కాలస్వరూపమే మకర సంక్రాంతి

సంక్రాంతి అతి పెద్ద పండుగ. పంటలు చేతికంది రైతులు పరవశించే తరుణం. బ్రహ్మజ్ఞానం పొందడానికి, సద్గతులు కలగడానికి అనువైన సమయం. వైకుంఠ ద్వారాలు తెరుచుకునే పుణ్యకాలం.  

Updated : 11 Jan 2024 03:34 IST

జనవరి 15 సంక్రాంతి

సంక్రాంతి అతి పెద్ద పండుగ. పంటలు చేతికంది రైతులు పరవశించే తరుణం. బ్రహ్మజ్ఞానం పొందడానికి, సద్గతులు కలగడానికి అనువైన సమయం. వైకుంఠ ద్వారాలు తెరుచుకునే పుణ్యకాలం.  

న పూర్వులు సూర్య సంచారాన్ని రెండుగా విభజించారు. సూర్యుడు భూమధ్యరేఖకు ఉత్తర దిశలో ఉన్నప్పుడు ఉత్తరాయణం, దక్షిణ దిశలో ఉంటే దక్షిణాయనం అన్నారు. సూర్యుడు ఒక రాశి నుంచి వేరొక రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు. అలా ప్రవేశించడానికి పట్టే కాలం సుమారు నెలరోజులు. ఇలాంటి సంక్రమణాలు సంవత్సరం మొత్తం మీద పన్నెండు. వాటిలో మకర సంక్రమణానికి ప్రాధాన్యత ఎక్కువ.

రాశి చక్రంలో మకరరాశి పదవది. సహస్ర కిరణుడైన సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే మహత్తర పుణ్యదినం మకర సంక్రమణం. కాలచక్రంలోని రాశులన్నింటిలోకి ‘మకరం’ ఉత్తమమైంది. ఈ పవిత్రమైన మకరరాశిలోనే విష్ణుమూర్తి నక్షత్రమైన శ్రవణం కూడా ఉంది. సూర్యుడు శ్రీమన్నారాయణ మూర్తిగా మనకి ప్రత్యక్షంగా సాక్షాత్కరించేది మకర సంక్రమణం పర్వకాలంలోనే. సూర్యుడికి ‘సూర్య నారాయణుడు’ అనే పేరు ఇలా ఏర్పడిందే. ఈ సందర్భంగా భోగి, సంక్రాంతి, కనుమ.. అంటూ మూడు రోజులు పండుగ చేసుకోవటం ఆచారం.

భోగి అనగానే మనకు గుర్తొచ్చేవి భోగి మంటలు. భోగం నుంచి వచ్చిన పదం భోగి. భోగం అంటే సుఖం, అనుభూతి అనే అర్థాలున్నాయి. అంటే భోగాలు అనుభవించే రోజని భావం. పురాణ కథలను అనుసరించి గోదాదేవి- శ్రీ రంగనాథస్వామిలో లీనమవడం అనే భోగాన్ని పొందిన రోజే భోగి పండుగ. భోగినాడు ఉదయాన్నే స్నానం చేసి మంటలు వేయాలన్నది సంప్రదాయం. ఎండిపోయిన చెట్లను, విరిగిపోయిన పీటలు, బల్లలు లాంటివి భోగి మంటల్లో వేస్తారు. అలాగే రావి, మామిడి, మేడి వంటి ఔషధ చెట్ల బెరళ్లను వేస్తారు. భవిష్యత్తులో ఏర్పడబోయే ప్రమాదాలను అరికట్టడమే భోగిమంటల ప్రధాన ఉద్దేశం. చలి కాచుకోవడం రెండోది. భోగి మంటలు వేదకాలంలో రుషులు చేసిన యజ్ఞాల్లో ఒకటైన ఆగ్రహాయణి హోమాగ్నికి ప్రతిరూపం కూడా. శ్రీకృష్ణుడి ప్రీత్యర్థం చేసిన యజ్ఞం పూర్తయిన తర్వాత ఆ కుండం నుంచి యజ్ఞ విభూతిని తీసి నుదురు, భుజాలు, ఛాతీ మీద పెట్టుకుంటారు. అలాగే భోగిమంటలు వేశాక వచ్చే విభూతిని ధరిస్తే అనేక భోగాలు సమకూరుతాయని ప్రతీతి. అందుకే భోగాలను కోరుకునేవారు అగ్నిని పూజించాలని ఈ క్రింది శ్లోకం తెలియజేస్తోంది.

ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్‌ శ్రియమిచ్చేత్‌ హుతాశనాత్‌
జ్ఞానం మహేశ్వరాదిచ్ఛేత్‌ మోక్షమిచ్చేత్‌ జనార్దనాత్‌

సూర్యుడి నుంచి ఆరోగ్యాన్ని, యజ్ఞపురుషుడి నుంచి భోగాలను, మహేశ్వరుడి నుంచి జ్ఞానాన్ని, విష్ణువు నుంచి మోక్షాన్ని కోరి పొందాలన్నది భావం.

ముగ్గులు.. గొబ్బెమ్మలు..

ధనుర్మాసం నెలరోజులూ వాకిట్లో సంక్రాంతి ముగ్గులేసి, గొబ్బెమ్మలు పెట్టడం తెలిసిందే! గోమయంతో చేసే గొబ్బిని గౌరీదేవిగా భావిస్తారు. ఏ రోజుకారోజు గొబ్బెమ్మలను పెడుతూ.. పాత వాటిని ఒకచోట చేరుస్తూ ఎండబెడతారు. వాటి మంటతో ప్రసాదం తయారుచేస్తారు. ఇది కేవలం ఆచారమే కాదు, శాస్త్రీయతా దాగి ఉంది. ఆవు పేడను కాల్చగా వచ్చే పొగతో గాలిలో ఉన్న సూక్ష్మక్రిములు నశించడమే కాకుండా వాతావరణంలో ఉన్న కాలుష్యం తగ్గుతుంది. ప్రాణవాయువు అధికంగా విడుదలవుతుంది. ఈ గాలిని పీల్చడం వల్ల శరీరంలోని 72వేల నాడులు ఉత్తేజితం అవుతాయి. శ్వాస సంబంధిత వ్యాధులకు ఔషధంగానూ పని చేస్తుంది.  

రేగుచెట్టు మీద విష్ణుమూర్తి

భోగి రోజు సాయంత్రం చిన్నారులకు భోగి పళ్లు పోస్తారు. బంతి పువ్వులరేకలూ, చిల్లర నాణేలూ, చెరకు ముక్కలూ, రేగుపండ్లు.. ఇలా దిష్టి తీసి తల మీదుగా పోయడం వల్ల.. పిల్లలకు దృష్టి దోషాలు సోకవని, శుభం చేకూరుతుందని నమ్ముతారు. సంస్కృతంలో రేగు చెట్టును బదరీ వృక్షం అంటారు. బదరికావనం విష్ణుదేవుడి నివాసస్థానాల్లో ఒకటి. అందువల్ల సంక్రాంతి పండుగ నాడు ఆయన ఆశీస్సులకు సూచికగా ఈ రేగుపళ్లను పిల్లలకు భోగిపళ్లుగా పోసే ఆచారం ఏర్పడింది. ఇక నాణేలు, చెరుకు ముక్కలు చుట్టూ చేరిన చిన్నారులను సంతోషపరిచేందుకు.

పండుగ నాడు ఏమేం చేయాలి..

బుద్ధిని వృద్ధి చేసుకోవడం అనేది సంక్రాంతి పండుగలోని ఆంతర్యం. అందుకే ఈ రోజున బుద్ధికి అధిదేవత అయిన సూర్యుణ్ణి ఆరాధించాల్సిన రోజుగా నిర్ణయించారు పెద్దలు. ఈ శుభ ఘడియల్లో చేసే పూజలు, దానాలతో పుణ్యం కలుగుతుంది. సంక్రాంతి నాడు నువ్వులతో హోమం, నువ్వుల దానంతో శని దోషం నివృత్తి అవుతుంది. తెల్లని నువ్వులు సేవించడం వల్ల అకాల మృత్యు బాధ తొలగి, ఆయుష్షు పెరుగుతుందన్నది పురాణ వచనం. వరాహ మూర్తి భూమిని ఉద్ధరించిన సంకేతంగా- సంక్రాంతి రోజున గుమ్మడికాయ (కూష్మాండం) దానం చేస్తారు. దీనితో పాటు ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, చెరకు, గోవు, బంగారం- ఇలా శక్తికొద్దీ దానం చేస్తారు. ఇలా చేసే దానాలు ఉత్తమ ఫలితాన్ని ఇస్తాయి.

కొత్త బియ్యంతో పరమాన్నం, అరిసెలు వంటి పిండివంటలు చేసి శ్రీమహావిష్ణువుకి నైవేద్యం సమర్పించడం ఆచారం. పితృదేవతలు సదా మనల్ని ఆశీర్వదిస్తుంటారు. అంత శక్తిగల వారిని ఇతర రోజుల్లో ఎలా ఉన్నా సంక్రాంతి నాడు తప్పక ఆరాధించాలని పెద్దలు చెబుతారు. పితృదేవతలకి నైవేద్యాలు సమర్పించాల్సిన పండుగ కనుక సంక్రాంతిని ‘పెద్ద పండుగ, పెద్దల పండుగ’ అని కూడా పిలుస్తారు.

గోవులను కాపాడింది కనుమనాడే!

పంటలు పండటంలో, అవి చేతికి అందడంలో తమకు సహాయపడిన పశు పక్ష్యాదుల పాత్ర పెద్దది. అందుకు సర్వదా కృతజ్ఞతాభావం చూపిస్తారు రైతులు. సంవత్సర మంతా తమతో పాటు శ్రమించిన పశువులను కనుమ నాడు ప్రత్యేకంగా పూజిస్తారు. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి, గోకులంలోని ప్రజలను, గోవులను రక్షించింది కనుమ నాడేనని పురాణాలు చెబుతున్నాయి.

ఉత్తమం - ఉత్తరం

ఉత్తరాయణాన్ని పుణ్యకాలం అనడానికి దాని విశిష్టతే కారణం. భారతీయ సంస్కృతికి మూలమైన వేదాలు, సంస్కృతభాష ఉత్తరాదిన పుట్టాయి. దేవతలు, రుషులు, పండితులకు ఉత్తర ప్రాంతాలే నివాస స్థానాలని చెబుతారు. మకర సంక్రమణంతో దేవతలకు పగటి కాలం మొదలవడం వల్ల ఈ కాలంలో దేవతలు మేల్కొని ఉండి, కోరిన కోర్కెలు తీరుస్తారని.. ఈ రోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని, ఈ సమయంలో పితృ దేవతలకు తర్పణాలు ఇస్తే వారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని పురాణ కథనాలు పేర్కొన్నాయి. ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. ఒకవేళ మిగిలిన పదకొండు సంక్రమణాల్లో ఇవ్వలేక పోయినా, మకర సంక్రమణం నాడు తప్పకుండా ఇవ్వాలి.

సాయి శారద కొడుకుల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని