ఇప్పుడు సాధ్యమేనా?

15 ఏళ్ల కిందట ఎలక్ట్రానిక్స్‌ (ఈసీఈ) డిగ్రీ చదివా. నా వయసు 38 సంవత్సరాలు. ఏ కోర్సులు చేస్తే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగావకాశాలుంటాయి? పోటీని తట్టుకుని ఉద్యోగం సాధించగలనా?

Updated : 21 Nov 2023 01:03 IST
15 ఏళ్ల కిందట ఎలక్ట్రానిక్స్‌ (ఈసీఈ) డిగ్రీ చదివా. నా వయసు 38 సంవత్సరాలు. ఏ కోర్సులు చేస్తే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగావకాశాలుంటాయి? పోటీని తట్టుకుని ఉద్యోగం సాధించగలనా?
మాలతి
సాధారణంగా ప్రైవేటు ఉద్యోగం చేయడానికి వయసుతో పనిలేదు కానీ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగానికి ఎక్కువ వయసు కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఇంజినీరింగ్‌ డిగ్రీ పూర్తి చేసిన ఈ 15 ఏళ్లలో అన్ని ఇంజినీరింగ్‌ కోర్సుల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. మీరు ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీరింగ్‌ చేసి, ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌ వైపు వెళ్దామనుకొంటున్నారు కాబట్టి, మరోసారి మీ ఇంజినీరింగ్‌ సబ్జెక్టుల్లో ప్రాథమిక అంశాలను పునశ్చరణ చేసుకోండి. సాఫ్ట్‌వేర్‌లో ఏ రంగంలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారో ముందుగా నిర్ణయించుకోండి. అందుకోసం కొన్ని ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లు నేర్చుకోవాలి. ఆ తరువాత ఏదైనా సాఫ్ట్‌వేర్‌ శిక్షణ సంస్థలో చేరి ప్రస్తుతం బాగా డిమాండ్‌ ఉన్న కోర్సులను నేర్చుకొనే ప్రయత్నం చేయండి. మొదటే ప్రముఖ సంస్థలో కాకుండా, ఏదైనా చిన్న సంస్థలో ఉద్యోగం చేసి కొంత అనుభవం గడించండి. టీసీఎస్‌, పలు సంస్థలు మీలాంటి వారికోసం సెకండ్‌ కెరియర్‌ అనే అవకాశాల్ని కల్పిస్తున్నాయి. కుటుంబ కారణాల వల్ల విరామం తీసుకున్న మహిళలకు 40 సంవత్సరాల పైవయసులోనూ వివిధ ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. కాకపోతే, ఉద్యోగానుభవం మాత్రం తప్పనిసరి. అదేవిధంగా అమెజాన్‌, డెలాయిట్‌, గోల్డ్‌ మ్యాన్‌ సాచ్‌ ఇండియా, ఐబీఎం ఇండియా, ఎస్‌ఏపీ ఇండియా లాంటి సంస్థలు కూడా వయసుతో సంబంధం లేకుండా ప్రతిభ, నైపుణ్యాల ఆధారంగా మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. వీటిలో కొన్ని సంస్థలు ముందుగా ఇంటర్న్‌షిప్‌ ఇచ్చి, ఆ తరువాత ఉద్యోగంలోకి తీసుకొంటున్నాయి. మీకు ఆసక్తి, అవకాశం ఉంటే, డేటా సైన్స్‌/ అనలిటిక్స్‌లో పీజీ చేసి కూడా సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేయొచ్చు.
ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని