రాష్ట్రాల సమస్యల పరిష్కారంలో కేంద్రానిదే పెద్దన్న పాత్ర

మనదేశంలో మూడు స్థాయుల్లో ప్రభుత్వాలు పనిచేస్తూ ఉంటాయి. అంతర్జాతీయ, జాతీయ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర/ప్రాంతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు, క్షేత్ర స్థాయిలో స్థానిక ప్రభుత్వాలైన మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీలు ఆర్థిక  కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంటాయి.

Updated : 27 Mar 2024 00:57 IST

ఏపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
ఇండియన్‌ ఎకానమీ

మనదేశంలో మూడు స్థాయుల్లో ప్రభుత్వాలు పనిచేస్తూ ఉంటాయి. అంతర్జాతీయ, జాతీయ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర/ప్రాంతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు, క్షేత్ర స్థాయిలో స్థానిక ప్రభుత్వాలైన మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీలు ఆర్థిక  కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంటాయి. దేశంలో వీటిని సమర్థవంతంగా నిర్వహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ, సహకారాలు అత్యంత అవసరం.

భారత విత్త సంఘం - కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంబంధాలు
(Finance Commission of India)

భారతదేశం ఒక సమాఖ్య (ఫెడరల్‌) వ్యవస్థ.

  • భారత రాజ్యాంగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలను, విధులను విభజించి, అవసరమైన ఏర్పాట్లు చేసింది.
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు కేటాయించిన బాధ్యతలు, విధులను తప్పకుండా నెరవేర్చేందుకు అవసరమైన ఆర్థిక వనరులు సమీకరించి, వినియోగించడానికి నిర్దిష్టమైన అధికారాలను నిర్ణయించారు.
  • వీటికి అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమతమ విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది.
  • అంతర్జాతీయ కార్యకలాపాలు, వివిధ రాష్ట్రాల మధ్య వచ్చే సమస్యలను పరిష్కరించే అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి.
  • వేటికీ కేటాయించకుండా ఉన్న (మిగిలిన) అధికారాలన్నీ (Residual Powers) కేంద్రానికే చెందుతాయి.
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకదానితో ఒకటి సమన్వయ పరచుకుంటూ రాబడి, వ్యయాలపై దృష్టిసారిస్తాయి.

విత్త, విధుల విభజన

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విధుల విభజన:

  • కేంద్ర ప్రభుత్వమే సంపూర్ణ బాధ్యత వహించి నిర్వహించే విధుల్లో ముఖ్యమైనవి - రక్షణ, రైల్వేలు, పోస్టల్‌, టెలికాం సేవలు మొదలైనవి.
  • రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే విధుల్లో ముఖ్యమైనవి - వ్యవసాయం, రోడ్డు రవాణా, విద్యుత్‌ సరఫరా మొదలైనవి.
  • ఉమ్మడిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే విధుల్లో ముఖ్యమైనవి - విద్య, ఆరోగ్యం మొదలైనవి.

కేంద్ర, రాష్ట్రాల మధ్య విత్త అధికారాల విభజన:

పన్నుల వసూళ్లు, వాటి పంపకాల విషయంలో కొన్ని ప్రాతిపదిక సూత్రాలను అనుసరిస్తారు.
ఎ) అంతర్జాతీయ, అంతర్‌రాష్ట్ర సంబంధ పన్నులను కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది.
బి) స్థానిక/ప్రాంతీయ సంబంధిత పన్నులను రాష్ట్ర ప్రభుత్వం విధిస్తుంది.
సి) ఇతర అన్ని విషయాల సంబంధిత పన్నులు విధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది.

అంతర్‌రాష్ట్ర వాణిజ్య, వ్యాపార విషయాల్లో వస్తువుల అమ్మకం, కొనుగోలుపై పన్ను విధించే అధికారం పార్లమెంట్‌కు ఉంటుంది. కొన్నింటి మీద పన్ను విధించాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు ఆ అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి బదలాయించవచ్చు.

ఉదా: చాలా రాష్ట్రాల్లో వ్యవసాయ భూమిని ఎస్టేట్‌ డ్యూటీ పరిధిలోకి మార్చారు.

  • ప్రభుత్వాల మధ్య ఉన్న విత్తవనరుల కూర్పును పరిశీలిస్తే రాజ్యాంగబద్ధంగా కేటాయించిన పన్నుల వివరాలు, విత్తవనరుల రాబడుల అసమతౌల్యం తెలుస్తుంది.
  • ఎక్కువ రాబడిని సమకూర్చే ఆదాయపు పన్ను, కార్పొరేషన్‌ పన్ను, కస్టమ్స్‌ సుంకం లాంటివి కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి.
  • సామాజిక సేవల విస్తరణకు అధికంగా ఖర్చు చేయాల్సిన పన్నులు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్నాయి.
  • రాబడులు సేకరించుకునే మార్గాలపై కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది.
  • సామాజికాభివృద్ధిపై ఎక్కువ ఖర్చు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది.
  • ఈ విత్త సంబంధ వ్యత్యాసాల వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు వనరుల సమీకరణకు లేదా బదిలీకి కేంద్ర ప్రభుత్వంపై ఎక్కువ ఆధారపడాల్సి వస్తుంది.
  • ఈ విధంగా రాష్ట్రాలకు కేటాయించిన విత్త వనరులు విధులు నిర్వహించడానికి సరిపోవని, కాలక్రమంలో రాష్ట్రాల రాబడి - వ్యయాల మధ్య అంతరం ఎక్కువైందని రాజ్యాంగ నిర్మాతలు గ్రహించారు.
  • ఈ అంతరాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వ రాబడిలో కొంతభాగం రాష్ట్ర ప్రభుత్వాలకు బదిలీ (Devolution of Fiscal Resources) అయ్యే ఏర్పాటు చేశారు.
  • ఈ ఏర్పాటు ప్రకారం కేంద్ర ప్రభుత్వం విధించి, వసూలు చేసుకునే పన్నుల రాబడిని పాక్షికంగా లేదా మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వాలకు బదిలీ చేస్తారు. వాటిలో ముఖ్యమైనవి.

ఎ) కొన్ని పన్నులను కేంద్రం విధించి, వసూలు చేసినా వాటి రాబడిలో నిర్దేశించిన వాటా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలతో పంచుకోవాలి.

ఉదా: ఆదాయ పన్ను, కేంద్ర ఎక్సైజ్‌ సుంకం

బి) కొన్ని పన్నులను కేంద్రమే విధించి, వసూలు చేసినా వాటి రాబడి పార్లమెంట్‌ నిర్దేశించిన అనుపాతంలో రాష్ట్ర ప్రభుత్వాలకే చెందుతుంది.
ఉదా: ఎస్టేట్‌ డ్యూటీ, ప్రయాణికుల సరుకులపై పన్ను, రైల్వే ఛార్జీలు, వస్తువుల రవాణా ఛార్జీలు, స్టాక్‌ ఎక్సేంజీల లావాదేవీలపై పన్ను, వార్తాపత్రికలపై పన్ను మొదలైనవి.

సి) కొన్ని పన్నులను కేంద్ర ప్రభుత్వం విధించినా రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసుకుని ఉపయోగించుకుంటాయి.
ఉదా: స్టాంపు డ్యూటీ, మద్యం ఉపయోగించి తయారు చేసే మందులపై విధించే ఎక్సైజ్‌ డ్యూటీ లాంటివి.

డి) రాష్ట్ర ప్రభుత్వాలు వస్తువుల అమ్మకంపై విధించే పన్ను స్థానంలో కేంద్రం పన్ను విధించి మొత్తం రాబడిని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిణీ చేస్తుంది.
ఉదా: మిల్లు తయారీ జౌళి వస్త్రాలపై విధించే అదనపు ఎక్సైజ్‌ సుంకం, చక్కెర, పొగాకు వస్తువులపై పన్ను.

ఇతర పన్నులు

రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలపై ఎక్కువ వ్యయం చేయడానికి వీలుగా, రాబడి లోటు భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వ పన్నుల్లో వాటాయే గాక ఇతర మార్గాలు ఏర్పరిచారు. వాటిలో ముఖ్యమైనవి.
1) అనుబంధ పన్నులు (Supplementary Taxes) విధించడం
2) కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయక విరాళాలు మంజూరు చేయడం.

  • ఈ సహాయక విరాళాలు సాధారణ విరాళాలు. ఇవి ప్రత్యేక విరాళాలుగా, మ్యాచింగ్‌ లేదా నాన్‌ మ్యాచింగ్‌ గ్రాంట్స్‌గా ఉండవచ్చు.
  • ఈ సహాయ విరాళాలు అంతర్‌రాష్ట్ర వ్యత్యాసాలు తగ్గించడానికి ఉపయోగపడతాయి. అంతేగాక రాష్ట్రాలపై కేంద్రం నియంత్రణ కలిగి ఉండటానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు సంక్షేమ పథకాల అమలులో సహకారం అందించడానికి వీలుకలుగుతుంది.

3) కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు రుణాలు మంజూరు చేయడం. ఈ రుణాలు మార్కెట్‌ రుణాలుగా లేదా పెట్టుబడి రుణాలుగా ఉపయోగపడుతాయి.

రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని వ్యవసాయ, నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించడానికి, సామాజిక అభివృద్ధి సాధించే పథకాలను అమలు చేయడానికి వినియోగిస్తాయి.

పన్ను రకాలు

భారత దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు, ఇతరత్రా పన్నుల వసూలు గురించి రాజ్యాంగంలోని షెడ్యూల్‌ జుఖిఖి లో నిర్దిష్టంగా వివరించారు. వీటిని మూడు విధాలుగా వర్గీకరించవచ్చు.

కేంద్ర ప్రభుత్వం విధించే పన్నులు (Central List):

కేంద్ర ప్రభుత్వం మొత్తం 12 రకాల పన్నులు విధిస్తుంది. వాటిలో ముఖ్యమైనవి.

నీ వ్యవసాయ రంగం మినహాయించి ఇతర ఆదాయాలపై పన్ను
నీ కార్పొరేషన్‌ పన్ను
నీ కస్టమ్స్‌ సుంకం
నీ ఆల్కహాల్‌, కాస్మోటిక్స్‌ తప్ప ఇతర ఎక్సైజ్‌ సుంకాలు
నీ ఎస్టేట్‌ డ్యూటీ, వారసత్వ పన్ను
నీ అంతర్‌రాష్ట్ర వాణిజ్యంలో అమ్మకాలు, కొనుగోళ్ల పన్ను మొదలైనవి.

రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు:

రాష్ట్ర ప్రభుత్వాలు 17 రకాల పన్నులు విధిస్తాయి. అందులో ముఖ్యమైనవి

  • భూమి శిస్తు
  • న్యూస్‌ పేపర్‌ మినహాయించి ఇతర వస్తువుల అమ్మకం, కొనుగోళ్ల పన్ను
  • వ్యవసాయ ఆదాయాల పన్ను నీ భూమి, నిర్మాణాల పన్ను
  • వ్యవసాయ భూముల వారసత్వ పన్ను
  • రాష్ట్ర ఎక్సైజ్‌ సుంకం (ఆల్కహాల్‌, మత్తుపదార్థాల వాటిపై)
  • స్థానిక ప్రాంతాల్లోకి ప్రవేశించే వస్తువుల పన్ను
  • వినోదం పన్ను నీ వృత్తి పన్ను మొదలైనవి

ఉమ్మడి జాబితా (Concurrent List):

ఉమ్మడి జాబితా అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికీ అధికారం ఉంటుంది.

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోటర్‌ వాహనాలు, నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంపులపై విధించే పన్నులు, నాన్‌ కరెంట్‌ జాబితాలో వ్యవసాయ భూమిపై విధించే ఎక్సైజ్‌ సుంకం ఉమ్మడి జాబితాలో ఉంది.
  • రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలోకి రాని ఇతర పన్నులపై కేంద్రానికి పూర్తి అధికారం ఉంటుంది.

పై మూడు జాబితాల్లో నిర్దిష్టంగా పేర్కొనని ఏ ఇతర పన్నునైనా వసూలు చేసే పూర్తి అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది.

రచయిత బండారి దనుంజయ విషయ నిపుణులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని