దేశీ ‘సందేశ్‌’ వచ్చేసింది.. కానీ
close

Updated : 18/02/2021 18:13 IST
దేశీ ‘సందేశ్‌’ వచ్చేసింది.. కానీ

ఇంటర్నెట్ డెస్క్‌: ఇన్‌స్టంట్‌ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు పోటీగా కేంద్రం ప్రభుత్వం కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్‌ తరహా ఫీచర్స్‌తో దేశీయ ఇన్‌స్టా మెసేజింగ్ యాప్‌ సందేశ్‌ (Sandes)ను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) అభివృద్ధి చేసింది. గతంలో ప్రభుత్వ అధికారులు అంతర్గత సమాచార బట్వాడా కోసం ఉపయోగించిన గవర్నమెంట్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ సిస్టం (జిమ్స్‌)లో మార్పులు చేసి సందేశ్‌ యాప్‌ను తీసుకొచ్చారు. ఇప్పటివరకు ప్రభుత్వ సిబ్బందికి మాత్రమే అందుబాటులో ఉన్న ఈ యాప్‌ను ఇక మీదట సాధారణ ప్రజలూ ఉపయోగించవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ యూజర్లకు అందుబాటులో ఉంది. ఐఓఎస్‌ యూజర్స్ నేరుగా యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఐఫోన్, ఐపాడ్‌లో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ యూజర్స్ జిమ్స్‌ వెబ్‌సైట్ నుంచి ఆ ఏపీకే డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. 

ఎలా పనిచేస్తుంది..

* యాప్‌లో ఖాతా తెరిచేందుకు ఫోన్‌ నంబర్‌ లేదా ఈ-మెయిల్ ఐడీతో నమోదు చేసుకోవాలి. ప్రస్తుతం ప్రభుత్వ అధికారిక ఈ-మెయిల్ (xxx@gov.in) ఐడీలు ఉన్నవారికి మాత్రమే ఖాతా తెరిచేందుకు అనుమతించారు. మిగిలినవాళ్లు మొబైల్‌ నెంబరుతో ఖాతా తెరవొచ్చు.

* ఒకవేళ ప్రైవేటు మెయిల్ ఐడీతో ఖాతా తెరిచేందుకు ప్రయత్నించినా జీమెయిల్‌, హాట్‌ మెయిల్‌తో పాటు ఇతర ప్రైవేటు డొమైన్లకు అనుమతి లేదనే పాప్‌-అప్‌ మెసేజ్‌ కనిపిస్తుంది. వెబ్‌ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. అయితే ఇది కేవలం ఈ-మెయిల్‌ ఐడీతో లాగిన్‌ అయినవారికే పనిచేస్తుంది. 

* ఖాతా తెరిచిన తర్వాత వాట్సాప్‌ తరహాలోనే ఛాటింగ్‌, ఆడియో/వీడియో కాల్స్‌, ఫైల్, కాంటాక్ట్ షేరింగ్ చెయ్యొచ్చు. యూజర్స్‌ సమాచార గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లకుండా సందేశ్‌లో కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ ఇచ్చారు. 

* ఈ యాప్‌లో ఫోన్‌ నంబర్‌ లేదా ఈ-మెయిల్ ఐడీ మార్చుకునే అవకాశం లేదు. ఒకవేళ ఫోన్ నంబర్‌ మార్చుకోవాలంటే పాత ఖాతా డిలీట్ చేసి, కొత్త ఫోన్ నంబర్‌ లేదా ఈ-మెయిల్‌ ఐడీతో కొత్తగా ఖాతా తెరవాలి. అయితే వాట్సాప్‌లో మాత్రం ఫోన్ నంబర్ మార్చుకునే సదుపాయం ఉంది. 

* వాట్సాప్‌ తరహాలో సందేశ్‌ యాప్‌ ఉపయోగించమని కోరుతూ ఎవరికీ రిక్వెస్ట్‌ మెసేజ్‌ పంపలేం. అవతలి వ్యక్తులు కూడా సందేశ్‌ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటేనే ఇద్దరి మధ్య ఛాటింగ్ సాధ్యపడుతుంది. 


దీంతోపాటు సంవాద్ (Samvad) పేరుతో మరో మెసేజింగ్ యాప్‌ను తీసుకొస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని సెంటర్‌ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలీమాటిక్స్ (సీ-డాట్‌) అభివృద్ధి చేస్తుంది. ఇందులో కూడా వ్యక్తిగత/గ్రూప్ మెసేజింగ్, ఫొటో/ఆడియో/వీడియో ఫైల్ షేరింగ్, యూజర్ స్టేటస్‌ వంటి ఫీచర్స్ ఉంటాయని తెలిపింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ను సపోర్ట్ చేస్తుంది. అయితే న్యూస్‌ ఫీడ్‌, ప్రైవేట్‌ సోషల్‌ నెట్‌వర్కింగ్‌, మల్టీ యూజర్‌ ఛాట్‌ సెషన్స్‌ లాంటి అదనపు ఫీచర్లు ఉండబోతున్నాయని సమాచారం. 

వాట్సాప్ ఇటీవల నూతన గోప్యతా విధానాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని వల్ల వాట్సాప్‌లోని యూజర్‌ డేటా మాతృ సంస్థ ఫేస్‌బుక్‌తో పంచుకుంటుందనే వార్తలు వెలవడ్డాయి. ఈ నిర్ణయంపై యూజర్స్ పెద్ద ఎత్తున్న ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వాట్సాప్ తన నిర్ణయాన్ని మే నెల వరకు వాయిదా వేసినట్లు ప్రటకటించింది. యూజర్స్ కూడా వాట్సాప్‌ ప్రత్యమ్నాయ యాప్‌లను ఉపయోగించడం ప్రారంభించారు. దీంతో టెలిగ్రాం, సిగ్నల్ వంటి మెసేజింగ్ యాప్‌లకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకొచ్చిన సందేశ్‌ యాప్ యూజర్స్‌ని ఎంత మేర ఆకట్టుకుంటుందనేది వేచి చూడాల్సిందే. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న