ఆర్కిటెక్చర్‌ ప్రవేశానికి నాటా బాట!

‘ఔరా!’  అనిపించే ఆధునిక నిర్మాణాల వెనుక ఉన్నది ఆర్కిటెక్టుల సృజనాత్మకతే. ఈ వృత్తిలో ఆసక్తి ఉన్నవారు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (బీఆర్క్‌) కోర్సు పూర్తిచేసి, రాణించగలరు. ఇందులో ప్రవేశానికి నేషనల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు ఇన్‌ ఆర్కిటెక్చర్‌ (నాటా) ఏటా నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 465 సంస్థలు ఆర్కిటెక్చర్‌ కోర్సులు అందిస్తున్నాయి.

Updated : 13 Apr 2023 06:50 IST

‘ఔరా!’  అనిపించే ఆధునిక నిర్మాణాల వెనుక ఉన్నది ఆర్కిటెక్టుల సృజనాత్మకతే. ఈ వృత్తిలో ఆసక్తి ఉన్నవారు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (బీఆర్క్‌) కోర్సు పూర్తిచేసి, రాణించగలరు. ఇందులో ప్రవేశానికి నేషనల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు ఇన్‌ ఆర్కిటెక్చర్‌ (నాటా) ఏటా నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 465 సంస్థలు ఆర్కిటెక్చర్‌ కోర్సులు అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశాలకు నాటా స్కోరు దారి చూపుతుంది. ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఆ వివరాలు...

బీఆర్క్‌ కోర్సు వ్యవధి ఐదేళ్లు. ఇందులో ప్రవేశానికి నాటాను మూడు సార్లు నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్నవారు మూడు పరీక్షలూ రాసుకోవచ్చు. రెండుసార్లు పరీక్ష రాస్తే ఎక్కువ మార్కులు సాధించిన ప్రయత్నాన్ని తుది స్కోరుగా పరిగణనలోకి తీసుకుంటారు. మూడుసార్లు రాస్తే ఎక్కువ మార్కులు పొందిన రెండు పరీక్షల సగటును మలి స్కోరుగా నమోదు చేస్తారు. ఈ పరీక్షలో చూపిన ప్రతిభతో జవహరల్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా 465 సంస్థల్లో బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశానికి అర్హత పొందవచ్చు. బీఆర్క్‌ అనంతరం ఎంఆర్క్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో చేరవచ్చు. నిర్మాణరంగ సంస్థల్లోనే కాకుండా ప్రభుత్వ విభాగాలు, రైల్వే, రక్షణ శాఖ, ఎయిర్‌ పోర్టు అథారిటీ, హౌసింగు బోర్డులు, కార్పొరేషన్లు, కార్పొరేట్‌ సంస్థలు... మొదలైన చోట్ల అవకాశాలు లభిస్తాయి.


పరీక్ష విధానం

మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 125 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు. ఇందులో మల్టిపుల్‌ ఛాయిస్‌, మల్టిపుల్‌ సెలక్ట్‌.. ఇలా 5 రకాల ప్రశ్నలు వస్తాయి. వీటికి 1 లేదా 2 లేదా 3 మార్కులు ఉంటాయి. సిట్యువేషన్‌ జడ్జ్‌మెంట్‌, రీజనింగ్‌- డయాగ్రమాటిక్‌/ న్యూమరికల్‌/ వెర్బల్‌/ ఇండక్టివ్‌/ లాజికల్‌/ ఆబ్‌స్ట్రాక్ట్‌ ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. పరీక్షలో అర్హత సాధించడానికి 70 మార్కులు పొందాలి.    

విద్యార్హత: మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కులతోపాటు ఇంటర్మీడియ  ట్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు, ప్రస్తుతం పరీక్షలు రాసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా 50 శాతం మార్కులతో డిప్లొమా పూర్తిచేసినవారూ, ఆఖరు సంవత్సరం విద్యార్థులు అర్హులే.


సన్నద్ధత ఎలా?

డ్రాయింగ్‌ విభాగంలో ఎక్కువ మార్కులు సొంతం చేసుకోవడానికి సృజనాత్మకమైన ఆకారాలు (చిత్రాలు) గీయగలగడం, సునిశిత పరిశీలన, ఆలోచనా నైపుణ్యం ఉండాలి.

చిత్ర నైపుణ్యం, ఊహ, పరిశీలన అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. పరీక్షలో అడిగినదానికి సృజనాత్మకతతో ఆకట్టుకునే అర్థవంతమైన రూపాన్ని ఇవ్వాలి.

అందంగా గీయగలగడం ఎంత ముఖ్యమో నిర్ణీత ప్రమాణాల మేరకు ఆ రూపం ఉండేలా చూసుకోవడం అవసరం.

పాత ప్రశ్నపత్రాలను పరిశీలించి, ప్రశ్నల స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చు. పరీక్షకు ముందు వీలైనన్ని నమూనా టెస్టులు రాయాలి.

మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ ప్రశ్నలకు ఇంటర్‌ పాఠ్యపుస్తకాలు చదువుకుంటే సరిపోతుంది.

జనరల్‌ ఆప్టిట్యూడ్‌ విభాగం ప్రశ్నలకు ప్రపంచంలోని పలు కట్టడాలు, వాటిని నిర్మించిన విధానం తదితరాలను పరిశీలించాలి.

3డీ, 2డీ చిత్రాలు, అనలిటికల్‌ రీజనింగ్‌, మెంటల్‌ ఎబిలిటీ...తదితరాల్లో అవగాహన పెంచుకోవాలి.

రీజనింగ్‌ ప్రశ్నలు తర్క నైపుణ్యంపై ఆధారపడి ఉంటాయి.


ముఖ్యమైన తేదీలు

న్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: ఏప్రిల్‌ 13 (మొదటి విడత) మే 13 (రెండో విడత) జూన్‌ 24 (మూడో విడత)

ఫీజు: ఒకసారి పరీక్ష రాయడానికి జనరల్‌/ ఓబీసీ పురుషులకు రూ.2000. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1500. రెండుసార్లకు వీటికి రెట్టింపు చెల్లించాలి. మూడుసార్లు రాయాలంటే జనరల్‌/ఓబీసీ పురుషులకు రూ.5400. మిగిలిన అందరికీ రూ.4050.

పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 21 (మొదటిది) మే 28 (రెండోది) జులై 9 (మూడోది)

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.

వెబ్‌సైట్‌:  www.nata.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు