గృహస్థ ఆశ్రమం.. ఘనమైన ఆశ్రయం

గృహస్థ ఆశ్రమాన్ని పాటిస్తూ కూడా పరమాత్మ పాదాలను ఆశ్రయించి, పారమార్థిక పురోగతి సాధించవచ్చని మన ధర్మం ప్రబోధిస్తోంది. సంసార సాగరాన తామరాకుపై నీటిబొట్టులా జీవించిన వారెందరో ఉన్నారు. సంత్‌ తుకారామ్‌ నుంచి సతీసక్కుబాయి వరకూ ఎందరో పరమభక్తులు గృహస్థులే.

Updated : 01 Feb 2024 04:35 IST

గృహస్థ ఆశ్రమాన్ని పాటిస్తూ కూడా పరమాత్మ పాదాలను ఆశ్రయించి, పారమార్థిక పురోగతి సాధించవచ్చని మన ధర్మం ప్రబోధిస్తోంది. సంసార సాగరాన తామరాకుపై నీటిబొట్టులా జీవించిన వారెందరో ఉన్నారు. సంత్‌ తుకారామ్‌ నుంచి సతీసక్కుబాయి వరకూ ఎందరో పరమభక్తులు గృహస్థులే.

న్యాస ఆశ్రమం ఎంత ఘనమైందో, సంసార ధర్మమూ అంతే. ఇహలోక బంధాలు వద్దనుకుని పరమాత్మ దర్శనానికి పరితపించేవారు ఉన్నతులు. అలాగే కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తూ.. భగవంతుడేం చేసినా తమ మంచికేనని నమ్మే భక్తులూ అంతే ఉన్నతులు. ఒకరిది సత్యాన్వేషణ, మరొకరిది సర్వసమర్పణం. గమనాలు వేరుగా అనిపించినా.. గమ్యం మాత్రం ఒకటే. సర్వసంగ పరిత్యాగులే కాదు సాంసారిక జీవులూ తరించే తరుణోపాయం ఉంది. బ్రహ్మచర్యం నుంచి గృహస్థ జీవితానికి, తర్వాత వానప్రస్థ ఆశ్రమానికి. అంటే గృహ బాధ్యతలను తర్వాతి తరంవారికి అప్పగించి, అవసరమైనప్పుడు సలహాలు ఇస్తూ.. నెమ్మదిగా ఇహలోక బంధాల నుంచి వైదొలగడం. ఆ వానప్రస్థం నుంచి సన్యాసానికి మరలి ముక్తిని పొందే మార్గాన్ని సూచించారు మన ఆధ్యాత్మికవేత్తలు.

పూర్వం కర్దమ ప్రజాపతి అనే మునీశ్వరుడు ఉండేవాడు. యుక్తవయసులో ఆయనకు వివాహం చేసుకోవాలన్న సంకల్పం కలిగింది. భగవంతుడి అనుగ్రహంతో అర్ధాంగిని అన్వేషించాలనుకున్నాడు. సరస్వతీ నదీతీరానికి వెళ్లి తపస్సు చేశాడు. ఫలితంగా శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. సంతోషించిన మహర్షి ‘మాధవా! గృహధర్మమనే యజ్ఞానికి సహకరించే వధువును ధర్మపత్నిగా చేసుకోదలచాను. నీ సహాయం ఉంటేనే సంసార సముద్రాన్ని దాటడం సాధ్యం’ అని వేడుకున్నాడు. లక్ష్మీనాథుడు ‘తథాస్తు’ అని ఆశీర్వదించాడు. ‘గృహస్థువై స్వధర్మాన్ని ఆచరించు. ప్రాణికోటికి అవసరమైనప్పుడు అభయం ఇస్తూ, దానాలు చేస్తూ, కరుణామూర్తివై, సుజ్ఞానివై ప్రవర్తించు. నాలోనే లోకాలన్నీ ఉన్నాయనీ, నీలో నేనున్నానని తెలుసుకొని నన్ను ఆరాధిస్తూ ధర్మబద్ధంగా జీవించు. అంత్యదశలో నన్ను చేరుకుంటావు’ అని ప్రబోధించాడు. ‘నీ కుమారుడిగా జన్మిస్తాను’ అని వరం కూడా ఇచ్చాడు. అనంతరం ఆ పరమాత్మ కర్దమ, దేవహూతి దంపతులకు కపిలుడిగా జన్మించి, వారిని తరింపజేశాడు. గృహస్థ ధర్మాన్ని యజ్ఞంగా నిర్వర్తించిన ఆ మునీశ్వరుడు లోకానికి మార్గదర్శకుడయ్యాడు.

అన్ని ఆశ్రమాలకూ అదే ఆధారం

ఎందరో మహానుభావులు గృహస్థ జీవితానికి ఆశ్రమ గౌరవాన్ని కల్పించారు. స్వధర్మ ఆచరణతో, దయా దాన గుణాలతో, తామరాకుపై నీటిబొట్టులా జీవిస్తూ, ఆధ్యాత్మికోన్నతిని సాధించారు. సాయిబాబాను తొలుత గుర్తించి ఆదరించిన మహల్సాపతి, బాయిజాబాయి, శ్యామా పంతులు లాంటి వారంతా గృహస్థులే. రమణ మహర్షి అరుణాచలంలో అనామకంగా తిరుగుతున్నప్పుడు మొదటిసారి ఆకలి తీర్చిన గృహిణి ముత్తమ్మ. చనిపోయిన తన కొడుకులా ఉన్నాడని, రమణులకు రోజూ ఆ దయామయి ప్రేమతో భోజనం పెట్టేది. అలాగే రామకృష్ణ పరమహంసను దక్షిణేశ్వర కాళీమందిరంలో పూజారిగా నియమించిన జమిందారిణి రాణీరాస్మణీ దేవి. ఆయన ఆవాసానికి, ఆధ్యాత్మిక సాధనలకు సకలం సమకూర్చాడు ఆమె అల్లుడు మధుర్‌బాబు. వీళ్లంతా గృహస్థ జీవితాన్ని గడుపుతూనే సాధుసేవతో మహాత్ముల కృపకు పాత్రులయ్యారు.

స్వధర్మ ఆచరణా సాధనే

ఎవరి పనిని వారు చేస్తూ, ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తిస్తూ భగవంతుణ్ణి ‘తండ్రీ! ఎలాంటి జన్మ ప్రసాదించినా సరే.. నీపై అక్షయమైన భక్తివిశ్వాసాలు కలిగి, ఈ సంసారంలో మునిగిపోకుండా చూడు’ అని ప్రార్థించేవారు ఉత్తమ గతులు పొందుతారు. పలాయనవాదులై, బాధ్యతలు విస్మరించి సన్యాసం స్వీకరించేవారు రెంటికీ చెడ్డ రేవడి అవుతారు. అందుకే స్వామి వివేకానంద ‘సంఘంలో కొద్దిమందే సన్యాసులుండాలి. మిగతావారు ఆదర్శవంతులైన గృహస్థులుగా ఉంటూ అంకితభావంతో విధులను నిర్వర్తించాలి’ అనేవారు. శక్తిసామర్థ్యాలు, సేవాకాంక్ష ఉన్న గృహస్థులు పారమార్థికోన్నతిని పొందుతారన్నారు. ఆధ్యాత్మికతను నిరూపించేది ప్రేమ, సమభావన. పూజలు, జపతపాలే భక్తికి ప్రాతిపదికలైతే మాంసం అమ్మే వృత్తిలో ఉండి పారమార్థిక జ్ఞానాన్ని ఆర్జించిన ధర్మవ్యాధుడు, మట్టికుండలు మలిచి శ్రీవేంకటేశుడి భక్తుడైన కురువనంబి ఆధ్యాత్మిక లోకంలో ఆదర్శప్రాయులు అయ్యేవారే కాదు.

జగద్గురువులు చూపిన తరుణోపాయాలు

సమస్త బంధాలను త్యజించి సాధనతో సర్వేశ్వరుణ్ణి సాక్షాత్కరించుకునే శక్తిసంపత్తులు అందరికీ ఉండవు. చాలామందికి ఆ అనుకూలత ఉండదని అర్థం చేసుకొని గృహస్థులకూ కైవల్య మార్గాన్ని చూపారు సద్గురువులు. ఆ పరంపరలో జగద్గురువులైన శంకరాచార్యులు తమ భజగోవిందంలో..

గేయం గీతానామ సహస్రం, ధ్యేయం శ్రీపతి రూపమజస్రమ్‌
నేయం సజ్జనసంగే చిత్తం, దేయం దీనజనాయ చ విత్తమ్‌

అన్నారు. భగవద్గీత, విష్ణుసహస్రనామాలను పఠించాలి. లక్ష్మీనారాయణ రూపాన్ని ధ్యానించాలి. సజ్జన సాంగత్యంలో మనసును సంస్కరించుకోవాలి. నిస్సహాయులకు దానం చేయాలి- అంటూ నాలుగు ఉపాయమార్గాలను ఉపదేశించారు. వినయంతో కూడిన దాతృత్వగుణం అత్యుత్తమమైంది. ఇది గృహస్థధర్మంలో మనల్ని గట్టెక్కించే ఉన్నత మార్గం. ఉన్నదాంట్లో నలుగురికి దానం చేసే దయార్ద్ర హృదయులు ధన్యులు. దేవుని కొలువుకు అర్హులు. పరివారంతో ఉంటూనే పరమార్థాన్ని ఎలా తెలుసుకోవచ్చో తేటపరుస్తూ తాళ్లపాక అన్నమాచార్యులు కూడా భగవంతునిపై భక్తిని కలిగి ఉంటే చాలు, ఆ ఆర్తజనరక్షకుడు తనను నమ్మి, ఆధారపడిన వారికి సాధనాఫలాలన్నీ ప్రసాదిస్తాడు- అన్నాడు. గృహస్థధర్మంలో ఉంటూ ఆధ్యాత్మిక సాధనలు చేయటమనేది కోటలో ఉండి యుద్ధం చేయటం లాంటిది.

గృహిణులకూ ఉత్తమగతులు

ఇంటిపనులు, కుటుంబసభ్యుల సేవతోనే జీవితం గడిచిపోతోంది. ఆరాధనకు ఎక్కువ సమయం లేదంటూ కొందరు గృహిణులు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. కానీ సంసార బాధ్యతలు నెరవేర్చడం కూడా సర్వేశ్వరుడికి చేసే సేవేనని స్పష్టం చేసింది రామాయణం. శ్రీరామచంద్రుడు తల్లి కౌసల్యాదేవితో ‘అమ్మా! స్వధర్మాన్ని విడిచిపెట్టి ఎంత తపస్సు చేసినా ఫలించదు. తన ధర్మాన్ని తాను నిర్వర్తించినప్పుడు జపతపాలు చేయకున్నా స్త్రీ ఉత్తమ ఫలితాలు పొందుతుంది. ఇది వేద ధర్మం’ అని వివరించాడు. అలాగే అమ్మవారు గృహిణి ధర్మాన్ని మహా తపస్సు కన్నా ఎక్కువగా ఆదరిస్తుందని ఆ తల్లి ఉపాసకులు చెబుతారు. ఇలా మన పురాణాలు, ఇతిహాసాలు గృహస్థు ధర్మాన్ని యజ్ఞంగా నిర్వచించాయి. ఎందరో గృహస్థులు తమ ధర్మాన్ని ఆచరించి ఆదర్శంగా నిలిచారు.

చైతన్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు