Updated : 28 Oct 2021 02:34 IST

గెలిచి నిలిచేది ధర్మమే

నవంబర్ 3 నరక చతుర్దశి 

‘ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే’ అని భగవద్గీతలో చెప్పినట్లుగానే అవసరమైనప్పుడల్లా దుష్టశిక్షణ, శిష్టరక్షణ తక్షణ కర్తవ్యంగా చేపట్టాడు శ్రీకృష్ణుడు. మోహినీ అవతారమెత్తిభస్మాసురుణ్ని,నరసింహుడై హిరణ్యకశిపుణ్ని అంతమొందించినట్లే అటు దేవతల్నీ, ఇటు మనుషుల్నీ పీడిస్తోన్న నరకాసురుడ్ని సత్యభామా సమేతుడై సంహరించాడు. రాక్షస విముక్తితో అందరూ ఆనందించిన ఆరోజే నరకచతుర్దశి.

ప్రతి పండుగ వెనుకా ఓ పరమార్థం ఉంటుంది.  పండుగలు ఆనందాన్నిస్తూనే జీవితాన్ని అర్థవంతంగా తీర్చి దిద్దుకోడానికి వీలుగా అనేక సందేశాలను అందిస్తాయి. వాటిని అందిపుచ్చుకుని వ్యక్తిత్వానికి మెరుగులు పెట్టుకుంటూ తోటివారి జీవితాల్లో వెలుగులు నింపుతూ ముందుకు పోవడమే మన కర్తవ్యం.

లోకకంటకుడైన నరకాసురుణ్ణి సత్యభామాశ్రీకృష్ణులు అంతమొందించిన ఆశ్వయుజ బహుళ చతుర్దశే నరకచతుర్దశి. నరకాసురుని పీడ తొలగిపోయిందని ఆనందపారవశ్యంతో ఆ మర్నాడు జరుపుకున్నదే దీపావళి. వరాహావతారంతో హిరణ్యాక్షుణ్ణి సంహరించిన తర్వాత విష్ణుమూర్తికీ భూదేవికీ పుట్టినవాడే నరకుడు. అతనిలో అసుర లక్షణాలున్నాయని విష్ణుమూర్తి చెప్పగా, బిడ్డ ప్రాణానికి అపాయం ఉంటుందేమోనని భూదేవి భయపడి కొడుకుకు రక్షించమని వేడుకుంది. తల్లి వల్లే మరణిస్తాడని చెప్పగా, ‘ఏ తల్లీ కొడుకును చంపుకోదుగా’ అని భూదేవి ధైర్యాన్ని కూడగట్టుకుంటుంది.

కాలక్రమంలో నరకుడు ప్రాగ్జ్యోతిషపురాన్ని రాజధానిగా చేసుకుని కొన్ని యుగాలపాటు చక్కగా పాలన సాగించాడు. స్త్రీలను మాతృభావనతో చూడటం అతని సుగుణాల్లో ఒకటి. అయితే క్రమంగా అతనిలోని మంచి లక్షణాలన్నీ ఒక్కొక్కటిగా కనుమరుగయ్యాయి. దీనికి కారణం నరకుడు బాణాసురునితో చేసిన స్నేహం. ఆరునెలల సహవాసంతో వారు వీరవుతారన్నట్లుగా బాణాసురుని మైత్రి వల్ల నరకుడు అసురలక్షణాలను సంతరించుకుని నరకాసురుడు గర్వాంధుడై దేవతలను బాధిస్తూ, మునులను వేధిస్తూ వేలాదిమంది పరస్త్రీలను చెరపడుతూ లోకకంటకుడిగా పరిణమించాడు.

ద్వాపరయుగంలో దేవ మానవులు సత్యభామ (భూదేవి) శ్రీకృష్ణుల వద్దకు వచ్చి, నరకాసురుని బారినుంచి తమను కాపాడమని వేడుకున్నారు. దాంతో శ్రీకృష్ణుడు యుద్ధానికి సిద్ధపడ్డాడు. సత్యభామ, యుద్ధం చూస్తాననడంతో కృష్ణుడు సతీసమేతుడై బయల్దేరాడు.

లేమా! దనుజుల గెలువగ
లేమా? నీవేల కడగి లేచితివిటురా
లే, మాను, మానవేనిన్‌
లే! మావిల్లందుకొనుము లీలంగేలన్‌
అంటూ కృష్ణుడు సత్యభామను యుద్ధానికి ప్రేరేపించి...
కొమ్మా! దానవనాథుని
కొమ్మాహవమునకు దొలగె గురువిజయము గై
కొమ్మా మెచ్చితినిచ్చెద
గొమ్మాభరణములు నీవు గోరినవెల్లన్‌

అని భార్య యుద్ధనైపుణ్యాన్ని చూసి ప్రశంసించాడు. ఇలా లీలగా హేలగా సత్యభామాశ్రీకృష్ణులు కలిసి నరకాసురుణ్ణి సంహరించి లోకాలకు భద్రతను చేకూర్చి సంతోషాన్ని కలిగించారు.

పరమార్థం

ఈ వృత్తాంతం మానవాళికి గొప్ప సందేశాన్ని అందిస్తుంది. విచక్షణాజ్ఞానాన్ని కోల్పోయి చెడుస్నేహాల చెరలో చిక్కుకుపోవడం వల్ల మన వ్యక్తిత్వాన్ని కోల్పోవడమే కాకుండా ఒక్కోసారి మన ఉనికికే ప్రమాదం వాటిల్లే పరిస్థితులు తలెత్తుతాయని గ్రహించాలి.

‘మణినా భూషితఃసర్పః కిమసౌ నభయంకరః’ అన్నట్టు సంపదలను బట్టి స్నేహం కాకుండా, శీలాన్ని బట్టి స్నేహం చేయాలని జాగ్రత్త చెబుతుంది. అష్టాదశ పురాణాలలోనూ వ్యాసుడు చెప్పాలనుకున్నవి రెండే రెండు మాటలు.. ‘పరోపకారాయ పుణ్యాయ, పాపాయ పరపీడనం’ ఇతరులకు మేలు చేయడమే పుణ్యం. ఇతరులను బాధించడమే పాపం. సంతానం పాపకార్యాలు చేస్తున్నప్పుడు, ఇతరులను బాధిస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఉపేక్షించకూడదని, పక్షపాత వైఖరి లేకుండా శిక్షించాలని కర్తవ్యబోధ చేస్తుంది ఈ కథ.

తల్లిదండ్రులో, పెద్దవాళ్లో ఎవరో మనని దండించే స్థితికి రాకుండా ఎవరికి వారు స్వీయక్రమశిక్షణతో మెలగాలని అందరికీ మార్గదర్శనం చేస్తుంది.

ఇంట్లో ఉన్న చీకటిని పోగొట్టడానికి దీపాన్ని వెలిగిస్తాం.  అలాగే జీవితంలో ఉన్న సమస్యల నుంచి బయటపడటానికి కృషి చేయాలి. మనలో ఉన్న అజ్ఞానమనే చీకటిని ప్రయత్నపూర్వకంగా మనమే దూరం చేసుకోవాలి. కష్టాలకు కంగారుపడకుండా ధైర్యజ్యోతులను నింపుకుని వాటికి స్వస్తిపలకాలి. ఒక దీపం మరో దీపాన్ని వెలిగించినట్లే మన జీవితాన్ని మనం చక్కదిద్దుకుంటూ సాటిమనిషి కష్టంలో ఒక ఓదార్పుగా, దారిచూపే వెలుగుగా నిలుస్తూ జీవితానికి సార్థకతను చేకూర్చుకోవాలి. మనలో ఉన్న దోషాలూ బలహీనతలపై, భగవద్భక్తితో, సంపూర్ణ ప్రయత్నంతో విజయాన్ని సాధించి వ్యక్తిత్వ పరిపక్వతను పొందాలి.

ఈ నరకచతుర్దశి రోజున విధిగా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అందులో మొదటిది అభ్యంగస్నానం. ప్రతి తెలుగు మాసంలో బహుళపక్ష చతుర్దశి మాసశివరాత్రి. ఆరోజు తలంటు నిషిద్ధం. కానీ కేవలం ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు తలంటు తప్పనిసరి. తెల్లవారకముందే ఇంకా చీకటి ఉండగానే అందరూ నువ్వులనూనెను తలకు, శరీరానికి పట్టించి, శనగపిండితో నలుగుపెట్టుకుని తలంటుకోవాలి. తర్వాత రాబోయే శీతాకాలానికి తగినట్లుగా శరీరాన్ని సన్నద్ధం చేయడం దీని ఉద్దేశం. ఈ రోజున నువ్వులనూనెలో లక్ష్మీదేవి, నీళ్లలో గంగాదేవి కొలువై ఉంటారట. దీన్నిబట్టి కూడా ఈరోజు ప్రాముఖ్యత వెల్లడవుతుంది.

దీపోజ్యోతిః పరంబ్రహ్మ దీపః సర్వతమోపహః
దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే

అని దీపలక్ష్మిని ప్రతిరోజూ ఆరాధించే సంప్రదాయం మనది. అలాంటిది స్త్రీలు ఈ నరకచతుర్దశి నుంచి ప్రారంభించి కార్తీకమాసం అంతా ఉభయసంధ్యలలో దీపాన్ని వెలిగిస్తారు.   అంతే కాకుండా ఈ నరకచతుర్దశి నాడు సాయం సమయంలో దీపదానం చేయాలి.

చతుర్దశ్యాం తు యే దీపాన్‌ నరకాయ దదాతి చ
తేషాం పితృగణాస్సర్వే నరకాత్‌ స్వర్గమాప్నుయుః

ఈ పర్వదినాన పితృదేవతలను తలచుకుంటూ సాయంకాలం దక్షిణదిక్కున దీపాలు వెలిగించడం వలన నరకంలో ఉన్న పితృగణాలు స్వర్గాన్ని పొందుతాయని పురాణాలు చెబుతున్నాయి. అలాగే భూలోకవాసులకు యమమార్గాధికారుల నుంచి బాధలు తప్పుతాయంటారు. యముడికి ఇష్టమైన మినప పిండివంటలు ఈరోజు తప్పక తినాలి.

ఇలా ఎన్నో విషయాలతో ముడిపడిన నరకచతుర్దశి పర్వదినం పిల్లలూ పెద్దలూ అందరికీ కొత్త ఉత్తేజాన్ని కలిగిస్తుంది. చెడుపై మంచే విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని ఇస్తుంది. సాటిమనిషి జీవితంలో నిస్స్వార్థంగా ఆనందాల వెలుగులు నింపడానికి స్ఫూర్తినిస్తుంది.

బులుసు అపర్ణ, శతావధాని


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts