దార్శనికుడు.. మార్గగామి ఏసు ప్రభువు

రెండువేల ఏళ్ల క్రితం ఏసు క్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. ఆ రోజే క్రిస్మస్‌. ప్రపంచమంతా చేసుకునే అతి తక్కువ పండుగల్లో ఇదొకటి. నెల రోజుల ముందే సంబరాలు మొదలై, పండుగ వరకూ కొనసాగుతాయి.

Updated : 21 Dec 2023 04:19 IST

డిసెంబరు 25 క్రిస్మస్‌

రెండువేల ఏళ్ల క్రితం ఏసు క్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. ఆ రోజే క్రిస్మస్‌. ప్రపంచమంతా చేసుకునే అతి తక్కువ పండుగల్లో ఇదొకటి. నెల రోజుల ముందే సంబరాలు మొదలై, పండుగ వరకూ కొనసాగుతాయి. క్రీస్తు పుట్టినప్పుడు తూర్పుదేశ జ్ఞానులు.. ఆయన్ను చూడటానికి బయల్దేరారు. వారికి  ఆ ప్రాంతం తెలియకపోతే ఒక నక్షత్రం దారి చూపింది. అందుకు గుర్తుగానే.. క్రిస్మస్‌ సీజన్‌ ప్రారంభమైన నవంబరు 25 నుంచి క్రైస్తవులు ఇళ్లపై కాంతులు వెదజల్లే స్టార్స్‌ను అమరుస్తారు.

క్రిస్మస్‌ అనేది రెండు గ్రీకు పదాల కలయిక. ‘క్రిస్‌’ అంటే క్రీస్తు. ‘మస్‌’ అంటే ఆరాధించడం. ‘క్రిస్మస్‌’ అంటే క్రీస్తును ఆరాధించడం. దేవుడు.. తాను సృష్టించిన మనుషుల్ని ఎంతో ప్రేమించాడు. పాపులను రక్షించేందుకు పరలోకాన్ని విడిచి, తాను కూడా భూలోకంలో మనిషిగా జన్మించాడని క్రైస్తవులు బలంగా విశ్వసిస్తారు.

ఏసుక్రీస్తు ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు. ఆయన అనుసరించిన మార్గం.. సర్వ మానవాళికి ఆదర్శం. ప్రభువు ప్రతి విషయంలో మనకు మార్గదర్శిగా నిలిచాడు. ఈ లోకంలో ఆయన చెప్పిన మాటలు, చేసిన బోధలు విని ఆచరిస్తే.. మనం ధన్యులమౌతాం. పలు సందర్భాల్లో ఏసు ప్రభువు చెప్పిన మాటలను ఓసారి స్మరించుకుందాం.

శోధనలో వాక్యాన్ని ఆశ్రయించాలి

విశ్వాసి జీవితంలో అనేక పరీక్షలు ఎదురవుతాయి. అలాంటప్పుడు వాక్యం ఎంతో ముఖ్యమైందన్న విషయాన్ని ప్రభువు నిరూపించాడు. సాతాను ఒకసారి ఏసుక్రీస్తును శోధించాడు. ఆయన్ను కొండపైకి తీసుకెళ్లి.. ‘నువ్వు గనుక నాకు మొక్కితే ఈ లోకమంతా ఇచ్చేస్తా’ అన్నాడు. బదులుగా ప్రభువు.. ‘సాతాన్‌! తక్షణం ఇక్కడి నుంచి వెళ్లిపో! దేవుణ్ణే ఆరాధించి, ఆయన్నే సేవించాలని ధర్మశాస్త్రం చెబుతోంది’ అంటూ బదులిచ్చాడు. వాక్యాన్ని ఆశ్రయిస్తే.. పాపం నుంచి తప్పించుకోవచ్చు అనేదానికి ఇదో ఉదాహరణ.

దేవుడు అప్పగించిన పని నెరవేర్చాలి

ఏటా పస్కా పండుగకు కుటుంబసమేతంగా జెరూసలేం వెళ్లేవారు. పన్నెండేళ్ల వయసులో ప్రభువు కుటుంబంతో కలిసి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ఆయన కనిపించకపోవడంతో అంతటా వెతికారు. ఆ సమయంలో ఆయన మందిరంలో సమావేశమైన పెద్దలు, బోధకులతో కూర్చుని మాట్లాడుతున్నాడు. ‘మాతో ఎందుకు రాలేదు?’ అని వాళ్లడిగితే.. ‘నేను వచ్చింది దేవుడి పని కోసమని మీకు తెలియదా?’ అని జవాబిచ్చాడు. మరో సందర్భంలో ‘దేవుని చిత్తం నెరవేర్చడం, ఆయన అప్పగించిన పనిని పూర్తి చేయడమే నా పని’ అన్నాడు. మన గురి ఎప్పుడూ లక్ష్యం మీదే ఉండాలనే సందేశాన్ని ఈ రెండు ఘటనల ద్వారా తెలియజేశాడు ప్రభువు.

మోహపు చూపు.. వ్యభిచారంతో సమానం

ఏసు వ్యభిచారం గురించి ప్రస్తావిస్తూ ‘పాత నిబంధనలో వ్యభిచరించకూడదు అనే మాట ఉంది కదా! అది శారీరకమే కాదు, ఒక మొహపు చూపు సైతం వ్యభిచారమే’ అన్నాడు. ఈ మాటను గుర్తుంచుకుని, ఆచరిస్తే అకృత్యాలు ఆగిపోతాయి.

నమ్మినవారిని ఆదరించండి!

ఒకసారి కొందరు స్త్రీలు పిల్లల్ని వెంటబెట్టుకుని ప్రభువు దగ్గరికి వచ్చారు. అక్కడున్న శిష్యులు వారిని అడ్డగించారు. అది చూసిన ప్రభువు ‘మీరెందుకు వాళ్లను అడ్డుకుంటున్నారు? రానివ్వండి’ అన్నారు. వాళ్లు చెంతకు వచ్చాక.. పిల్లల్ని ప్రేమగా ఎత్తుకుని ‘నా దగ్గరికి వచ్చేవాళ్లను ఎంతమాత్రం ఆటంకపరచను’ అన్నారు. అనుచరులకూ అదే చెప్పారు. స్వస్థత, సహాయం కోసం వచ్చేవారిని సదా ఆదరించేవాడు ఏసు. మనల్ని నమ్ముకున్న వారిని, సాయం కోరి వచ్చేవారిని ఆదరించాలన్న పాఠాన్ని నేర్పించాడు.

బాధితుల పక్షాన నిలబడాలి!

ప్రభువు తన మాటలు, క్రియల ద్వారా బాధితుల పక్షాన నిలబడ్డాడు. వ్యభిచార స్త్రీని క్షమించడం, ఎందరో రోగులను స్వస్థపరచడం, ఆపదలో ఉన్నవారికి సాయం చేయడం.. ఇలా తన జీవితకాలంలో ఎందరికో చేయందించాడు. తీసుకోవడం కంటే ఇవ్వడంలో ధన్యత ఉందని పరిశుద్ధ గ్రంథం కూడా చెబుతోంది. కనుక మనం బాధితుల పక్షాన నిలబడి సాయం చేయాలి.

మరవకూడని బాధ్యత

ఏసు ప్రభువును సిలువ వేసినప్పుడు.. తల్లి మరియ అక్కడే ఉంది. ఆ సమయంలో తనకు అత్యంత సన్నిహితమైన శిష్యుడు యోహాను కూడా ఉన్నాడు. ప్రభువు వాళ్లిద్దరి వంక చూసి.. ‘అమ్మా! ఇక నుంచి యోహాను నీ కుమారుడు. యోహానూ! ఇదిగో నీ తల్లి’ అంటూ అప్పగించాడు. తల్లిదండ్రుల బాధ్యతను మరణం వరకూ మరవకూడదు- అంటూ సందేశమిచ్చాడు.

తొందరపాటు తీర్పు..

ఒకసారి వ్యభిచారం చేసిన ఓ మహిళని కొందరు పట్టుకున్నారు. ఆమెని రాళ్లతో కొట్టి చంపేందుకు సిద్ధమయ్యారు. అది చూసిన ఏసు ‘మీలో ఇంత వరకూ ఎలాంటి పాపాలూ, తప్పులూ చేయనివారు ఆమె మీద మొదటి రాయి విసరండి’ అన్నాడు. అది వినగానే వాళ్లంతా తల వంచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. తమ తప్పులు మరచి ఇతరులను దోషులుగా చూడటం, తొందరపడి తీర్పులివ్వడం సరికాదని ఏసు ప్రభువు ప్రజలకు బోధపరిచాడు.

చింత వదిలేయండి

ఒకసారి ప్రభువు ‘చింతించకండి. దుఃఖం వల్ల మీ ఎత్తు ఒక మూరెడు పెరగదు, తగ్గదు’ అన్నాడు. అంతేకదా! సమస్య ఎదురైనప్పుడు.. అదే ఆలోచిస్తూ దిగులు చెందితే ఒత్తిడి కలుగుతుంది, కల్లోలం మిగులుతుంది. అందుకు బదులుగా పరిష్కారం వెతికితే భారం తీరి, శాంతి నెలకొంటుందని విశదపరిచాడు.

ప్రశాంత్‌.జి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని