TS Exams 2022: సంఘాలు... శ్రేణులుగా వృత్తులు!

ఒక ప్రాంత సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను అధ్యయనం చేయాలంటే ముందుగా అక్కడి రాజకీయ చరిత్రపై స్థూలంగా అవగాహన పెంచుకోవాలి. తెలంగాణ చరిత్ర క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దం నుంచే మొదలై శాతవాహనుల కాలంలో

Updated : 12 Apr 2022 00:39 IST

తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

ఒక ప్రాంత సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను అధ్యయనం చేయాలంటే ముందుగా అక్కడి రాజకీయ చరిత్రపై స్థూలంగా అవగాహన పెంచుకోవాలి. తెలంగాణ చరిత్ర క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దం నుంచే మొదలై శాతవాహనుల కాలంలో స్థిరమైన దశకు చేరుకుంది. షోడశ మహా జనపదాల్లోని అస్సక లేదా అస్మక రాజ్యం నేటి నిజామాబాద్‌లోనిదే. ప్రాచీనకాలంలో తెలంగాణను శాతవాహనులు మొదట పాలించారు. ఆ దశలోనే ఈ ప్రాంతంలో సాంస్కృతిక ఏకత్వం ఏర్పడింది. నాటి ప్రజా జీవనంలో వ్యవసాయం, వ్యాపారం, మతం ప్రముఖ పాత్రను పోషించాయి. వృత్తులు సంఘాలుగా మారి శ్రేణులుగా అవతరించాయి. సామాజిక జీవనాన్ని ప్రభావితం చేశాయి. 

శాతవాహనులు

శాతవాహనులు తెలుగు ప్రాంతాలను దాదాపు 450 ఏళ్లు పరిపాలించారు. వీరి కాలంలో తెలంగాణ అన్ని రంగాల్లో గణనీయమైన   అభివృద్ధి సాధించింది. 

శాతవాహన రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు. ఈయన కోటిలింగాలను రాజధానిగా చేసుకొని పాలించారు. తర్వాత ఈయన కుమారుడైన మొదటి శాతకర్ణి సింహాసనాన్ని అధిష్టించాడు. మొదటి శాతకర్ణి   వివరాలను ఆయన భార్య దేవినాగానిక వేయించిన నానాఘాట్‌ శాసనం  తెలుపుతుంది. చుళ్ల కళింగ జాతకంలో   కళింగాధీశుడిపై (కళింగ పాలకుడు ఖారవేలుడు) అశ్మకాధిపతి (మొదటి శాతకర్ణి) విజయం సాధించినట్లు పేర్కొన్నారు. ఫలితంగా ఈయన రాజ్యం తూర్పు దిశకు    విస్తరించింది.

 హాలుడు 

శాతవాహనుల్లో 17వ రాజు హాలుడు. ఈయన గొప్ప కవి. కవివత్సలుడు అనే బిరుదును పొందాడు. హాలుడు గాథాసప్తశతి అనే గ్రంథాన్ని ప్రాకృత భాషలో రచించాడు. ఈయన ఆస్థాన కవి కుతూహలుడు శ్రీలంక రాజకుమారి లీలావతితో హాలుడి ప్రేమ వివాహాన్ని గురించి ప్రస్తావిస్తూ ‘లీలావతి కావ్యం’ అనే గ్రంథాన్ని రచించాడు. 

గౌతమీపుత్ర శాతకర్ణి

శాతవాహనుల్లో గొప్ప పాలకుడు గౌతమీపుత్ర శాతకర్ణి. ఈయన తల్లి గౌతమీ బాలశ్రీ శాతకర్ణి మరణానంతరం నాసిక్‌ శాసనాన్ని వేయించింది. ఈ శాసనం ఆయనకు సంబంధించిన రాజకీయ విజయాలను వివరిస్తుంది. శాతకర్ణి కాలం నుంచే  రాజులు తమ తల్లుల పేర్లను వారి పేర్లకు ముందు ధరించే సంప్రదాయం ప్రారంభమైంది. ఈ విధంగా మాతృసంజ్ఞలను వాడిన మొదటి శాతవాహన పాలకుడు గౌతమీపుత్ర శాతకర్ణి. మూడు సముద్రాల పర్యంతం సామ్రాజ్యాన్ని విస్తరింపజేసిన కారణంగా ‘త్రిసముద్రతోయ పీతవాహన’ అనే బిరుదును పొందాడు. నాసిక్‌ శాసనం గౌతమీపుత్ర శాతకర్ణుడిని ‘బెణాకటస్వామి’ అని పేర్కొంటుంది. 

యజ్ఞశ్రీ శాతకర్ణి

ఈ వంశంలో యజ్ఞశ్రీ శాతకర్ణి చివరి గొప్ప పాలకుడు. మాధ్యమిక వాదాన్ని ప్రతిపాదించిన ఆచార్య నాగార్జునుడిని యజ్ఞశ్రీ ఆదరించి ఆయన కోసం నాగార్జున కొండలో పారావత మహా విహారాన్ని నిర్మించాడు. రెండు తెరచాపలతో కూడిన నౌకా ముద్ర గల నాణేలు ఈయన కాలంలో జరిగిన విదేశీ నౌకా వ్యాపారాభివృద్ధిని తెలియజేస్తున్నాయి. మూడో పులోమావి ఈ వంశ చివరి పాలకుడని మ్యాకదోని శాసనం చెబుతోంది.

ప్రిపరేషన్‌ టెక్నిక్‌: సంస్కృతి అధ్యయనం రాజకీయ చరిత్ర ఆధారంగా సాగాలి. రెండింటినీ వేరు చేసి చదివితే సంఘటనలు, వాటి ప్రభావాలను అర్థం చేసుకోవడంలో, గుర్తుంచుకోవడంలో ఇబ్బందిపడే అవకాశం ఉంటుంది.  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని