Updated : 02 May 2022 06:37 IST

TS Exams 2022: కాకతీయుల కాలంలో తెలంగాణ వైభవం!

తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

మూడు శతాబ్దాల సుదీర్ఘపాలనలో కాకతీయులు తెలంగాణ చరిత్ర, సంస్కృతిపై ఎన్నో చెరగని ముద్రలు వేశారు. మహాజనుల సాయంతో గ్రామాల్లో మంచిపాలన సాగించారు. పుణ్యకార్యంగా భావించి చెరువుల నిర్మాణం చేపట్టారు. ఆడవారికి ఆస్తిహక్కు అందించారు. అనేక ప్రముఖ ఆలయాలను నిర్మించారు. కవులను ఆదరించి సాహిత్యపోషణ చేశారు. నాటి వైభవాన్ని విదేశీయులూ కొనియాడటంతో ఓరుగల్లు రాజుల  కాలంలో తెలంగాణ ప్రాభవం ప్రపంచస్థాయికి చేరింది.


కాకతీయులు

తెలంగాణ సంస్కృతిని నలుదిశలకు విస్తరింపజేసిన ఘనత కాకతీయులకు దక్కుతుంది. వీరు తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఏకం చేశారు. హనుమకొండ, ఓరుగల్లు రాజధానులుగా సుమారు 300 సంవత్సరాలకు పైగా పాలించారు. చెరువులు, దేవాలయాల నిర్మాణాన్ని ప్రోత్సహించడంతో పాటు వివిధ భాషల సాహిత్యాన్ని పోషించారు. వీరి కాలంలో తెలంగాణ అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించింది. తొలి కాకతీయ రాజులు సామంతులుగా పాలించగా మలి కాకతీయ రాజులు స్వతంత్ర పాలన సాగించారు. కాకతీయ రాజ్య స్థాపకుడు బేతరాజు.

రుద్రదేవుడు (క్రీ.శ.1158 - 1196)

స్వతంత్ర కాకతీయ రాజ్యస్థాపకుడు రుద్రదేవుడు. ఈయన కల్యాణి చాళుక్యుల నుంచి క్రీ.శ.1163లో స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నట్లు హనుమకొండ శాసనం వివరిస్తుంది. హనుమకొండ శాసనాన్ని అచితేంద్రుడు రచించాడు. తన స్వాతంత్య్ర ప్రకటనకు గుర్తుగా రుద్రదేవుడు హనుమకొండలో రుద్రేశ్వరాలయం (వెయ్యి స్తంభాల గుడి) అనే త్రికూటాలయాన్ని నిర్మించాడు. ఇతడు పల్నాటి యుద్ధంలో (క్రీ.శ.1182) నలగామ రాజుకు సహాయం చేశాడు. ఈయన గొప్ప కవి, కవి పోషకుడు. ద్రాక్షారామ శాసనం రుద్రదేవుడిని వినయ విభూషణుడని తెలుపుతుంది. ఇతడికి విద్యాభూషణ అనే బిరుదు ఉండేది. సంస్కృత భాషలో నీతిసారం అనే గ్రంథాన్ని రచించాడు. రుద్రదేవుడి మంత్రి గంగాధరుడు వైష్ణవాభిమాని, స్మార్త బ్రాహ్మణుడు. ఇతడు హనుమకొండలో ప్రసన్న కేశవాలయాన్ని, గంగచియ చెరువును నిర్మించాడు.  

రుద్రదేవుడు పానుగంటిని (పానగల్లు) జయించి దానికి చిహ్నంగా అక్కడ తన పేరుతో రుద్రసముద్రం అనే  చెరువును నిర్మించాడు. ఈయన కాలంలో జైన, శైవ మతాల మధ్య సంఘర్షణలు ప్రారంభమయ్యాయి. వైదిక మతం, వర్ణధర్మాలతో శైవానికి పొత్తు కుదిర్చి ప్రచారం చేసిన మల్లికార్జున పండితారాధ్యుడు రుద్రదేవుడి సమకాలికుడు.

గణపతి దేవుడు (క్రీ.శ.1199 - 1262)

కాకతీయ పాలకుల్లో గొప్పవాడు గణపతి దేవుడు. ఇతడి రాజ్యం కంచి వరకు విస్తరించింది. 63 సంవత్సరాల దీర్ఘకాలం పాలించాడు. విదేశీ వర్తకులకు అభయమిస్తూ క్రీ.శ.1244లో మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించాడు. మోటుపల్లిని దేశీయ కొండ పట్టణం అనేవారు. అభయ శాసనాన్ని అమలు చేయడానికి సిద్ధయ్య దేవుడిని నియమించాడు.  క్రీ.శ.1254లో తన రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చాడు. పాకాల చెరువును నిర్మించాడు. ఇతడి గజసాహిణి అయిన జాయపసేనాని గొప్ప కవి. ఆయన నృత్తరత్నావళి, గీత రత్నావళి, వాద్య రత్నావళి అనే గ్రంథాలను రచించాడు. గణపతి దేవుడి శివదీక్షా గురువు గోళకీ మఠానికి చెందిన విశ్వేశ్వర శంభూ అనే ప్రసిద్ధ శైవాచార్యుడు. ఈయన దగ్గర గణపతి దేవుడు శివ దీక్షను పొందాడు. ఇతడి సేనాని రేచెర్ల రుద్రుడు క్రీ.శ.1213లో పాలంపేటలో రామప్ప దేవాలయాన్ని నిర్మించాడు. గణపతి దేవుడు రాజధానిలో సహస్ర లింగాలయాన్ని నిర్మించాడు.

రుద్రమదేవి (క్రీ.శ.1262 - 1289)

గణపతి దేవుడికి పుత్ర సంతానం లేకపోవడంతో అతడి కూతురు రుద్రమదేవి రుద్రదేవ మహారాజు పేరుతో సింహాసనాన్ని అధిష్టించింది. ఈమె తెలంగాణను పాలించిన మొదటి స్త్రీ పాలకురాలు. ఈమెకు రాయగజకేసరి అనే బిరుదు ఉండేది. రుద్రమదేవి తన సైన్యంలో నాయంకర విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈమె పాలనాకాలంలో వెనీస్‌ (ఇటలీ) యాత్రికుడైన మార్కోపోలో కాకతీయ రాజ్య వైభవాన్ని దర్శించాడు. ఆయన మోటుపల్లి ఓడరేవును సందర్శించి వాణిజ్యం, పరిశ్రమలు, పరిపాలన గురించి వివరించాడు. రుద్రమదేవి ఓరుగల్లు కోటకు మరమ్మతులు చేయించి రాతి కోటకు లోపలి వైపు మెట్లు కట్టించింది.

ప్రతాపరుద్రుడు (క్రీ.శ.1289 - 1323)

రుద్రమదేవి మనుమడు ప్రతాపరుద్రుడు. ఇతడినే రెండో ప్రతాపరుద్రుడు అంటారు. ఇతడు అడవులను పంట పొలాలుగా మార్చి నీటిపారుదల సౌకర్యాలు కల్పించాడు. రాయలసీమ ప్రాంతంలో అనేక నూతన గ్రామాలను నిర్మించాడు. ఇతడి ఆస్థానంలో మాచల్దేవి అనే పేరిణి నృత్యకారిణి ఉండేది. క్రీ.శ.1323లో దిల్లీ సుల్తాన్‌ జునాఖాన్‌ (మహమ్మద్‌బిన్‌ తుగ్లక్‌) ఓరుగల్లుపై దండెత్తి ప్రతాపరుద్రుడిని ఓడించి దిల్లీకి బందీగా తీసుకువెళ్లాడు. ఈ క్రమంలో నర్మదానది (సోమోద్భవ) తీరంలో ప్రతాపరుద్రుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ముసునూరి ప్రోలయ నాయకుడి విలస శాసనం, రెడ్డి రాణి అనితల్లి కలువచేరు తామ్ర శాసనం (క్రీ.శ.1243) తెలుపుతున్నాయి. దీంతో కాకతీయ సామ్రాజ్యం దిల్లీ రాజ్యంలో అంతర్భాగమైంది. మహ్మద్‌బిన్‌ తుగ్లక్‌ ఓరుగల్లుకు సుల్తాన్‌పూర్‌ అని పేరు పెట్టాడు.


పరిపాలన

గ్రామ పరిపాలనకు మహాజనులు అనే పేరుతో ఒక సభ ఉండేది. ఈ సభ నిర్ణయాలను అమలుపరుస్తూ 12 మంది ఆయగార్లు ఉండేవారు. చక్రవర్తి అంగరక్షకులను లెంకలు అని పిలిచేవారు. లెంకలను పాలకులు తమ పుత్రులతో సమానంగా చూసేవారు. లెంక ధర్మాలను తెలిపే లెంకావళి ఉండేది. రాజాస్థానాల్లో ప్రాడ్వివాకులు అనే ప్రత్యేక న్యాయధికారులు ఉండేవారు. పండిన పంటలో 1/6వ వంతు భూమి శిస్తు వసూలు చేసేవారు. భూమిశిస్తును అరి, చెల్లించే వారిని అరిగాపులు అని వ్యవహరించేవారు. రాజును దర్శించినప్పుడు ఇచ్చే కానుకలను దరిశనము అంటారు. రాజు లేదా ఇతర అధికారులు మేలు చేసినప్పుడు ప్రతిఫలంగా చెల్లించే పన్నును ఉపకృతి, ధనరూపంలో చెల్లించే పన్నును పుట్టిహుండి అంటారు. రాజు సొంత పొలానికి రాచదొడ్డి అని పేరు.


చెరువుల నిర్మాణం

కాకతీయులు వ్యవసాయానికి నీటిపారుదల సౌకర్యాలు కల్పించారు. దీనికోసం చెరువుల నిర్మాణాన్ని ప్రోత్సహించారు. దీనిలో భాగంగా తెలంగాణలోని అన్ని గ్రామాల్లో చెరువుల నిర్మాణం జరిగింది. చెరువును నిర్మించిన వ్యక్తికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం వస్తుందనే నమ్మకం ఉండేది. చెరువుల నిర్మాణాన్ని సప్త సంతానాల్లో ఒకటిగా భావించేవారు. వీరి సామంతులు, వివిధ అధికారులు పోటీపడి చెరువులను నిర్మించారు. కేసరి సముద్రం, కేసముద్రం అనే చెరువులను మొదటి ప్రోలరాజు నిర్మించాడు. పాకాల చెరువును జగదల ముమ్మడ (గణపతి దేవుడి సేనాని), రామప్ప చెరువును రేచెర్ల రుద్రుడు (గణపతి దేవుడి సేనాని), లక్నవరం చెరువును ప్రతాపరుద్రుడు; బయ్యారం, ధర్మసాగర్‌ చెరువులను మైలాంబ (గణపతి దేవుడి సోదరి) నిర్మించారు. కాకతీయులు ‘దశబంధ ఈనాం’ అనే కొత్త పద్ధతిని ప్రవేశపెట్టారు. చెరువు కింద సాగయ్యే భూమి మీద పంటలో పదో వంతు రాజుకు ధనరూపంలో లేదా ధాన్యరూపంలో చెల్లించే షరతు మీద ఇచ్చిన ఈనాంను దశబంధ ఈనాం అంటారు. ఓరుగల్లు ప్రాంతంలో సువాసనలు వెదజల్లే బియ్యం పండినట్లు మార్కోపోలో రచనల ద్వారా తెలుస్తుంది. రత్నకంబళాలు, ముఖమల్‌ వస్త్రాలకు ఓరుగల్లు; ఇనుము పరిశ్రమకు గుత్తికొండ, పల్నాటి సీమలు; కత్తులకు (డమాస్కస్‌ వరకు ప్రసిద్ధి) నిర్మల్‌, వజ్రాల గనులకు గోల్కొండ, రాయలసీమ ప్రసిద్ధి చెందాయి. గురజాలను వజ్రపురి అని పిలిచేవారు. వర్తకులు శ్రేణి వ్యవస్థ ద్వారా వర్తకం చేసేవారు. ఆనాటి పెద్ద శ్రేణి సర్వదేశీయ సహస్రతెలికి. దీని దేశీయ వాణిజ్యానికి ఓరుగల్లు ప్రధాన కేంద్రం. అక్కడ ప్రతివారం మడిసంత, మైలసంత జరిగేవి. గద్యాణం అనే బంగారు నాణేన్ని నిష్కముమాడ అనేవారు.


 


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని