.

మా మాటలు వింటే బాగుపడతావ్‌. నిన్ను చివరివరకూ పువ్వుల్లోపెట్టి చూసుకునేవాళ్ళం మేమే. వాళ్ళనే నమ్ముతావో, మా మాటే వింటావో నీ ఇష్టం’’ ఇవే పాఠాలు మార్చి మార్చి చెబుతూ అరగంట బ్రెయిన్‌వాష్‌ చేశారు భక్తవత్సలంగారు.

తల వంచుకున్నది వంచుకున్నట్టుగానే విన్నానన్నట్టు తలూపింది రుక్మిణి.

ఆవిడ అటు వెళ్ళగానే భార్య చెవిలో ‘‘శంకరమఠంలో స్వామి వారెవరో వేదాంతోపన్యాసాలిస్తున్నారట. మీ తోటికోడల్ని ఓ వారం అక్కడికి పంపించు. ఆ వైరాగ్యం ఒంటబడితే వచ్చిన ఆ ఐశ్వర్యాన్ని తొందరగా మనకొదిలి పెడుతుందేమో’’ అని గుసగుసలాడారు. ఆ ఉపాయం మంచి ఫలితాన్నే ఇచ్చింది.

* * *

‘‘లాయరుగారు ఇవాళ వస్తానన్నారు. రాతకోతలన్నీ పర్‌ఫెక్టుగా ఉండటం మంచిది గదా అన్నారాయన’’ అంది రుక్మిణి తల వంచుకునే.

కుటుంబ సభ్యులందరిలోనూ ఆనందం పోటొచ్చిన సముద్రపుటలలాగా ఉవ్వెత్తున ఎగిసిపడింది.

‘అమ్మయ్య, ఉత్కంఠకు తెరపడబోతోంది. ఇద్దరి మధ్యనా ఎక్కువ తక్కువలుండవు గదా’ అన్నదమ్ములు లెక్కలు వేసుకుంటున్నారు. ఆడపిల్లలేమో తూకాలు వేసేసుకుంటున్నారు.
లక్ష్మీపతిగారు వచ్చారు.

* * *

‘‘తల వంచుకుని చెప్పినచోట సంతకం పెట్టిన ఈ అమాయకురాలిలో ఇంత విచక్షణా ఇంత దయార్ద్ర హృదయమూ ఇంత సేవా దృక్పథమూ ఉంటుందనీ ఎవరూ వేలెత్తి చూపించలేని విధంగా ఇంత ఉన్నతమైన నిర్ణయం తీసుకోగలదనీ నేనూహించలేదు. ఇంకోమాట... ఆమెనలా తీర్చిదిద్ది, ముందుకడుగేయటానికి ప్రోత్సహించిన

మీ సంస్కారానికి నా ధన్యవాదాలు’’ అంటూ ప్రారంభించారు లాయరుగారు.

అర్థంకాకపోయినా అయోమయంగా ఉన్నా అవునవునన్నట్టు చిరునవ్వులు చిందిస్తూ తలలూపారు అందరూ.

‘‘మీకు తెలుసనుకుంటాను- రుక్మిణమ్మ ‘మదర్‌ థెరిస్సా ఆర్ఫనేజి’లో అనాథలకి స్వచ్ఛందంగా సేవ చేయటం కోసం వెళ్ళిపోబోతోందని...’’

తెల్లబోయారు. ‘శంకరమఠం వివేకానంద ప్రవచనాల్లో అంత ప్రభావముందా..? బాగానే ఉంది, మరి ఆస్తి మాటో..?’

‘‘దానికే వస్తున్నాను. అవకరంతోనో అతిలేమిలోనో పుట్టి మర్యాదగా మనుగడ సాగించేందుకు అగచాట్లు పడుతోన్న ఆడపిల్లల్నీ మగవాళ్ళ దౌష్ట్యానికి బలై,

నా అన్న వారి ఆదరణ కరువై వీధి పాలైన ఆడపిల్లల్నీ కరుణతో ఆదుకునేందుకు నిర్వహిస్తోన్న సంస్థ మదర్‌ థెరిసా ఆర్ఫనేజి. ఇప్పటివరకూ సావిత్రిగారి ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇప్పుడు ఆమె లేరు.

ఆ పగ్గాలిప్పుడు రుక్మిణమ్మ అందుకుంటున్నారు. ఇకనుంచి అద్దె ఇల్లు కాకుండా సావిత్రిగారు రుక్మిణమ్మకు రాసిచ్చిన భవనం ఆ దీనులకి ఆశ్రయమవుతుంది. బ్యాంకులో ఉన్న డబ్బూ బంగారమూ వారి సంక్షేమానికి శాశ్వత నిధి అవుతుంది. ఇదీ రుక్మిణమ్మగారి ఔదార్యం.’’

రుక్మిణి లేచి నుంచుంది. ఇన్నాళ్ళకు... కాదు కాదు ఇన్నేళ్ళకు తల పైకెత్తింది.

‘‘అదనులో చినుకుపడక ఎండి నేల వాలిపోయిన పైరు మీద వాన కురిసినట్టు... ఏళ్ళు పైబడి, కోరికలుడిగిపోతున్న ఈ వయసులో ఆయాచితంగా దఖలైన ఈ ఐశ్వర్యాన్ని ఏం చేసుకోను? మీరంతా పరమ పూజ్యులు. రెండుచేతులా సంపాదించుకుంటున్న మీకు-

ఉట్రువుడియంగా నాకొచ్చిపడిన ముదనష్టం మీద ఆవంతయినా ఆపేక్ష లేదు, ఉండదు... నాకు తెలుసు.

ఆడపిల్లలున్నారు - అల్ప సంతోషులు. మన ఆస్తిలో నాకు రావాల్సిన వాటా, అత్తగారి బంగారంలో నా భాగమూ వారి ముగ్గురికీ పంచి ఇవ్వండి చాలు. పిచ్చి పిల్లలు... సంతోషపడిపోతారు.
తెలియకుండానే మీరు నాకో మహోపకారం చేశారు. ‘నా’ అనీ ‘నాది’ అనే స్వార్థం లేకుండా ఇంటిల్లిపాదికీ సేవ చేయటంలోనే పరమార్థమున్నదని మీరు నేర్పారు. విసుగూ విరామం లేకుండా అందరి సేవలోనూ మునిగిపోయిఉండటమనే అలవాటు మీ దయవల్లే నాకలవడింది.

మీకిప్పుడు నా అవసరం లేదు. నాకోసం నా సేవల కోసం ఆర్తిగా ఎదురుచూస్తున్నవారి కోసం ఆత్రంగా వెడుతున్నాను. నేనింత తెగింపుగా ఆలోచించగలుగుతున్నానంటే, ధైర్యంగా నాకిష్టమైన నిర్ణయాలు తీసుకున్నానంటే అందుకు కారకులు మీరే. మీకెంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే’’ రెండు చేతులూ ఎత్తి నమస్కారం చేసింది రుక్మిణి.

ఎదురుగా ఉన్న వారిలో కదలిక లేదు. చెక్కబొమ్మల్లా ఉన్నారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.