నలుగురితో కలిసిపోదాం..!

పక్కవారితో మాట్లాడాలంటే బెరుకు... కొత్తమొహాలు ఎదురుపడితేనే భయం... అందరితోనూ కలివిడిగా ఉండాలనే ఆశ ఉన్నా, అలా ఉండలేని మనస్తత్వం. దీన్ని దాటేదెలా?... నలుగురితోనూ కలిసిపోయేదెలా? ‘సోషల్‌ పర్సన్‌’ అవ్వడం ఎలా?... ఇది చదవండి!

Updated : 24 May 2022 06:08 IST

పక్కవారితో మాట్లాడాలంటే బెరుకు... కొత్తమొహాలు ఎదురుపడితేనే భయం... అందరితోనూ కలివిడిగా ఉండాలనే ఆశ ఉన్నా, అలా ఉండలేని మనస్తత్వం. దీన్ని దాటేదెలా?... నలుగురితోనూ కలిసిపోయేదెలా? ‘సోషల్‌ పర్సన్‌’ అవ్వడం ఎలా?... ఇది చదవండి!

తెలుసుకుందాం

* మీకే కాదు, చాలా మందికి ఈ ఇబ్బంది ఉంటుంది. ఒక సర్వే ప్రకారం జనాభాలో దాదాపు 40 శాతం మంది ఎదుటివారితో మొదట మాట కలపడం కష్టంగా భావిస్తారట. అవసరమైనా కూడా మాట్లాడలేరట!

* అందరితో సరదాగా ఉండటం అంటే మనవల్ల ఎవరూ ఇబ్బంది పడకుండా, వారి మూడ్‌ను చెడగొట్టకుండా ఉండటం. మనకు నచ్చకపోయినా అవతలివారిని భరించడం కాదు.

* మన గురించి అవతలి వ్యక్తి ఏం అనుకుంటున్నారో అన్న ఆలోచన వస్తే... మనపై మనకు నమ్మకం దెబ్బతింటుంది. సొంతంగా జడ్జ్‌ చేసుకోవడం సరికాదు కదా!

* చిన్న చిన్న విషయాలకు గొడవపడటం, ఫిర్యాదు చేయడం, చిన్నబుచ్చుకోవడం చేస్తే ఎవరికైనా నచ్చదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

ఆచరిద్దాం: * బాగా మాట్లాడాలి అంటే అంతకంటే ముందు చేయాల్సింది వినడం! శ్రద్ధగా వినేవారే చక్కగా మాట్లాడగలరు కూడా. మొదట ఎదుటివారు చెప్పేది ఆసక్తితో వినాలి. అప్పుడే మనం కొనసాగించే సంభాషణ బంధాన్ని ఏర్పరచగలదు.

* ప్రశ్నలు అడగడం... ఏం మాట్లాడాలో తెలియనప్పుడు ఏదైనా ప్రశ్న అడగడం కొంత పనిచేస్తుంది. కానీ అది సందర్భానికి తగినదై ఉండాలి.

* ఒక చిన్ని ప్రశంస... ఒక మంచి అభినందన ఎలాంటి వారినైనా మనవైపు తిప్పుతుంది. ఎదుటివారిలో మంచి విషయాలను గుర్తించి ప్రశంసించడం ద్వారా ఒక పాజిటివ్‌ సంభాషణకు బీజం పడుతుంది.

* సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, సహాయ బృందాలతో కలిసి పనిచేయడం, ఏదైనా హాబీ ఏర్పరుచుకోవడం, ఆటలాడటం వల్ల ఈ భయాన్ని అధిగమించి అందరితో చక్కగా మాట్లాడగలుగుతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని