close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సావిత్రి చూసినా మెచ్చాలనుకున్నాం!

సావిత్రి చూసినా మెచ్చాలనుకున్నాం!

మహానటి... దక్షిణాది అంతా చర్చించుకుంటున్న సినిమా. ఎప్పుడెప్పుడు చూద్దామా అని అన్నితరాలవాళ్లూ ఎదురుచూస్తున్న సినిమా. అలనాటి నటి సావిత్రి జీవితకథే ‘మహానటి’. దీన్ని తెరకెక్కించిన ఆ సాహస యువ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. దర్శకుడిగా అతడికిది రెండో సినిమానే. చిన్న వయసులోనే పెద్ద ప్రాజెక్టు చేపట్టాడు. మహానటి మన ముందుకు వస్తున్న సందర్భంగా తన మనసులోని మాటల్ని మనతో పంచుకుంటున్నాడిలా...ర్నలిస్టు అవుతానని చెప్పేసరికి మా బంధువుల్లో చాలామందికి ఆశ్చర్యంగా అనిపించింది. కానీ అమ్మానాన్నా, స్నేహితులు మాత్రం... ‘ఇది మేం ఊహించిందే’ అన్నారు. బంధువులకి ఆశ్చర్యంగా అనిపించడానికి కారణం లేకపోలేదు. అమ్మానాన్నా ఇద్దరూ డాక్టర్లే. అమ్మ జయంతీ రెడ్డి... గైనకాలజిస్టు. నాన్న జయరాంరెడ్డి యూరాలజిస్టు. నేను చదువుకున్నది హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్లో. అక్కడ రెండో తరగతిలో ఉన్నపుడు ఒక పుస్తకం చదివాను. ఒక పెంపుడు జంతువు గురించి అది. చివర్లో అది చనిపోతుందో, ఇంటినుంచి తప్పిపోతుందో! అది చదివాక బాగా ఏడ్చేశాను. అప్పట్నుంచీ ఆ పుస్తకాలంటే ఆసక్తి పెరిగింది. ఎవరూ చెప్పకపోయినా లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు తెచ్చుకునిచదువుకునేవాణ్ని. అలా కామిక్స్‌, కథలూ, నవలలూ చదవడం అలవాటైంది. పరీక్షలపుడు కూడా పుస్తకాల కింద దాచి పెట్టుకుని మరీ చదివేవాణ్ని. స్కూల్లో ఆటలకంటే డిబేట్స్‌, క్విజ్‌, ఎస్సే రైటింగ్‌ లాంటి వాటిలో ఎక్కువగా పాల్గొనేవాణ్ని. ఆటలు ఆడినా క్రికెట్‌, బాస్కెట్‌బాల్‌ లాంటి టీమ్‌ స్పోర్ట్స్‌ కాకుండా టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌లాంటివే ఆడేవాణ్ని. నటుడు రానా నా క్లాస్‌మేట్‌. దాదాపు అయిదారేళ్లు కలిసి చదువుకున్నాం.
వెబ్‌సైట్‌ ప్రారంభించాను
ఏదో ఒకటి చేయాలి, జీవితంలో పైకి రావాలన్న తొందర స్కూల్‌ రోజుల్లో బాగా ఉండేది. ఓ పక్క స్కూల్‌ మ్యాగజీన్‌లో కథనాలు రాస్తూనే సొంతంగా ఒక మ్యాగజీన్‌ని తీసుకొచ్చాను. అది ప్రింట్‌ చేయించి ఫ్రెండ్స్‌కి అమ్మేవాణ్ని. అందులోని అంశాల్ని వారెంతో ఆసక్తిగా చదివేవారు. అలా నాకు రాయడంపైన ఇష్టం పెరిగింది. మనం చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయన్న ఆలోచనల్లో ఉండేవాణ్ని. మన దగ్గర ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చిన కొత్తల్లో అంటే 1999-2000 ప్రాంతంలో ఒక వెబ్‌సైట్‌ మొదలుపెట్టాను. దానిద్వారా సక్సెస్‌ అయిపోవాలనేది నా కల. దాని కోడింగ్‌ రాసుకునేవాణ్ని, అందులో ఆర్టికల్స్‌ రాసేవాణ్ని. అన్నీ నేనొక్కడినే చూసుకోవడం ఎంతవరకూ సాధ్యం. కానీ ఏదో ఆతృత. ఆ వెబ్‌సైట్‌వల్ల పదకొండో తరగతిలో మార్కులు బాగా తగ్గిపోయాయి. ఆ తర్వాత దానిగురించి మర్చిపోయాను. చిన్నప్పట్నుంచీ సినిమాలంటే కూడా ఆసక్తి. నర్తనశాల, మాయాబజార్‌ నుంచి స్టార్‌వార్స్‌ వరకూ అన్నీ చూసేవాణ్ని. కానీ సినిమాల్లోకి ఎలా వెళ్లాలనేది తెలీదు. ఇప్పుడు చాలా ఫిల్మ్‌స్కూల్స్‌ వచ్చాయి. అప్పట్లో ఒకట్రెండు ఉన్నా వాటి గురించి అవగాహనలేదు. దాంతో నాకు ఇష్టమైన మరో రంగమైన జర్నలిజంలోకి వెళ్లాలనుకున్నాను. నా రచనా సామర్థ్యానికి అదే మంచి వేదిక అనిపించింది. పన్నెండో తరగతి తర్వాత మణిపాల్‌ యూనివర్సిటీలో జర్నలిజం, మాస్‌ కమ్యునికేషన్స్‌ డిగ్రీలో చేరాను. ఆ సమయంలో రేడియో మీదే ఒక సెమిస్టర్‌ ఉంటుంది. అప్పుడు ఆసక్తి రేడియోవైపు తిరిగింది. బొమ్మల్లేకుండా శబ్దంతోనే చేసే మాయలా అనిపించింది. షార్ట్‌ఫిల్మ్స్‌లాంటివి రేడియో మూవీస్‌ చేశాను. అప్పుడే ప్రాజెక్టు వర్కులో భాగంగా ఒడిశా నుంచి కర్ణాటక వచ్చిన వలస కార్మికులపైన డాక్యుమెంటరీ తీశాను. డిగ్రీ పూర్తయ్యేసరికి రేడియోకంటే అడ్వర్టైజింగ్‌ రంగం ఆకర్షణీయంగా అనిపించింది. కొన్నాళ్లు బెంగళూరులో ఓ ప్రకటన సంస్థలో కాపీ రైటర్‌గా పనిచేశాను. ఆ తర్వాత సినిమాలవైపు మనసు మళ్లింది.శేఖర్‌ శిష్యుడిగా...
సినిమాల్లోకి వెళ్లేముందు ఫిల్మ్‌ కోర్స్‌ చేస్తే బావుంటుందని అమ్మానాన్న అన్నారు. అయితే సినిమా తీసే కళ ఒకరు నేర్పితే వచ్చేది కాదనేది నా ఉద్దేశం. ఎంతో కొంత అవగాహన వస్తుందిలే అని న్యూయార్క్‌ వెళ్లి సినిమాటోగ్రఫీలో ఆర్నెల్ల కోర్సు చేశాను. అక్కడ అద్భుతమైన కెమెరాలు ఉండేవి. వాటితో పనిచేయడం మర్చిపోలేని అనుభవం. విజువల్‌ ఎఫెక్ట్స్‌పైన ప్రత్యేక దృష్టిపెట్టి నేర్చుకున్నాను. అక్కడే ఒక స్టూడియోలో ఇంటర్న్‌గానూ చేశాను. న్యూయార్క్‌ నుంచి తిరిగి వచ్చాక ‘నేను మీకు తెలుసా?’ సినిమాకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాను. ఆ తర్వాత శేఖర్‌ కమ్ముల గారి దగ్గర ‘లీడర్‌’, ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ సినిమాలకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశాను. ప్రతి సినిమాకీ కొత్త ముఖాల్ని పరిచయం చేయాలని చూస్తారు శేఖర్‌. సూరి అనే మరో అసిస్టెంట్‌ డైరెక్టర్‌కీ, నాకూ కొత్తవాళ్లని వెతికే బాధ్యత ఇచ్చారు. అందుకోసం కాలేజీలకు వెళ్లే వాళ్లం. షాపింగ్‌ మాల్స్‌లో తిరిగేవాళ్లం. ఎవరైనా మాకు కావాల్సిన లక్షణాలతో కనిపిస్తే... ‘ఆసక్తి ఉంటే రండి’… అని చెప్పి విజిటింగ్‌ కార్డు ఇచ్చేవాళ్లం. లీడర్‌లో చిన్న పాత్రలు చేసినవాళ్లనీ, లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌లో కీలక పాత్రలు పోషించిన వాళ్లనీ అలానే ఎంపికచేశాం. ఒక పాత్రకి నటుల్ని ఎంచుకునే విషయంలో శేఖర్‌ నుంచి చాలా నేర్చుకున్నాను. లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ తర్వాత సొంతంగా పనిచేయడం మొదలుపెట్టాను. చిన్న ప్రొడక్షన్‌ హౌస్‌ పెట్టి యాడ్స్‌, షార్ట్‌ ఫిల్మ్స్‌, డాక్యుమెంటరీలూ చేసేవాళ్లం. అప్పుడే ప్రియాంకాదత్‌, స్వప్నాదత్‌ల కోసం ఒక ప్రకటన చేశాను. తర్వాత వాళ్లతో కలిసి ఒక షార్ట్‌ ఫిల్మ్‌ చేశాను. అలా మేం స్నేహితులం కూడా అయిపోయాం. ఆ ప్రయాణంలో నా సినిమా కథల్ని వినిపించేవాణ్ని. నేను అనుకున్న ఓ ప్రాజెక్టు ఆలస్యమైంది. అప్పుడు ‘అదే పట్టుకుని ఉండటం ఎందుకు. మరో కథ ఉంటే చూడు’ అని వాళ్లన్నారు. మరో కథను పది రోజుల్లోనే రాసుకున్నాను అదే ‘ఎవడే సుబ్రమణ్యం’. స్వప్నకూ ప్రియాంకకూ అది నచ్చడంతో ఆ ప్రాజెక్టు మొదలుపెట్టాం. నానీ, విజయ్‌ దేవరకొండ నటించిన ఆ సినిమాకి మంచి గుర్తింపు వచ్చింది.
మహా ప్రయత్నం...
చిన్నప్పట్నుంచీ సావిత్రిగారి సినిమాల్ని చూస్తున్నా, ఆమె గురించి చదువుతున్నా, వింటున్నా... ఒక ప్రత్యేకమైన ఆసక్తి. ఆ ఆసక్తే ఆమెపైన సినిమా గురించి ఆలోచించేలా చేసింది. ‘ఎవడే...’ ప్రాజెక్టు పూర్తవుతున్న సమయంలో... ‘తర్వాత ఏంటి’ అని స్వప్న, ప్రియాంక అడిగినపుడు... సావిత్రి బయోపిక్‌ ఆలోచన ఉందని చెప్పాను. నిజానికి కొన్నాళ్లు ఆగి ఇంకాస్త అనుభవం వచ్చాక చేద్దామనుకున్నాను. కానీ వాళ్లుకూడా దీనిపైన బాగా ఆసక్తి చూపారు. ఈ సినిమా ఒక పెద్ద బాధ్యతగా భావించాం. సినిమాలో సావిత్రి జీవితంలోని ప్రతి సందర్భం లేకపోయినా సమగ్రంగా ఉండాలనుకున్నాం. ఆవిడ గురించి తెలుసుకోవాలనుకునేవారికి ఒక ప్రామాణికమైన సినిమా తీయాలనుకున్నాం. కల్పితాలు జోడించకుండా, వాస్తవాలని చెబితేనే ఆ విలువ ఉంటుందనిపించింది. అందుకే వ్యక్తులూ, సందర్భాలూ, భావోద్వేగాలూ అన్నీ వాస్తవమైనవే తీసుకున్నాం. సావిత్రిగారు ఉండి ఈ సినిమా చూసుంటే ఆమె కూడా ‘బాగా తీశారు’ అని సంతృప్తి చెందేలా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రాజెక్టు ఓకే అనుకున్నాక నటీనటుల ఎంపిక, కథ, సెట్‌లూ... అన్నింటి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. ఇప్పుడంతా డిజిటల్‌లో సినిమా చిత్రీకరిస్తున్నారు. మా సినిమాలో చరిత్రలోకి వెళ్తున్నాం కాబట్టి కొన్ని సీన్లవరకూ ఫిల్మ్‌లోనే చిత్రీకరించాం. ఫిల్మ్‌లో తీస్తే అప్పటి లుక్‌ వస్తుందని అలా ప్రయత్నించాం. ఈ సినిమాలో నటించడం కోసం మేం సంప్రదించిన వాళ్లంతా మా మాట కాదనకుండా నటించారు. కీర్తిసురేష్‌కంటే కూడా సమంతా ఈ సినిమాలోకి ముందు వచ్చారు. తనది సావిత్రి పాత్ర కాదని తెలిసినా చేయడానికి అంగీకరించారు. కీర్తి కూడా మొదట తాను ఆ పాత్రకు న్యాయం చేయగలనా అని సందేహించినా మామీద నమ్మకంతో చివరకు ఒప్పుకుంది. జెమినీ గణేశన్‌ పాత్ర కోసం తెలుగువారిని కాకుండా వేరేవాళ్లని తీసుకుందాం అనుకున్నాం. ఆ సమయంలో దుల్కర్‌ సల్మాన్‌ని అడిగి చూశాం. ‘మంచి ప్రాజెక్టు, ఇలాంటివి రావాలి’ అని చెప్పి ఓకే చెప్పాడు. విజయ్‌ దేవరకొండ, నాగ చైతన్య కూడా తమ పాత్రల గురించి అడిగారే తప్ప వాటి నిడివిగురించీ, ప్రాధాన్యం గురించీ అడగలేదు. నిజానికి వాళ్లకున్న ఫాలోయింగ్‌తో పోల్చితే ఈ సినిమాలో వారు చేస్తున్న పాత్రలు చిన్నవనే చెప్పాలి. అయినా మమ్మల్ని ప్రోత్సహించాలనే పెద్ద మనసుతో చేస్తున్నారు. మొదట తెలుగు, తమిళ భాషల్లోనే తీయాలనుకున్నాం. కీర్తి, దుల్కర్‌ వచ్చాక మలయాళంలోనూ తెద్దాం అనుకున్నాం. ఏ విషయంలోనూ రాజీపడకుండా సినిమాని మేం తీయాలనుకున్నట్టుగానే తీశాం. మేం పడ్డ కష్టం తెరపైన సినిమా చూసినపుడు అర్థమవుతుంది. ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందన్న నమ్మకమైతే ఉంది.


ఇంజినీరింగ్‌ చేయాల్సింది!

మెడిసిన్‌ ఆలోచన ఎప్పుడూ లేదు కానీ అప్పట్లో చెల్లి మెడిసిన్‌ పుస్తకాలు సరదాగా చదివేవాణ్ని. చాలా ఆసక్తిగా ఉండేవి. ఇంజినీరింగ్‌ చదివి ఉండాల్సిందని ఇప్పుడనిపిస్తుంది. ఇంజినీర్‌గా స్థిరపడాలని కాదు... సైన్స్‌, సాంకేతిక విషయాలు నేర్చుకోవడానికీ, తెలుసుకోవడానికీ ఎక్కువ అవకాశం ఉంటుందని.
* పర్యటనలంటే ఇష్టం. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ దేశంలోని అన్ని చోట్లకీ వెళ్తుంటా.
* 20ఏళ్లపుడు జీవితంలో కన్‌ఫ్యూజన్‌ ఎక్కువగా ఉండేది. ఆ సమయంలో యోగా, ధ్యానం ప్రాక్టీసు చేసేవాణ్ని. ఆధ్యాత్మికత గురించి తెలుసుకునేవాణ్ని. దాంతో చాలా మార్పు వచ్చింది. నిదానం అలవాటైంది. శరీరం-మనసు మధ్య సమన్వయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలంతో తైచీ, కుంగ్‌ఫూ లాంటివీ నేర్చుకున్నాను.
* ఎవడే సుబ్రమణ్యం సమయంలోనే నిర్మాతలైన ప్రియాంక, స్వప్నలతో వాదనలు బాగా జరిగేవి. కానీ ఆ సినిమా పూర్తయ్యేసరికి మమ్మల్ని మేం బాగా అర్థం చేసుకోగలిగాం. ‘మహానటి’ సమయంలో మాత్రం ఎలాంటి అభిప్రాయ
భేదాలూ రాలేదు. వాళ్లిద్దరూ చాలా తెలివైనవాళ్లు. ఫైట్లూ, పాటలూ అని చూడకుండా ఒక మంచి సినిమాలో ఏం ఉండాలో వాటికే ఓటేస్తారు.
ఎవడే... ప్రయాణంలోనే ప్రియాంక-నేను ప్రేమించుకున్నాం. పెద్దల అంగీకారంతో పెళ్లిచేసుకున్నాం. మేం కుటుంబ సభ్యులం కాకపోయినా వీళ్లతో పనిచేస్తాను. ఎందుకంటే డబ్బు ఎవరైనా ఇస్తారు కానీ నిర్మాతల ఆలోచనలు సినిమాకి ఉపయోగపడాలి.
* రిషి... ఆ పేరులో ఓ స్నేహితుడు ఉన్నాడనిపిస్తుంది. ఎవడే సుబ్రమణ్యంలో విజయ్‌ దేవరకొండ పాత్రకి ఆ పేరు పెట్టాను. మా బాబుదీ అదే పేరు.
* అశ్వనీదత్‌ గారు మా సినిమాల్లో పాటల ట్యూన్లూ, సాహిత్యం విని సలహా ఇస్తారు. స్వప్న, ప్రియాంకాలే పూర్తిగా నిర్మాణ బాధ్యతలు చూసుకుంటున్నారు.
* విజయ్‌ దేవరకొండ మంచి ఫ్రెండ్‌. ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ నుంచీ తెలుసు. ప్రకటనలూ, సినిమాల్లో మేం కలిసి పనిచేశాం.


- సుంకరి చంద్రశేఖర్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.