Updated : 03 May 2022 06:07 IST

అపోహలు వీడితేనే ఆస్థమాపై విజయం!

నేడు ప్రపంచ ఆస్థమా దినం

ఆస్థమా మామూలు జబ్బే. పూర్తిగా నియంత్రణలో ఉంచుకోదగిందే. అయినా దీని మూలంగా మనదేశంలో ఏటా లక్ష మంది మృత్యువాత పడుతున్నారు. అత్యవసరంగా ఆసుపత్రుల్లో చేరటానికి దారితీస్తున్న సమస్యల్లో ఆస్థమా మూడోది కావటం గమనార్హం. దీని నిర్ధరణ, చికిత్సలో విప్లవాత్మక మార్పులు వచ్చినా ఎందుకీ దుస్థితి? తెలిసో తెలియకో ఎక్కడో పొరపాటు జరుగుతోందనే విషయాన్ని ఇది చెప్పకనే చెబుతోంది. ఇప్పటికీ జబ్బుపై సరైన అవగాహన లేకపోవటం.. ఇన్‌హేలర్లను సరిగా వాడకపోవటం, వీటిపై నెలకొన్న అపోహలు, భయాల వంటివన్నీ సమస్య తీవ్రం కావటానికి దోహదం చేస్తున్నాయి. కాబట్టే ఆస్థమా చికిత్సలో లోటుపాట్లను పూరించాలని ప్రపంచ ఆస్థమా దినం నినదిస్తోంది.

స్థమా. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని పట్టి పీడిస్తున్న సమస్య. మనదేశంలో సుమారు 3 కోట్ల మంది దీంతో బాధపడుతున్నారని అంచనా. సగటున పెద్దవారిలో 2-6% మంది.. పిల్లల్లో 6-20% మంది ఆస్థమాతో సతమతమవుతున్నవారే. ఏటా 2.70 లక్షల మంది పిల్లలు ఆస్థమా చికిత్స కోసం ఆసుపత్రులకు వస్తున్నారు. ఇందుకోసం 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది. ఆస్థమాతో పిల్లలు కోటి బడి దినాలకు దూరమవుతున్నారు. ఇవన్నీ పరిస్థితి తీవ్రతకు నిదర్శనాలే. వాయు కాలుష్యం, బద్దకంతో కూడిన జీనవశైలి, ఊబకాయం, కరోనా అనంతర దుష్ప్రభావాల మూలంగా ఇటీవల ఇది మరింత ఎక్కువగానూ విజృంభిస్తోంది. ఊబకాయంతో ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గుతుంది. ఎప్పుడూ ఇంట్లోనే కూర్చుంటే బయట ఎండ తగలదు. శరీరానికి విటమిన్‌ డి దొరకదు. దీని లోపంతో ఆస్థమా ఉద్ధృతమయ్యే అవకాశముంది. ప్రస్తుతం ఆస్థమా ఎక్కువ కావటానికి ఇలాంటివన్నీ దోహదం చేస్తున్నాయి.  

ఆస్థమా అంటే?

ఇదో దీర్ఘకాల శ్వాసకోశ సమస్య. ప్రత్యేకించి ఊపిరితిత్తుల్లోని గాలిగొట్టాలకు సంబంధించిన సమస్య. మనం ముక్కుతో పీల్చుకునే గాలి శ్వాసనాళం ద్వారా ఊపిరితిత్తుల లోపలికి చేరుకుంటుంది. ఈ శ్వాసనాళం పైనుంచి రెండుగా చీలుతూ వచ్చి.. మళ్లీ చిన్నచిన్న గొట్టాలుగా విడిపోతూ.. అతి సూక్ష్మమైన గాలిగదుల్లోకి గాలిని చేరవేస్తుంది. ఇదంతా ఎంతో సునాయాసంగా, ఎలాంటి కష్టం లేకుండా సాగిపోయే ప్రక్రియ. ఆస్థమా బాధితుల్లో సరిగ్గా ఇదే అస్తవ్యస్తమవుతుంది. సాధారణంగా దుమ్ము ధూళి ఉన్న ప్రాంతాలకు వెళ్లినప్పుడు దగ్గు రావటం మామూలే. ఇది హాని కారకాలు లోపలికి ప్రవేశించకుండా, వాటిని బయటకు నెట్టివేయటానికి శరీరం చేసే ప్రయత్నమే. ఆస్థమా వచ్చే స్వభావం (అటోపీ) గలవారికి ఇలాంటి మామూలు విషయాలే పెద్ద సమస్యగా మారతాయి. దుమ్ము ధూళి వంటివి తగిలినప్పుడు లోపల అలర్జీ ప్రేరేపితమై గాలిగొట్టాలు విపరీతంగా స్పందిస్తుంటాయి. ఆస్థమాకు మూలం ఇదే. గాలిగొట్టాలకు అలర్జీ కారకాలు తగిలినప్పుడు రోగనిరోధక కణాలు అతిగా స్పందిస్తాయి. దీంతో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) మొదలవుతుంది. ఫలితంగా గాలిగొట్టాల గోడలు ఉబ్బిపోయి లోపలి మార్గం సన్నబడుతుంది. మరోవైపు గాలి గొట్టాల్లో జిగురుద్రవం ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఇది లోపలే చిక్కుకు పోతుంది. దీంతో శ్వాస తీసుకోవటం, వదలటం కష్టమైపోతుంది. దగ్గు, ఆయాసం, పిల్లికూతల వంటి ఇబ్బందులు మొదలవుతాయి. ఈ లక్షణాలు కొందరిలో కొద్దిసేపే ఉండొచ్చు. ఒకట్రెండు లక్షణాలే ఉండొచ్చు. కొందరికి ప్రత్యేకించి కొన్ని సమయాల్లోనే తలెత్తొచ్చు. కొందరికి నిరంతరం వేధిస్తుండొచ్చు. కొందరికి ఎలాంటి లక్షణాలు లేకుండానూ ఆస్థమా ఉండొచ్చు (సైలెంట్‌ చెస్ట్‌).

ముప్పు ఎవరికి?

అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర్నుంచి పండు ముదుసలి వరకు ఎవరికైనా, ఏ వయసులోనైనా ఆస్థమా రావొచ్చు. దీనికి ప్రధాన కారణం వంశపారంపర్యంగా సంక్రమించే జన్యువులు. తల్లిదండ్రులిద్దరికీ ఆస్థమా ఉంటే పుట్టబోయే బిడ్డకు రావటానికి 70% వరకూ అవకాశం ఉంది. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరికే ఆస్థమా ఉంటే 30% వరకు ముప్పు పొంచి ఉంటుంది. అదేపనిగా అలర్జీ కారకాలకు గురవుతున్నప్పుడు జన్యువులు లేకపోయినా ఆస్థమా దాడి చేయొచ్చు. ఆస్థమా బాధితుల్లో సుమారు 6% మంది ఇలాంటివారే. మానసిక ఆందోళన, ఒత్తిడి, కొన్నిరకాల వృత్తులు, ఇన్‌ఫెక్షన్ల వంటివీ ఆస్థమాను ప్రేరేపించొచ్చు.

పరీక్షలతో నిర్ధరణ

ఆస్థమా నిర్ధరణకు స్పైరోమెట్రీ పరీక్షే ప్రామాణికం. దీంతో ఊపిరితిత్తుల సామర్థ్యం బయటపడుతుంది. కొందరికి పీక్‌ఫ్లో మీటర్‌ పరీక్ష కూడా చేస్తారు. ఇది నిర్ధరణకే కాదు, జబ్బు అదుపులో ఉందో లేదో తెలుసుకోవటానికీ ఉపయోగపడుతుంది. తొలిదశలో కొన్నిసార్లు ఈ పరీక్షల్లో సమస్య తేలకపోవచ్చు. అప్పుడు అలర్జీ కారకాలను ఇచ్చి పరీక్షిస్తారు. అలర్జీ కారకాలను కచ్చితంగా గుర్తించటానికి కొందరికి స్కిన్‌ ప్రిక్‌ పరీక్ష చేయాల్సి రావొచ్చు. క్షయ, సీవోపీడీ వంటి ఇతరత్రా సమస్యలేవైనా ఉన్నయేమో చూడటానికి ఎక్స్‌రే కూడా అవసరమవుతుంది. అలర్జిక్‌, నాన్‌ అలర్జిక్‌ ఆస్థమాను తెలుసుకోవటానికి రక్త పరీక్ష ఉపయోగపడుతుంది.


భయాలు, సందేహాలు వద్దు

ఆస్థమా విషయంలో ఇప్పటికీ ఎన్నో అపోహలు ఉన్నాయి. వీటిని తొలగించుకోవాలి.

ఆస్థమా అంటువ్యాధి కాదు. ఇది ఒకరి నుంచి మరొకరికి సోకదు.

సాధారణంగా ఆహారంతో ఆస్థమా రాదు. కాకపోతే కొందరికి కొన్నిరకాల పదార్థాలు పడకపోవచ్చు. ప్యాకెట్లలో అమ్మే పదార్థాలు నిల్వ ఉండటానికి కలిపే ప్రిజర్వేటివ్స్‌ కొందరికి ఆస్థమాను కలిగించొచ్చు.

‘ఆ ఏముంది? ఆయాసం వస్తుంది, పోతుంది’ అని కొందరు ఆస్థమాను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది తగదు. నియంత్రణలో ఉంచుకోకపోతే సమస్య తీవ్రమై ప్రాణాల మీదికీ తేవొచ్చు.

చిన్నపిల్లల్లో ఆస్థమా పెద్దగా అవుతున్నకొద్దీ తగ్గిపోతుందన్నది పూర్తిగా అపోహ. చుట్టుపక్కల పరిసరాల్లో అలర్జీ కారకాలను బట్టి, వీటి ప్రభావానికి ఎంతవరకు గురవుతున్నామనే దాన్ని బట్టి ఆస్థమా దాడి చేస్తుంది. పిల్లల్లో కొందరిలో ఆస్థమా లక్షణాలు క్రమంగా తగ్గుముఖం పట్టొచ్చు. అలాగని నయమైనట్టు కాదు. వయసుతో పాటు ఊపిరితిత్తులు పెరగటం వల్ల జబ్బు తీవ్రత తగ్గుతుండొచ్చు గానీ పూర్తిగా నయమైందని అనుకోవటానికి లేదు.

ఆస్థమా గల మహిళలు గర్భం ధరించినా ఎప్పటి మాదిరిగానే మందులు వాడుకోవాలి. మరింత జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది కూడా. ఎందుకంటే ఆస్థమా నియంత్రణలో లేకపోతే గర్భస్రావం, నెలలు నిండకముందే కాన్పవ్వటం, బిడ్డ తక్కువ బరువుతో పుట్టటం, బిడ్డలో ఊపిరితిత్తులు పరిపక్వం కాకపోవటం వంటి అనర్థాలు తలెత్తొచ్చు. ఇన్‌హేలర్‌ ద్వారా తీసుకునే మందులు బిడ్డపై ఎలాంటి విపరీత ప్రభావాలు చూపవు.

ఆస్థమాతో బాధపడే పిల్లలను కొందరు ఆటలు ఆడనీయరు. వ్యాయామం చేయనీయరు. ఇది మంచి పద్ధతి కాదు. వ్యాయామం శరీరానికి అత్యవసరం. పిల్లలకు మరింత ముఖ్యం. ఆస్థమాతో బాధపడే క్రీడాకారులు ఎందరో ఒలింపిక్స్‌లో బంగారు పతకాలు సాధించారని గుర్తించాలి. వ్యాయామం చేస్తే ఆస్థమా ఉద్ధృతం కాదు. కాకపోతే కొందరికి వ్యాయామం చేస్తే ఆస్థమా వచ్చే స్వభావముంటుంది. ఇలాంటివారు సైతం ముందుగా మందులు వాడుకొని తర్వాత వ్యాయామం చేయొచ్చు. ఒకేసారి కాకుండా నెమ్మదిగా వేగం పెంచుకుంటూ రావాలి. అంతే తప్ప వ్యాయామం పూర్తిగా మానెయ్యటం తగదు.


మందుల వాడకం ప్రధానం

ఆస్థమా ఒకసారి మొదలైతే పోయేది కాదు. జీవితకాల సమస్య. లక్షణాలేవీ లేకపోయినా, హాయిగా ఉంటున్నా లోపల ఆస్థమా అలాగే ఉంటుంది. ఇది ఏ క్షణంలోనైనా ఉద్ధృతమయ్యే అవకాశముంది. కాబట్టి మధుమేహం, అధిక రక్తపోటు వంటి జబ్బుల్లో మాదిరిగానే దీనికీ క్రమం తప్పకుండా మందులు వాడుకోవాలి. మంచి విషయం ఏంటంటే- సీవోపీడి వంటి ఇతరత్రా శ్వాసకోశ సమస్యల మాదిరిగా దీనిలో తలెత్తే మార్పులు శాశ్వతంగా ఉండకపోవటం. మందులతో తిరిగి మామూలు స్థితికి రావటం. ఆస్థమా పూర్తిగా నయం కాకపోవచ్చు గానీ మందులతో పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఇందుకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ప్రధానమైనవి రిలీవర్లు, కంట్రోలర్లు. వీటిని ఇన్‌హేలర్‌ పరికరం ద్వారానే తీసుకోవాల్సి ఉంటుంది. వీటితో నేరుగా శ్వాసమార్గాల్లోకే మందు వెళ్తుంది. వెంటనే ప్రభావం కనిపిస్తుంది. లక్షణాల నుంచి తక్షణం ఉపశమనం కలిగించేవి రిలీవర్లు (బ్రాంకోడైలేటర్లు). ఇవి శ్వాసనాళాలు విప్పారేలా చేసే వెంటనే లక్షణాలను తగ్గిస్తాయి. ఆస్థమా తిరగబెట్టకుండా కాపాడేవి కంట్రోలర్లు (స్టిరాయిడ్లు). ఇవి వాపుప్రక్రియను అదుపులో ఉంచుతాయి. దీర్ఘకాలం సమస్య తిరగబెట్టకుండా చూస్తాయి. అయితే చాలామంది రిలీవర్లతో లక్షణాలు తగ్గగానే సమస్య నయమైపోందని అనుకుంటారు. కంట్రోలర్లను పెద్దగా పట్టించుకోరు. దీంతో లోపల వాపుప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. దీని మూలంగా ఆస్థమా ఎప్పుడైనా ఉద్ధృతమయ్యే ప్రమాదముంది. కాబట్టి రెండు మందులనూ క్రమం తప్పకుండా వాడుకోవాలి. కంట్రోలర్‌ను ఎంతకాలం వాడుకోవాలనేది ఆయా వ్యక్తులను బట్టి ఉంటుంది. కొందరికి రెండు, మూడేళ్ల పాటు వాడితే లక్షణాలు తగ్గిపోవచ్చు. ఇలాంటివారికి కంట్రోలర్‌ ఆపేసినా లక్షణాలు లేకపోతే పూర్తిగా మానేసే అవకాశముంది. ఒకవేళ లక్షణాలు వస్తున్నట్టయితే జీవితాంతం వాడుకోవాల్సిందే. కొందరికి మాంటెలుకాస్ట్‌ మాత్రలూ అవసరమవ్వచ్చు.

రెండు మూడు అలర్జీ కారకాలే ఉన్నవారికి ‘ఇమ్యూనో చికిత్స’ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఆయా అలర్జీ కారకాలను మందు రూపంలో ఇస్తారు. దీంతో వాటికి యాంటీబాడీలు పుట్టుకొస్తాయి. ఇవి మున్ముందు అవే అలర్జీ కారకాలకు గురైనా సమస్య తలెత్తకుండా చూస్తాయి.

శాస్త్రీయంగా రుజువు కాని చికిత్సల జోలికి వెళ్లొద్దు.


ఇన్‌హేలర్లపై అనుమానాలొద్దు

ఆస్థమా చాలా ఎక్కువగా ఉంటేనే, చివరిదశలోనే ఇన్‌హేలర్లు వాడతారని కొందరు భావిస్తుంటారు. ఇది నిజం కాదు. ఇన్‌హేలర్లు తొలిదశ చికిత్స, పైగా ఉత్తమమైన చికిత్సని తెలుసుకోవాలి. ఇన్‌హేలర్‌ ద్వారా తీసుకునే మందు మోతాదు మైక్రోగ్రాముల్లో ఉంటుంది. ఇది నేరుగా శ్వాసమార్గాల్లోకే మందు చేరుకుంటుంది. రక్తంలో కలవటం చాలా తక్కువ. కాబట్టి పెద్దగా నష్టమేమీ ఉండదు. ఈ మందులకు అలవాటు పడటమనేది ఉండదు. ఇన్‌హేలర్లు సురక్షితం. వీటి గురించి ఆందోళన అవసరం లేదు.

ఆస్థమా పిల్లల విషయంలో- ‘పెరిగే వయసు కదా. ఇప్పట్నుంచే ఇన్‌హేలర్లు ఎందుకు?’ అని కొందరు వెనకాడుతుంటారు. స్టిరాయిడ్ల వాడకంతో ఎదుగుదల కుంటుపడుతుందని భయపడుతుంటారు. ఇది తప్పు. నిజానికి ఆస్థమా నియంత్రణలో లేకపోతేనే ఎదుగుదల దెబ్బతింటుంది. డాక్టర్‌ సూచించిన మోతాదులో మందు వాడితే ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు.

ఇన్‌హేలర్లు ఖరీదైనవని మరికొందరి అభిప్రాయం. మాత్రలతో పోలిస్తే వీటి ధర ఎక్కువే కావొచ్చు. కానీ వీటిని సరిగా వాడకపోవటం వల్ల ఆసుపత్రిలో చేరితే అయ్యే ఖర్చుతో పదేళ్లకు సరిపడిన ఇన్‌హేలర్‌ మందులు కొనుక్కోవచ్చు.

ఇన్‌హేలర్లను సరిగా వాడుకోవటమూ ముఖ్యమే. కేవలం 30% మందే వీటిని సరిగ్గా వాడుకుంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇన్‌హేలర్‌ బాక్స్‌ మీద క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది. దీన్ని స్కాన్‌ చేస్తే ఎలా వాడుకోవాలో వీడియోలో చూడొచ్చు. దీని ప్రకారం సక్రమంగా వాడుకోవాలి. అప్పుడే మంచి ఫలితం కనిపిస్తుంది. వీటిని ఉపయోగించాక నోరు కడుక్కోవాలి.

అధునాతన చికిత్సలు

సుమారు 5% మందిలో మందులు వాడినా ఆస్థమా నియంత్రణలోకి రాదు. వీరికి బయోలాజికల్‌ ఇంజెక్షన్లు ఉపయోగపడతాయి. బ్రాంకియల్‌ థర్మోప్లాస్టీ ప్రక్రియ కూడా అందుబాటులో ఉంది. ఇందులో శ్వాసనాళం గోడను లేజర్‌ ద్వారా వేడి చేస్తారు. దీంతో కండరం పలుచబడి మార్గం వెడల్పు అవుతుంది. కాకపోతే ఇవి కాస్త ఖరీదైనవి.


శాపం కాదు

కప్పుడంటే ఏమో గానీ ఇప్పుడు ఆస్థమాకు భయపడాల్సిన పనిలేదు. దీన్ని అదుపులో ఉంచుకుంటే మిగతావాళ్ల మాదిరిగానే హాయిగా, ఆనందంగా జీవించొచ్చు. ఆస్థమా జీవితానికి అడ్డంకి కాదు. సినీనటులు, గాయకులు, క్రీడాకారుల వంటి ప్రముఖుల్లోనూ ఆస్థమా చూస్తుంటాం. అయినా అన్నిరంగాల్లో ఎంతో విజయం సాధిస్తున్నారు. కాబట్టి ఆస్థమాను శాపంగా, భారంగా పరిగణించరాదు. దీన్ని మందులతో నియంత్రణలో ఉంచుకుంటే అందరిలా హాయిగా జీవించొచ్చు.


అలర్జీ కారకాలపై కన్నేయండి

జన్యువులున్నా ఆస్థమా రావాలనేమీ లేదు. జన్యు స్వభావానికి అలర్జీ కారకాలు తోడైనప్పుడే గొలిగొట్టాలు విపరీతంగా ప్రతిస్పందిస్తాయి. వీటికి దూరంగా ఉంటే ఆస్థమాను చాలావరకు నివారించుకోవచ్చు. ఎక్కువగా సమస్యను తెచ్చిపెట్టే అలర్జీ కారకాలు ఇవీ..

* పుప్పొడి

* దుమ్ము ధూళి

* తవిటి పురుగులు (డస్ట్‌మైట్స్‌)

* వాహనాలు, సిగరెట్ల పొగ

* పెంపుడు జంతువుల బొచ్చు

* గోడలకు పట్టే చెమ్మ, నాచు

* సెంట్లు, సుగంధ ద్రవ్యాలు

* పోపు వాసనలు

* చల్లటి నీరు, గాలి

* బొద్దింకలు, నల్లులు, తేనెటీగల వంటి కీటకాలు

* ఆస్ప్రిన్‌, నొప్పి మందులు, బీటా బ్లాకర్స్‌ వంటి కొన్నిరకాల మందులు


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని