Ayodhya Ram Mandir: అందరి దేవుడయ్యా.. అయోధ్య రామయ్య

శ్రీరామచంద్రుడు ఆవిర్భవించిన అయోధ్య.. రాముడి లాగానే పరమపవిత్రమైంది. రఘురాముడి అవతార లీలలతో అది పుణ్యప్రదేశమైంది. నాడు శ్రీరాముడికి అయోధ్యలో జరిగిన పట్టాభిషేకం ఎంత వైభవోపేతమైందో..

Updated : 18 Jan 2024 06:48 IST

జనవరి 22 అయోధ్య రామాలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ

శ్రీరామచంద్రుడు ఆవిర్భవించిన అయోధ్య.. రాముడి లాగానే పరమపవిత్రమైంది. రఘురాముడి అవతార లీలలతో అది పుణ్యప్రదేశమైంది. నాడు శ్రీరాముడికి అయోధ్యలో జరిగిన పట్టాభిషేకం ఎంత వైభవోపేతమైందో.. ఈనాడు కట్టిన ఆలయంలో (Ayodhya Ram Mandir) చేయనున్న శ్రీరామ ప్రతిమ ప్రాణప్రతిష్ఠ కూడా అంతే అద్భుతం, అపురూపం.

శ్రీరామచంద్రుడు తన ప్రతాపంతో లంకాధీశుని సంహరించాడు. భువిలోని ప్రజలూ, దివిలోని దేవతలూ కూడా సంతోషించారు, సంబరాలు చేసుకున్నారు. రావణాసురుడి లంక వైభవానికి లక్ష్మణాదులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అప్పుడే లంకాధిపతిగా అభిషిక్తుడైన విభీషణుడు- లంకలో కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుని వెళ్లమని శ్రీరాముణ్ణి అభ్యర్థించాడు. లక్ష్మణ, సుగ్రీవులు సహా అందరికీ అది ఆమోదయోగ్యం, ఆనందదాయకంగా తోచింది. కానీ జానకీనాథుడు ఆ విన్నపాల్ని సున్నితంగా తిరస్కరిస్తూ ‘లక్ష్మణా! లంక ఎంత సువర్ణ మయమైనా, నాకు మనస్కరించటం లేదు’ అన్నాడు. అంతేకాదు ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ.. కన్నతల్లి, జన్మభూమి స్వర్గం కన్నా ఉన్నతమైనవి’ అని స్పష్టం చేశాడు. ఆ జగదేకపతి శ్రీరాముడి జన్మభూమి మరేదో కాదు.. అయోధ్య అనే సుందర సుసంపన్న ప్రదేశం. నాటి త్రేతాయుగం నుంచి నేటి కలియుగం వరకు ఆ అయోధ్య అశేష జనవాహినికి పుణ్యస్థలం. తాను అవతరించినందుకే కాదు, అసమాన శౌర్య ప్రతాపాలకు, ఆధ్యాత్మిక అనుభూతులకు ఆలవాలమైనందుకే రామయ్యకు ఆ ప్రాంతమంటే అంత ప్రీతి. రఘురాముడికి ప్రాణప్రదమైన అయోధ్యలో, ఆ దాశరథి పేరిట నిర్మించిన మందిరంలో, ఆ దివ్య మూర్తికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుండటం రామభక్తులకు మహా ఆనందదాయకం.

ఆదికవి వాల్మీకి మదిలో..

వాల్మీకి మహర్షికి తన ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుడిపై ఎంత పూజ్యభావమో, ఆ అవతారపురుషుడు ఆవిర్భవించిన అయోధ్య అంటే కూడా అంతే ఆరాధనా భావం. అందుకే తన రామాయణ బాలకాండలో ఆ నగరాన్ని అమోఘంగా కీర్తించాడు. ప్రజారంజకమైన పాలనకే కాదు పారమార్థిక చింతనకు కూడా నెలవైన ఆ నగరం సనాతన భారతీయ సాంస్కృతిక సంపదకు పెట్టని కోటలాంటిది. ఆ భావనతోనే వాల్మీకి మహర్షి ‘యోద్ధుం అశక్యా ఇతి అయోధ్య.. జయించటానికి వీలు కానిది అయోధ్య’ అని శ్లాఘించాడు. అంతేకాదు తన అంతరంగాన్నే అయోధ్యగా చేసుకుని ఆ ఆజాను బాహుణ్ణి అందులో ప్రాణప్రతిష్ఠ చేసుకున్నాడు. రామాయణ కాలం ప్రకారం అయోధ్య పొడవు 12, వెడల్పు 3 యోజనాలు. ఇప్పటి లెక్కల్లో 168 కి.మీ. పొడవు, 42కి.మీ. వెడల్పు. దీన్ని బట్టి ఆ నగర వైశాల్యం అప్పట్లో దాదాపు 7 వేల కిలోమీటర్లు. వాల్మీకి అయోధ్యను రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక.. ఇలా అన్ని రంగాల్లోనూ ఆదర్శప్రాయం అంటూ అభివర్ణించాడు. కేవలం శ్రీరాముణ్ణి, ఆయన అవతరించిన అయోధ్యను ఆరాధించటమే కాదు.. ఆ గుణగణాలను అనుసరించటం ప్రధానమని చెప్పకనే చెప్పాడు. భౌగోళికంగా కాదు భక్తిభావంతో అయోధ్యను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. అప్పుడే దర్శనభాగ్యం లభిస్తుందంటారు తాత్త్వికులు.

ధర్మమే దుర్బేధ్యమైన కోట

ఒకసారి అయోధ్యను పాలించిన రఘుమహారాజు సమాజం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే ఎలాంటి పథకాల్ని అవలంబించాలో చర్చించటానికి మేధావుల సభ ఏర్పాటుచేశాడు. ఆ సభలో ఒక వర్గం వారు దేశం అభివృద్ధి చెందటానికి సైన్యం పటిష్టంగా ఉండాలని, అందుకు అవసరమైన ప్రణాళికలు చేపట్టాలని సూచించారు. రెండో వర్గం దేశం శాంతి సౌఖ్యాలతో వర్ధిల్లాలంటే ప్రజలు సచ్ఛీలతతో ఉండాలన్నారు. ప్రజల్ని శీలవంతులుగా తీర్చిదిద్దటానికి అవసరమైన పథకాలను చేపట్టాలని సూచించారు. అప్పుడు రఘుమహారాజు రెండో సూచనకు ఆమోద ముద్ర వేశాడు. శీలవంతులైన ప్రజలు రాజ్యానికి దుర్భేద్యమైన కోట లాంటివారని, దేశం శాంతి సౌఖ్యాలతో విలసిల్లాలంటే ప్రజల్ని శీలవంతులుగా, సంస్కారవంతులుగా తీర్చిదిద్దటమే మార్గమని తీర్మానించుకున్నాడు. అందుకే అయోధ్యకాండలో కౌసల్య కుమారుడు కోదండరాముని ‘ధర్మస్తామభి రక్షతు.. ఏ ధర్మాన్ని నువ్వు నియమంతోనూ, ధైర్యంతోనూ పాటిస్తున్నావో.. ఆ ధర్మమే నిన్ను రక్షించుగాక’ అని ఆశీర్వదించింది. భగవంతుడు అవతరించినందుకే కాదు ధర్మానికి సమున్నత స్థానం ఇచ్చినందువల్ల రామయ్య వలెనే అయోధ్య కూడా అజరామరమైంది. ఆ అపురూప ప్రాంతానికి కోసల రాజ్యమని కూడా పేరు.

తులసీదాసు తరించిన స్థలం

అయోధ్య స్థల మాహాత్మ్యానికి సంత్‌ తులసీదాసు నిదర్శనం. రామ్‌బోలాగా ప్రసిద్ధుడైన ఆ రామభక్తుడు ఉత్తరప్రదేశ్‌లోని రాజ్‌పూర్‌ గ్రామంలో జన్మించాడు. బాలుడిగా భిక్షాటన చేసుకుంటూ వైష్ణవ సాధువు నరహరిదాసు దృష్టిలో పడ్డాడు. ఒకనాడు ‘నీ శిష్యునికి రామచరితం నేర్పించు’ అని నరహరి దాసుకు స్వప్నాదేశం లభించింది. ఆయన శిష్యుణ్ణి అయోధ్యకు తీసుకెళ్లి, ఉపనయనం జరిపించి రామమంత్రం ఉపదేశించాడు. ఆపైన గురుశిష్యులు సరయూ నదీ తీరంలో అయిదేళ్లు ఆధ్యాత్మిక శిక్షణలో గడిపారు. ఆ అనుభవం, అనుభూతి ఫలితంగా తారకరాముడి అనుగ్రహంతో తులసీదాసు ‘రామచరితమానస్‌’ కావ్యాన్ని రచించాడు. ఆ ఆనందపరవశంతో..

రామ్‌ తేరానామ్‌ స్వయంహీ కావ్యహై
కోయీ కవిబన్‌జాయే సహజ సంభావ్యహై

‘ఓ రామా! నీ నామమే ఒక కావ్యం.. ఆ నామం రుచి తెలిసినవాడు కవి కావటం సహజమే!’ అని కొనియాడాడు. అంతేకాదు ‘రఘుకులానికి ఆనందాన్ని చేకూర్చే శ్రీరఘునందనుని వదనం రాజ్యాభిషేక వార్త విని వెలిగిపోలేదు. వనవాస దుఃఖవార్తకు వాడిపోనూ లేదు. అటువంటి ముఖకమల శోభ నాకు ఎల్లప్పుడూ శుభాన్ని కలిగించు గాక!’ అంటూ తులసీదాసు- రాముడి ఘనతను కీర్తించాడు.

ఆధ్యాత్మిక దృక్పథంలో రామజన్మభూమి

తాత్త్వికులు అయోధ్యను, అయోధ్యకాండను ఆధ్యాత్మిక దృష్టితోనూ అభివర్ణించారు. రామాయణంలోని మిగతా అన్ని కాండల్లో ఎక్కడో ఒక దగ్గర యుద్ధ ప్రస్తావన ఉంటుంది. కానీ అయోధ్యకాండలో మాత్రం కనిపించక పోవడం ప్రత్యేకత. అయోధ్య అంటే ఘర్షణ లేని ప్రదేశం. ఇది సరయూనది తీరాన ఉంది. రామభక్తి అనే ఆ నదీ తీరాన నివసిస్తే మన జీవితాలు కూడా శత్రుబాధ లేకుండా సామరస్యంగా సాగిపోతాయి. శ్రీరామచంద్రుడు మన మదిలో నివసించాలంటే ముందుగా వైరుధ్య భావాల్ని తొలగించాలని అయోధ్య కాండ చెబుతోంది. అక్కడి ప్రజలందరూ ఆనందంగా ఉండేవారు. కారణం ఇతరుల సౌఖ్యం కోసం వారు తమ సుఖాలను త్యజించేవారు. తమ్ముడి కోసం రాముడు సామ్రాజ్యాన్ని వదిలి అడవికి వెళ్లాడు. లక్ష్మణుడు ఆయన వెంటే నడిచాడు. ఇక భరతుడు అయోధ్యలో ఉన్నా.. సోదరుడు లేడు కనుక.. అది అడవిలానే భావించాడు. ఆ సామ్రాజ్యం రాముడిదేనని ప్రకటించి.. సింహాసనం మీద కూర్చోనని తీర్మానించుకున్నాడు.

ప్రతిష్టాత్మక ఆలయంలో శ్రీరామ ప్రాణప్రతిష్ఠ

త్రేతాయుగం నాటి ఆలయ నిర్మాణకౌశలాన్ని తలపించేలా అయోధ్యలో రామమందిరం నిర్మితమైంది. అరవై ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఆలయ సముదాయాన్ని నిర్మించారు. మూడంతస్థులు, అయిదు మండపాలు కలిగిన ప్రధాన ఆలయం 2.77 ఎకరాలు. ప్రధాన గర్భాలయం అష్టభుజి ఆకారంలో నిర్మితం కావటం ప్రత్యేకం. గర్భాలయంలో ప్రతిష్ఠించే మూలమూర్తులను నేపాల్‌లోని గండకీ నదిలో లభించే సాలగ్రామ శిలలతో రూపొందించటం విశేషం. అక్షరాలతో వర్ణించనలవి కాని మరిన్ని మందిరాలు, నిర్మాణాలు కొలువైన అయోధ్యను దర్శించటం, ఆ స్ఫూర్తితో రామమార్గంలో ధర్మంగా జీవించటం మన కర్తవ్యం.

ప్రతి హృదయంలో పట్టాభిరాముడు

అయోధ్య రామమందిరంలో ఆ రామచంద్రుడి ప్రతిమ ప్రాణప్రతిష్ఠతోనే ఉత్సవానికి ముగింపు పలకకూడదు. మన హృదయాలన్నీ ఆ సీతానాథుడి మందిరాలుగా మారాలి. ఆయన గుణగుణాలే ఆ కోవెలకు వాడని పూమాలలుగా అలంకృతమవ్వాలి. జగదభిరాముడి అమృతవాక్కులే ఆ గుడిలో జేగంటలై మోగాలి. దాశరథి ఆదర్శమే ఆ దేవళానికి పైకప్పుగా మారాలి. నిరంతరం రామనామమే మన మనోమందిరంలో మహామంత్రమై ప్రతిధ్వనించాలి.

బి.సైదులు, రామకృష్ణ మఠం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని