తాత్కాలికమే అయినా అదీ పక్షవాతమే!

కొన్నిసార్లు పేరును చూసి మోసపోతుంటాం. ఇది మనుషులకే పరిమితం కాదు. జబ్బుల విషయంలోనూ ఇలాంటిది చూస్తుంటాం. తాత్కాలిక పక్షవాతం అలాంటిదే. అప్పటికప్పుడే తగ్గిపోతుందనే భావనతో చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు గానీ

Updated : 21 Jun 2022 07:49 IST

కొన్నిసార్లు పేరును చూసి మోసపోతుంటాం. ఇది మనుషులకే పరిమితం కాదు. జబ్బుల విషయంలోనూ ఇలాంటిది చూస్తుంటాం. తాత్కాలిక పక్షవాతం అలాంటిదే. అప్పటికప్పుడే తగ్గిపోతుందనే భావనతో చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు గానీ త్వరలో పెద్ద ప్రమాదాన్నే తెచ్చిపెడుతుంది. అందుకే దీని  పేరును మార్చటం మీద చర్చ నడుస్తోంది.

పక్షవాతం ఎంత ప్రమాదకరమైందో చెప్పక్కర్లేదు. సత్వరం చికిత్స అందకపోతే వైకల్యం బారినపడక తప్పదు. కొన్నిసార్లు ప్రాణాపాయమూ సంభవించొచ్చు. మెదడు భాగానికి రక్త సరఫరా ఆగిపోవటం (ఇస్కెమిక్‌) లేదా మెదడులోకి రక్తస్రావం కావటం (హెమరేజిక్‌) వల్ల పక్షవాతం వస్తుంటుంది. సాధారణంగా రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడటం లేదా పూడికల మూలంగా రక్త సరఫరా నిలిచిపోతుంటుంది. అదృష్టవశాత్తు కొందరికిది కొద్దిసేపే ఉండొచ్చు. కొద్ది నిమిషాల్లోనే లక్షణాలు తగ్గిపోవచ్చు. దీన్నే ట్రాన్సియెంట్‌ ఇస్కెమిక్‌ అటాక్‌ (టీఐఏ) అంటుంటారు. ప్రస్తుతం దీని పేరును ‘మైనర్‌ ఇస్కెమిక్‌ స్ట్రోక్‌’గా మార్చాలని వైద్యరంగంలో చర్చ నడుస్తోంది. టీఐఏలో తాత్కాలికమనే అర్థం ధ్వనిస్తుండటంతో తేలికగా తీసుకుంటుండటమే దీనికి కారణం. పక్షవాతం లక్షణాలు వెంటనే తగ్గిపోవటం వల్ల ‘హమ్మయ్య.. ప్రమాదం గడిచింది. గండం నుంచి గట్టెక్కినట్టే’ అని చాలామంది భావిస్తుంటారు. మర్నాడో, ఆపై వారమో డాక్టర్‌ దగ్గరికి వెళ్దామని అనుకుంటుంటారు. కానీ కొందరిలో తీవ్ర నష్టమే జరుగుతుంది. టీఐఏ బాధితుల మెదడులోనూ స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నట్టు, కొందరిలో ఆయా భాగాలు శాశ్వతంగా దెబ్బతింటున్నట్టు స్కాన్‌ పరీక్షలు చెబుతున్నాయి. పక్షవాతంలో నాడీ కణాలు, వీటి మధ్య అనుసంధానాలు చాలా వేగంగా చనిపోవటం ఆరంభిస్తాయి. కొద్దిసేపు    రక్త సరఫరా ఆగినా మెదడు దెబ్బతినటానికి దారితీస్తుంది. టీఐఏ బారినపడ్డవారిలో చాలామందికి 24-48 గంటల్లోనే పూర్తిస్థాయి పక్షవాతం వచ్చే ప్రమాదముంది. అదీ చాలా తీవ్రంగా రావొచ్చు కూడా. సుమారు 10.5 శాతం మందిలో మూడు నెలల్లోనే మరోసారి పక్షవాతం వస్తున్నట్టు, వీరిలో సగం మందికి తొలి రెండు రోజుల్లోనే ఇది సంభవిస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అందువల్ల టీఐఏను తేలికగా తీసుకోవటానికి లేదు. ఏమాత్రం అనుమానిత లక్షణాలు కనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించటం తప్పనిసరి. మెదడును స్కాన్‌ చేస్తే సమస్య బయటపడుతుంది. టీఐఏ అయితే రక్తం గడ్డకుండా చూడటానికి డాక్టర్లు ఆస్ప్రిన్‌, క్లోపిడెగ్రెల్‌ మందులు ఆరంభిస్తారు. కొందరికి ఇతరత్రా మందులు, చికిత్సలూ అవసరమవ్వచ్చు. తీవ్ర ముప్పు తప్పిన తర్వాత తక్కువ మోతాదు ఆస్ప్రిన్‌ ఒక్కటే సూచిస్తారు. ఇలా పెద్ద ప్రమాదాన్ని ముందే నివారించుకోవచ్చు.

ఇవీ లక్షణాలు
* శరీరంలో ఒకవైపున ముఖం, కాలు, చేయి వంటి భాగాల్లో బలహీనత, మొద్దుబారటం
* మాట తత్తరపోవటం, ఇతరుల మాటలు అర్థం కాకపోవటం
* ఒక కంట్లో గానీ రెండు కళ్లలో గానీ చూపు పోవటం లేదా రెండేసి వస్తువులు కనిపించటం
* తల తిప్పటం, శరీరం మీద పట్టుకోల్పోయి తూలటం, సమన్వయం కొరవడటం
- కొందరికి ఈ లక్షణాల్లో ఒకటి కన్నా ఎక్కువే ఉండొచ్చు. ఇవి పదే పదే వస్తుండొచ్చు. లేదూ వేర్వేరు లక్షణాలు పొడసూపొచ్చు. మెదడులో ప్రభావితమైన భాగాన్ని బట్టి లక్షణాలు ఆధారపడి ఉంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని