పార్శ్వనొప్పి వేధిస్తోందా?

పార్శ్వనొప్పి (మైగ్రెయిన్‌) చాలా ఇబ్బంది పెడుతుంది. ఒక్క తలనొప్పితోనే కాదు, వికారంతోనూ వేధిస్తుంది. దీన్ని రకరకాల కారణాలు ప్రేరేపిస్తుంటాయి. కొన్ని జాగ్రత్తలతో పార్శ్వనొప్పి బాధలను తగ్గించుకోవచ్చు.

Updated : 18 Jul 2023 00:02 IST

పార్శ్వనొప్పి (మైగ్రెయిన్‌) చాలా ఇబ్బంది పెడుతుంది. ఒక్క తలనొప్పితోనే కాదు, వికారంతోనూ వేధిస్తుంది. దీన్ని రకరకాల కారణాలు ప్రేరేపిస్తుంటాయి. కొన్ని జాగ్రత్తలతో పార్శ్వనొప్పి బాధలను తగ్గించుకోవచ్చు.

నిద్ర సరిగా..

నిద్ర చిత్రమైన ప్రేరకం. మరీ ఎక్కువైనా, తక్కువైనా పార్శ్వనొప్పి తలెత్తొచ్చు. కాబట్టి రోజూ తగినంత నిద్ర పోయేలా చూసుకోవాలి. నిద్ర వేళలను కచ్చితంగా పాటించాలి.

భోజనం మానొద్దు

రక్తంలో గ్లూకోజు మోతాదులు పడిపోతే ముందుగా ప్రభావితమయ్యేది మెదడే. తలనొప్పులకు ఆకలి ఓ ప్రధాన కారణం. అందువల్ల సమయానికి భోజనం చేయాలి. రోజంతా పనిచేయటానికి శరీరానికి అవసరమైన శక్తి లభించేలా చూసుకోవాలి.

కెఫీన్‌ ఆచితూచి

కాఫీలోని కెఫీన్‌ పార్శ్వనొప్పిని ప్రేరేపించొచ్చు, తగ్గించొచ్చు. ఇది నొప్పి మందుల సామర్థ్యాన్ని పెంచుతుంది కాబట్టి కొన్ని తలనొప్పి మందుల్లో కెఫీన్‌నూ కలుపుతుంటారు. అయితే మోతాదు ఎక్కువైతేనే సమస్య. అందువల్ల కెఫీన్‌ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.

వ్యాయామం కీలకమే

కొన్నిసార్లు ఎక్కువ శ్రమతోనూ పార్శ్వనొప్పి ప్రేరేపితం కావొచ్చు. కానీ క్రమం తప్పకుండా, ఒక మాదిరిగా వ్యాయామం చేస్తే మొత్తంగా ఆరోగ్యం ఇనుమడిస్తుంది. తలనొప్పినీ నివారించుకోవచ్చు. వ్యాయామాలను నెమ్మదిగా ఆరంభించి, క్రమంగా వేగం పెంచుకుంటూ రావటం ముఖ్యమని గుర్తుంచుకోవాలి.

ప్రేరకాలకు దూరంగా..

సాధారణంగా పెద్ద శబ్దాలు, ఘాటు వాసనలు, మిరుమిట్లు గొలిపే కాంతుల వంటివి పార్శ్వనొప్పిని ప్రేరేపిస్తుంటాయి. ఇలాంటి ప్రేరకాలకు దూరంగా ఉండాలి. అవేంటో తెలియకపోతే నోట్‌ పుస్తకంలో ఏం తింటున్నారు? ఎప్పుడు తింటున్నారు? ఎప్పుడు మందులు వేసు కుంటున్నారు? ఎలాంటి లక్షణాలు వస్తున్నాయో రాసుకోవాలి. వీటిని బట్టి  తలనొప్పి ఎప్పుడెప్పుడు వస్తుందో, ఏవి ప్రేరేపిస్తున్నాయో తెలుసుకోవచ్చు.

నెలసరికి తగినట్టుగా

హార్మోన్లు మెదడు మీద చాలా ప్రభావం చూపుతాయి. మహిళల్లో నెలసరి సమయంలో పార్శ్వనొప్పి రావటం మామూలే. ఫలదీకరణ జరిగే సమయంలో, నెలసరి నిలిచిపోయే దశలోనూ తలనొప్పి రావొచ్చు. హార్మోన్ల మార్పులు జరిగే సమయంలో మందులు వెంట ఉంచుకోవటం మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని