స్టేట్‌ బ్యాంకులో 2000 పీఓ కొలువులు

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ ఖీ ప్రమోషన్‌ డిపార్ట్‌మెంట్‌, కార్పొరేట్‌ సెంటర్‌... 2000 ప్రొబేషనరీ ఆఫీసర్‌ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు ప్రిలిమ్స్‌, మెయిన్‌, సైకోమెట్రిక్‌, గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌, ఇంటర్వ్యూల ద్వారా నియామకాలుంటాయి.

Updated : 11 Sep 2023 06:34 IST

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ ఖీ ప్రమోషన్‌ డిపార్ట్‌మెంట్‌, కార్పొరేట్‌ సెంటర్‌... 2000 ప్రొబేషనరీ ఆఫీసర్‌ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు ప్రిలిమ్స్‌, మెయిన్‌, సైకోమెట్రిక్‌, గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌, ఇంటర్వ్యూల ద్వారా నియామకాలుంటాయి. ఎంపికైన వాళ్లు దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాలి. అన్నీ కలిపి నెలకు సుమారు రూ.లక్ష జీతం ఉంటుంది.

స్‌బీఐ దాదాపు ప్రతీ సంవత్సరం ఇదే సంఖ్యలో పీఓ పోస్టులను భర్తీ చేస్తోంది. డిసెంబరు 31, 2023 కల్లా గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసుకునే అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అంటే ఆ తేదీలోగా పరీక్షలు పూర్తయి ఫలితాలు వెలువడాలి. కాబట్టి చివరి సంవత్సరం లేదా చివరి సెమిస్టర్‌లో ఉన్న అభ్యర్థులు అప్పటిలోగా పరీక్షలు రాసి వాటి ఫలితాలు వెలువడినట్లయితే వారికి ఇదో మంచి అవకాశం అవుతుంది.

మూడు దశల్లో...

మూడు దశల ఎంపిక ప్రక్రియ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొదటిదశలో ఆబ్జెక్టివ్‌ తరహాలో నిర్వహించే ఆన్‌లైన్‌ పరీక్ష, రెండో దశలో ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌ తరహాలో నిర్వహించే ఆన్‌లైన్‌ పరీక్ష, మూడో దశలో సైకోమెట్రిక్‌, గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌, ఇంటర్వ్యూలు ఉంటాయి.
అభ్యర్థులను రెండు, మూడు దశల్లో నిర్వహించే పరీక్షల్లోని మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. మొదటి దశలో నిర్వహించే ప్రిలిమినరీ పరీక్ష అర్హత పరీక్ష మాత్రమే. మూడోదశలోని సైకోమెట్రిక్‌ పరీక్ష అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని పరిశీలించే విధంగా ఉంటుంది. దీనికి ఎలాంటి మార్కులూ ఉండవు. ఈ దశలోని గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌, ఇంటర్వ్యూలకు మాత్రం మార్కులు  ఉంటాయి.

తుది ఎంపిక  

రెండో దశలోని మెయిన్స్‌ పరీక్షలో మొత్తం 250 మార్కులను నార్మలైజేషన్‌ పద్ధతిలో 75కు, మూడో దశలోని గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌, ఇంటర్వ్యూల్లోని 50 మార్కులను 25కు కుదిస్తారు. ఆ రెండు దశల మొత్తం మార్కుల్లో (100) అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.  

ముఖ్యమైన టాపిక్స్‌

వివిధ సబ్జెక్టుల్లో గత సంవత్సరం వచ్చిన ప్రశ్నలు, టాపిక్స్‌ను పరిశీలిస్తూ.. సిద్ధమవ్వాల్సిన ముఖ్యమైన టాపిక్స్‌ను చూద్దాం.
క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌/ డేటా ఇంటర్‌ప్రెటేషన్‌: ప్రిలిమ్స్‌ పరీక్షలో డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ నుంచి 15 ప్రశ్నలు, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్‌-5, నంబర్‌ సిరీస్‌-5, అరిథ్‌మెటిక్‌ ప్రశ్నలు-10 వరకు వచ్చాయి. మెయిన్స్‌ పరీక్షలో డీఐ-24, డేటా సఫిషియన్సీ-3, క్వాంటిటీ కంపారిజన్‌ (క్యూ1-క్యూ2)-5, నంబర్‌ సిరీస్‌-3 ప్రశ్నలు వచ్చాయి. ఈ టాపిక్స్‌ అన్నీ బాగా సిద్ధమవుతూ అరిథ్‌మెటిక్‌ టాపిక్స్‌ అన్నింటిపైనా బాగా పట్టు సాధించాలి.

రీజనింగ్‌: దీనిలో ప్రిలిమ్స్‌ పరీక్షలో సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌ అండ్‌ పజిల్స్‌ నుంచి 23 వరకు, సిలాజిజమ్‌-5, బ్లడ్‌ రిలేషన్స్‌-3, డైరెక్షన్స్‌-2, కోడింగ్‌-డీకోడింగ్‌-1, వర్డ్‌ ఫార్మింగ్‌ నుంచి 1 వచ్చాయి. మెయిన్స్‌లో సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌ అండ్‌ పజిల్స్‌-20, ఇన్‌పుట్‌-అవుట్‌పుట్‌-5, సిలాజిజమ్‌-2, కోడింగ్‌-డీకోడింగ్‌-2, కోడెడ్‌-ఇనీక్వాలిటీ-4, డేటా సఫిషియన్సీ-2, లాజికల్‌ రీజనింగ్‌-8 ప్రశ్నలు వచ్చాయి. కాబట్టి ఈ టాపిక్స్‌ అన్నీ బాగా ప్రిపేర్‌ అవ్వాలి.

ఇంగ్లిష్‌: ప్రిలిమ్స్‌లో రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ నుంచి 9 ప్రశ్నలు, పారా జంబుల్డ్‌-5, వర్డ్‌ రీ అరేంజ్‌మెంట్‌-5, ఫిల్లింగ్‌ ది బ్లాంక్స్‌-5, ఫైండింగ్‌ ది ఎర్రర్స్‌-3, వర్డ్‌ యూసేజ్‌-3 ప్రశ్నలు వచ్చాయి. మెయిన్స్‌లో కాంప్రహెన్షన్‌-13, ఎర్రర్స్‌-5, క్లోజ్‌ టెస్ట్‌-5, మ్యాచ్‌ ది కాలమ్‌-5, ఫిల్లర్స్‌-2, రీ అరేంజ్‌మెంట్‌ ఆఫ్‌ వర్డ్‌-5 ప్రశ్నలు వచ్చాయి. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌లోని ప్రశ్నల స్థాయిని గమనిస్తూ గ్రామర్‌పై అవగాహన పెంచుకుని దాని ఆధారంగా వచ్చే ఈ మోడల్‌ ప్రశ్నలకు సిద్ధం కావాలి. అదేవిధంగా మెయిన్స్‌లోని డిస్క్రిప్టివ్‌ పేపర్‌ కోసం ఎస్సే, లెటర్‌ రైటింగ్‌ బాగా సాధన చేయాలి.


నోటిఫికేషన్‌ వివరాలు

పోస్టుల సంఖ్య : 2000

విద్యార్హత (31.12.2023 నాటికి) :  ఏదైనా డిగ్రీ

వయసు (01.04.2023 నాటికి) : 21-30 సంవత్సరాలు (జనరల్‌   అభ్యర్థులు)

దరఖాస్తు ఫీజు : ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌లకు రూ.750

దరఖాస్తుకు చివరి తేదీ: 27.09.2023

ప్రిలిమ్స్‌ పరీక్ష : నవంబర్‌ 2023

మెయిన్స్‌ పరీక్ష : డిసెంబరు 2023/ జనవరి 2024

మూడో దశ : జనవరి/ఫిబ్రవరి 2024

తుది ఫలితాలు : ఫిబ్రవరి/మార్చి 2024

వెబ్‌సైట్‌ : www.sbi.co.in


జీతభత్యాలు: పీవోగా ఎంపికైన అభ్యర్థులకు రూ.41,960 మూల వేతనంతో ప్రారంభమై.. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, పీఎఫ్‌, లీవ్‌ రెంటల్‌ ఫెసిలిటీ, మెడికల్‌.. మొదలైన వాటితో దాదాపు లక్ష రూపాయల వరకూ గ్రాస్‌ శాలరీగా నెల వేతనం పొందే అవకాశం ఉంది. కోతలు పోనూ రూ.70 వేలకు పైగా నెట్‌ శాలరీ వచ్చే అవకాశం ఉంది.

విదేశాల్లో పనిచేసే అవకాశం: ఎస్‌బీఐకి విదేశాల్లోనూ శాఖలున్నాయి. ఎంపికైన అభ్యర్థులకు విదేశాల్లో కూడా పనిచేసి అవకాశం ఉంటుంది.


ఇలా సన్నద్ధం కండి

బ్యాంక్‌ పరీక్షలన్నింటిలో ఎస్‌బీఐ పీవో పరీక్ష హెచ్చు స్థాయిలో ఉంటుంది. సిలబస్‌, సబ్జెక్టుల్లో ఎలాంటి భేదం లేనప్పటికీ ప్రశ్నల స్థాయిలో మాత్రం తేడా ఉంటుంది.

గతంలో జరిగిన పరీక్షల ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ఏ తరహాలో ప్రశ్నలు వస్తున్నాయో అర్థమవుతుంది.

ఇంతకుముందు నుంచీ బ్యాంకు పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు ఎస్‌బీఐ పీఓలో అడిగే ప్రశ్నల స్థాయి, శైలిని గమనించి తదనుగుణంగా సన్నద్ధం కావాలి.

మొదటిసారి పరీక్ష రాసే అభ్యర్థులు మాత్రం ప్రాథమిక స్థాయి నుంచీ ప్రిపేర్‌ అవ్వాలి. ముఖ్యంగా అరిథ్‌మెటిక్‌, రీజనింగ్‌ సబ్జెక్టుల్లోని టాపిక్స్‌ అన్నింటి మీదా గట్టి పట్టు పెంచుకోవాలి. ఆయా టాపిక్స్‌లో ప్రాథమిక స్థాయి నుంచి హెచ్చు స్థాయి వరకూ ఉండే మోడల్‌ ప్రశ్నలు సాధన చేయాలి.

ప్రిలిమ్స్‌ పరీక్షకు దాదాపు రెండు నెలలు, మెయిన్స్‌కు దాదాపు మూడున్నర-నాలుగు నెలల సమయం ఉంటుంది. దానికి తగినవిధంగా సన్నద్ధమవ్వాలి.

మెయిన్స్‌లోని ప్రశ్నలను అర్థం చేసుకుని సాధించాలి.

ప్రిలిమ్స్‌ పరీక్షతో పోల్చితే మెయిన్స్‌ పరీక్షలోని ప్రశ్నలు సాధించడానికి ఎక్కువ సమయం ఉంటుంది. ఉదాహరణకు ప్రిలిమ్స్‌లో ఆప్టిట్యూడ్‌ విభాగానికి 35 ప్రశ్నలకు 20 నిమిషాల సమయం ఉంటే... మెయిన్స్‌లో అదే విభాగం (డేటా ఎనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్‌)లో 30 ప్రశ్నలు సాధించడానికి 45 నిమిషాల సమయం ఉంటుంది. దీన్ని బట్టి ప్రశ్నల స్థాయి ఎలా ఉందో తెలుస్తుంది.

ప్రతిరోజూ మాదిరి పరీక్ష: ఒకసారి సబ్జెక్టుల్లోని టాపిక్స్‌ అన్నీ నేర్చుకున్న తరువాత ఎస్‌బీఐ పీఓ ప్రిలిమ్స్‌ తరహాలోని మోడల్‌ పేపర్‌ను ఆన్‌లైన్‌ పద్ధతిలో రాయాలి. ఆపై దాన్ని విశ్లేషించుకోవాలి. తద్వారా అభ్యర్థులు తాము ఏ సబ్జెక్టు/ టాపిక్‌లలో ఇబ్బందిపడుతున్నారో.. దేన్ని సాధించడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నారో.. ఎక్కడ తికమక పడుతున్నారో తెలుసుకుంటారు. వాటిని అధిగమించేలా తమ ప్రిపరేషన్‌లో మార్పులు చేస్తూ కొనసాగించాలి. అవగాహన కోసం గత సంవత్సరం జరిగిన పరీక్షల కటాఫ్‌ మార్కులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. తాము రాసే పరీక్షలో సాధించే మార్కులను వాటితో బేరీజు వేసుకుంటూ ఉంటే తమ ప్రిపరేషన్‌ ఏ విధంగా ఉందో అంచనా వేసుకునే అవకాశం కలుగుతుంది.  

సాధన (ప్రాక్టీస్‌) నిరంతర ప్రక్రియగా ఉండాలి. అసలు పరీక్ష రాసేవరకూ దాన్ని కొనసాగిస్తూనే ఉండాలి.

సెక్షనల్‌ కటాఫ్‌ లేదు

ప్రిలిమినరీ, మెయిన్స్‌ ఆబ్జెక్టివ్‌ పరీక్షల్లో సెక్షనల్‌ కటాఫ్‌ మార్కులు లేవు. అంటే సెక్షన్లవారీగా కనీస మార్కులతో అభ్యర్థులు క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లేదు. అన్ని సెక్షన్లకూ కలిపి అభ్యర్థులకు వచ్చిన మొత్తం మార్కులను అనుసరించి
మెరిట్‌ ఆధారంగా తదుపరి దశకు ఎంపిక చేస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని