సివిల్స్‌ పరీక్షకు సిద్ధం అయ్యేదెలా?

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో ఇచ్చే ప్రశ్నలకు సమాధానాలు నేరుగా దొరకవు. ప్రాథ]మిక అంశాలపై గట్టి పట్టు పెంచుకుంటేనే ఈ ప్రశ్నలకు సులువుగా, మెరుగ్గా సమాధానాలు రాయగలరు.

Published : 17 Apr 2024 00:17 IST

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో ఇచ్చే ప్రశ్నలకు సమాధానాలు నేరుగా దొరకవు. ప్రాథ]మిక అంశాలపై గట్టి పట్టు పెంచుకుంటేనే ఈ ప్రశ్నలకు సులువుగా, మెరుగ్గా సమాధానాలు రాయగలరు.

ఇంటర్‌ (హెచ్‌ఈసీ) పరీక్షలు రాశాను. సివిల్స్‌కు ఇప్పటినుంచే ఎలా సన్నద్ధం కావాలి? డిగ్రీలో ఆర్ట్స్‌, సైన్స్‌.. రెండూ చదివే అవకాశం ఉందా?

శ్రావిక

  • ఇంటర్మీడియట్‌లోనే సివిల్స్‌ గురించి ఆలోచించడం అభినందనీయం. సివిల్‌ సర్వెంట్‌ అవ్వాలంటే, యూపీఎస్సీ నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో మెరుగైన ప్రతిభ చూపాలి. సివిల్స్‌ లాంటి పరీక్షకు డిగ్రీ మొదటి సంవత్సరం నుంచే సన్నద్ధం అయితే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. ముందుగా యూపీఎస్సీ వెబ్‌సైట్‌ని సందర్శించి సివిల్‌ సర్వీసెస్‌కు సంబంధించిన సిలబస్‌, పాత ప్రశ్నపత్రాలను పరిశీలించండి, ఈ పరీక్షపై ఒక అవగాహన ఏర్పర్చుకోండి. సిలబస్‌ ఆధారంగా ప్రామాణిక పుస్తకాలను సమకూర్చుకోండి. క్రమం తప్పకుండా వార్తా పత్రికలను చదవండి. సంపాదకీయ పేజీలో వచ్చే వ్యాసాలను తప్పకుండా అనుసరించండి. ఇప్పటికే ఈ పరీక్షకు సన్నద్ధం అయ్యేవారి సలహాలూ, సూచనలను స్వీకరించండి.

దినపత్రికలు ప్రచురించే, సామాజిక మధ్యమాలు అందించే సివిల్స్‌ విజేతల ఇంటర్వ్యూలను చూస్తూ ప్రేరణ పొందండి. కమ్యూనికేషన్‌ నైపుణ్యాలను, విషయ విశ్లేషణ సామర్ధ్యాలను పెంపొందించుకోవటం అవసరం. సీశాట్‌ కోసం ఇప్పటినుంచే సన్నద్ధం కండి. మెయిన్స్‌ పరీక్షకు రాయబోయే ఆప్షనల్‌ సబ్జెక్టును ముందే ఎంచుకోవటం మంచిది. రోజుకి ఎన్ని గంటలు చదవాలనుకొంటున్నారో, అందుకు అనుగుణంగా షెడ్యూల్‌ను సిద్ధం చేసుకోండి. చదివిన విషయాల్ని వీలున్నప్పుడల్లా పునశ్చరణ చేస్తూ ఉండాలి. వీలున్నన్ని మాక్‌ టెస్ట్‌లు రాయటమూ మేలు చేస్తుంది.

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో ఇచ్చే ప్రశ్నలకు సమాధానాలు నేరుగా దొరకవు. ప్రాథ]మిక అంశాలపై గట్టి పట్టు పెంచుకుంటేనే ఈ ప్రశ్నలకు సులువుగా, మెరుగ్గా సమాధానాలు రాయగలరు. ముఖ్యంగా మెయిన్స్‌ పరీక్షలో రాయవలసిన దీర్ఘ వ్యాసాలపై అవగాహన పెంచుకొని, అవి రాయడానికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోండి. ఈ విషయాలన్నింటినీ పాటిస్తూ సివిల్‌ సర్వీసెస్‌కు తయారుకండి. జాతీయ విద్యావిధానం- 2020 అమలు చేస్తున్న యూనివర్సిటీ/ కళాశాలల్లో ఆర్ట్స్‌, సైన్స్‌ కలిపి చదివే అవకాశం ఉంది. తెలంగాణలో ఇటీవల ప్రారంభించిన బకెట్‌ సిస్టం ద్వారా డిగ్రీలో ఆర్ట్స్‌, సైన్స్‌ కలిపి చదివే అవకాశం ఉంది.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని