కరెంట్‌ అఫైర్స్‌

అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యక్తిగా రికార్డు సృష్టించిన రష్యా కాస్మోనాట్‌ ఎవరు? (2008 నుంచి ఇప్పటివరకు ఈయన అయిదు సార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) వెళ్లారు.

Published : 27 Mar 2024 00:05 IST

మాదిరి ప్రశ్నలు

అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యక్తిగా రికార్డు సృష్టించిన రష్యా కాస్మోనాట్‌ ఎవరు? (2008 నుంచి ఇప్పటివరకు ఈయన అయిదు సార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) వెళ్లారు. 2024, ఫిబ్రవరి 4 నాటికి మొత్తంగా 878 రోజుల 12 గంటల పాటు అంతరిక్షంలో ఉన్నారు. ఇప్పటి వరకు ఈ రికార్డు రష్యాకు చెందిన గెన్నడీ పదల్కా (878 రోజుల 11 గంటల 29 నిమిషాల 48 సెకన్లు) పేరిట ఉంది.)

జ: ఒలెగ్‌ కొనొనెంకొ

ఆస్ట్రేలియా సెనేట్‌ సభ్యుడిగా ఎన్నికైన భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయవాది ఎవరు? (1985లో భారత్‌లో జన్మించిన ఈయన చిన్నతనంలోనే తల్లిదండ్రులతో పాటు ఆస్ట్రేలియాకు వెళ్లారు. ఆస్ట్రేలియా సెనేట్‌కు ఎన్నికైన తొలి భారత సంతతి వ్యక్తిగా ఘనత సాధించాడు. ఈయన  లేబర్‌ పార్టీ తరఫున వెస్ట్రర్న్‌ ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ప్రస్తుత సెనేటర్‌ పాట్రిక్‌ డాడ్సన్‌ అనారోగ్య కారణాలతో రిటైర్‌ అయిన నేపథ్యంలో ఆయన స్థానంలో ఫెడరల్‌ పార్లమెంట్‌కు భారత సంతతికి చెందిన ఈయనను ఎన్నుకున్నట్లు వెస్ట్రర్న్‌ ఆస్ట్రేలియా లెజిస్లేటివ్‌ అసెంబ్లీ ప్రకటించింది. భగవద్గీతపై ప్రమాణం చేసి పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి ఆస్ట్రేలియన్‌ సెనేటర్‌గా కూడా ఈయన ఘనత సాధించాడు.)

జ: వరుణ్‌ ఘోష్‌

ఏ నగరంలోని కేంద్ర సముద్ర మత్స్య పరిశోధన సంస్థ (సీఎంఎఫ్‌ఆర్‌ఐ - సెంట్రల్‌ మెరైన్‌ ఫిషరీస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌) దేశంలోనే తొలిసారిగా ప్రయోగశాలలో చేప మాంసం తయారీకి శ్రీకారం చుట్టింది? (సముద్రాలు, నదులు, చెరువులు కాలుష్యం బారిన పడుతుండటం, ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం, వాతావరణ మార్పుల ప్రభావం, మితిమీరిన వేట వల్ల మత్స్య జాతులు నేడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. అధిక డిమాండ్‌ ఉండే చేపలు చాలా పరిమితంగా లభ్యమవడంతో ధరలు భారీగా పలుకుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీన జాతులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ ప్రాజెక్ట్‌ చేపట్టినట్లు కేంద్రం ప్రకటించింది. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు నీట్‌ మీట్‌ బయోటెక్‌ సంస్థతో సీఎంఎఫ్‌ఆర్‌ఐ తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది.)

జ: కోచి


కరెంట్‌ అఫైర్స్‌

డబ్ల్యూటీటీ ఫీడర్‌ బీరుట్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నీలో ఆకుల శ్రీజ విజేతగా నిలిచింది. 2024, మార్చి 25న లెబనాన్‌లోని బీరుట్‌లో జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్స్‌లో శ్రీజ సారా డి నట్టె (లగ్జెంబర్గ్‌)పై నెగ్గింది. శ్రీజ కెరీర్‌లో ఇది రెండో డబ్ల్యూటీటీ సింగిల్స్‌ టైటిల్‌. 2024, జనవరిలో ఫీడర్‌ కార్పస్‌ క్రిస్టీ టోర్నీలో ఆమె విజేతగా నిలిచింది.


తుంగభద్ర బోర్డు ఛైర్మన్‌గా వీరేంద్రశర్మ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తిశాఖ 2024, మార్చి 25న ఉత్తర్వులు ఇచ్చింది. వీరేంద్రశర్మ కేంద్ర జల సంఘంలో (సీడబ్ల్యూసీ) కృష్ణా గోదావరి బేసిన్‌ ఆర్గనైజేషన్‌ ముఖ్యఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.


భారత్‌లో 4జీ వినియోగదార్లతో పోలిస్తే 5జీ వినియోగదార్లు 3.6 రెట్ల డేటాను ఎక్కువగా వాడుతున్నట్లు టెలికాం గేర్‌ తయారీ కంపెనీ నోకియా నివేదిక పేర్కొంది. అక్టోబరు 2022లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 2023లో మొత్తం డేటా రద్దీలో 15 శాతం వాటా 5జీదేనని నివేదికలో తెలిపింది.


ప్రధాన మంత్రి సూర్యోదయ్‌ యోజన (పీఎం సూర్యోదయ్‌ యోజన) ప్రాజెక్టుకు సమన్వయకర్తగా ప్రభుత్వ రంగ సంస్థ ఆర్‌ఈసీ లిమిటెడ్‌ను ప్రభుత్వం ఎంపిక చేసింది.

రూఫ్‌టాప్‌ సోలార్‌ యూనిట్ల సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే దేశంలో గుజరాత్‌ అగ్రస్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక ఉన్నాయి. గుజరాత్‌లో దాదాపు 2898 మెగావాట్ల రూఫ్‌టాప్‌ సోలార్‌ సామర్థ్యం ఉంది.

కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్‌ కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.

 

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని