అమెరికా విద్యకు ఆర్థిక ఆసరా!  

అమెరికాలో ఉన్నతవిద్య అనగానే.. ‘అమ్మో! చాలా ఖర్చుతో కూడుకున్న పని’ అని అందరూ భావిస్తారు. కానీ విద్యావిషయకంగా సుసంపన్నమైన ఆ దేశంలో అతి సామాన్యమైన ఖర్చుతోనే ఉన్నత విద్యను పూర్తి చేయొచ్చు!

Published : 12 Oct 2018 20:21 IST

విదేశీ విద్య 

అమెరికా విద్యకు ఆర్థిక ఆసరా!  

అమెరికాలో ఉన్నతవిద్య అనగానే.. ‘అమ్మో! చాలా ఖర్చుతో కూడుకున్న పని’ అని అందరూ భావిస్తారు. కానీ విద్యావిషయకంగా సుసంపన్నమైన ఆ దేశంలో అతి సామాన్యమైన ఖర్చుతోనే ఉన్నత విద్యను పూర్తి చేయొచ్చు!  అమెరికాలోని వివిధ వర్సిటీల్లో దాదాపుగా 200 రకాల ఫెలోషిప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఫెలోషిప్‌ అనగానే ఉచితంగా డబ్బులు అందుతాయనుకోకూడదు. అక్కడ ఉచిత విద్య అందుబాటులో ఉండదు. కానీ ప్రతిభ చూపితే.. ఏ కోర్సునైనా తక్కువ ఖర్చుతోనే పూర్తి చేయగల అవకాశముంది. అమెరికాలోని ప్రతి విశ్వవిద్యాలయం తానందించే కోర్సులతోపాటు అందుబాటులో ఉన్న ఫెలోషిప్‌లు, గ్రాంట్ల గురించి ఒక హ్యాండ్‌బుక్‌ అందిస్తుంది. దాని ద్వారా ఏయే యూనివర్సిటీలు ఏ సాయమందిస్తున్నాయో తెలుసుకోవచ్చు!తెలుగు విద్యార్థులు ఫెలోషిప్స్‌ పొందడంలో వెనకబడుతున్నారా అంటే.. అవుననే సమాధానం వస్తుంది. వీరు ఎక్కువగా కాలిఫోర్నియా, న్యూయార్క్‌, టెక్సాస్‌, ఫ్లోరిడాల్లో మాత్రమే చదువుతున్నారు. అది కూడా అక్కడున్న 4,800 యూనివర్సిటీల్లో  160 యూనివర్సిటీలనే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. దీంతో ఫెలోషిప్స్‌ పొందే విషయంలో విపరీతమైన పోటీ ఉంటోంది. ఫలితంగా మన విద్యార్థుల్లో చాలామంది ఫెలోషిప్స్‌ను పొందలేక పోతున్నారు. 
గత ఏడాది  తెలుగు రాష్ట్రాల నుంచి 45,000 మంది విద్యార్థులు అమెరికాలోని వివిధ విద్యాసంస్థల్లో చేరారు. వీరంతా కేవలం 160 యూనివర్సిటీల్లోనే చేరినట్టు అమెరికన్‌ ఇమిగ్రేషన్‌ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అంటే, 160 విద్యాసంస్థల్లోని మన పిల్లల మధ్యే పోటీ నెలకొనడంతో అతి తక్కువ మందికే ఫెలోషిప్స్‌ అందుతున్నాయి. వాస్తవానికి అమెరికాలోని సుమారు 4800 యూనివర్సిటీల్లో వెయ్యి విశ్వవిద్యాలయాల్లోనైనా చేరితే అవి అందించే 200 రకాల ఫెలోషిప్స్‌లో సగానికిపైగా మన తెలుగు విద్యార్థులకు అందే అవకాశం ఉంటుంది. 
అమెరికాలోని ఉన్నతస్థాయి విద్యాసంస్థల్లో ఒక ట్యూషన్‌ ఫీజు నిమిత్తమే దాదాపుగా నలభై వేల డాలర్ల వరకు వెచ్చించాల్సి వస్తుంది. అయితే ప్రతిభావంతులైన విద్యార్థులు స్కాలర్‌షిప్‌లు, అసిస్టెంట్‌షిప్‌ల రూపంలో చెల్లించిన ఫీజు నుంచి చాలావరకూ రాయితీగా తిరిగి పొందవచ్చు. చదువుకునే సమయంలోనే తమ నైపుణ్యాలను చాటుకుంటే వారికి ఉద్యోగావకాశాల రూపంలోనూ అమెరికా విద్యాసంస్థలు పెద్దమొత్తంలో ప్రతిఫలాలను అందిస్తున్నాయి. అందుకే, వీటిని సద్వినియోగం చేసుకోగలగాలి. 
అమెరికా విద్యకు ఆర్థిక ఆసరా!  అతి సంపన్న దేశమైన అమెరికాలో జీవన వ్యయమూ ఎక్కువే. చదువు, ఇతర శిక్షణలకు ఫీజులు భారీగానే ఉంటాయి. అంతమాత్రాన చదువుకోవడానికి, బతకడానికి అవసరమైన డబ్బుల కోసం ఏదో ఒక పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేయాలనే ఆలోచనను ఏ క్షణంలోనూ మనసులోకి రానివ్వకూడదు (వర్సిటీలు అనుమతించిన లీగల్‌ జాబ్స్‌ మాత్రమే చేయాలి). ఉదాహరణకు- ఇంజినీరింగ్‌ కోర్సులు చేసే విదేశీ విద్యార్థులకు ఆయా విద్యాసంస్థల నుంచి ఆర్థికసాయం లభిస్తుంది. ఏబీఈటీ సమాచారం ప్రకారం.. అమెరికాలోని 350కి పైగా కళాశాలలు, వర్సిటీలు వివిధ ఇంజినీరింగ్‌ విభాగాల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ కోర్సులను అందిస్తున్నాయి. 
ప్రతి కాలేజీ/ యూనివర్సిటీలో చేరేముందు ఆ విద్యాసంస్థ ఏదైనా ఆర్థిక సాయం (ఫైనాన్షియల్‌ ఎయిడ్‌) అందిస్తోందో లేదో తెలుసుకోవాలి. ఆ విద్యాసంస్థ వెబ్‌సైట్‌, హ్యాండ్‌బుక్స్‌లో ఈ సమాచారం లభిస్తుంది. అమెరికాలో విద్యాభ్యాసం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న తెలుగు విద్యార్థులు యూఎస్‌లోని ఈ ఆర్థికసాయ వనరులను అందుకోవాలంటే వాటి గురించి మొదటే తెలుసుకుని ఉండాలి. వాటికి ఏమేం అవసరమో, అర్హతలేం ఉండాలో ముందో తెలుసుకోవడం వల్ల తగిన ఫెలోషిప్స్‌ పొందే వీలవుతుంది.

కష్టమేమీ కాదు

అమెరికా విద్యకు ఆర్థిక ఆసరా!  

 

అమెరికాలోని 4,800 విశ్వవిద్యాలయాల్లో 4,000 యూనివర్సిటీలు ఏవిధంగా చూసినా గుర్తింపు, ప్రామాణికత ఉన్నవే. యూఎస్‌లోని దాదాపు ప్రతి యూనివర్సిటీలో టీచింగ్‌ అసిస్టెంట్స్‌, రిసెర్చ్‌ అసిస్టెంట్స్‌ వంటి ఫెలోషిప్స్‌ అందుబాటులో ఉన్నాయి. వీటిని పొందడం పెద్ద కష్టమేమీ కాదు. ఫెలోషిప్‌ లేదా స్టైపెండ్‌ అనేది అమెరికా వర్సిటీల్లో లీగల్‌ జాబ్‌ చేయడం ద్వారా మాత్రమే దొరుకుతుంది. ఈ ఫెలోషిప్‌ పొందాలంటే ముందుగా వర్సిటీని సంప్రదించాలి. 
సహజంగా ఫెలోషిప్స్‌ అనగానే ప్రతిభ ఆధారంగా మాత్రమే అందుతాయని మన విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయం. ఇది అపోహ మాత్రమే. అమెరికాలోని కొన్ని విభాగాల్లో అందే ఫెలోషిప్స్‌ మాత్రమే ప్రతిభ ఆధారంగా లభిస్తాయి. ఉదాహరణకు- రిసెర్చ్‌ అసోసియేట్స్‌, పీహెచ్‌డీ విభాగాల్లో ఉండే ఫెలోషిప్స్‌ మాత్రమే ప్రతిభ ఆధారంగా ఉంటాయి. విద్యార్థి పీహెచ్‌డీలో అడ్మిషన్‌ పొందితే సుమారుగా 2000 డాలర్ల వరకూ ఫెలోషిప్‌ అందుకునే అవకాశాలు ఉంటాయి. మిగిలిన అన్ని విభాగాల్లోని ఫెలోషిప్స్‌ ప్రతి ఒక్క విద్యార్థికీ అందుబాటులో ఉంటాయి.

అకడమిక్‌ రికార్డు బాగుండాలి  

అకడమిక్‌ రికార్డు బాగా ఉన్నవారికి ఆర్థికసాయం అందించే విషయంలో మొదటి ప్రాధాన్యమిస్తారు. కాబట్టి, భారత్‌లో చదువుకున్నప్పటినుంచే తమ అకడమిక్‌ రికార్డు అత్యుత్తమంగా ఉండేలా చూసుకోవాలి. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌నూ మెరుగుపరచుకోవాలి. ఈ విషయాలను ఎవరూ చెప్పరు. నిబంధనలను వర్సిటీ హ్యాండ్‌బుక్స్‌ను క్షుణ్ణంగా చదవడం ద్వారా, వెబ్‌సైట్లను చూడటం ద్వారా తెలుసుకోవాలి. 
అమెరికా వర్సిటీల్లో అసిస్టెంట్‌షిప్‌ చేస్తే నెలకు సుమారు 1200 డాలర్లవరకూ సంపాదించవచ్చు. అంతకంటే ఎక్కువ ఇచ్చే వర్సిటీలు కూడా ఉన్నాయి. పరిశోధన ప్రాతిపదికన ఉండే శాస్త్ర విజ్ఞాన రంగ అధ్యయనాలకు కూడా మన ప్రతిభ ఆదారంగా విశేష రీతిలో ఆర్థికసాయం అందుకోవచ్చు. ఇలా సాయం పొందుతూ యూఎస్‌లో చదువుల ఖర్చు భారాన్ని తగ్గించుకోవచ్చు.

లీగల్‌ జాబ్స్‌ ఏవి?  

ఆయా యూనివర్సిటీల్లో అందుబాటులో ఉండే ఈ ఫెలోషిప్స్‌ను ఒకవిధంగా లీగల్‌ జాబ్స్‌గా పేర్కొంటారు. ఉదాహరణకు- ఇటీవల యోగా పట్ల అన్ని యూనివర్సిటీలూ మక్కువ చూపుతున్నాయి. దీంతో చాలా వర్సిటీలు పార్ట్‌టైం యోగా ఇన్‌స్ట్రక్టర్లకు అసిస్టెంట్లుగా పనిచేసే అవకాశాన్ని విద్యార్థులకు కల్పిస్తున్నాయి. మన భారతీయులకు సహజంగానే యోగాలో అభినివేశం, ప్రావీణ్యం ఎక్కువ. ఈ యోగా ఇన్‌స్ట్రక్టర్లకు అసిస్టెంట్లుగా వర్సిటీలో లభించే ఉద్యోగాలకు ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉండదు. 
వర్సిటీల్లో అందుబాటులో ఉండే మరో జాబ్‌- టీచింగ్‌ అసిస్టెంట్లు. అంటే.. వర్సిటీ ప్రొఫెసర్లకు అసిస్టెంట్‌గా ఉంటూ బ్యాచిలర్‌ డిగ్రీ చదువుతున్న విద్యార్థుల ప్రశ్నపత్రాలను దిద్దడం, వారికి క్లాసులను నిర్వహించడం వంటి విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. 
ఇంకా యూనివర్సిటీల్లో గల జిమ్‌లు, రిసెర్చ్‌ విభాగం, కెఫెటేరియా, పోలీసింగ్‌, లైబ్రరీల్లోనూ సహాయకులుగా పనిచేయడానికి ఎన్నో అవకాశాలున్నాయి. అయితే ఇవి ప్రతి విశ్వవిద్యాలయంలోనూ ఆ వర్సిటీల విద్యా విభాగాల్లోనూ పదుల సంఖ్యలోనే ఉంటాయి. ఈ లెక్కన ఇటువంటి ఉద్యోగాలు వర్సిటీల మొత్తంలో 200-300 వరకు ఉంటాయి. 
యూనివర్సిటీ పరిధిలో లభించే ఈ తరహా ఉద్యోగాలనే లీగల్‌ జాబ్స్‌ అంటారు. వీటిని వారంలో 20 గంటలపాటు చేసుకునే వీలుంటుంది. అంటే నెలకు 80 గంటలు లీగల్‌గా ఉద్యోగం చేసుకోవచ్చు.

వీసా తిరస్కరించే అవకాశాలు తక్కువ

  ఆయా యూనివర్సిటీల పరిధిలో న్యాయపరంగా పనిచేసుకోవడానికి వీలు కల్పించే లీగల్‌ జాబ్స్‌ అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసానికి ఆర్థికంగా కొంతైనా ఉపకరిస్తాయి. అయితే ఇటువంటి ఉద్యోగాలు చేస్తూ అమెరికాలో చదువుకోవడం సాధ్యమేనా అనే అనుమానం విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో ఉంటుంది. ఈ లీగల్‌ జాబ్స్‌ను చేయడం ద్వారా మాత్రమే అమెరికాలో చదువుకుంటూనే విజ్ఞానాన్నీ, వారు కోరుకున్న డిగ్రీనీ  సాధించడానికి అవకాశముంది. యూనివర్సిటీ పరిధిలో కాకుండా బయటచేసే ఇల్లీగల్‌ ఉద్యోగాల వల్ల ఆందోళన తప్పదు. 
ఈ లీగల్‌ ఉద్యోగాల కోసం వివిధ విశ్వవిద్యాలయాలను ఎంపిక చేసుకుని వాటి వెబ్‌సైట్లను నిశితంగా పరిశీలించాలి. ప్రతి వెబ్‌సైట్‌లో ఈ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం ఉంటుంది. విద్యార్థి వారు చేరబోయే డిపార్ట్‌మెంట్‌లోనే కాకుండా ఇతర వాటిల్లోనూ చేరే అవకాశం ఉంటుంది. ఫెలోషిప్‌ లభించడానికి వీలు కల్పించే ఈ ఉద్యోగాల్లో వర్సిటీలో చేరిన తరువాత అయినా చేరొచ్చు. చేరడానికి ముందు కూడా అవకాశముంటుంది. కాకపోతే ముందుగానే యూనిర్సిటీలో ఫెలోషిప్‌/ ఉద్యోగం పొందడం వల్ల కలిగే ప్రయోజనాల్లో ముఖ్యమైంది- వీసా రిజెక్ట్‌ కాకుండా ఉండటం. విద్యార్థుల చేతిలో వర్సిటీ అధికారిక ఉద్యోగం ఉన్నట్లయితే వీసా తిరస్కరించే అవకాశాలూ తక్కువగా ఉంటాయి.

పరీక్షల్లేకుండానే ప్రవేశాలా? 
ప్రామాణిక యూనివ‌ర్సిటీలు 4000 
ర‌క‌ర‌కాల ఫెలోషిప్‌లు దాదాపు 200

అమెరికా విద్యకు ఆర్థిక ఆసరా!  

నేపథ్యం ఏ సబ్జెక్టుదైనా ఇష్టమైన కోర్సుల్లో చేరి చదివే అవకాశం కల్పిస్తుంది అమెరికా. మనదేశంలో కంప్యూటర్స్‌ చేసినవారు ఆ దేశంలో సైన్స్‌ డిగ్రీ కోర్సుల్లో చేరవచ్చు. ఈ వెసులుబాటు అక్కడి ప్రత్యేకత. అయితే విద్యాభ్యాసానికి అమెరికా వెళ్లే   విషయంలో విద్యార్థిలోకంలో సందేహాలు ఎన్నో. ఎలా వెళ్లాలి, వెళ్లడానికి ముందు ఏమేం చేయాలి? ఏం చేయకూడదు? ఇలాంటి ప్రశ్నలు చుట్టుముడుతుంటాయి. మరి వాటిని నివృత్తి చేసుకుందామా?* జీఆర్‌ఈ, టోఫెల్‌ రాయకుండా అమెరికా విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్‌ పొందవచ్చా? 
అమెరికాలో ఏదైనా యూనివర్సిటీలో ప్రవేశం పొందాలంటే ప్రామాణిక పరీక్షలుగా భావించే జీఆర్‌ఈ, టోఫెల్‌ రాయడం తప్పనిసరి. ఒకవేళ ఈ పరీక్షలతో నిమిత్తం లేకుండా ఏదైనా వర్సిటీ ప్రవేశం కల్పిస్తోందంటే ఆ వర్సిటీకి కానీ, అది అందించే కోర్సులకు గానీ ప్రామాణికత, విశ్వసనీయత లేవని చెప్పవచ్చు. 
ఆ మధ్య సిలికాన్‌ యూనివర్సిటీ, నార్త్‌ వెస్టర్న్‌ పాలిటెక్నిక్‌ విద్యాసంస్థల్లో చదవడానికి చాలామంది తెలుగు విద్యార్థులు వెళ్లి వెనక్కి తిరిగి వచ్చేసిన సంగతి తెలిసిందే. ప్రామాణిక పరీక్షలతో నిమిత్తం లేకుండానే ఈ రెండు విద్యాసంస్థలూ అడ్మిషన్లు కల్పించాయి. ఇవే కాదు, ఇలాంటి యూనివర్సిటీలు అమెరికాలో ఎన్నో ఉన్నాయి. 
కానీ అమెరికన్‌ ఇమిగ్రేషన్‌ అధికారులు... అమెరికాలో చదవదల్చిన విద్యార్థులు టోఫెల్‌, జీఆర్‌ఈ లాంటి పరీక్షల్లో మంచి స్కోరు సాధించడం అవసరంగా భావిస్తారు. అంతే కాదు, ఈ పరీక్షల్లో మెరుగైన స్కోరు సాధించిన విద్యార్థులకు అమెరికా విద్యాసంస్థలు ఎదురుడబ్బులిస్తూ నేరుగా పీహెచ్‌డీని చేయగల అవకాశాన్నీ కల్పిస్తున్నాయి. 
అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్న నాటి నుంచీ ఈ పరీక్షలకు సంబంధించిన వెబ్‌ సైట్లు, ఆన్‌లైన్‌ వనరులను చూస్తుండాలి. సన్నద్ధతను ఏడాది ముందుగానే ఆరంభించాలి. 
* ఓపీటీ నిబంధనలు మారతాయా? 
ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రెయినింగ్‌నే సంక్షిప్తంగా ఓపీటీ అంటారు. దీనిలో 36 నెలల పాటు యూఎస్‌సీఐఎస్‌ అనుమతితో, కొన్ని పరిమితులతో పార్ట్‌టైమ్‌ వర్కు చేసి విద్యార్థులు డబ్బు సంపాదించుకోవచ్చు. అయితే నిబంధనలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి అధికారులను సంప్రదించాకే నిర్ణయం తీసుకోవాలి. 
గ్రాడ్యుయేషన్‌కు 90 రోజుల ముందే ఓపీటీ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి. భారీ సంఖ్యలో ఉండే దరఖాస్తుల కారణంగా ఓపీటీ కార్డు ఇవ్వడానికి చాలా సమయం పడుతుంది. ఓపీటీ ముగిసి హెచ్‌1బీ మొదలయ్యాక స్టూడెంట్‌ స్టేటస్‌ అమల్లో ఉండాలంటే కొత్త ఐ 20 పొందడం అవసరం. 
స్టూడెంట్‌ స్టేటస్‌కు సంబంధించి తగిన పత్రాలనూ, సమాచారాన్నీ అంటే చిరునామా మార్పు, ఓపీటీ, ఐ 20, ఓపీటీ- ఎక్స్‌టెన్షన్‌ ఐ 20, హెచ్‌1బీ దరఖాస్తు వంటివాటిని జాగ్రత్తగా నిర్వహించుకోవాలి. ఈ-వెరిఫైడ్‌ ఎంప్లాయర్‌ కోసం పనిచేయడం చాలా కీలకం. ఈ సమాచారమంతా యూనివర్సిటీ వారి వద్ద అప్‌ టు డేట్‌గా ఉండాలి. 
* సీపీటీ అంటే? దాని ఉపయోగం? 
ఇది కరిక్యులర్‌ ప్రాక్టికల్‌ ట్రెయినింగ్‌. ఈ సీపీటీ చదువుకు సంబంధించిన పనేనని అధికారులు ధ్రువీకరించాల్సివుంటుంది. ఈ మేరకు స్టూడెంట్‌ అండ్‌ ఎక్స్జ్చేంజి విజటర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (సెవిస్‌)లో నమోదు చేయించాలి. విద్యార్థి అమెరికాలో తన వీసా స్టేటస్‌ను నిలుపుకోవడానికి ఉపకరించే విధానమే సెవిస్‌. ఇందులో మీ వివరాలు ఎప్పటికప్పుడు తాజాగా ఉండాలి. 
సీపీటీ కోసం దరఖాస్తు చేసుకుంటే చదువుకుంటున్న కాలంలోనే విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌ చేయవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని