విజ్ఞానం పంచి.. చైతన్యం పెంచి!

చరిత్రను, సంస్కృతిని అర్థం చేసుకొని చైతన్యవంతం కావడానికి సాయపడే సాధనాల్లో గ్రంథాలయాలు ప్రధానమైనవి. అవి విజ్ఞానాన్ని పెంపొందిస్తాయి.  కొత్త ఆలోచనలను, సృజనాత్మకతను, నవీన దృక్కోణాలను ప్రేరేపించి వినూత్న సమాజ నిర్మాణానికి దోహదపడతాయి. తెలంగాణలో సరిగ్గా అదే జరిగింది.

Published : 29 Sep 2022 02:38 IST

తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

చరిత్రను, సంస్కృతిని అర్థం చేసుకొని చైతన్యవంతం కావడానికి సాయపడే సాధనాల్లో గ్రంథాలయాలు ప్రధానమైనవి. అవి విజ్ఞానాన్ని పెంపొందిస్తాయి.  కొత్త ఆలోచనలను, సృజనాత్మకతను, నవీన దృక్కోణాలను ప్రేరేపించి వినూత్న సమాజ నిర్మాణానికి దోహదపడతాయి. తెలంగాణలో సరిగ్గా అదే జరిగింది. నిజాంల పాలనలో మగ్గిపోతున్న ప్రజలను మేల్కొలపడంలో గ్రంథాలయాలు ప్రముఖ పాత్ర పోషించాయి. నాటి నాయకులు ఉద్యమంగా చేసిన భాషానిలయాల ఏర్పాటు, ప్రచురించిన పుస్తకాలు ఇక్కడి జనంపై ఎంతో ప్రభావాన్ని చూపాయి. పోరాటాల వైపు నడిపించాయి. ఈ అంశాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.

తెలంగాణలో గ్రంథాలయోద్యమం

 

అసఫ్‌జాహీల పాలనలో తెలంగాణ బాగా వెనుకబడి పోయింది. ప్రజలకు ఎలాంటి హక్కులు లేకుండా పోయాయి. భూములన్నీ భూస్వాముల అధీనమయ్యాయి. సమాజం అంతా వెట్టిచాకిరి వ్యాపించింది. ఆ పరిస్థితుల్లో 1883లో చందా రైల్వే పథకం సందర్భంగా హైదరాబాద్‌ సంస్థానంలో మొదటిసారిగా ప్రజాభిప్రాయం వ్యక్తం కావడం మొదలైంది. తర్వాతి దశలో గ్రంథాలయాల ఏర్పాటు ఒక ఉద్యమంగా సాగడంతో జనంలో చైతన్యం మరింత పెరిగింది. వారిని స్వాతంత్య్రోద్యమం వైపు నడిపించింది.
1872లో సికింద్రాబాద్‌లో మొదటి గ్రంథాలయాన్ని     సోమసుందర మొదలియార్‌ ఏర్పాటు చేశారు. ఇది తెలంగాణలో ఏర్పడిన తొలి గ్రంథాలయం. దీన్ని 1884లో మహబూబ్‌ కాలేజీలో విలీనం చేశారు. సోమసుందర మొదలియార్‌ ఆ    కాలేజీని 1862లో స్థాపించారు. శంకరానంద గ్రంథాలయాన్ని కవాడిగూడలో 1872లో ముదిగొండ శంకరాధ్యులు స్థాపించారు. 1891లో అసఫియా స్టేట్‌ సెంట్రల్‌ లైబ్రరీ అఫ్జల్‌గంజ్‌లో ఏర్పడింది. 1895లో భారత గుణవర్దక్‌ సంస్థ లైబ్రరీని శాలిబండలో స్థాపించారు. 1896లో ఆల్బర్ట్‌ రీడింగ్‌ రూమ్‌ను బొల్లారంలో ఏర్పాటు చేశారు.

సంస్థలు, సభలు
గ్రంథాలయోద్యమానికి పితామహుడు కొమర్రాజు వెంకటలక్ష్మణరావు. ఈయన మునగాల రాజా వెంకట రంగారావు సంస్థానంలో దివానుగా పనిచేసేవారు. కొమర్రాజు 1901లో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం అనే తొలి తెలుగు గ్రంథాలయాన్ని హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజార్‌లో, 1904లో రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం లైబ్రరీని హనుమకొండలో స్థాపించారు. 1905-06లో సికింద్రాబాద్‌లో ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయ స్థాపన జరిగింది. బాలభారతి నిలయాన్ని ఆంధ్ర భాషా వర్తక సంఘం వారు శంషాబాద్‌లో ఏర్పాటు చేశారు. 1906లో విజ్ఞాన చంద్రికా మండలిని హైదరాబాద్‌లో, 1910లో ఆంధ్ర భాషా నిలయాన్ని ఖమ్మంలో, 1913లో ప్రతాపరుద్ర ఆంధ్ర భాషా నిలయాన్ని మడికొండలో, సంస్కృత కళా వర్ధినిని సికింద్రాబాద్‌లో స్థాపించారు. 1918లో ఆంధ్ర సరస్వతి గ్రంథ నిలయాన్ని నల్గొండలో, ఆంధ్ర విజ్ఞాన ప్రకాశినిని సుర్యాపేటలో ఏర్పాటు చేశారు. 

1918లో రెడ్డి హాస్టల్‌ గ్రంథాలయాన్ని హైదరాబాద్‌లో, 1921లో బాలభారతి నిలయాన్ని నల్గొండలో, 1925లో ఆంధ్ర సోదరి సమాజ గ్రంథాలయాన్ని, 1939లో బాపూజీ గ్రంథాలయాన్ని మహబూబాబాద్‌లో స్థాపించారు. రావి నారాయణరెడ్డి 1941లో చిలుకూరులో రైతు గ్రంథాలయాన్ని, కొండా వెంకట రంగారెడ్డి 1923లో హైదరాబాద్‌లో వేమన భాషా నిలయాన్ని స్థాపించారు. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు ‘విజ్ఞాన పరిషత్తు’ అనే సంస్థ ద్వారా మొదటిసారిగా ప్రైవేటు రంగంలో తెలుగు భాషా పరీక్షల నిర్వహణ కేంద్రాన్ని ప్రారంభించారు. 1922, ఫిబ్రవరి 27న ‘ఆంధ్ర పరిశోధక సంఘం’ స్థాపనతో గ్రంథాలయోద్యమానికి గొప్ప చైతన్యం కలిగింది. గ్రంథాలయ ఉద్యమాన్ని మాడపాటి హనుమంతరావు పట్టుదలతో నిర్వహించారు.

గ్రంథాలయ మహాసభలు: గ్రంథాలయాల ఏర్పాటును ప్రోత్సహించడానికి తెలంగాణలోని వివిధ పట్టణాల్లో గ్రంథాలయ మహాసభలు నిర్వహించారు. గ్రంథాలయోద్యమంలో మాడపాటి హనుమంతరావు, కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, సోమనాథ రావు, కోదాటి నారాయణరావు లాంటి వారు కీలకపాత్ర పోషించారు.

ప్రథమ గ్రంథాలయ మహాసభ (1925, ఫిబ్రవరి 22): ఈ సమావేశం మధిరలో జరిగింది. దీనికి పింగళి వెంకటరామారెడ్డి అధ్యక్షత వహించారు. మాడపాటి హనుమంతరావు వివిధ ప్రాంతాల్లో కొత్తగా ఏర్పడిన అనేక గ్రంథాలయ నిర్వాహకులను ఆహ్వానించి సభ జరిపారు. గ్రంథాలయ నిర్వహణలో క్రమశిక్షణ, నియమ నిబంధనలను రూపొందించడం ఈ సమావేశ ఉద్దేశం. గ్రంథాలయోద్యమాన్ని వ్యాపింపజేసేందుకు ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు.

రెండో గ్రంథాలయ మహాసభ (1929, జూన్‌ 1): ఈ సభ   సూర్యాపేటలో జరిగింది. దీనికి వామన్నాయక్‌ అధ్యక్షత వహించారు. ఉన్నవ వెంకటరామయ్య వందలాది గ్రంథాలయాలను స్థాపించారు. ఆయన గ్రంథాలయ నిర్వాహకుల్లో ఉత్సాహం నింపడానికి తాలుకా స్థాయుల్లో కూడా గ్రంథాలయాలను ఏర్పాటు చేశారు.

గ్రంథమాలలు: ఈ కాలంలో వివిధ గ్రంథమాలలు ఏర్పడి ప్రజలకు అవసరమైన వివిధ విషయాల్లో పుస్తకాలను ప్రచురించి నామమాత్ర ధరకే అందించేవి.

ఆంధ్ర చంద్రికా గ్రంథమాల: దీన్ని మాడపాటి హనుమంతరావు స్థాపించారు. ఇది తెలంగాణ ఆంధ్రోద్యమ చరిత్ర అనే గ్రంథాన్ని ప్రచురించింది.

విజ్ఞాన వర్ధనీ గ్రంథావళి: ఈ సంస్థను విజ్ఞాన వర్ధనీ పరిషత్తు వారు స్థాపించారు. దీనికి కేశవ పంతుల నరసింహశాస్త్రి కార్యదర్శిగా ఉండేవారు. ఈయన ‘యువజన విజ్ఞానం’ లాంటి అనేక విజ్ఞానశాస్త్ర గ్రంథాలను ప్రచురించారు.

వైదిక ధర్మ గ్రంథ మండలి: దీన్ని మంత్రి ప్రగడ వెంకటేశ్వర రావు స్థాపించారు. సాంఘిక దురాచారాలతో క్షీణించిపోతున్న హిందూ సమాజాన్ని జాగృతం చేయాలనే లక్ష్యంతో ఇది ఏర్పడింది. అనేక గ్రంథాలను ప్రచురించింది.

అణా గ్రంథమాల: దీన్ని కల్వల చంద్రసేన గుప్తా (కె.సి.గుప్తా) ఏర్పాటు చేశారు. సంపాదకుడిగా వెల్దుర్తి మాణిక్యరావు వ్యవహరించారు. నిజాం ప్రభుత్వం రాజకీయ సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన అరవముదు అయ్యంగార్‌ కమిటీ ఇచ్చిన నివేదిక ఎందుకూ పనికిరాదనే విమర్శలు అప్పట్లో వచ్చాయి. ఆ కమిటీ నివేదికను తెలుగులో ప్రచురించి ఒక్క అణాకే ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ఈ అణా గ్రంథమాల ఏర్పడింది. నిజాం ప్రభుత్వం నిర్ణయించిన రాజకీయ సంస్కరణలకు సంబంధించిన 70 పేజీల పుస్తకాన్ని గెజెట్‌ (సర్కారీ జరీదా) పేరిట ఒక్క అణాకే విక్రయించారు. అడవి బాపిరాజు రచించిన ‘అజంతా’ పుస్తకాన్ని ముద్రించి ఒక్క అణాకే అమ్మారు. డాక్టర్‌ భోగరాజు పట్టాభి సీతారామయ్య రచించిన ‘భారత జాతీయ కాంగ్రెస్‌ - 50 సంవత్సరాల చరిత్ర’ గ్రంథాన్ని జానపాటి సత్యనారాయణతో సంక్షిప్తంగా రెండు పుస్తకాలుగా రాయించి వాటిని ఒక్కోదాన్ని ఒక్కో అణాకు విక్రయించారు. ఆర్య సమాజ స్థాపకుడైన దయానంద సరస్వతి జీవిత చరిత్రను ఈ గ్రంథమాల ప్రచురించింది. వెల్దుర్తి మాణిక్యరావు రచించిన ‘రైతు’ పుస్తకాన్ని నిజాం ప్రభుత్వం నిషేధించింది. దేశ నాయకులైన జవహర్‌లాల్‌ నెహ్రూ, సుభాష్‌ చంద్రబోస్‌,   ఎం.ఎన్‌.రాయ్‌, వినాయక దామోదర్‌ సావర్కర్‌ల చరిత్రలను కె.రంగదాసు రచించగా అణా గ్రంథమాల ప్రచురించింది. అయితే నిజాం ప్రభుత్వం ఈ గ్రంథాలను నిషేధించి పౌజుదారీ (క్రిమినల్‌) కేసు పెట్టింది. బూర్గుల రామకృష్ణారావు ప్రచురణకర్త తరఫున వాదించి ప్రభుత్వాన్ని విమర్శించాడు. ఈ కేసులో అణా గ్రంథమాల  హైకోర్టులో విజయం సాధించింది. ఆ విధంగా ప్రభుత్వ చర్యను విమర్శించడమే కాకుండా ప్రభుత్వంపై కేసు గెలవడం హైదరాబాద్‌ రాజ్యచరిత్రలో అదే మొదటిసారి. సురవరం ప్రతాపరెడ్డి రచించిన మొగలాయి కథలు, కాళోజీ కథలను ఈ గ్రంథమాల ప్రచురించింది. ‘జాగీరు ప్రజలు’ అనే కథాంశంతో సురవరం ప్రతాపరెడ్డి, ఉమ్మెత్తల కేశవరావు రెండు పుస్తకాలను రచించగా వీరు ముద్రించారు. ‘అనువంశీకము - వాహకులు’ అనే శరీర విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాన్ని డాక్టర్‌ రమణారావు రచించగా ప్రచురించారు. అణా గ్రంథమాల సంపాదకులు రచించిన ‘ఖాదీ’ అనే 80 పేజీల పుస్తకాన్ని చేతి కాగితంపై పబ్లిష్‌ చేశారు. ప్రఖ్యాత అభ్యుదయ కవి ముఖ్దూం మొహియుద్దీన్‌ రచించిన గీతాలను ఉర్దూలో అచ్చు వేశారు. అణా గ్రంథమాలవారు ఒక్కో పుస్తకాన్ని 50 ప్రతులుగా   ప్రచురించేవారు. ప్రతి పుస్తకాన్ని ఒక్క అణాకే విక్రయించేవారు.

దేశోద్ధారక గ్రంథమాల: దీన్ని వట్టికోట ఆళ్వారుస్వామి స్థాపించారు. ఇది ‘దేశోద్ధారక’ అనే కాశీనాథుని నాగేశ్వరరావు బిరుదు పేరున ఏర్పాటైంది. వట్టికోట ఆళ్వారుస్వామి గోలకొండ పత్రికలో ప్రచురణ శాఖ మేనేజర్‌గా పనిచేసేవారు. హైందవ ధర్మవీరులు, ప్రాథమిక స్వత్వములు అనే గ్రంథాలను సురవరం ప్రతాపరెడ్డి రచించగా ఈ గ్రంథమాల ప్రచురించింది. మానవుడి కనీస పౌరహక్కులు ఏమిటి అనే విషయాన్ని తెలుగులో స్పష్టంగా, శాస్త్రీయంగా పొందుపరిచిన మొదటి పుస్తకం ప్రాథమిక స్వత్వములు. తుర్కియే (టర్కీ) దేశ ప్రజలను ఆధునికంగా మార్చిన ‘ముస్తఫాకెమాల్‌ పాషా జీవితం’ గ్రంథాన్ని దేశోద్ధారక గ్రంథమాల ప్రచురించింది. ఇక్కడ ప్రచురించే గ్రంథాలన్నింటి అట్టపై త్రివర్ణ జాతీయ పతాకాన్ని స్ఫురింపజేసే విధంగా మువ్వన్నెల పట్టీని ముద్రించారు. వట్టికోట ఆళ్వారు స్వామి రచించిన ‘ప్రజల మనిషి’, ‘గంగు’ అనే నవలలు నాటి హైదరాబాద్‌ రాజకీయ వాతావరణాన్ని ప్రతిబింబించాయి.

ఆంధ్రకేసరి గ్రంథమాల: దీన్ని 1940లో గుండవరం హనుమంతరావు, గొబ్బూరు రామచంద్రరావు, గోపాల్‌రావు స్థాపించారు. వీరు తెలుగులో ప్రగతిశీల, చైతన్యవంతమైన సాహిత్యాన్ని ప్రచురించారు. ఈ గ్రంథమాల నిజాం రాజ్యంలోని విద్యావంతుల్లో రాజకీయ చైతన్యం కలిగించింది.

విజ్ఞాన చంద్రికా మండలి: ఇది నిజాం రాజ్యంలో ఏర్పడిన మొదటి గ్రంథమాల. దీన్ని 1906లో కొమర్రాజు వెంకట లక్ష్మణరావు స్థాపించారు. ఈయన తెలుగులో చరిత్ర, విజ్ఞాన శాస్త్రం గ్రంథాలను ప్రోత్సహించారు. తెలుగు విజ్ఞాన సర్వస్వం  రచించారు. ఈ సంస్థ పట్ల నిజాం ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో దీన్ని 1908లో మద్రాసుకు తరలించారు. 1910లో చిలుకూరి వీరభద్రరావు రచించిన ‘ఆంధ్రుల చరిత్ర’ను మండలి ప్రచురించింది.


రచయిత: డాక్టర్‌ ఎం.జితేందర్‌ రెడ్డి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని