ఏఐ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌లో ఉపాధి అవకాశాలు

ఏఐ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఐఈఎస్‌ఎల్‌).. సంస్థకు చెందిన యాక్టివిటీ కేంద్రాల్లో 209 అసిస్టెంట్‌ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Updated : 04 Jan 2024 03:55 IST

 74 గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రైనీలు

ఏఐ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఐఈఎస్‌ఎల్‌).. సంస్థకు చెందిన యాక్టివిటీ కేంద్రాల్లో 209 అసిస్టెంట్‌ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థుల ఎంపిక రాతపరీక్ష/ స్కిల్‌ టెస్ట్‌, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా జరుగుతుంది.

బీఎస్సీ/ బీకాం/ బీఏ, కంప్యూటర్‌ కోర్సు పూర్తిచేయాలి. డేటాఎంట్రీ/ కంప్యూటర్‌ అప్లికేషన్‌లలో ఏడాది పని అనుభవం ఉండాలి. లేదా బీసీఏ/ బీఎస్సీ (సీఎస్‌) / ఐటీ డిగ్రీ/ కంప్యూటర్‌ సైన్స్‌ పాసై డేటా ఎంట్రీ/ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో ఏడాది పని అనుభవం ఉండాలి.
01.01.2024 నాటికి అభ్యర్థుల వయసు 35 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠ వయసులో ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌లకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది. జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.1000. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఏఐఈఎస్‌ఎల్‌ యాక్టివిటీ సెంటర్లు: దిల్లీ-87, ముంబయి-70, కోల్‌కతా-12, హైదరాబాద్‌-10, నాగ్‌పుర్‌-10, తిరువనంతపురం-20 ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులను వీటిల్లో ఎక్కడైనా నియమించవచ్చు.
అభ్యర్థులను ఫిక్స్‌డ్‌ టర్మ్‌ కాంట్రాక్ట్‌ కింద 5 ఏళ్ల కాలానికి ఉద్యోగంలోకి తీసుకుంటారు. అభ్యర్థి పనితీరు, సంస్థ అవసరాల నిమిత్తం ఉద్యోగాలను పర్మినెంట్‌ చేసే అవకాశమూ ఉంది.
దరఖాస్తుతోపాటు విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన సర్టిఫికెట్లు అన్నింటినీ ఈమెయిల్‌ ద్వారా పంపాలి. లేదా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న గూగుల్‌ ఫామ్‌ లింక్స్‌లో కూడా దరఖాస్తును నింపి పంపవచ్చు.
ఎంపిక: విద్యార్హతలు, అనుభవం ఆధారంగా అభ్యర్థులను రాత పరీక్షకు ఎంపిక చేస్తారు. వీరి వివరాల జాబితాను వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు. రాత పరీక్ష/ నైపుణ్య పరీక్ష నిర్వహించే తేదీలు, వేదిక, చిరునామా వివరాలనూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి నైపుణ్య పరీక్షను నిర్వహిస్తారు. ఎంఎస్‌-వర్డ్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-పవర్‌ పాయింట్‌లలో ఈ పరీక్ష ఉంటుంది. దీంట్లో నెగ్గితే సంస్థ వైద్యాధికారులు నిర్వహించే వైద్య పరీక్ష చేసి, అర్హులైనవారిని తుది ఎంపిక చేస్తారు. ఈ వైద్య పరీక్షలకు అయ్యే ఖర్చులన్నింటినీ అభ్యర్థులే భరించాలి.


గమనించాల్సినవి  

  • నిరుద్యోగులైన ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రాత పరీక్ష కేంద్రానికి రెండో తరగతి రైలు ఛార్జీలు/ బస్‌ ఛార్జీలను చెల్లిస్తారు.
  •  ఎంపికైన అభ్యర్థులను దేశవ్యాప్తంగా ఉన్న యాక్టివిటీ సెంటర్లలో ఎక్కడైనా నియమించవచ్చు.
  •  రాత, నైపుణ్య పరీక్షలకు సంబంధించిన తాజా సమాచారాన్ని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.
  • ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌లకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు, సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తుకు చివరి తేదీ: 15.01.2024
దరఖాస్తులు పంపాల్సిన ఈమెయిల్‌:  careers@aiesl.in

ఏఐఈఎస్‌ఎల్‌ 74 గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రైనీ- సపోర్ట్‌ సర్వీసెస్‌ పోస్టులనూ భర్తీ చేయబోతోంది. దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో పంపాలి. మొత్తం 74 ఖాళీల్లో.. దిల్లీ-24, ముంబయి-22, కోల్‌కతా-03, హైదరాబాద్‌-03, నాగ్‌పుర్‌-07, తిరువనంతపురం-15 ఉన్నాయి.
జనవరి 1, 2024 నాటికి ఏరోనాటికల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌/ టెలికమ్యూనికేషన్స్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ ఇండస్ట్రియల్‌/ ప్రొడక్షన్‌/ కెమికల్‌ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్‌ పాసవ్వాలి. అన్‌రిజర్వుడ్‌ అభ్యర్థులకు గేట్‌ పర్సంటైల్‌ 80 శాతం, ఆపైన ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ అభ్యర్థులకు 75 శాతం ఉంటే సరిపోతుంది. దరఖాస్తులను పరిశీలించాక అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.
01.01.2024 నాటికి అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠ వయసులో ఓబీసీలు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు 3 ఏళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.1500. ‘ఏఐ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌’ పేరు మీద న్యూదిల్లీలో చెల్లుబాటు అయ్యేవిధంగా డిమాండ్‌ డ్రాఫ్ట్‌ తీయాలి. ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ ఫీజు చెల్లించనవసరం లేదు. ప్రకటనలో అందుబాటులో ఉన్న దరఖాస్తు నమూనాను ప్రింట్‌ తీసుకుని పూర్తి వివరాలను రాసి పోస్ట్‌/ స్పీడ్‌పోస్ట్‌/ కొరియర్‌లో పంపాలి. కవరుపైన దరఖాస్తు చేస్తున్న ఉద్యోగం పేరును స్పష్టంగా రాయాలి.
ఎంపిక: సంబంధిత విద్యార్హతలున్న అభ్యర్థులను పర్సనల్‌ ఇంటర్వ్యూకు ఎంపికచేస్తారు. దీంట్లో రాణించిన వారికి వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. వీటిల్లోనూ పాసైతే అభ్యర్థుల తుది జాబితాను తయారుచేస్తారు.
స్టైపెండ్‌: ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది శిక్షణ సమయంలో నెలకు రూ.40,000 స్టైపెండ్‌ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకుంటే అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా ప్రమోషన్‌ ఇస్తారు. వీరికి నెలకు రూ.59,000-79,000 వేతనాన్ని నాలుగేళ్లపాటు చెల్లిస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఐదేళ్ల కాలానికి రూ.3 లక్షలకు బాండ్‌ రాయాలి. పనితీరు సంతృప్తికరంగా లేని అభ్యర్థుల శిక్షణ కాలాన్ని పెంచే అవకాశం ఉంటుంది.

  •  ఎంపికైన అభ్యర్థులను దేశంలోని ఏఐఈఎస్‌ఎల్‌ స్టేషన్లలో ఎక్కడైనా నియమిస్తారు.
  •  పర్సనల్‌ ఇంటర్వ్యూకు హాజరయ్యే నిరుద్యోగులైన ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రెండో తరగతి రైలు ప్రయాణ చార్జీలు/బస్సు చార్జీలను చెల్లిస్తారు.
  •  దరఖాస్తుతోపాటుగా విద్యార్హతలు, పుట్టినతేదీ, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల నకళ్లను జతపరచాలి.
  •  ఇంటర్వ్యూ సమయంలో ఒరిజినల్‌ డాక్యుమెంట్లను పరిశీలిస్తారు.

దరఖాస్తుకు చివరి తేదీ: 15.01.2024
చిరునామా: చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ ఆఫీసర్‌, ఏఐ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, పర్సనల్‌ డిపార్ట్‌మెంట్‌, సెకండ్‌ ఫ్లోర్‌, సీఆర్‌ఏ బిల్డింగ్‌, సఫ్దర్‌జంగ్‌ ఎయిర్‌పోర్ట్‌ కాంప్లెక్స్‌, అరబిందో మార్గ్‌, న్యూదిల్లీ-110 003.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని