సమాఖ్య స్ఫూర్తికి.. శాసనాల సమగ్రతకు!

మేధోమథనాలు, విస్తృత చర్చల మధ్య సిద్ధమయ్యే చట్టసభల బిల్లుల్లో ఇంకా ఏమైనా లోపాలు, పొరపాట్లు ఉంటే సరిదిద్దే సమున్నత బాధ్యతను ఎగువసభ తలకెత్తుకుంటుంది. శాసనాల రూపకల్పన, ఆమోదాల్లో దిగువసభ తొందరపాటును, ఆవేశాన్ని నియంత్రించే ప్రయత్నం చేస్తుంది.  ప్రత్యక్ష రాజకీయాలతో ప్రమేయంలేని కొందరు మేధావులు,

Updated : 26 Aug 2022 06:54 IST

భారత రాజ్యాంగం రాజకీయాలు

మేధోమథనాలు, విస్తృత చర్చల మధ్య సిద్ధమయ్యే చట్టసభల బిల్లుల్లో ఇంకా ఏమైనా లోపాలు, పొరపాట్లు ఉంటే సరిదిద్దే సమున్నత బాధ్యతను ఎగువసభ తలకెత్తుకుంటుంది. శాసనాల రూపకల్పన, ఆమోదాల్లో దిగువసభ తొందరపాటును, ఆవేశాన్ని నియంత్రించే ప్రయత్నం చేస్తుంది.  ప్రత్యక్ష రాజకీయాలతో ప్రమేయంలేని కొందరు మేధావులు, వివిధ రంగాల్లోని విశిష్ట వ్యక్తులు ఈ శాశ్వత సభలో భాగస్వాములుగా ఉండటం వల్ల ప్రజా సమస్యల పరిష్కారానికి సమగ్ర ప్రాతినిధ్యం లభిస్తుంది. రాష్ట్రాల మండలిగా సమాఖ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది.


రాజ్యసభ

పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభ దేశ శాసన నిర్మాణంలో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తోంది. పెద్దల సభగా ప్రసిద్ధి చెందిన ఈ సభలో మేధావులు, వివిధ రంగాలకు చెందిన విశిష్ట వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. దిగువ సభ అయిన లోక్‌సభ చేసే చట్టాలను అవసరమైన సమయాల్లో రాజ్యసభ నియంత్రిస్తుంది. బ్రిటిష్‌ పార్లమెంట్‌లోని ఎగువ సభ ‘హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌’ (ప్రభువుల సభ) అంతటి బలహీనమైంది కాదు మన రాజ్యసభ. అదేవిధంగా అమెరికా శాసన వ్యవస్థలో ఎగువ సభ ‘సెనేట్‌’ అంతటి బలమైనదీ కాదు. అమెరికా సెనేట్‌లో ఆ దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం ఉంటుంది. కానీ మన దేశంలో రాజ్యసభ సభ్యుల సంఖ్య ఆయా రాష్ట్రాల జనాభా సంఖ్యపై ఆధారపడి ఉంటుంది.


నిర్మాణం

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 80 రాజ్యసభ నిర్మాణం గురించి వివరిస్తుంది. ఇందులో గరిష్ఠంగా 250 మంది సభ్యులు ఉండవచ్చు. ప్రస్తుతం 245 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో రాష్ట్రాల నుంచి 225 మంది, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 8 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కళలు, సాహిత్యం, సామాజిక సేవా రంగాల్లో ప్రావీణ్యం కలిగిన 12 మంది విశిష్ట వ్యక్తులను రాష్ట్రపతి ఈ సభకు నామినేట్‌ చేస్తారు. రాజ్యసభ సభ్యులను రాష్ట్రాల్లోని శాసనసభల సభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య విధానంలో ఏక ఓటు బదిలీ పద్ధతిలో ఎన్నుకుంటారు. ఆ ఎన్నిక విధానాన్ని దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి గ్రహించారు. రాజ్యాంగంలోని 4వ షెడ్యూల్‌లో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాజ్యసభలో సీట్లు కేటాయించారు. దీనికి నియోజక వర్గాల ప్రాతిపదికన ఎన్నికలు జరగవు. ఈ సభ్యులు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించడం వల్ల రాజ్యసభను ‘రాష్ట్రాల మండలి’గా పేర్కొంటారు.

నిరంతర సభ: శాశ్వత సభగా వ్యవహరించే రాజ్యసభ మొత్తం సభ్యుల ఎన్నిక ఒకేసారి జరగదు. అలాగే వీరు ఒకేసారి పదవీ విరమణ కూడా చేయరు. సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో 1/3వ వంతు మంది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పదవీ విరమణ చేస్తారు. అంతే సంఖ్యలో కొత్తవారు ఎన్నికవుతారు.

ఆర్టికల్‌ 84 ప్రకారం రాజ్యసభకు ఎన్నికయ్యేవారికి కింది అర్హతలు ఉండాలి.


అర్హతలు:

* భారతీయ పౌరుడై ఉండాలి.

* 30 సంవత్సరాల వయసు నిండి ఉండాలి.

* భారతదేశంలోని ఏదైనా పార్లమెంటు  నియోజక వర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి.

* పార్లమెంటు నిర్ణయించిన ఇతర అర్హతలను కలిగి ఉండాలి.

భారత ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్‌-3 ప్రకారం ఒక వ్యక్తి రాజ్యసభకు ఒక రాష్ట్రం నుంచి ఎన్నిక కావాలంటే, సంబంధిత రాష్ట్ర నివాసి అయి ఉండాలని పేర్కొన్నారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం 2003లో భారత ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించి, ఒక వ్యక్తి ఏ రాష్ట్ర నివాసితుడు అయినప్పటికీ, దేశంలో ఏ రాష్ట్రం నుంచి అయినా రాజ్యసభకు ఎన్నిక కావచ్చని నిర్దేశించింది.

రాజ్యసభ ఛైర్మన్‌:  రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 89 ప్రకారం ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ‘ఎక్స్‌అఫీషియో ఛైర్మన్‌’గా వ్యవహరిస్తారు. ఈయన రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించి, సమర్థంగా నిర్వహిస్తారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించిన సభ్యుల అనర్హతలను ప్రకటిస్తారు. సభా నియమాలను పాటించని సభ్యులను శిక్షిస్తారు. సమావేశాల నిర్వహణకు అవసరమైన కనీస సభ్యుల హాజరు (కోరం) 1/10వ వంతును ధ్రువీకరిస్తారు. సభలో ప్రవేశపెట్టిన బిల్లులపై ఓటింగ్‌ నిర్వహించినప్పుడు అనుకూలంగా, వ్యతిరేకంగా సమాన ఓట్లు వస్తే అధ్యక్ష స్థానంలో ఉండి ‘నిర్ణాయక ఓటు’ను వినియోగించుకొని బిల్లును గెలిపించగలరు లేదా ఓడించగలరు. రాజ్యసభలో పబ్లిక్‌, ప్రైవేట్‌ బిల్లులను ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇస్తారు. రాజ్యసభకు తొలి ఛైర్మన్‌గా సర్వేపల్లి రాధాకృష్ణన్‌ వ్యవహరించారు. ప్రస్తుత ఛైర్మన్‌, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖఢ్‌.

డిప్యూటీ ఛైర్మన్‌: రాజ్యసభ సభ్యులు తమలో నుంచి ఒకరిని డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నుకుంటారు. ఈయన పదవీ కాలాన్ని రాజ్యాంగబద్ధంగా నిర్ధారించకపోయినప్పటికీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగినంత కాలం అంటే 6 సంవత్సరాలు పదవిలో ఉంటారు. రాజ్యసభకు మొదటి డిప్యూటీ   ఛైర్మన్‌గా ఎస్‌.వి.కృష్ణమూర్తి వ్యవహరించారు. ప్రస్తుత డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌. ఈ  పదవికి ఇప్పటివరకు ముగ్గురు మహిళలు ఎన్నికయ్యారు. వారు వయోలెట్‌ అల్వా, ప్రతిభా పాటిల్‌, నజ్మాహెప్తుల్లా.

రాజీనామా - తొలగింపు: రాజ్యసభ ఛైర్మన్‌ తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి. డిప్యూటీ ఛైర్మన్‌ తన రాజీనామాను ఛైర్మన్‌కు పంపించాలి. రాజ్యసభ ఛైర్మన్‌ను పార్లమెంటు, డిప్యూటీ ఛైర్మన్‌ను రాజ్యసభ సభ్యులు 14 రోజుల ముందస్తు నోటీసు ఇచ్చి సాధారణ మెజార్టీతో తొలగించవచ్చు. ఛైర్మన్‌/డిప్యూటీ ఛైర్మన్‌లలో ఎవరిపై తొలగింపు తీర్మానం ప్రవేశపెడతారో వారు సభకు అధ్యక్షత వహించకూడదు. కానీ సభా సమావేశాల చర్చల్లో పాల్గొని తమ వివరణ ఇచ్చుకోవచ్చు.


ప్రత్యేక అధికారాలు

* ఆర్టికల్‌ 67(b) ప్రకారం ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి.

* ఆర్టికల్‌ 249(1) ప్రకారం రాష్ట్ర జాబితాలోని ఏదైనా అంశానికి జాతీయ ప్రాధాన్యం ఉందని రాజ్యసభ 2/3 ప్రత్యేక మెజార్టీతో ఒక తీర్మానాన్ని ఆమోదిస్తే, దానిపై పార్లమెంటు శాసనం చేస్తుంది. ఆ విధంగా రూపొందిన శాసనం దేశం మొత్తానికి లేదా దేశంలోని కొంత భాగానికి వర్తిస్తుంది.

ఉదా: 1952లో దేశంలో ఆహార కొరత ఏర్పడినప్పుడు ఆహార ధాన్యాల ఉత్పత్తి, పంపిణీ, వాణిజ్యాలను క్రమబద్ధం చేయడానికి రాజ్యసభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

* ఆర్టికల్‌ 312 ప్రకారం రాజ్యసభ 2/3 ప్రత్యేక మెజార్టీతో ఒక తీర్మానాన్ని ఆమోదిస్తే పార్లమెంటు ‘నూతన అఖిల భారత సర్వీసుల’ను ఏర్పాటు చేస్తూ శాసనాన్ని రూపొందిస్తుంది.

ఆర్టికల్‌ 312 ప్రకారం ఇంతవరకు రాజ్యసభ ఆమోదించిన తీర్మానాలు:

* 1961లో ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌, ఇండియన్‌ సర్వీస్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌, ఇండియన్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌.

* 1965లో ఇండియన్‌ అగ్రికల్చర్‌ సర్వీసెస్‌, ఇండియన్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌. వీటిలో ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌ను మాత్రమే 1966లో ఆలిండియా సర్వీసుల్లో చేర్చారు.

* ఆర్థిక, కార్యనిర్వాహకవర్గాన్ని నియంత్రించే అంశాలు మినహా మిగిలిన అన్ని అంశాల్లో రాజ్యసభకు లోక్‌సభతో సమానమైన అధికారాలు ఉన్నాయి.


ఉదా: 1961లో వరకట్న నిషేధ బిల్లును   రాజ్యసభ తిరస్కరించింది. 1970లో మాజీ స్వదేశీ సంస్థానాధిపతుల హక్కుల రద్దు బిల్లుకు ఆమోదం ఇవ్వలేదు. 1978లో బ్యాంకింగ్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటు/రద్దు బిల్లును, గుంటూరులో ఉన్న టొబాకో బోర్డును మరో ప్రదేశానికి మార్చడానికి ఉద్దేశించిన బిల్లును రాజ్యసభ అంగీకరించలేదు. 1978లో మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వం 44వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించినప్పుడు అందులోని 7 అంశాలను   రాజ్యసభ వ్యతిరేకించగా, వాటిని తొలగించారు. ఆర్టికల్‌ 352 ప్రకారం ‘జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన’, ఆర్టికల్‌ 356 ప్రకారం ‘రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన ప్రకటన’, ఆర్టికల్‌ 360 ప్రకారం ‘ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటన’ లాంటివి అమల్లోకి రావాలంటే రాజ్యసభ అనుమతి తప్పనిసరి. ఆర్టికల్‌ 368 ప్రకా0రం రాజ్యాంగ సవరణ బిల్లులను పార్లమెంటు ఉభయ సభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్‌ కాలేజీలో, రాజ్యసభలోని మొత్తం సభ్యులు (ఎన్నికైన, నామినేటెడ్‌) ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్‌ కాలేజీలో ఓటర్లుగా ఉంటారు.


సభానాయకుడు

రాజ్యసభలో ప్రభుత్వం తరఫున సభానాయకుడిగా ఒకరు వ్యవహరిస్తారు. మొదటి సభా నాయకుడిగా ఎన్‌.గోపాలస్వామి అయ్యంగార్‌ వ్యవహరించారు. ప్రస్తుతం రాజ్యసభకు సభానాయకుడిగా పీయూష్‌ గోయల్‌ కొనసాగుతున్నారు. రాజ్యసభకు అత్యధిక కాలం సుమారు 10 సంవత్సరాలు (2004 నుంచి 2014 వరకు) సభా నాయకుడిగా మన్మోహన్‌ సింగ్‌ వ్యవహరించారు.


ప్రధాన ప్రతిపక్షం

1967లో కాంగ్రెస్‌(ఓ) పార్టీకి చెందిన శ్యాంనందన్‌ మిశ్రను రాజ్యసభలో గుర్తింపు పొందిన మొదటి ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ధ్రువీకరించారు. 1977లో భారత పార్లమెంటు ప్రధాన ప్రతిపక్ష పార్టీకి గుర్తింపునిచ్చే చట్టాన్ని రూపొందించింది. దీని ప్రకారం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు లభించాలంటే సభలోని మొత్తం స్థానాల్లో 1/10వ వంతు స్థానాలు పొంది ఉండాలి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతకు కేంద్ర కేబినెట్‌ మంత్రికి లభించే వసతి, హోదా లభిస్తాయి. ఈ చట్టం చేసిన అనంతరం రాజ్యసభలో గుర్తింపు పొందిన మొదటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కమలాపతి త్రిపాఠి (1977) నిలిచారు. ప్రస్తుతం రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతగా కాంగ్రెస్‌కు చెందిన మల్లికార్జున ఖర్గే వ్యవహరిస్తున్నారు.

శుక్రవారం - ప్రైవేటు మెంబర్‌ బిల్లు: పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రతి శుక్రవారం రాజ్యసభలో రెండున్నర గంటల పాటు ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లుపై చర్చించేందుకు అవకాశం కల్పిస్తారు.

* రాజ్యసభ కార్యక్రమాల నిర్వహణకు సెక్రటేరియట్‌ ఉంటుంది. రాజ్యసభకు మొదటి సెక్రటరీ జనరల్‌ ఎస్‌.ఎన్‌.ముఖర్జీ, ప్రస్తుత సెక్రటరీ జనరల్‌ ప్రమోద్‌ చంద్ర.


ఎగువ సభ ఎందుకు?

మారిస్‌జోన్స్‌ గ్రంథమైన ‘ది గవర్నమెంట్‌ అండ్‌ పాలిటిక్స్‌ ఆఫ్‌ ఇండియా’లో రాజ్యసభకు సంబంధించి మూడు ప్రత్యేక ప్రయోజనాలను వివరించారు.

* లోక్‌సభ తొందరపాటుతో చేసే శాసనాలను పునరాలోచన చేసి లోటుపాట్లను సరిచేయడానికి, సవరించడానికి తోడ్పడుతుంది.

* అవసరం ఉన్న, ప్రాధాన్యం కలిగిన అదనపు రాజకీయ పదవులను రాజ్యసభ సమకూరుస్తుంది.

* శాసన నిర్మాణపరంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి, అభిలషణీయమైన శాసనాల రూపకల్పనకు తోడ్పడుతుంది.




https://tinyurl.com/4wnmc5sf


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని