Updated : 01 Feb 2023 06:13 IST

వేదికపై ధీమాగా.. మాట్లాడాలా?


మాట్లాడటం ఒక కళ.. నలుగురినీ మాటలతో మెప్పించడం నేటి ఉద్యోగార్థులకు అవసరమైన నైపుణ్యం. అందుకే చదువుతోపాటు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన సాఫ్ట్‌ స్కిల్స్‌లో ‘పబ్లిక్‌ స్పీకింగ్‌’ కూడా ఒకటి. 


కొందరు విద్యార్థులు చదువులో మిగతావారి కంటే ఎప్పుడూ ముందే ఉంటారు. కానీ అందరిముందూ నాలుగు మాటలు మాట్లాడాల్సి వస్తే మాత్రం జంకుతారు. తోటి విద్యార్థులు పాఠ్యాంశాల్లో ఏవైనా సందేహాలు అడిగితే.. వారికి అర్థమయ్యేలా వివరిస్తుంటారు కొందరు. కానీ అదే విషయాన్ని అందరిముందూ నిలబడి చెప్పమంటే మాత్రం భయంతో వణికిపోతుంటారు.


లుగురిలో మాట్లాడే నైపుణ్యమే ఉంటే ఆలోచనలను స్పష్టంగా, ప్రభావశీలంగా ఇతరులకు వ్యక్తం చేయగలుగుతారు. దాంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కూడా. అసలు ఏ రంగంలో ఉద్యోగం సంపాదించాలన్నా సమర్థంగా మాట్లాడగలిగే సామర్థ్యం ఉండటం ఎంతో ముఖ్యం. దీన్ని సాధించటానికి కొన్ని అంశాలు దోహదపడతాయి. .

భావవ్యక్తీకరణ సామర్థ్యం

మన ఆలోచనలు, అభిప్రాయాలను ఇతరులకు వ్యక్తంచేయాలంటే ఈ నైపుణ్యం ఎంతో అవసరం. దీన్ని సాధించాలంటే కేవలం మాట్లాడితేనే సరిపోదు. ఇంకా అనేక విషయాలనూ గుర్తుంచుకోవాలి. బాడీ లాంగ్వేజ్‌, గొంతులో హెచ్చుతగ్గులు.. ఇవన్నీ కూడా దీని కిందికే వస్తాయి. ప్రసంగాన్ని మెల్లగా ప్రారంభించడం, ముఖ్యాంశాలను చెప్పేటప్పుడు స్వర స్థాయిని కాస్త పెంచడం, చివరలో కాస్త తక్కువ స్వరంతో ముగించడం... ఇలాంటి వాటినీ పాటించాలి. ప్రజెంటేషన్స్‌ ఇచ్చేటప్పుడు, డిబేట్స్‌లో పాల్గొనేటప్పుడు విద్యార్థులకు నలుగురి ముందూ మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అలాంటప్పుడు ఈ విషయాలన్నీ గుర్తుంచుకోవాలి.

స్వేచ్ఛగా వెల్లడించడం

నలుగురి ముందూ మాట్లాడటం మొదలుపెడితే.. మీ అభిప్రాయాలు, ఆలోచనలను ఇతరులతో స్వేచ్ఛగా పంచుకోగలుగుతారు. అలా మాట్లాడే క్రమంలోనే సృజనాత్మకంగానూ ఆలోచించడం ప్రారంభిస్తారు. అంటే ఊరికే మనసులోని భావాలను తెలియజేయడమే కాకుండా వాటిని కాస్త వినూత్నంగా, సృజనాత్మకంగా ఎలా చెప్పగలమో.. ఆలోచించడం మొదలుపెడతారు. దీనికి అనుగుణంగా ప్రయత్నాలనూ ప్రారంభిస్తారు. ఈ తపనంతా కూడా విద్యార్థులకు ఎంతో అవసరమయ్యే నైపుణ్యాలను అందించడానికి తోడ్పడుతుంది.

సన్నద్ధం కావొచ్చు

సంకోచం, భయం, అభద్రతా భావం, ఎదుటివాళ్లు ఏమనుకుంటారోననే జంకు.. ఇవన్నీ నలుగురి ముందూ మిమ్మల్ని స్వేచ్ఛగా మాట్లాడనీయవు. వీటిని పక్కన పెట్టి ప్రసంగాన్ని మొదలుపెట్టడానికి ప్రయత్నించాలి. ఉద్యోగ సాధనలో భాగంగా భవిష్యత్తులో ఎన్నో ఇంటర్వ్యూలకూ హాజరుకావాలి. అలాంటప్పుడు ఎలాంటి సంకోచాలకూ తావులేకుండా మాట్లాడగలగాలంటే ఇప్పటి నుంచీ సన్నద్ధం కావడం ఎంతో అవసరం. 

ఒప్పించే నేర్పు

ఒక విషయాన్ని గురించి ప్రసంగించడం, మన అభిప్రాయాలన్నీ సబబేనని ఇతరులు భావించేలా చేయడం.. తేలికైన విషయాలేమీ కాదు. మనం వెలిబుచ్చిన అభిప్రాయాలకు ఇతరులు సానుకూలంగా స్పందించేలానూ చేయగలగాలి. అంటే.. ఇతరులను మన వాదనతో ఒప్పించడం ముఖ్యం. అలాగే సౌమ్యంగా ప్రసంగించడమూ అవసరమే. ఇదంతా నలుగురి ముందూ మాట్లాడటం మొదలుపెట్టిన కొత్తలోనే అలవడదు. కొంతకాలంపాటు సాధన చేసిన తర్వాతే అలవాటు అవుతుంది. దీనికోసం ముందుగా తోటి విద్యార్థులతో వివిధ అంశాల మీద చర్చించడాన్ని అలవాటు చేసుకోవాలి. ఆ తర్వాత నలుగురి ముందూ నిలబడి మాట్లాడటానికి వెనకడుగు వేయరు.

ప్రశాంతత ముఖ్యం

దృష్టి ఎప్పుడూ ప్రసంగించబోయే అంశం మీదే ఉండాలి. దాని గురించి మాత్రమే ఆలోచించగలగాలి. దీనికోసం ముందురోజు నుంచీ సన్నద్ధమైతే ఆందోళన, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అలాగే నిలబడే విధానాన్నీ పట్టించుకోవాలి. నిటారుగా, నిలబడి ఎదురుగా ఉంటే ప్రేక్షకులను చూస్తూ మాట్లాడాలి. అంతేగానీ ఊరికే అటూఇటూ తల తిప్పడం, పైకీ కిందకూ చూస్తూ ఉండటం లాంటి చేయకూడదు. ఇలాంటి పనుల వల్ల మీ ఏకాగ్రత దెబ్బతింటుంది. అంతేకాదు ప్రేక్షకులూ మీరు చెప్పేదాన్ని వినాలని అంత ఆసక్తిగా ఎదురుచూడకపోవచ్చు.

సహజంగా ఉండాలి

నలుగురి ముందూ మాట్లాడే క్రమంలో మీ ప్రవర్తన సహజంగా ఉండాలి. రోజూ ఎదుటివారితో మీరెలా మాట్లాడతారో అలాగే అందరిముందూ మాట్లాడటానికి ప్రయత్నించాలి. వేదిక మీద లేనిపోని గాంభీర్యాన్నీ, పెద్దరికాన్నీ తెచ్చిపెట్టుకోవడం లాంటివి చేయకూడదు. అలవాటైన పద్ధతినే కొనసాగించాలి.


సాయం చేసే యాప్స్‌

సమావేశాలు నిర్వహించేటప్పుడు, బృందంగా చర్చించేటప్పుడు... అవసరమయ్యే ఈ మెలకువలను సులభంగా, ఉచితంగా నేర్పించేందుకు ఇప్పుడు చాలా యాప్స్‌ అందుబాటులోకి వచ్చాయి. అందులో కొన్ని ముఖ్యమైన వాటి గురించి మనమూ తెలుసుకుందాం.

విద్యార్థుల్లో చాలామందికి వేదిక అంటే భయం ఉంటుంది. నలుగురినీ ఉద్దేశించి మాట్లాడాలి అన్నప్పుడు తెలీకుండానే విపరీతమైన భయం ఆవహిస్తుంటుంది, అది సహజం. ప్రపంచంలో ఉన్న మొత్తం జనాభాలో 73శాతం మందికి ఈ భయం ఉంటుందట తెలుసా! అందుకే ముందునుంచీ దీన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తే... నేడు సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ, రేపు ఉద్యోగం చేసే చోట... ఆత్మవిశ్వాసంతో ఉండగలుగుతారు. ఆలోచనలు పంచుకునేందుకు, మనోభావాలు తెలియజేసేందుకు, ప్రభావవంతమైన సంభాషణలను జరిపేందుకు... ఈ పబ్లిక్‌ స్పీకింగ్‌ స్కిల్స్‌ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని నేర్పిస్తున్న ప్లాట్‌ఫామ్స్‌ గురించి తెలుసుకుంటే, అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు.

ఒరై Orai

ఇందులో మన అవసరానికి తగినట్టుగా వివిధ విభాగాలున్నాయి. వర్క్‌ ప్రజెంటేషన్స్‌, కాన్ఫిడెంట్‌ - కన్సైజ్‌ - కంపెల్లింగ్‌ కమ్యూనికేషన్‌... ఇలా నాలుగు రకాలుగా మన స్పీచ్‌ను మెరుగుపరుచుకోవచ్చు. మాట్లాడినది రికార్డ్‌ చేస్తే... వెంటనే ఏఐ ఆధారిత ఫీడ్‌బ్యాక్‌ కనిపిస్తుంది.

* ఏవైనా పదాలు పదేపదే చెప్పామా, అనవసరమైన పదాలు - వాక్యాలు ఏం ఉపయోగించాం, వ్యాకరణంలో దోషాలతో ఏమైనా మాట్లాడామా.. ఇలా అన్నీ వివరంగా చూపిస్తుంది. ప్రభావవంతంగా మాట్లాడేందుకు అవసరమైన పాఠాలను చిన్నచిన్న బిట్లుగా చెబుతుంది. వరుసగా ఇందులో సాధన చేస్తుంటే... మనం మాట్లాడే తీరును మొత్తంగా అంచనా వేసి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో, ఎలా సాధన చేయాలో వివరంగా చూపిస్తుంది.

వర్చువల్‌ ఆరేటర్‌ Virtual orator

వర్చువల్‌ రియాలిటీని ఉపయోగిస్తూ... స్పీచ్‌ పాఠాలు చెబుతుందీ యాప్‌. ఇందులోకి వెళ్తే... ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి అనేది వీఆర్‌ ద్వారా నేరుగా అక్కడ ఉండి తెలుసుకుంటున్న భావనతో నేర్చుకోవచ్చు. రోజువారీ సంభాషణలే కాకుండా, కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు, ఉన్నతాధికారులతో  మాట్లాడేటప్పుడు... ఇలా ప్రతి సందర్భానికీ విడివిడిగా వీఆర్‌ పాఠాలు ఉంటాయి. మన పురోగతి ఎలా ఉందనేది తెలుసుకునేందుకు ఎనలిటిక్స్‌ కూడా లభిస్తాయి. ప్రత్యక్షంగా నేర్చుకున్న భావన కలిగించేందుకు ఇది  బాగా ఉపయోగపడుతుంది.

వోకల్‌ ఇమేజ్‌ : ఏఐ వాయిస్‌ కోచ్‌ Vocal image : Ai voice coach

మాట్లాడేటప్పుడు పదాలతోపాటు పిచ్‌ కూడా ముఖ్యం. అప్పుడే అనుకున్న భావం సరిగ్గా శ్రోతల్లోకి వెళ్తుంది. అలా వాయిస్‌ కోచింగ్‌ ఇచ్చేదే ఈ యాప్‌.  సందర్భానికి తగినట్టు గొంతు పిచ్‌, మాడ్యులేషన్‌ ఎలా మార్చాలి, ఏ ప్రసంగానికి/ఏ సంభాషణకు ఏ పిచ్‌ ఎంచుకోవాలి... ఇలా అన్నీ నేర్పిస్తుంది. మనం మాట్లాడే విధానాన్ని బట్టి గొంతును అంచనా వేసి ఎక్కడ మెరుగుపరుచుకోవాలో చెబుతుంది.

చాటర్‌ఫాక్స్‌ Chatterfox

ఇంగ్లిష్‌లో ప్రసంగించేటప్పుడు ఏ సందర్భానికి ఏ ఎక్స్‌ప్రెషన్‌ వాడాలి, ప్రతి అక్షరాన్నీ యాసకు తగినట్టు ఎలా పలకాలి అనేది నేర్చుకోవచ్చు. ఇందులో ఉండే ఏఐ స్మార్ట్‌ కోచ్‌ మన ప్రసంగంలోని పదాలను ఒక్కొక్కటీ ఎలా పలకాలి, మనం సరిగ్గా పలుకుతున్నామా లేదా అనేది సరిచూసి చెబుతుంది. బాగా సాధన చేశాక, చివర్లో హ్యూమన్‌ కోచ్‌ మన ప్రసంగం విని ఫీడ్‌బ్యాక్‌ ఇస్తారు. నిజజీవితంలో వాడే భాషను కూడా ఇందులో సాధన చేయవచ్చు.

ప్రాంప్ట్‌స్మార్ట్‌ ప్రో Promptsmart pro

ఇది మీరు స్పీచ్‌ ఇచ్చేటప్పుడు ఉపయోగపడే యాప్‌,  టెలీప్రాంప్టర్‌ సాఫ్ట్‌వేర్‌. దీనిలో ‘వాయిస్‌ట్రాక్‌ స్పీచ్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ’ని ఉపయోగించారు. ఇది మీ స్పీచ్‌లో ఏం మాట్లాడుతున్నారో ఫాలో అవుతూ... టెక్ట్స్‌ను తానే కిందకు స్క్రోల్‌ చేస్తుంది. ఒకవేళ ముందుగా అనుకున్న స్పీచ్‌ నుంచి మనం పక్కకు వెళ్తున్నట్లు కనిపిస్తే... తిరిగి ప్రసంగంలోని పదాల వద్దకు వచ్చేవరకూ ఎదురుచూస్తుంది. ఇదంతా నెట్‌ కనెక్షన్‌ లేకపోయినా జరుగుతుంది. ప్రసంగం సహజంగా కనిపించేందుకు... అవసరమైనప్పుడు ప్రాంప్టింగ్‌ ఇచ్చేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

స్పీకో మీటర్‌ Speako meter

ఇంగ్లిష్‌లో అమెరికన్‌, బ్రిటిష్‌ యాక్సెంట్‌ (యాస)ను  స్పష్టంగా పలికేందుకు ఇది శిక్షణ ఇస్తుంది. ప్రతి పదాన్నీ ఎలా పలకాలో, సంభాషణల్లో ఎలా ఉపయోగించేలా తెలియజేస్తుంది. 65వేలకు పైగా పదాల ఉపయోగంపై తరగతులు చెబుతుంది. ఇందులో ఉండే పాఠాలన్నీ పబ్లిక్‌ స్పీకింగ్‌కు సంబంధించిన వాక్యాలను, యాసను ఎలా ఉపయోగించాలి అనేదాన్ని చర్చిస్తూ.. సాధన చేసేందుకు వీలుగా ఉంటాయి.

ఇవేకాక Ummo, Virtual speech, Likeso

వంటి మరిన్ని యాప్స్‌ కూడా పబ్లిక్‌ స్పీకింగ్‌ పాఠాలు చెబుతున్నాయి. అయితే కొన్ని రోజులు వీటిని ఉపయోగించిన తర్వాత ఎంచుకున్న కోర్సును బట్టి కొంత ఫీజు చెల్లించాలి.  ఆండ్రాయిడ్‌, ఐఫోన్లలో పనిచేసే ఈ అప్లికేషన్లతో సంభాషణా నైపుణ్యాలను చిటికెలో సాధన చేయవచ్చంటే ఆశ్చర్యం ఏముంది?


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు