అప్పుడిక.. అనంతానంద పరిమళమే!

పగలు-రాత్రి, వారం-నెల, సంవత్సరం-శతాబ్దం.. ఇలా కాలం గడుస్తూనే ఉంటుంది. ఏళ్లకు ఏళ్లు గతంలోకి చేరిపోతుంటాయి. ఎప్పటికప్పుడు ఇంకో రోజు, మరో వత్సరం కొత్త చిగుళ్లు తొడిగి మన ముందు నిల్చుంటాయి.

Published : 28 Dec 2023 00:02 IST

కొత్త సంవత్సరం సందర్భంగా..

పగలు-రాత్రి, వారం-నెల, సంవత్సరం-శతాబ్దం.. ఇలా కాలం గడుస్తూనే ఉంటుంది. ఏళ్లకు ఏళ్లు గతంలోకి చేరిపోతుంటాయి. ఎప్పటికప్పుడు ఇంకో రోజు, మరో వత్సరం కొత్త చిగుళ్లు తొడిగి మన ముందు నిల్చుంటాయి. వర్తమానంలో ఎదురయ్యే దిగుళ్లను దిగమింగి, కొత్త ఉత్సాహంతో ముందుకు సాగాలంటే ఆత్మీయుల అండదండలుండాలని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. కనుక ఇంటా బయటా అనుబంధాలనూ, ఆత్మీయతలనూ పెంచుకుందాం!

కాలచక్ర గమనంలో పై ఆకులు రాలడం, కొత్త చిగుళ్లు తొడగటం సహజం. పండుటాకు ఎప్పటికీ ఉంటానని మొరాయిస్తే చక్రభ్రమణం నిలిచిపోతుంది. చక్రాలు కదలని బండి చలనం లేని జీవిలా అక్కడే ఆగిపోతుంది. వ్యక్తి మొదలు విశ్వం దాకా ఈ ఒక్క సూత్రం మీదనే తిరుగాడుతుంటాయి. ఆ చలన శక్తే దైవం. అదే కాలం. ‘అక్షయమైన కాలాన్ని నేను’ అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు. కాలం భగవత్‌ స్వరూపమని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. మహాభారతం ఆదిపర్వంలోని ఉదంకోపాఖ్యానంలో సంవత్సర స్వరూప వివరణ ఉంది. ఉదంకుడనే ముని పాతాళ లోకానికి వెళ్లినప్పుడు అక్కడ ఇద్దరు వ్యక్తులు తెలుపు, నలుపు దారాలను నేస్తుంటారు. దానికి సమీపంలో ఓ ఆరుగురు పన్నెండు ఆకుల చక్రాన్ని తిప్పుతుంటారు. ఉదంకుడికి ఇదంతా ఏమిటో మొదట తెలియలేదు. కానీ.. దారాలను నేస్తున్న ఆ ఇద్దరూ విధి, విధాతలనీ.. తెలుపు పగలు, నలుపు రాత్రి అనీ.. పన్నెండు ఆకుల చక్రమే పన్నెండు నెలల కాలమనీ తర్వాత అర్థమైంది. ఈ పన్నెండు ఆకుల కాలాన్ని ఆరు రుతువులు తిప్పుతున్నాయి. ఇదీ మహాభారతం వర్ణించిన సంవత్సర స్వరూప విశేషం. కాలం జీవులకు చైతన్యం కలిగిస్తుంది. అందుకే ‘తత్వైనమః, నిమేషాయ నమః, కాలాయ నమః’- అంటూ పరమాత్మ శక్తిని ఆరాధించటం కనిపిస్తుంది.

కుటుంబ బంధం.. కుసుమ సుగంధం

ప్రేమానురాగాలు వ్యక్తికి ముందుగా కుటుంబం నుంచే అందుతాయి. అందుకే ‘నా వాళ్లు, నా కుటుంబం’ అనే పలవరింతలు. ఈ మధుర బంధ ఆస్వాదన ‘జగమంత కుటుంబం నాది’ అనే భావనకు దారితీయాలంటారు పెద్దలు. దీని కోసమే నేటి తరం ‘గ్లోబల్‌ ఫ్యామిలీ డే’ పేరిట వేడుక చేసుకోవడానికి తెర తీసింది. అయితే ఇది నిజంగా కొత్తదా? అంతకు ముందెన్నడూ మనకు తెలియదా? అంటే భారతీయంలో ఏనాటి నుంచో వసుధైక కుటుంబం అనేది చిరపరిచితంగా ఉన్నదే. ఆ భావన పెంపొందించేలా ఎందరో కవులు తమ రచనల్లో వ్యక్తంచేసిన మాట నిజం. విశేషమల్లా ఒక్కటే.. ‘గ్లోబల్‌ ఫ్యామిలీ డే’ ప్రతి సంవత్సరం జనవరి ఒకటిన నూతన సంవత్సర ప్రారంభ వేళ చేసుకునే సంబరాల్లో ఒకటిగా ప్రపంచం ముంగిట్లోకి అడుగుపెట్టడం. ఇలా రెండూ ఒకటై రావటం వల్ల ‘మనం మనం మానవులం.. మనమంతా ఒకే కుటుంబం’ అనే సదాలోచన ప్రపంచమంతా పరవళ్లు తొక్కుతోంది. కాలం, కుటుంబం.. ఈ రెండింటి నేపథ్యంలో పరమాత్మను దర్శించగలిగితే జీవితం అనంతానంద పరిమళంతో నిండిపోతుంది. అసలు మనకున్న బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమ వ్యవస్థలో గృహస్థాశ్రమం ముఖ్యమైంది. అది.. దంపతులు సమాజానికి సేవ చెయ్యటం కోసం, దైవ కార్య నిర్వహణ కోసం నిర్దేశితమైంది.

ఇల్లే శాంతి స్థానం

శాంతి అనేది వ్యక్తి దగ్గర మొదలై సమష్టి దాకా చేరి, సృష్టి అంతటినీ ఆవరిస్తుంది. అలా జరగాలంటే ముందుగా కుటుంబసభ్యుల మధ్య సఖ్యత పెరగాలి. కుటుంబమంటే అమ్మా-నాన్నా, అన్నా-తమ్ముడూ, అక్కా-చెల్లీ. ఆ తర్వాత అమ్మ వైపు వారు, నాన్న వైపు వారు. ఆ బలగంతో పాటు మిత్రవర్గం. అందుకే సంప్రదాయంగా శుభలేఖల్లో ‘సకుటుంబ సపరివార సమేతంగా’ అని రాస్తుంటారు. అంటే.. ‘అందరూ కలిసి రండి, సందడిగా సంతోషాలు పంచుకుందాం’ అని ఆహ్వానించడమన్నమాట. వ్యక్తుల మధ్య, కుటుంబాల మధ్య, సమాజాల మధ్య సఖ్యత పెరగటానికే ఇలా రాస్తుండేది. పెద్దలు చెప్పిన ‘వసుధైక కుటుంబం’ అన్న ఆదర్శంలోని సారాన్ని గ్రహించటానికే ఇవన్నీ ఉన్నది. వాటి ప్రకారం నడుచుకుంటే విశ్వశాంతి వర్ధిల్లుతుంది, అశాంతి అంతమవుతుంది.

ఆదర్శ మార్గాలు

కాలాన్ని దైవంగా భావిస్తూ సాగడానికి, కుటుంబ వ్యవస్థ సవ్యంగా నడవటానికి-  రామాయణ, భారత, భాగవతాది ఇతిహాస పురాణాల్లో ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. రాముడు సోదరులతో సఖ్యంగా ఉన్న తీరు, తమ్ములు అన్నను గౌరవించిన తీరు.. ఇవన్నీ ప్రతి తరంలోనూ పెద్దలు ముందు తాము తెలుసుకుని, అనుసరించి చిన్నలకు చెబుతుండాలి. యాగరక్షణకు శ్రీరాముణ్ణి మాత్రమే పంపమని విశ్వామిత్రుడు దశరథుణ్ణి కోరితే.. లక్ష్మణుడు స్వచ్ఛందంగా అన్న సేవకోసం అడవులకు బయల్దేరాడు. కైకేయి ఆదేశం మేరకు శ్రీరాముడు అరణ్యాలకు వెళ్తుంటే.. సొంత సుఖాలను వదులుకొని లక్ష్మణుడు పద్నాలుగేళ్లు అన్నను వెన్నంటే ఉన్నాడు. మహా భారతంలో యక్ష ప్రశ్నల సందర్భం కూడా సోదర బంధాన్ని ప్రతిబింబిస్తుంది. యక్షమాయ వల్ల భీమార్జున నకుల సహదేవులు మరణించినప్పుడు ధర్మరాజు యక్షప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పాడు. దానికి మెచ్చిన యక్షుడు మరణించిన వారిలో ఒక్కరిని మాత్రమే బతికిస్తానన్నాడు. ధర్మరాజు నకులుణ్ణి కోరుకున్నాడు. అంతులేని బలపరాక్రమవంతులైన భీమార్జునులను కాదని, నకులుణ్ణే ఎందుకు కోరావని- యక్షుడు అడిగాడు. కుంతికి జన్మించిన వారిలో తాను బతికే ఉన్నానని, సవతి తల్లి మాద్రి కొడుకుని కూడా బతికించడం తన బాధ్యత కనుక అలా కోరానన్నాడు ధర్మరాజు. ఆయన  మాటల్లో ధర్మం, కుటుంబానికి ఇచ్చిన ప్రాధాన్యత, సోదరబంధ సౌందర్యం కనిపించడంతో.. యక్షుడు సంతోషించాడు, అందరినీ బతికించాడు. ఇవి కొన్ని ఉదాహరణలే. ఇలా కుటుంబసభ్యులందరూ ఒకరి కష్టంలో ఒకరు పాలు పంచుకోవటం, సుఖసంతోషాల్లో కలిసి ఆనందించటం అనే తత్త్వం ప్రపంచవ్యాప్తంగా పెరగాలి. కాలం విలువను తెలుసుకుని జీవితాన్ని సార్థకం చేసుకోవాలన్నదే ఆధ్యాత్మిక వేత్తల లక్ష్యం. ఈ లక్ష్య సాధనలోనే అనంతమైన ఆనందం, విశ్వశాంతి ఇమిడి ఉన్నాయి.

డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జున రావు, గుంటూరు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని