కామర్సా.. ఆర్ట్సా?

కామర్స్‌, ఆర్ట్స్‌లో ఏది మెరుగు అంటే, చెప్పడం చాలా కష్టం. ఏ కోర్సుకు అదే మెరుగు. ప్రతి డిగ్రీకీ మెరుగైన ఉన్నత విద్యా, ఉద్యోగావకాశాలు ఉంటాయి.

Published : 18 Apr 2024 00:29 IST

మా అమ్మాయి ఇంటర్‌ (సీఈసీ) రెండోమసంవత్సరం పరీక్షలు రాసింది. డిగ్రీలో కామర్స్‌ కాకుండా.. ఆర్ట్స్‌ చదువుతానంటోంది. ఏది మెరుగు?

ఎస్‌.నర్సింగ్‌

  • కామర్స్‌, ఆర్ట్స్‌లో ఏది మెరుగు అంటే, చెప్పడం చాలా కష్టం. ఏ కోర్సుకు అదే మెరుగు. ప్రతి డిగ్రీకీ మెరుగైన ఉన్నత విద్యా, ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఉపాధి అవకాశాలు కోర్సును బట్టి కాకుండా, ఆ డిగ్రీ చదివే వ్యక్తిపై, ఆ డిగ్రీ అందిస్తున్న విద్యాసంస్థపై కూడా ఆధారపడి ఉంటాయి. మీ అమ్మాయిని ఇంటర్‌లో కామర్స్‌లో చేర్చినప్పుడు ఏ ఉద్దేశంతో చేర్చారు? అది ఆమె నిర్ణయమా? మీ నిర్ణయమా? మీ అమ్మాయి ఇంటర్‌లో కామర్స్‌ని ఎలా చదివింది? ఇప్పుడు ఆర్ట్స్‌లోకి వెళ్ళడానికి కారణం ఏంటి? కామర్స్‌ మీద ఆసక్తి లేకా? ఆర్ట్స్‌పై ఆసక్తి ఉండా? మెరుగైన ఉపాధి అవకాశాల కోసమా? ఈ విషయాలపై స్పష్టత ఉంటే కానీ, మీ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. మీ అమ్మాయి స్వల్పకాలిక/ దీర్ఘకాలిక ఆశయాలు, ఆసక్తి, అభిరుచి, పట్టుదల, కష్టపడే తత్వం, నైపుణ్యాలు, విషయ పరిజ్ఞానం, కుటుంబ ఆర్థిక స్తోమత, కుటుంబ సహకారం లాంటి చాలా అంశాలు కెరియర్‌ నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. బీకాం చదివినా, బీఏ చదివినా, డిగ్రీతో ఉన్న అన్ని కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వరంగ ఉద్యోగాలకూ సమాన అర్హత ఉంటుంది. అకౌంట్స్‌ ఆఫీసర్‌ లాంటి కొన్ని ఉద్యోగాలకు మాత్రం కామర్స్‌ చదివినవారు మాత్రమే అర్హులవుతారు. బీఏ, బీకాం డిగ్రీలతో బీఈడీ, పీజీలు చేయవచ్చు. ప్రైవేటు రంగంలో ఆర్ట్స్‌ చదివినవారి కంటే కామర్స్‌ చదివినవారికి కొన్ని ఉద్యోగావకాశాలు అదనంగా ఉంటున్నాయి.

 ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని