close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
బుజ్జిగాడికీ బీన్‌ బ్యాగు!

మెత్తగా ఉంటూ, ఎక్కడికి కావాలన్నా తీసుకెళ్లేలా, సౌకర్యంగా కూర్చునేందుకు పనికొచ్చే బీన్‌ బ్యాగులంటే అందరికీ భలే ఇష్టం. ముఖ్యంగా టీవీ చూసేటప్పుడైతే అందులో కూర్చుంటే చాలా హాయిగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇవి పెద్దవాళ్లకు మాత్రమే కాదు... చంటిపిల్లలకు కూడా వచ్చేశాయ్‌. నెలల పిల్లలు పడుకునేలా సరికొత్త బీన్‌ బ్యాగులను తయారుచేస్తున్నారు డిజైనర్లు. వీటికి రక్షణగా బెల్టులు కూడా ఉంటున్నాయి. పాపాయిని దానిపై పడుకోబెట్టి, నడుముకు ఆ బెల్టును పెట్టేస్తే చాలు. కాళ్లూచేతులూ కదిల్చినా, కేరింతలు కొట్టినా... కిందపడిపోరు. మంచం మీద వేసినప్పటిలా దొర్లిపోతారేమోనన్న భయం కూడా ఉండదు. అంటే ఇక అందులో బుజ్జాయి హాయిగా బజ్జోవచ్చన్నమాట!


సబ్బు నానిపోదిక!

వాష్‌బేసిన్‌ దగ్గర వాడుకునేందుకు సబ్బును చాలామంది ఆ కొళాయి పక్కనే పెడుతూ ఉంటారు. తడిచేతులతో దాన్ని పట్టుకున్నాక మళ్లీ దాన్ని అక్కడే పెట్టాలి. దాని వల్ల కిందంతా జిడ్డుగా తయారవుతుంది. అలా కాకుండా, సబ్బుకు అంటుకున్న నీరు నేరుగా కిందకి జారిపోతే బాగుంటుంది కదా! అప్పుడిక వాష్‌బేసిన్‌ పాడవ్వకుండానూ ఉంటుంది, సబ్బూ ఎక్కువరోజులు వస్తుంది. అందుకే ఈ సరికొత్త సోప్‌ బాక్సులు మార్కెట్‌లోకి వచ్చాయి. ఇవి మామూలు వాటిలా కాకుండా ఆకు ఆకారంలో ఉంటాయి. వీటిని వాష్‌బేసిన్‌కు అతికించేలా కింద బేస్‌ ఉంటుంది. ఈ సోప్‌బాక్స్‌లో సబ్బును పెడితే నీరు నేరుగా కిందకి జారిపోతుంది. అందువల్ల సబ్బు నీటిలో నానిపోకుండా పొడిగా, శుభ్రంగా ఉంటుందన్నమాట.


అదిరే ఎయిర్‌పాడ్స్‌ కేస్‌!

ఎయిర్‌పాడ్స్‌ అంటే యూత్‌కి యమా క్రేజ్‌! అందుకే ఎంత కష్టపడైనా ఒక సెట్‌ కొనేసుకుని ముచ్చటపడిపోతూ ఉంటారు. మరి అంత ఇష్టపడి కొనుక్కున్న ఎయిర్‌పాడ్స్‌ను ఉంచేందుకు సాదాసీదా కేసు ఏం బావుంటుంది చెప్పండి? అందుకే వీటిలోనూ డిజైనర్‌ లుక్‌ ఉన్నవి మార్కెట్లోకి వస్తున్నాయి. ప్లాస్టిక్‌, సిలికాన్‌ వంటి మెటీరియల్స్‌లో దొరుకుతున్న ఈ కేసులను వివిధ రూపాల్లో తయారుచేస్తున్నారు. కార్టూన్‌ క్యారెక్టర్లూ, పండ్లూ, పక్షులూ, జంతువులూ, ఫేమస్‌ బ్రాండ్ల ఆకారంలో ఎంతో ముద్దుగా ఉండేలా డిజైన్‌ చేస్తున్నారు. ఫ్యాన్సీ లుక్‌తో ఆకట్టుకోవడంలో ఇవి ముందుంటున్నాయి. ఇలాంటి ఒక కేసు దగ్గర ఉంటే వెరైటీగా ఉంటుంది అనడంలో సందేహమే లేదు!


స్టూలులో షూ!

పిల్లలో, ఆఫీసుకు వెళ్లేవాళ్లో హడావుడిగా తయారవుతున్నప్పుడు సాక్స్‌, షూ వేసుకోవడం కోసం కిందకు వంగాలి. కానీ అదేమంత సౌకర్యంగా ఉండదు. అందుకే కొందరు వాటిని హాల్లోకి తెచ్చేసి సోఫా మీద కూర్చుని వేసుకుంటూ ఉంటారు. కానీ వారు వెళ్లిన తర్వాత కింద నేలంతా తుడుచుకోవడం మళ్లీ అదో పని. అందుకే హాయిగా బయటే కూర్చుని షూ తొడుక్కునేలా ఈ స్టూల్స్‌ వచ్చేశాయి. అంతేకాదు, ఆ షూలను పెట్టుకునేందుకు వీటిలో ఒక అర కూడా ఉంటోంది. అందులో షూ అయితే ఒక జత, చెప్పులైతే రెండు జతలు  దాచుకోవచ్చు. కావాల్సినప్పుడు తీసుకుని దాని మీదే కూర్చుని తొడుక్కోవచ్చు.


హ్యాండిల్‌ లాక్‌ వేసేద్దాం

బైక్‌కి లాక్‌ సిస్టం పాడైతే చాలా ఇబ్బంది. కొత్తది పెట్టేవరకూ ఎక్కడ ఎవరు ఎత్తుకుపోతారో అని ఒకటే భయం. అలాంటప్పుడు ఉపయోగపడేందుకే ఈ హ్యాండిల్‌ లాక్స్‌ వస్తున్నాయి. ఈ లాక్‌కు ఒకవైపున తాళం పెట్టి తిప్పితే అది రెండుగా విడిపోతుంది. అలా విడిన లాక్‌లో బైక్‌ హ్యాండిల్‌, బ్రేక్‌ పట్టేలా ఖాళీలు ఉంటాయి. ఆ ఖాళీల్లో హ్యాండిల్‌, బ్రేక్‌ను దగ్గరగా నొక్కిపెట్టి, లాక్‌ను మూసేసి తాళం వేసేస్తే సరి. ఇక దొంగలు ఎట్టిపరిస్థితుల్లోనూ బైక్‌ను ఎత్తుకెళ్లలేరు. కొన్ని బైకులు వేరే బండి తాళం పెట్టి తిప్పినా వచ్చేస్తుంటాయి. అలాంటి ఇబ్బంది ఉందనుకున్నప్పుడు కూడా మెయిన్‌లాక్‌కు అదనంగా వీటిని వాడుకోవచ్చు.ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు