ఆనందోబ్రహ్మ

నాటి మునుల నుంచి నేటి ఆధ్యాత్మికవేత్తల వరకూ- అందరూ కూడా జీవితంలో సంతృప్తి చాలా ముఖ్యమన్నారు. సంతుష్టులై ఉన్నవారే సంతోషంగా ఉండగలరని, వారే నిజమైన భగవత్‌ భక్తులు కాగలరని హితవు పలికారు. అందుకే ‘సంతుష్టః సతతం’ అంటోంది భగవద్గీత.

Updated : 04 Jan 2024 09:42 IST

నాటి మునుల నుంచి నేటి ఆధ్యాత్మికవేత్తల వరకూ- అందరూ కూడా జీవితంలో సంతృప్తి చాలా ముఖ్యమన్నారు. సంతుష్టులై ఉన్నవారే సంతోషంగా ఉండగలరని, వారే నిజమైన భగవత్‌ భక్తులు కాగలరని హితవు పలికారు. అందుకే ‘సంతుష్టః సతతం’ అంటోంది భగవద్గీత. అంటే నిత్యసంతోషులే నిజమైన భక్తులన్నమాట. అంతరంగంలో శాంతి, సంతోషాలు వెల్లివిరిస్తే.. వాటిని ఆరోగ్యకరమైన హాస్యరూపంలో నలుగురికీ ప్రసరింపజేయగలరు.

‘శివతాండవం’ రచించిన ఆధ్యాత్మికవేత్త పుట్టపర్తి నారాయణాచార్యులు తీర్థయాత్రలు చేస్తూ ఉత్తర భారతదేశం వెళ్లారు. అక్కడో పండితుడు తారసపడి తాను తులసీదాసు రామచరితమానస్‌పై వ్యాఖ్యానం రాస్తున్న సంగతి ప్రస్తావించారు. తనకూ, తులసీదాసుకూ ఓ పోలిక ఉన్నందునే ఈ రచనకు పూనుకున్నానన్నారు. ఆచార్యులు ఆశ్చర్యంగా ‘మీ ఇద్దరిలో ఉన్న పోలికేమిటి మహానుభావా?’ అన్నారు. అప్పుడాయన కాస్త గర్వంగా ‘తులసీదాసులా నేను కూడా ఎప్పుడూ గంభీరంగా ఉంటాను. ఎవరు ఎంతగా నవ్వించాలని ప్రయత్నించినా నవ్వనుగాక నవ్వను. నేను నవ్వి దాదాపు ఇరవయ్యేళ్లు అయ్యుంటుంది తెలుసా!’ అన్నారు. తన రచనలు, ఆధ్యాత్మిక ప్రసంగాల్లో హాస్యోక్తులతో అలరించే నారాయణాచార్యులు పండితుడి మాటలకు అవాక్కయ్యారు. రెండు దశాబ్దాలుగా ముఖంపై చిరునవ్వు చిగురించని ఇతనేం మనిషి? ఇలాంటి వ్యక్తి రామాయణంపై వ్యాఖ్యానం రాస్తున్నందుకు శ్రీరామచంద్రుడు, తులసీదాసు కూడా ఎంత మథనపడిపోతారో!- అనుకున్నారు. ఒక సభలో ఈ విషయాన్ని పుట్టపర్తివారు ప్రస్తావించి, ‘రామభక్తుడైన తులసీదాసు ప్రదర్శించిన నిశ్చలత్వాన్ని, గాంభీర్యాన్ని- ఆ పండితుడు అలా అర్థం చేసుకున్నందుకు ఎలా స్పందించాలో తెలియలేదు. ఆరోగ్యకరమైన హాస్యం, ఆనందంతో కూడిన ముఖం ఆధ్యాత్మిక జీవనానికి చిహ్నాలు’ అన్నారు. అందుకే ‘భగవంతుని సాన్నిధ్యం పొందటానికి ప్రార్థించడం కంటే కూడా ఎప్పుడూ చిరునవ్వు ముఖంతో, సంతోషంగా ఉండటం మరింత దోహదపడుతుంది’ అన్నారు మన మహర్షులు.

సంతోషం ఒక యోగం

నవరసాల్లో ఆబాలగోపాలాన్నీ అలరించేది హాస్యరసమే. పైగా ఈ సృష్టిలో స్వచ్ఛంగా, స్వేచ్ఛగా నవ్వగలిగే ఏకైక జీవి మనిషే! నిష్కల్మషంగా నవ్వటం మనసులోని నిర్మలత్వానికి, పారమార్థిక పురోగతికి నిదర్శనం. అలాగే ఆధ్యాత్మికోన్నతికి కర్మ, భక్తి, జ్ఞాన, రాజయోగాలే కాదు హాస్యయోగం కూడా ఓ మార్గమే! అందుకే ‘నవ్వటం ఒక యోగం’ అన్నారు యోగ సాధకులు. ప్రసన్నత ప్రస్ఫుటించే ముఖం ప్రశాంతతకు చిహ్నం. మన సనాతన ధర్మంలో అవతారమూర్తులు, ఆధ్యాత్మిక గురువులు చిరునవ్వుల చిద్విలాస మూర్తులే! అందుకే మల్లాది రామకృష్ణశాస్త్రి ‘నవ్వులో శివుడున్నాడురా..’ అన్నారో గీతంలో.  ఆ మతం, ఈ మతం అని కాకుండా అన్ని మతాలవారూ హాస్యప్రియులే! ఆ భావనతోనే విలియమ్‌ వర్డ్స్‌వర్త్‌ కూడా ‘నవ్వులోనే మనిషి పరిపూర్ణంగా ఉంటాడు’ అన్నాడు.

హాస్యవల్లరి.. ఆనందలహరి..

ఆ రోజు రేపల్లెలో శ్రీకృష్ణుడి హాస్యవల్లరికి అంతా పులకించిపోయారు. ఆనందాలు వెల్లివిరిసాయి. బాలకృష్ణుడి లీలలన్నీ చమత్కారాలతో, హాస్యాలతో కూడుకున్నవే! సందర్భోచిత హాస్యం, చమత్కృతి ధీశక్తికి నిదర్శనమంటారు తాత్త్వికులు. గోకులనందనుడు వాటికి పెట్టింది పేరు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే- ఆ చిలిపిచేష్టలు, చమత్కారాలు గోకులంలో ఎవరినీ నొప్పించలేదు. తల్లి యశోద దగ్గరకు వెళ్లి నిందిస్తున్నట్లు నటించారు. కానీ లోలోన అందరూ చిన్ని కృష్ణుడు మళ్లీ ఎప్పుడు అల్లరి చేస్తాడా, ఆటపట్టిస్తాడా అని ఎదురుచూసేవారు. అదీ అసలైన హాస్యంతో అలరించటమంటే! ఆ సంతోషకర సన్నివేశాలను వర్ణిస్తూ భాగవతంలో బమ్మెర పోతన ‘పురుషోత్తముడైన ఆ కృష్ణుడు నవ్వితే, నవ్విస్తే దట్టమైన అజ్ఞానం కూడా నవ్వులపాలై, జ్ఞానం జనించేలా చేస్తుంది. అటువంటి విష్ణువు అపురూప బాలుడై, తనను చూసి నవ్వే గోపికలను చూస్తూ తాను నవ్వటం నేర్చుకున్నాడు’ అన్నాడు. అలాగే సద్గురు త్యాగరాజస్వామి ‘నగుమోము గలవాని నా మనోహరుని..’ అంటూ సుమధురహాసుడైన శ్రీరామచంద్రుణ్ణి చిరునవ్వుల నీలమేఘశ్యాముడిగానే మనసులో స్మరించుకొని, స్థిరపరచుకున్నాడు. మనం ఆరాధించే దేవతా మూర్తులందరూ ఆనందానికి ప్రతిరూపాలే!

పదకవితాపితామహుడు అన్నమయ్య శ్రీవేంకటేశ్వరుని, శ్రీపద్మావతీదేవిని వర్ణిస్తూ శృంగార, భక్తి కీర్తనల్లో వివిధ రకాల నవ్వుల్ని పరిచయం చేశాడు. ఎలనవ్వులు, అరనవ్వులు, మొలక నవ్వులు, చిరునగవులు, అందపు నవ్వులు, వెలితి నవ్వులు, పచ్చి నవ్వులు- అంటూ ఇన్ని రకాల నవ్వుల్ని పూయించిన కవి మరొకరు లేరంటారు పరిశోధకులు. పరమాత్ముణ్ణి మనసులో నిలిపి, మందస్మిత ముఖారవిందంతో ధ్యానం చేయటం మనలో ఆధ్యాత్మిక అనుభూతుల్ని ఇనుమడింప చేస్తాయని పరమభక్తుల ప్రగాఢ విశ్వాసం.

నవ్వుల తోటలో పారమార్థిక పారిజాతాలు

ఆరాధ్యనీయులైన మహాత్ములెందరో హాస్యప్రియులై అలరించిన వారే! అత్యున్నత ఆధ్యాత్మిక బోధల్ని కూడా హాస్యోక్తులతో రంగరించి భక్తులను కడుపుబ్బా నవ్వించేవారు. నిరంతరం మౌనదీక్షలో ఉండే రమణ మహర్షి అనేక సందర్భాల్లో కురిపించిన చతురోక్తులు హాస్యజల్లులే. ఒకసారి రమణులు ఆశ్రమంలో భారంగా నడుస్తున్నారు. ఇంతలో ఓ భక్తుడు ‘స్వామీ! తమరేదో ఇబ్బంది పడుతున్నట్లున్నారు? శరీరంతో చాలా అవస్థగా ఉన్నట్లుంది’ అని పరామర్శ పూర్వకంగా ప్రశ్నించాడు. అప్పుడాయన ‘ఇబ్బందే కదా! నలుగురు మోయాల్సిన దాన్ని ఒక్కడినే మోస్తున్నాను! భారం కాదా మరి?’ అంటూ ముందుకు కదిలారు. ఇక స్వామి వివేకానంద హాస్యచతురత వర్ణనాతీతం. ఏ మాత్రం అవకాశం దొరికినా ఛలోక్తులు విసురుతూ పరిసరాల్ని సరదాగా మార్చేసేవారు. ఆయన దృఢకాయం గురించి ఒకరు ప్రస్తావిస్తే ‘నా స్థూలకాయం నాకెంత రక్షణో తెలుసా? చిన్నప్పుడు గంగానదిలో ఈదినా నా శరీరాన్ని చూసి భయపడి ఒక్క మొసలి కూడా దగ్గరకు రాకపోయేది!’ అన్నారు. సున్నిత  హాస్య సంభాషణలు జగద్గురువుల సరళత్వానికి సూచికలు.

బోసినవ్వుల ఆ బొమ్మ

జపాన్‌, కొరియా, చైనా తదితర దేశాల్లో ఇళ్లు, బడులు, ప్రార్థనా మందిరాలు, ఆహారశాలలు.. ఇలా అన్నిచోట్లా తమ ఆధ్యాత్మిక చిహ్నంగా లాఫింగ్‌ బుద్ధా బొమ్మను పెట్టుకుంటారు. తృప్తితో కూడిన ముఖంపై ఎప్పుడూ నవ్వులు చిందించే ఆ బొమ్మ ఎక్కడుంటే అక్కడ సిరిసంపదలకు ఢోకా ఉండదని  వాళ్ల విశ్వాసం. బోసినవ్వుల ఆ బొమ్మే అంత అదృష్టానికి కారణమవుతుందని నమ్ముతున్నారు కదా! అలాంటిది సజీవంగా ఉన్న మనం సంతృప్తితో సంతోషంతో తిరుగుతుంటే.. ఆ ఇళ్లు ఇంకెన్ని వరాలతో, ఆధ్యాత్మిక పరిమళాలతో కళకళలాడతాయి! అసలు నవ్వుల సవ్వడే వినిపించని ఇంటి వంక మహాలక్ష్మి చూడకుండా ముఖం తిప్పేసుకుంటుంది. అందుకే ‘అదృష్టం తలుపు తట్టాలంటే.. ముందు మనం చిరునవ్వుతో సిద్ధమై ఉండాలి’ అన్నారో జెన్‌గురువు.

ఒత్తిడి తగ్గించే తరగతులు

ఆధునిక సమాజంలో మానసిక, శారీరక వ్యాయామాల్లో హాస్యయోగాన్ని చేర్చటం విశేషం. ప్రాణాయామంతో కూడిన  ఈ యోగసాధనతో సాధకుల్లో మానసిక, శారీరక ఆరోగ్యం వర్ధిల్లుతుందని హాస్యయోగ గురువుల అభిప్రాయం. ఒత్తిళ్లతో కూడిన వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో ఈ హాస్యయోగ సాధన ఫలితంగా సానుకూల ఫలితాలు కనిపిస్తుండటం విశేషం.

చైతన్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని