ఫొటోఫీచర్‌! - Sunday Magazine
close
ఫొటోఫీచర్‌!

ఎటు చూసినా పచ్చదనంతో నిండిన కొండలు... ఆ మధ్యలో పూల దండలు అలంకరించినట్లున్న శిఖరాలు... ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తున్న ఈచిత్రాన్ని చూస్తుంటే విచిత్రంగా అనిపించడం కూడా సహజమే. అవును మరి, మిగిలిన చోట్లంతా చెట్లు ఆకుపచ్చ రంగులో ఉంటే శిఖరాల మీద మాత్రం వేరే రంగులో ఎందుకుఉన్నాయబ్బా అనిపించకమానదు. అసలు విషయం ఏంటంటే... ఇక్కడ కొండ అంచుల మీదున్నవి చెర్రీ వృక్షాలు. వాలు మీద ఉన్నవి కొనిఫెర్‌ చెట్లు. రుతువులు మారినపుడు చెర్రీ చెట్ల ఆకుల రంగు మారుతుంటుంది. దాంతో ఆ ప్రదేశంలో మాత్రం ఇలా వేరే వర్ణం కనిపిస్తోంది. నమెగొ వ్యాలీ అనే ఈ చోటు జపాన్‌లోని టెంకవా పర్వతాల్లో ఉంది.


‘బంగారు’ తల్లి...!

‘జయజయహే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే’... అంటూ ఆశ్వయుజ శుద్ధపాడ్యమి నుంచి నవమి వరకూ దుర్గామాతను వేనోళ్ల కొనియాడుతూ దేశవ్యాప్తంగా దసరా వేడుకలు జరుపుకోవడం తెలిసిందే. అయితే తూర్పుభారతావనిలో ముఖ్యంగా కోల్‌కతాలో ఆశ్వయుజ శుక్లపక్ష షష్ఠి నుంచి దశమి వరకూ ఐదురోజులపాటు అంగరంగవైభవంగా దుర్గోత్సవ్‌ పేరుతో వేడుకలు చేసుకుంటారు. అందుకోసం కోట్ల రూపాయలతో వేదికల్ని నిర్మించి జగన్మాతను ప్రతిష్ఠిస్తుంటారు. అందులోభాగంగా గతేడాది సంతోష్‌ మిత్రా స్క్వేర్‌ దగ్గర నిర్మించిన పండాల్‌లో కనీవినీ ఎరగని రీతిలో 250 మంది కళాకారులు మూడు నెలలపాటు శ్రమించి 50 కిలోల బంగారంతో రూపొందించిన అమ్మవారి విగ్రహం భక్తుల మనసును దోచుకుంది. అంతేకాదు, మాయాపుర్‌లోని చంద్రోదయ ఇస్కాన్‌ ఆలయాన్ని తలపించేలా పండాల్‌ను కట్టి, లోపలి భాగాన్ని టన్నులకొద్దీ గాజుతో శీష్‌ మహల్‌ తరహాలో అలంకరించిన తీరు అద్భుతం. ఆ బంగారు తల్లి రూపాన్నే కళ్లలో నింపుకున్న భక్తుల్ని కరోనా కారణంతో నిరాశపరచకుండా ఈ ఏడాది సైతం పండాల్స్‌ నిర్మిస్తున్నారు. కానీ ఎక్కువమందికి ప్రవేశం లేకపోవడంతో యూట్యూబ్‌ ఛానల్స్‌, ఆగ్‌మెంటెడ్‌పూజాడాట్‌కామ్‌ల ద్వారా ఆ దుర్గామాతను దర్శించుకునే ఏర్పాటుచేయడం విశేషం.

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న